
దొంగలు పగలగొట్టిన బీరువాలు..
ప్రకాశం, సీఎస్‌పురం: మండల కేంద్రం సీఎస్‌పురంలో భారీ దోపిడీ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎస్‌పురంలోని ప్రధాన వీధిలో నగల వ్యాపారి ఇంట్లో జరిగిన 135 సవర్ల బంగారం దోపిడీ మండల ప్రజలను ఉలికి పాటుకు గురి చేసింది. స్థానిక పామూరు రోడ్డులో నగల వ్యాపారం చేసుకుంటున్న పత్తిపాటి శ్రీహరిరావు కుటుంబ సభ్యులు ముంబై వెళ్లిన సమయం గమనించిన దొంగలు శనివారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. శ్రీహరిరావు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు ఫోన్‌లో ఆయనకు సమాచారం అందించారు. బాధితులు సోమవారం ఉదయం సీఎస్‌పురం వచ్చి దొంగతనం జరిగిన విషయాన్ని నిర్ధారించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి విచారణ చేపట్టారు. కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, సీఐ మధుబాబులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ దొంగతనం జరిగిన ఇంటి నుంచి ప్రధాన రోడ్డు వెంబడి బస్టాండ్ సెంటర్, డీజీపేట రోడ్డు మీదగా ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లింది. అనంతరం అక్కడి నుంచి ఏనిమిట్ట వీధి నుంచి దొంగతనం జరిగిన ఇంటి వద్దకే వచ్చి నిలబడింది. క్లూస్ టీమ్ ఇంట్లో వేలిముద్రలు సేకరించింది. శ్రీహరిరావు ఇంటిని దోపిడీ చేసిన దొంగలు ఆ పక్క గదిలో ఉన్న నగలషాపును పట్టించుకోక పోవడం గమనార్హం. నగల షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఈ విషయం తెలిసే దొంగలు షాపు జోలికి వెళ్లలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
బాధితుడి కథనం ప్రకారం..
బాధితుడు శ్రీహరిరావు కథనం ప్రకారం.. 135 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఎస్‌ఐ కె విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన, ఆయన భార్య, పెద్ద కుమారుడు, కోడలు, మనుమరాళ్లకు సంబంధించిన బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దొపిడీకి గురైన నగలకు సంబంధించిన వివరాలను బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధికారికంగా 135 సవర్లు మాత్రమే దోపిడీ జరిగినట్లు చెబుతున్నారని, ఆ నగలేకాక ఇంకా ఎక్కువ మొత్తంలో బంగారం, వెంగి నగలు దోపిడీ జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. కేసు విచారణలో సీఎస్‌పురం, పామూరు, లింగసముద్రం ఎస్‌ఐలు కె. విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.