![Police Revealed Sensational Facts in Meerpet Incident](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/1212.jpg.webp?itok=02o20oZ7)
రాచకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని మీర్‌పేటలో వెలుగులోకి వచ్చిన ‘చంపేసి.. ఉడకబెట్టిన’ కేసు సంచలనం సృష్టించింది. ఇంత దారుణంగా కాకున్నా, హైదరాబాద్‌లో దాదాపు ఏడాదిన్నర క్రితం అనురాధ అనే నర్సు హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు చంద్రమోహన్ ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. మూసీ నది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి.చంద్రమోహన్ అవివాహితుడు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో నివసించేవాడు.
ఇతడి తండ్రికి 2007లో ఒక ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది.
అప్పట్లో ఆస్పత్రి తరఫున సేవలు చేయడానికి హెడ్ నర్సు వై. అనురాధారెడ్డి ఇంటికి వచ్చేది. చంద్రమోహన్‌కు ఆమెతో పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లో చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి, సన్నిహితంగా మారారు. చంద్రమోహన్ 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్‌లోకి తీసుకువచ్చాడు. అనురాధ, చంద్రమోహన్ 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అతగాడు ఆమె నుంచి దాదాపు 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ రెండో వివాహం చేసుకోవాలని 2023లో భావించింది. దీంతో తన వద్ద తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చంద్ర మోహన్‌పై ఒత్తిడి చేసింది.
ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్, అదే జరిగితే అనురాధ తనకు దూరం అవుతుందని, అప్పటికే ఆమె వద్ద తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. దీంతో అనురాధను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023 మే నెలలో వేసవి సెలవుల నేపథ్యంలో చంద్రమోహన్ ఇంటి కింది భాగంలో ఉన్న మరో పోర్షన్‌లో ఉండే కుటుంబం ఊరికి వెళ్లింది. అక్కడే ఉన్న మరో పోర్షన్‌లో నివసించే అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. ఆ నెల 12న మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి, గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, ఎలా మాయం చేయాలనే అంశంపై తన స్మార్ట్‌ఫోన్ ద్వారా యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు.
మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చేయాలనేది వెతికాడు. అందులో చూపించిన వీడియోలను ఆధారంగా చేసుకుని, అప్పటికప్పుడు రెండు చిన్న సైజు స్టోన్ కట్టర్లు, నాలుగు మటన్ కత్తులు, దాదాపు 40 వరకు ఫినాయిల్, డెట్టాల్, వివిధ కెమికల్స్ బాటిళ్లు, అగరుబత్తీలు, అత్తర్లు, కర్పూరం తదితరాలు కొనుక్కుని వచ్చాడు. కట్టర్లతో మొండెం నుంచి తల, కాళ్లు, చేతులు వేరు చేస్తూ అనురాధ శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల ఫ్రిజ్‌లో, మొండాన్ని ఓ పెట్టెలో పెట్టి మూడు రోజులు గదిలోనే ఉంచాడు. హతురాలి సెల్‌ఫోన్‌ను తన వద్దే ఉంచుకున్న చంద్రమోహన్ దాంతో ఆస్ట్రేలియాలో ఉండే ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్ చేస్తూ వచ్చాడు.
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటి నుంచి కింద ఉన్న అనురాధ పోర్షన్‌లోకి వస్తున్న చంద్రమోహన్ మృతదేహం ముక్కల మీద ఫినాయిల్, డెట్టాల్, కర్పూరం తదితరాలు చల్లి వెళ్లేవాడు. ఇంట్లో రక్తం వాసన తెలియకుండా అగరుబత్తీలు, అత్తర్లు వినియోగించాడు. ఇలా దాదాపు 13 రోజుల పాటు వాసన ఆ గది కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మృతదేహం విషయం పక్కింటి వాళ్లకు, పైనే ఉన్న చంద్రమోహన్ తల్లికీ తెలియలేదు. ఓ దశలో చంద్రమోహన్ దఫదఫాలుగా మృతదేహం భాగాలను బయట పారేయాలని భావించాడు. అనూరాధ తలను చెత్త కవర్‌లో పెట్టుకుని వెళ్లి, 2023 మే 15 రాత్రి మూసీ సమీపంలో పడేశాడు. పారిశుద్ధ్య కార్మికులు మే 17న ఉదయం దీనిని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తల దొరికిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న దానిపై ఆధారపడ్డారు. 2023 మే 16వ తేదీ ఫీడ్ పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో 15వ తేదీకి సంబంధించింది చూస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్‌ను ఆ ప్రాంతంలో పారేస్తున్నట్లు కనిపించింది. అక్కడ నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడి ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పారేయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్‌కు తన ఫోన్‌లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు.
ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం ఆ బేకరీ వద్దకు చేరుకుని ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా సేకరించారు. సీసీ కెమెరాల్లో ఉన్న టైమ్ ఆధారంగా వాటర్ బాటిల్ ఖరీదు చేసిన వ్యక్తి చెల్లించిన లావాదేవీని గుర్తించారు. ఆ యూపీఐ యాప్‌తో అనుసంధానించి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకున్న దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా చంద్రమోహన్‌ను గుర్తించి 2023 మే 24న అరెస్టు చేశారు. ఆపై కేసును హత్య జరిగిన ప్రాంతం జ్యురీస్‌డిక్షన్ ఆధారంగా చైతన్యపురి ఠాణాకు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment