థియేటర్ సీసీ టేవీ ఫుటేజీలో నమోదైన దృశ్యాల ఆధారంగా చిత్రం
సాక్షి, తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన ‘థియేటర్ లైంగిక వేధింపుల కేసు’లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. స్థానిక మీడియా ఛానెళ్లలో సదరు వీడియో చక్కర్లు కొట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే తల్లి ప్రొద్భలంతోనే మైనర్ బాలికపై లైంగిక చేష్టలకు సదరు వ్యక్తి దిగినట్లు తేలింది. ఈ విషయాన్ని మైనర్ బాలిక చెప్పటంతో సదరు వ్యక్తితోపాటు చిన్నారి తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే... మళప్పురానికి చెందిన వ్యాపారవేత్త మొయిదీన్ కుట్టీ(60), స్థానికంగా ఉంటున్న 35 ఏళ్ల ఓ మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 18న ఎడప్పల్‌లో ఉన్న ఓ థియేటర్‌కు మహిళను, ఆమె కూతురి(10)ని తీసుకెళ్లాడు. చెరోపక్క వారిద్దరినీ కూర్చోపెట్టుకుని మైనర్ బాలికను లైంగికంగా వేధించటం ప్రారంభించాడు. అయితే పక్కనున్న కొందరు బాలిక ఏడుస్తుండటం గమనించి థియేటర్ యాజమానికి సమాచారం అందించారు. థియేటర్‌లో సీసీ ఫుటేజీ కెమెరాలో(నైట్ విజన్ మోడ్ ద్వారా) ఆ తతంగం అంతా రికార్డయ్యింది. దృశ్యాలను గమనించిన థియేటర్ మేనేజర్ చైల్డ్ లైన్ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తీరుపై విమర్శలు... అయితే ఈ విషయంలో ఫిర్యాదు అంది రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసుల నుంచి స్పందన లేకుండా పోయింది. నిందితుడు బడా వ్యాపారవేత కావటంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు తటపటాయించారు. చివరకు ఆ వీడియో మీడియా ఛానెళ్లలో చక్కర్లు కొట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేరళ మహిళ కమిషన్‌చైర్‌పర్సన్ ఎంసీ జోసెఫిన్ దగ్గరుండి ఈ కేసును పర్యవేక్షించారు. ఏప్రిల్ 28న చైల్డ్ లైన్ సహాయక సిబ్బంది అందించిన వీడియోను కేరళ పోలీస్ శాఖకు ఆమె అందించారు. పోలీసుల నిర్లక్ష్యం నిర్ధారణ కావటంతో చంగరకులం ఎస్సైపై వేటు పడింది. కేరళ మానవహక్కుల సంఘం స్పందించి ఘటనపై పోలీస్ శాఖను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. మేజిస్ట్రేట్ ఆ బాలిక నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.
అమ్మకు తెలుసు... ఈ వ్యవహారంలో తల్లి ప్రొద్భలంతోనే సదరు వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ‘ఆ పెద్దాయన గురించి అమ్మకు తెలుసు. తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. మమల్ని బయటకు తీసుకెళ్లి బట్టలు కొనిచ్చి, భోజనం పెట్టించేవాడు. గతంలోనూ ఆయన ఓసారి నాతో అలాగే ప్రవర్తించాడు. అప్పుడు అమ్మకు ఈ విషయం చెబితే నన్ను తిట్టింది. ఆరోజు థియేటర్‌లో కూడా నాపై చెయ్యి వేస్తే ఏడ్పొచ్చింది. వద్దని బతిమాలినా వినలేదు’ అని బాలిక పేర్కొంది. ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం మొయిదీన్ కుట్టీని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. అటుపై అతను ఇచ్చిన సమాచారంతో ఆదివారం ఆ బాలిక తల్లిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పోక్సో యాక్ట్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను నిర్భయ సెంటర్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment