వీడు మామూలోడు కాదు ! | Interstate thief arrested | Sakshi
Sakshi News home page

వీడు మామూలోడు కాదు !

Published Sat, Mar 18 2017 3:31 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

వీడు మామూలోడు కాదు ! - Sakshi

వీడు మామూలోడు కాదు !

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌
నిందితుడిపై ఏపీ, తెలంగాణలో 17 కేసులు
హత్య కేసులో జైలుకూ వెళ్లాడు, మరో హత్య కేసులో విచారణ
సెల్‌ఫోన్‌ చోరీ కేసు దర్యాప్తులో వెలుగు చూసిన నేరాలు
రూ.12 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు,  ద్విచక్రవాహనం స్వాధీనం
అర్బన్‌ జిల్లా ఎస్పీ జయలక్ష్మి వెల్లడి


తిరుపతి క్రైం: అంతర్రాష్ట్ర గజ దొంగను గురువారం సాయంత్రం రేణిగుంట, చంద్రగిరి హైవేరోడ్డులోని రామానుజపల్లె క్రాస్‌ వద్ద అరెస్ట్‌ చేసినట్లు అర్బన్‌ జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతనిపై మొత్తం 17 కేసులు నమోదై ఉన్నాయని, హత్య కేసులో అతను జైలుకూ వెళ్లాడని, మరో హత్య కేసు నడుస్తోందని చెప్పారు. ఓ సెల్‌ఫోన్‌ చోరీ కేసుకు సంబంధించి చేసిన విచారణలో అతని దారుణ కృత్యాలు, చోరీలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు.  శుక్రవారం అర్బన్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయలక్ష్మి తెలిపిన వివరాల మేరకు..

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పెద్దపూజార్లు గ్రామానికి చెందిన నారా బసవరాజు అలియాస్‌ రాజు, అలియాస్‌ మహేష్‌(38)ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని బుధగేరిలో నివాసం ఉంటున్నాడు. ఇతన్ని అరెస్ట్‌ చేసి విచారణ చేయగా,19 ఏళ్ల కాలంగా అతను ఎన్నో నేరాలకు పాల్పడినట్లు తేలింది. గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడ తనతో పాటు నేరస్తుడైన ఇబ్రహీం అనే వ్యక్తిని 2003లో గొడవ పడి చంపేశాడు. ఆ హత్య కేసులో జైలుకూ వెళ్లాడు. అయితే ఆ కేసు కొన్ని రోజుల తరువాత కొట్టేశారు. అలాగే, తనతోపాటు చోరీలకు పాల్పడే  స్వగ్రామానికి చెందిన సలీంను కూడా పాతకక్షలతో 2011లో చంపేశాడు. ఆకేసులో కోర్టులో శిక్ష పడగా దానిపై ఇతను అప్పీలుకెళ్లాడు.

అనంతరం 2010లో బళ్లారి నుంచి ఇన్నోవా కారును బాడుగకు మాట్లాడుకుని ఇద్దరు స్నేహితులతో కలసి విజయవాడకు వెళ్లే దారిలో అద్దంకి సర్కిల్‌ పరిధిలో డ్రైవర్‌ను హతమార్చి, కారును తీసుకెళ్లాడు. ఇంకా ఆ కేసు పెండింగ్‌లో ఉంది.నంద్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనంలో ఎన్‌బీడబ్ల్యూ  కేసు పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్‌లో ఉంటూ వనస్థలిపురం, ఎల్‌బి.నగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడి పలుమార్లు జైలుకెళ్లివచ్చాడు.2015 నవంబర్‌ 5న నంద్యాల జైలు నుంచి బయటకు వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్‌ జిల్లా మాధవవరం, బెంగళూరులో బుధగేరిలో కాపురం ఉంటూ రాజంపేట, బద్వేల్, మార్గాపురం, ఆదోని, ఆత్మకూర్, గుంతకల్, అనంతపురం, మదనపల్లె, ఒంగోలు, గూడూరు, నెల్లూరు తిరుపతిలో చోరీలకు పాల్పడ్డాడు. అలా ఇళ్లలో చోరీ వస్తువులను ఆదోనిలో బంగారు వ్యాపారస్తులకు అమ్మేశాడు. అలాగే హోస్పేట్‌లోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో, మరో ఫైనాన్స్‌ కంపెనీలో కుదువపెట్టి బంగారు ఆభరణాలు విక్రయించినట్లు విచారణలో తేలింది.

ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, నందలూరు, ఒంగోలు ప్రాంతాల్లో చోరీ కేసులకు సంబంధించి వస్తువులను మాధవరంలో నిందితుడు నివాసం ఉన్న ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 250 గ్రాముల బంగారు, 9 కేజీల వెండి, టీవీ, సెల్‌ఫోన్, ట్యాబ్‌లు, మోటార్‌ సైకిల్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తి, దొంగతనాలకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.  ఒక్క హైదరాబాద్‌లోనే ఇతని 11కేసులు నమోదై ఉన్నాయి.ఈ కేసును ఛేదించడంలో క్రైం ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ కొండారెడ్డి, సీఐలు సత్యనారాయణ, శరత్‌చంద్ర, పద్మలత, ఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌పిళ్లై, మోహన్‌గౌడ్, రామ్మూర్తి, సుదర్శన్‌రావు తదితరులు ఎంతగానో కృషి చేశారని, వీరందరికీ రివార్డులు వచ్చేలా చూస్తామని జయలక్ష్మి చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement