2024 డిసెంబర్ 12 తెల్లవారుజాము దాదాపు 4 గంటల సమయం– హైదరాబాద్, దోమలగూడ అర్వింద్‌నగర్‌లోని ఘొరాయ్ కుటుంబీకుల ఇంట్లోకి ఆరుగురు ముసుగు దొంగలు చొరబడి, మారణాయుధాలతో బెదిరించి, రెండు కేజీల బంగారం సహా దాదాపు రూ.2 కోట్ల విలువైన సొత్తు దోచుకున్నారు. 2024 డిసెంబర్ 22 మధ్యాహ్నం దాదాపు 2 గంటల మధ్య సమయం–బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఘొరాయ్ కుటుంబీకుడు సహా 12 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆధారాలు దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం చేసిన ఈ బందిపోటు దొంగతనం ఒక పెంపుడు జాగిలం ద్వారా కొలిక్కి వచ్చింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన అన్నదమ్ములు రంజిత్ ఘొరాయ్, ఇంద్రజిత్ ఘొరాయ్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలసవచ్చారు. తమ కుటుంబాలతో దోమలగూడ అర్వింద్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఇద్దరూ వేర్వేరుగా నగల తయారీ వ్యాపారం ప్రారంభించారు. రంజిత్ యాభైమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతడి తమ్ముడు ఇంద్రజిత్ వ్యసనాలకు బానిసై, ఆర్థికంగా చితికిపోయాడు. తమ్ముడి పరిస్థితి చూసిన అన్న రంజిత్ తనతో కలిసి ఒకే ఇంట్లో వేరే పోర్షన్‌లో ఉండే ఏర్పాటు చేశాడు. రంజిత్ వ్యాపారం బాగా సాగుతుండటంతో ఇంద్రజిత్ కొన్నాళ్లుగా ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. ఇటీవల రంజిత్ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు కొన్నాడు. ఈ విషయం తెలిశాక ఇంద్రజిత్ మరింతగా రగిలిపోయాడు.
రంజిత్ వద్ద ఉండే బంగారం వివరాలను గమనిస్తూ వచ్చిన ఇంద్రజిత్– నకిలీ ఆదాయపు పన్ను దాడి చేయించడానికి ఆరు నెలల కిందట కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించినా, ఆ పథకం పారలేదు. దీంతో అన్న వద్ద ఉండే బంగారం దోచుకోవాలని ఇంద్రజిత్ భావించాడు. ప్రతి రోజూ తనతో కలిసి మార్నింగ్ వాక్ చేసే అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్‌లతో ఇంద్రజిత్‌కు స్నేహం ఏర్పడింది. రంజిత్ ఇంట్లో భారీగా బంగారం ఉండే సమయం చెప్తానని, అప్పుడు దోపిడీ చేయిస్తే, అందరం వాటాలు పంచుకుందామని చెప్పాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్, ఈ విషయాన్ని బాలాపూర్‌కు చెందిన రౌడీషీటర్ హబీబ్ హుస్సేన్ ద్వారా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షేక్ షబ్బీర్‌కు చెప్పారు.
ఈ దోపిడీకి తనకంటే మైలార్‌దేవ్‌పల్లి రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్ సమర్థుడని చెప్పిన షబ్బీర్, అతడిని పరిచయం చేశాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని, దోపిడీకి పథకం వేశారు. అర్బాజ్ తన అనుచరులతో కలిసి బందిపోటు దొంగతనానికి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్‌తో చర్చించి, ఒక వాహనాన్ని కూడా కొన్నాడు. తన అనుచరులతో రంజిత్ ఇంటి వద్ద రెక్కీ చేయించాడు. ఇంట్లో పెంపుడు శునకం, చుట్టూ ప్రహరీ, భారీ గేటు, గ్రిల్స్‌తో కట్టుదిట్టంగా ఉండటంతో బయటి వాళ్లు ప్రవేశించడం దుస్సాధ్యమని గుర్తించి, ఇంద్రజిత్‌కు చెప్పాడు. దీంతో అంతా కలిసి బహదూర్‌పురాకు చెందిన న్యాయవాది మహ్మద్ నూరుల్లా సహాయం కోరారు.
ఘొరాయ్ ఇంట్లోని పెంపుడు శునకాన్ని ఇంద్రజిత్ రోజూ ఉదయం బయటకు తీసుకువెళుతుంటాడు. దాని కాలకృత్యాలు పూర్తయ్యాక తీసుకువచ్చి, ఇంటి ఆవరణలో వదిలేస్తాడు.
దొంగతనం చేసే రోజు మాత్రం తెల్లవారుజామున పెంపుడు శునకాన్ని కాస్త తొందరగా బయటకు తీసుకుని వెళ్లాలని, తిరిగి వస్తూ ప్రధాన గేటుకు గడియపెట్టకుండా వదిలేయాలని నూరుల్లా సలహా ఇచ్చాడు. దీంతో అర్బాజ్ 2024 డిసెంబర్ 12 రాత్రి తన గ్యాంగ్‌తో రంగంలోకి దిగాడు. అర్బాజ్ నేతృత్వంలో అతడి అనుచరులు షబ్బీర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి షబ్బీర్ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి, రంజిత్ ఇంటికి చేరారు. తన అన్న కుటుంబీకులను కేవలం బెదిరించాలని ఇంద్రజిత్ పదేపదే చెప్పినా అర్బాజ్ పట్టించుకోలేదు. రంజిత్ కుటుంబాన్ని బంధించి, తన అనుచరులతో వారి పిల్లల మెడపై కత్తులు పెట్టించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్ చేతిని కత్తితో నరికించాడు. తర్వాత ఇంట్లోని రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండి, పూజ గదిలోని రెండు కేజీల ఇత్తడి సామాను దోచుకుని పారిపోయారు.
పోలీసులకు ఆధారాలు దొరక్కుండా, రహదారుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. కాసేపటికి రంజిత్ షాక్ నుంచి తేరుకున్నాడు. ఇంద్రజిత్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్‌కుమార్, నాగేష్, శ్రీకాంత్ తమ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఘొరాయ్ కుటుంబం దినచర్యపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నేరం జరిగిన రోజు ఇంద్రజిత్ తెల్లవారుజామున 3.00 గంటలకే పెంపుడు శునకాన్ని మార్నింగ్ వాక్‌కు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతడు నోరు విప్పాడు. ఆరు నెలల కిందటి ‘ఐటీ స్కెచ్’ నుంచి తాజా బందిపోటు దొంగతనంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న పదిహేను మంది వివరాలను బయటపెట్టాడు. దీంతో అధికారులు షహబాజ్, నజీర్, జహీర్ మినహా మిగిలిన పన్నెండు మందిని పట్టుకుని, వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి, రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment