
జగదేవ్‌పూర్ (గజ్వేల్): బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి ఆటోలో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సిద్దిపేట జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. జగదేవ్‌పూర్ గ్రామానికి చెందిన కొట్టాల కవిత (31), కొట్టాల లలిత (38), కొంతం చంద్రయ్య(47), కొంతం లక్ష్మి, శ్రీపతి కనకమ్మలు జగదేవ్‌పూర్‌కే చెందిన శ్రీగిరిపల్లి కనకయ్య(33)కు చెందిన ఆటోలో మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని ఇస్లాంపూర్‌కు బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి బయలుదేరారు.
అలిరాజ్‌పేట గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కనకయ్య, కవిత అక్కడికక్కడే మృతి చెందారు. కొంతం చంద్రయ్య, లక్ష్మి, లలిత, కనకమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా, కొంతం చంద్రయ్య, కొట్టాల లలిత మృతి చెందారు. మృతుల్లో కవిత, లలిత తోటి కోడళ్లు. భార్యాభర్తల్లో చంద్రయ్య మృతి చెందగా, భార్య లక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతులు, గాయపడిన వారంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment