పాతిపెట్టిన నగలను బయటకు తీస్తున్న మురుగన్
సాక్షి, చెన్నై: కొలిక్కిరాని కేసు ఛేదించడంతో పోలీసులు మొక్కులు తీర్చుకున్నారు. సమయపురం మారియమ్మన్‌ను దర్శించుకుని తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లలిత జ్యువెలరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మురుగన్ దోపిడీల అనంతరం నటీమణులతో జల్సా చేసినట్టు విచారణలో తేలడం ఆ నటీమణులు ఎవరో అని ఆరాతీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరిలో తిరుచ్చి సమయపురం టోల్‌గేట్ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. 470 సవర్ల నగలు, రూ. 19 లక్షల నగదును దుండగులు అపహరించుకు వెళ్లారు. ఈ కేసు విచారణ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాయి. కనీసం ఆదారం కూడా లభించకపోవడంతో నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.
అదే సమయంలో కొద్ది రోజుల క్రితం తిరుచ్చిలో మరో దోపిడీ జరిగింది. ప్రముఖ నగల షోరూమ్ లలిత జ్యువెలరీలో జరిగిన దోపిడీ స్టైల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టైల్ ఒకే రకంగా ఉండడంతో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. లలిత జ్యువెలరీ కేసు విచారణలో లభించిన సమాచారాలు, ఆధారాలు, దోపిడీ దొంగల చెంతకు పోలీసుల్ని తీసుకెళ్లింది. లలిత జ్యువెలరీ కేసులో తొలుత సెంగం కోర్టులో సురేష్ అనే నిందితుడు లొంగిపోయాడు. అతడ్ని విచారించగా, గణేష్ అనే మరో దొంగ దొరికాడు. ఈ దోపిడీల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న తిరువారూర్ మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగి పోయాడు. ఇతగాడ్ని ఇక్కడకు తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టిన బంగారాన్ని బయటకు తీశారు. మళ్లీ బెంగళూరు పోలీసులు తమ పరిధిలో ఉన్న కేసుల విచారణ నిమిత్తం మురుగన్‌ను పట్టుకెళ్లారు.
తలనీలాలు సమర్పించుకుని..
మురుగన్‌ను తమ కస్టడీకి తీసుకునేందుకు తిరుచ్చి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. అయితే, బెంగళూరు పోలీసు కస్టడీలో ఉన్న దృష్ట్యా, అక్కడ విచారణ ముగించినానంతరం, ఇక్కడకు అతడ్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించి ఉన్నారు. లలితా జ్యువెలరీ దోపిడితోపాటు తొమ్మిది నెలల క్రితం జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ కూడా మురుగన్ ముఠా పనితనంగా తేలింది. ఈ కేసులో రాధాకృష్ణన్ అనే నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులు కొలిక్కిరావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసును విచారిస్తున్న బృందంలోని ఇద్దరు పోలీసులు హరిహరన్, విజయకుమార్ ఉదయాన్నే సమయపురం మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసును ఎట్టకేలకు ఛేదించడంలో తమకు దేవుడి ఆశీస్సులు సైతం ఉన్న దృష్ట్యా, మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించుకోవడం గమనార్హం.
25 కేజీలు బంగారం స్వాధీనం..
లలిత జ్యువెలరీ కేసులో ఇప్పటి వరకు 25 కేజీల బంగారు స్వాధీనం చేసుకున్నట్టు తిరుచ్చి పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసు విచారణ గురించి వివరించారు. ప్రస్తుతం నిందితుడు మురుగన్ బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అక్కడ విచారణ ముగించినానంతరం ఇక్కడ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతడిపై మరెన్ని కేసులు ఉన్నాయో అని ఆరా తీస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ సాగుతున్నదన్నారు. కాగా నిందితుడు మురుగన్ దోపిడీల అనంతరం మోడల్స్, నటీమణులతో కలిసి జల్సా చేసేవాడుగా విచారణలో తేలినట్టు సమాచారం. కొందరికి దోపిడీ చేసిన నగలను సైతం ఇచ్చి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడం, రెండు సినిమాలకు సైతం ఫైనాన్స్ చేసి ఉన్నట్టు తేలడంతో ఆ నటీమణులు ఎవరో, ఆ సినిమాల వెనుక ఉన్న వాళ్లు ఎవరో ఆరా తీసే పనిలో ప్రత్యేక బృందం నిమగ్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment