మరికొన్ని రోజుల్లో వివాహ బంధంతో జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆ యువతిని విధి చిన్నచూపు చూసింది. పెళ్లి బట్టలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహంగా వెళ్తున్న ఆ కుటుంబంపైకి ట్రెయిలర్ లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాబోయే వధువుతోపాటు ఆమె తల్లి, సోదరుడు, బాబాయి, పిన్ని, ఆటో డ్రైవర్ కన్నుమూశారు. – సాక్షి, మహబూబాబాద్
ఏం జరుగుతుందో ఆలోచించే లోగానే...
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంట తండాకు చెందిన జాటోతు కస్నానాయక్–కల్యాణి (45) దంపతుల కుమార్తె ప్రమీల అలియాస్ మరియమ్మ (23) వివాహం డోర్నకల్ మండలం చాంప్లా తండా గ్రామ పరిధిలోని ధరావత్ తండాకు చెందిన ధరావత్ వెంకన్న–లలిత దంపతుల ప్రథమ కుమారుడు వినోద్‌తో నిశ్చయమైంది. వచ్చే నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి బట్టల కొనుగోలు కోసం వరంగల్‌కు శనివారం వెళ్దామని చెప్పిన ప్రమీల తండ్రి కస్నా నాయక్ పనికి వెళ్లగా శుక్రవారమే బట్టలు కొంటే బాగుంటుందనే ఆలోచనతో ప్రమీల, ఆమె తల్లి కల్యాణి, సో దరుడు ప్రదీప్ (25), బాబాయి జాటోతు ప్రసాద్ (42) చిన్నమ్మ లక్ష్మి (39) కలసి జాటోతు రాములు నాయక్ (33) ఆటోలో శుక్రవారం ఉద యం 10 గంటలకు గూడూరు మీదుగా వరంగల్ బయలుదేరారు.
సుమారు 40 నిమిషాల ప్రయాణం అనంతరం మర్రిమిట్ట–భూపతిపేట మధ్యలో జాతీయ రహదా రి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు చెందిన ట్రెయిలర్ లారీ ఎదురుగా వస్తూ అతివేగంగా ఆటోను ఢీకొట్టడమే కాకుండా దాన్ని సుమారు 150 మీటర్లు తోసుకెళ్లింది. దీంతో ఏం జరిగిందో తెలిసేలోపే ఆటోలోని వారు విగత జీవులుగా మారారు. ఫలితంగా మల్లంపెల్లి–సూర్యాపేట జాతీయ రహదారి రక్తపు మడుగుగా మారింది. లారీ డ్రైవర్ ధరావత్ కిషన్ అతివేగంగా నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదవార్త తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌లోకి ఎక్కించారు.
మృతదేహాలను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా అడ్డుకుంటున్న స్థానికులు
స్థానికుల ఆందోళన...
రోడ్డు ప్రమాద వార్త తెలుసుకొని ఎర్రకుంట తండావాసులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకొని రోడ్డుపై ధర్నాకు దిగారు. తక్షణమే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించే ప్రయత్నం చేయడం, చర్చల పేరుతో కాలయాపన చేస్తుండటంపై గ్రామస్తులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో రాత్రి వరకు మృతదేహాల తరలింపులో జాప్యం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో రాత్రి 7 గంటల వరకు కొనసాగింది.
చివరకు విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ఘటనాస్థలికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎన్‌హెచ్ కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు. చివరకు కాంట్రాక్టర్ ద్వారా రూ. 5 లక్షల చొప్పున, ప్రభుత్వం నుంచి రూ. లక్ష చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
సాయమే చంపేసింది!
నేషనల్ హైవే నిర్మాణ కాంట్రాక్టర్‌కు మొరం ఇచ్చేందుకు ఎవరూ సహకరించలేదు. దీంతో జాటోతు కస్నా నాయక్ తనకు సంబంధించిన మూడెకరాల బంజరు భూమి నుంచి మొరం తీసుకెళ్లేందుకు సమ్మతించాడు. ఈ మేరకు భూమిలో మొరం తీసేందుకు వినియోగించే ప్రొక్లెయిన్ తీసుకురావడానికి లారీతో డ్రైవర్ భూపతిపేట నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే కస్నానాయక్ కుటుంబ సభ్యులు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో సాయం చేయాలని ముందుకు రావడమే తన కుటుంబీకులను పొట్టన పెట్టుకుందంటూ కస్నా నాయక్ రోదించాడు.
మర్రిమిట్ట ప్రమాదంపై గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు వెంటనే అందించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment