నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న విజయవాడ సీపీ టి.కె.రాణా
విజయవాడ: ఉదయం పూజా సమయంలో భక్తుడిలా దేవాలయంలోకి ప్రవేశించి.. రాత్రికి ఇనుపరాడ్డుతో తలుపులు తెరిచి దేవతామూర్తుల బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లే ఓ ఘరానా అంతర్‌రాష్ట్ర దొంగను విజయవాడ నగర పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 60.9 లక్షల విలువ చేసే 80 కేజీల వెండి, 224 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన విజయవాడ వన్‌టౌన్‌లోని కుసుమ హరనాథ మందిరంలో జరిగిన దొంగతనంపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు.
సీసీ పుటేజీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఈ నెల 12వ తేదీన ప్రకాశం బ్యారేజీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సికింద్రాబాద్ తుకారం గేటు ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల అంగోత్ రాములునాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. విచారణలో నిందితుడు చేసిన తాజా చోరీతో పాటు గతంలో చేసిన దొంగతనాలను అంగీకరించడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అవనిగడ్డలోని సూర్య దేవాలయంలో నిందితుడు రాము 2011లో దొంగతనం చేసి అరెస్టు అయి జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు. జైలు నుంచి విడుదలయిన తరువాత అదే పంథాలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
చోరీ చేసిన సొత్తును కొద్ది రోజుల పాటు దేవాలయానికి సమీపంలోనే దాచి, పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తరువాత ఆభరణాల రూపం మార్చి విక్రయిస్తుంటాడని కమిషనర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్, చేబ్రోలు, ఆకివీడు, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నకిరేకల్, కొల్లిపర, తెనాలి, నగరంపాలెం, చేబ్రోలు, వినుకొండ, కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం, ప్రకాశం జిల్లాలోని నాగులపాడు, తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు రాములునాయక్‌పై ఇప్పటి వరకు 14 పోలీస్ స్టేషన్లలో 18 కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న డీసీపీ బాబురావు, ఏసీపీ హనుమంతరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు శంకర్, మూర్తిని సీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment