Sensational cases
-
ప్రణీత్ రావు చేసిన నిర్వాకమిది!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో విచారణాంతరం ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రణీత్ రావు నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు.. సస్పెండ్ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు విచారణలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐబీ Special Intelligence Bureau (SIB)లోని ఎస్వోటీ లాగర్ రూమ్‌లో ప్రణీత్‌రావు విధ్వంసం సృష్టించినట్లు తేలింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు రాగానే లాగర్ రూమ్ ధ్వంసానికి ప్రణీత్ రావు వ్యూహరచన చేసినట్లు వెల్లడైంది. ఎస్ఐబీలోని ఎస్వోటీ ఆపరేషన్‌కు హెడ్‌గా ఉన్న ప్రణీత్ రావు.. రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతల వ్యవహారాల వ్యవహారాలతో పాటు మావోయిస్టులు.. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రణీత్ రావు పర్యవేక్షించారు. ఎన్నికల ఫలితాలు రాగానే నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయన లాగర్ రూమ్‌కి వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్ ల తో పాటు వందల కొద్ది డాక్యుమెంట్లని ధ్వంసం చేసిన ప్రణీత్ రావు. ఆ సమయంలో ఎస్వోటీ లాగర్ రూమ్ సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారాయన. అంతేకాదు.. లాగర్ రూమ్ కరెంట్ సప్లైను నిలిపివేసి మరి ప్రణీత్ రావు లోపలికి వెళ్లినట్లు తేలింది. వేల సంఖ్యలో కాల్ డాటా రికార్డులతో పాటు ఐఎంఈఐ నెంబర్లను ధ్వంసం చేసి.. ఎస్ఐబీ ప్రాంగణంలోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను కాల్చేసినట్లు వెల్లడైంది. మొత్తానికి లాగర్ రూమ్‌లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయారాయన. అయితే.. ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం ధ్వంసం చేశాడో నిర్ధారించుకోలేకపోతున్న అధికారులు.. ఆయనపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఆయన బంధువుగా.. అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. ప్రణీత్ రావుకు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐబీని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్‌రావుకు ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్‌కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం. -
కులాంతర వివాహంతోనే హత్య
రాప్తాడు: ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన చిట్రా మురళి హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన కురుబ చిట్రా నాగన్న, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు చిట్రా మురళి, అదే గ్రామంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ములుగూరు రామానాయుడు (లేట్), యశోదమ్మ దంపతుల కుమార్తె వీణలు ప్రేమించుకున్నారు. గతేడాది జూన్ 23న ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాహం చేసు కున్నారు. కొన్ని రోజుల తర్వాత రాప్తాడు ఎస్సీ కాలనీలో కాపురం పెట్టారు. మురళి కియా కంపెనీలో ఉద్యోగానికి కుదరగా, వీణ కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల సచివాలయంలో మహిళా పోలీస్‌గా విధులు నిర్వర్తించేది. మురళిని కడతేర్చుతానని యశోదమ్మ శపథం కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని వీణ తల్లి యశోదమ్మ రగిలిపోయేది. కొన్ని రోజుల క్రితం కూతురితో మాట్లాడిన ఆమె నీ మొగుణ్ణి కడతేర్చుతానని శపథం చేసింది. తన బంధువులైన అప్పన్న గారి వెంకటేశులు (అనంతపురం), సుబ్రమణ్యం (మాజీ సర్పంచ్, కనగానపల్లి) ద్వారా అనంతపురానికి చెందిన సాకే సర్దార్తో మురళిని హత్య చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుంది. రూ.2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మిగతా మొత్తం హత్య తర్వాత ఇస్తామని చెప్పింది. రంగంలోకి దిగిన సర్దార్ తన ముఠా సభ్యులైన రవి, సయ్యద్ సద్దాం, పెనకలపాటి సుబ్రమణ్యం అలియాస్ మణి, పెనకలపాటి ప్రకాష్‌తో కలిసి మురళి హత్యకు రెక్కీ నిర్వహించాడు. కియా కంపెనీకి వెళ్లేందుకు మురళి రోజూ రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉండడం గమనించాడు. ఎప్పటిలాగే మురళి ఈ నెల 16న వేచి ఉండగా నలుగురూ కలిసి ఓ ఆటోలో కిడ్నాప్ చేశారు. బొమ్మేపర్తి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి కత్తులతో విచక్షణారహితంగా గొంతు కోసి హత్య చేశారు. దీనిపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అనంతపురం మండలం సోమలదొడ్డిలో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆటో, బైక్, 2 చాకులు, 8 సెల్ఫోన్లతో పాటు రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య జరిగిన 6 రోజుల్లోనే కేసును ఛేదించిన డీఎస్పీ శ్రీనివాసులు బృందాన్ని ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు. కార్యక్రమంలో ఇటుకల పల్లి సీఐ మురళీధర్, ఎస్ఐ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రాధ మిస్సింగ్ కేసు: హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు) -
ఆ నీచుడి గురించి అమ్మకు తెలుసు
-
ఆ నీచుడి గురించి అమ్మకు తెలుసు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన ‘థియేటర్ లైంగిక వేధింపుల కేసు’లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. స్థానిక మీడియా ఛానెళ్లలో సదరు వీడియో చక్కర్లు కొట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే తల్లి ప్రొద్భలంతోనే మైనర్ బాలికపై లైంగిక చేష్టలకు సదరు వ్యక్తి దిగినట్లు తేలింది. ఈ విషయాన్ని మైనర్ బాలిక చెప్పటంతో సదరు వ్యక్తితోపాటు చిన్నారి తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... మళప్పురానికి చెందిన వ్యాపారవేత్త మొయిదీన్ కుట్టీ(60), స్థానికంగా ఉంటున్న 35 ఏళ్ల ఓ మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 18న ఎడప్పల్‌లో ఉన్న ఓ థియేటర్‌కు మహిళను, ఆమె కూతురి(10)ని తీసుకెళ్లాడు. చెరోపక్క వారిద్దరినీ కూర్చోపెట్టుకుని మైనర్ బాలికను లైంగికంగా వేధించటం ప్రారంభించాడు. అయితే పక్కనున్న కొందరు బాలిక ఏడుస్తుండటం గమనించి థియేటర్ యాజమానికి సమాచారం అందించారు. థియేటర్లో సీసీ ఫుటేజీ కెమెరాలో(నైట్ విజన్ మోడ్ ద్వారా) ఆ తతంగం అంతా రికార్డయ్యింది. దృశ్యాలను గమనించిన థియేటర్ మేనేజర్ చైల్డ్ లైన్ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తీరుపై విమర్శలు... అయితే ఈ విషయంలో ఫిర్యాదు అంది రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసుల నుంచి స్పందన లేకుండా పోయింది. నిందితుడు బడా వ్యాపారవేత కావటంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు తటపటాయించారు. చివరకు ఆ వీడియో మీడియా ఛానెళ్లలో చక్కర్లు కొట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేరళ మహిళ కమిషన్చైర్పర్సన్ ఎంసీ జోసెఫిన్ దగ్గరుండి ఈ కేసును పర్యవేక్షించారు. ఏప్రిల్ 28న చైల్డ్ లైన్ సహాయక సిబ్బంది అందించిన వీడియోను కేరళ పోలీస్ శాఖకు ఆమె అందించారు. పోలీసుల నిర్లక్ష్యం నిర్ధారణ కావటంతో చంగరకులం ఎస్సైపై వేటు పడింది. కేరళ మానవహక్కుల సంఘం స్పందించి ఘటనపై పోలీస్ శాఖను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. మేజిస్ట్రేట్ ఆ బాలిక నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అమ్మకు తెలుసు... ఈ వ్యవహారంలో తల్లి ప్రొద్భలంతోనే సదరు వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ‘ఆ పెద్దాయన గురించి అమ్మకు తెలుసు. తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. మమల్ని బయటకు తీసుకెళ్లి బట్టలు కొనిచ్చి, భోజనం పెట్టించేవాడు. గతంలోనూ ఆయన ఓసారి నాతో అలాగే ప్రవర్తించాడు. అప్పుడు అమ్మకు ఈ విషయం చెబితే నన్ను తిట్టింది. ఆరోజు థియేటర్లో కూడా నాపై చెయ్యి వేస్తే ఏడ్పొచ్చింది. వద్దని బతిమాలినా వినలేదు’ అని బాలిక పేర్కొంది. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం మొయిదీన్ కుట్టీని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. అటుపై అతను ఇచ్చిన సమాచారంతో ఆదివారం ఆ బాలిక తల్లిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పోక్సో యాక్ట్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను నిర్భయ సెంటర్‌కు తరలించారు. -
విచ్చలవిడిగా ‘ములాఖత్’లు !
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో అరెస్టు అయి ఏసీబీ కేసులలో 11 నెలలుగా జైలులో ఉన్న మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి వ్యవహారంలో మరో సంచలన వీడియో బయటపడింది. గతంలో కరీంనగర్ జైలు అధికారి కార్యాలయంలోనే సెటిల్మెంట్లు చేసిన వీడియో బహిర్గతం కావడంతో సూపరింటెండెంట్ బదిలీ కావడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, అనుయాయులతో కలసి చర్చించడమే కాకుండా పోలీసులకు నజరానా ముట్టజెప్పిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈనెల 21న కరీంనగర్ కోర్టుకు వచ్చిన మోహన్‌రెడ్డి, దానికి ఎదురుగా ఉన్న ఉడిపి హోటల్లో సాయంత్రం 6.02 గంటలకు ప్రవేశించి ఏకంగా 23 నిమిషాలు హోటల్లో గడిపాడు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు అక్షయ్‌రెడ్డి, తమ్ముడు మహేందర్‌రెడ్డిలతో పాటు బంధువులు, మణింధర్సింగ్లతో చర్చలు జరిపారు. 6.24 నిమిషాలకు మోహన్‌రెడ్డి సూచనల మేరకు చర్చల అనంతరం మహేందర్‌రెడ్డి హోటల్ బెంచీపై డబ్బులు పెట్టాడు. మోహన్‌రెడ్డి లేవగానే అక్కడున్న కానిస్టేబుల్ ఆ మొత్తాన్ని తన జేబులో పెట్టుకొని నడుస్తున్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్కార్ట్ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని బాధితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ముస్కు మహేందర్‌రెడ్డి, బండమీది సాయన్నలు , లోక్‌సత్తా నాయకులు ఎన్.శ్రీనివాస్, ప్రకాశ్ హోల్లాలు డిమాండ్ చేశారు. ఇదిలా వుండగా ఈ ఘటనపై స్పందించిన కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. -
సంచలన కేసులు ఛేదించాం
గతం కన్నా తగ్గిన నేరాలు చోరీ అయిన సొత్తు రూ.6.95 కోట్లు రికవరీ అయింది రూ.3.11 కోట్లు అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి తిరుపతి క్రైం: తిరుపతి అర్బన్ జిల్లాలో పలు సంచలన కేసులు ఛేదించామని అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి తెలిపారు. 2015లో ఏడాది మొత్తం జరిగిన వివిధ నేరాలకు సంబంధించిన పోలీసులు తీసుకున్న చర్యలపై మంగళవారం పోలీసు అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీయాక్ట్ కేసు నమోదు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు అడవుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహించామన్నారు. 2015లో 62 కేసులు నమోదు కాగా, 250 మంది ఎర్ర కూలీలను అరెస్టు చేశామన్నారు. మొత్తం వీరి వద్ద నుంచి 1016 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మారిషస్‌లో పట్టుబడిన కొల్లెం గంగిరెడ్డిని భారతదేశానికి తీసుకురావడంలో అర్బన్ జిల్లా పోలీసులు కృషి చేశారన్నారు. ఈ సంవత్సరం సంచలన కేసులైన తిరుచానూరులో ఓ హత్య కేసులో పోలీసు అధికారిని సస్పెండ్ చేశామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలలో బాధితులకు అండగా నిలిచామన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎస్ఐ సంజీవ్‌కుమార్ వరదల్లో కొట్టుకుపోతున్న కాళిముత్తు, కృష్ణన్ అనే ఇద్దరిని ప్రాణాలకు తెగించి కాపాడడం జరిగిందన్నారు. మస్కన్ ఆపరేషన్ ద్వారా 127 మంది పిల్లలను చేరదీసి కొందరిని వారి తల్లిదండ్రులకు, మరికొందరిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారన్నారు. ఈ సంవత్సరంలో దొంగిలించిన మొత్తం రూ.6,95,34,741 కాగా రూ.3,11,31,147 సొత్తును రికవరీ చేశామన్నారు. షీటీమ్‌ల ద్వారా 354 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. మూడు బాల్య వివాహాలను ఆపామన్నారు. ఏఎస్పీలు సుబ్బారెడ్డి, స్వామి, డీఎస్పీలు రవిశంకర్‌రెడ్డి, వెంకటనారాయణ, రవికుమార్, ఇలియాజ్‌బాషా, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
సంచలన కేసులు ఛేదించాం
⇒గతంలో కన్నా పెరిగిన క్రైం ⇒చోరీ అయిన సొత్తు రూ.6.41 కోట్లు ⇒రికవరీ అయింది రూ.2.7 కోట్లు ⇒అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తిరుపతి క్రైం : తిరుపతి అర్బన్ జిల్లాలో ఈ ఏడాది పలు సంచలన కేసులు ఛేదించామని అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జట్టి తెలిపారు. 2014 ఏడాది మొత్తం జరిగిన వివిధ నేరాలకు సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలపై సోమవారం పోలీసు అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీయాక్ట్ నమోదు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టేందుకు నిత్యం అడవుల్లో కూంబింగ్ నిర్వహించామన్నారు. 2014లో 1404 మంది ఎర్రకూలీలను అరెస్టు చేశామన్నారు. సుమారు 140 కేసుల్లో మొత్తం 65,019 కిలోల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామన్నారు. 169 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఇందులో 125 కేసులు నిరూపణ కావడంతో 76 వాహనాలను సీజ్ చేశామన్నారు. సెప్టెంబర్ 13న గాజులమండ్యం రోడ్డులో ‘సాక్షి’ ఉద్యోగిపై దాడిచేసి రూ.32,82,190 లాక్కెళ్లారని, ఆ కేసును నెల లోపే ఛేదించి 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.20,14,000 రాబట్టామన్నారు. డిసెంబర్ 12న యూనివర్సిటీ ఏఏవో భార్య సుధారాణి హత్య ఘటనలో నిందితుడు మురళీకృష్ణను 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నామన్నారు. తిరుచానూరులో చిన్నారి లక్ష్మీప్రియను కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో నిందితుడిని కేవలం రెండుగంటల్లోనే అదుపులోకి తీసుకున్నామన్నారు. జూన్ 6వతేది బాబా పేరుతో ఎన్నో మోసాలకు పాల్పడిన శివ (అలియాస్) స్వామి, దాముకుమార్ను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.63,43,500 స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితో పాటు పలు దొంగ తనం కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేశామన్నారు. తాగిన వారికి మత్తు వదిలించాం తాగి వాహనాలు నడిపే వారిపై బ్రీత్ అన్లైజర్తో తనిఖీలు చేసి 61,300 కేసులు నమోదు చేశామన్నారు. దీని ద్వారా 1,40,99,660 రూపాయల అపరాధం వేశామన్నారు. 15,036 కేసులు కోర్టుకు వెళ్లగా, అపరాధ రూపంలో 47,87,600 రూపాయలను వసూలు చేశామన్నారు. 346 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి 565 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 10,47,734 రూపాయలను సీజ్ చేశామని తెలిపారు. 2012లో 2,355 కేసులు, 2,013లో 2,475, 2014లో 3,459 కేసులు నమోదయ్యాయన్నారు. గడిచిన సంవత్సరాలతో పోల్చితే నేరాల సంఖ్య పెరిగిందన్నారు. మొత్తం ప్రాపర్టీ రూ.6,41,69,003 పోగా ఇందులో రూ.2,75,60,875 రికవరీ అయిందన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీలు త్రిమూర్తులు, సుబ్బారెడ్డి, స్వామి, డీఎస్పీ కొండారెడ్డి, సీఐలు రామ్‌కిషోర్, రామకృష్ణ పాల్గొన్నారు.