గతం కన్నా తగ్గిన నేరాలు
చోరీ అయిన సొత్తు రూ.6.95 కోట్లు
రికవరీ అయింది రూ.3.11 కోట్లు
అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి
తిరుపతి క్రైం: తిరుపతి అర్బన్ జిల్లాలో పలు సంచలన కేసులు ఛేదించామని అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి తెలిపారు. 2015లో ఏడాది మొత్తం జరిగిన వివిధ నేరాలకు సంబంధించిన పోలీసులు తీసుకున్న చర్యలపై మంగళవారం పోలీసు అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీయాక్ట్ కేసు నమోదు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు అడవుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహించామన్నారు. 2015లో 62 కేసులు నమోదు కాగా, 250 మంది ఎర్ర కూలీలను అరెస్టు చేశామన్నారు. మొత్తం వీరి వద్ద నుంచి 1016 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మారిషస్‌లో పట్టుబడిన కొల్లెం గంగిరెడ్డిని భారతదేశానికి తీసుకురావడంలో అర్బన్ జిల్లా పోలీసులు కృషి చేశారన్నారు. ఈ సంవత్సరం సంచలన కేసులైన తిరుచానూరులో ఓ హత్య కేసులో పోలీసు అధికారిని సస్పెండ్ చేశామన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలలో బాధితులకు అండగా నిలిచామన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎస్‌ఐ సంజీవ్‌కుమార్ వరదల్లో కొట్టుకుపోతున్న కాళిముత్తు, కృష్ణన్ అనే ఇద్దరిని ప్రాణాలకు తెగించి కాపాడడం జరిగిందన్నారు. మస్కన్ ఆపరేషన్ ద్వారా 127 మంది పిల్లలను చేరదీసి కొందరిని వారి తల్లిదండ్రులకు, మరికొందరిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారన్నారు. ఈ సంవత్సరంలో దొంగిలించిన మొత్తం రూ.6,95,34,741 కాగా రూ.3,11,31,147 సొత్తును రికవరీ చేశామన్నారు. షీటీమ్‌ల ద్వారా 354 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. మూడు బాల్య వివాహాలను ఆపామన్నారు. ఏఎస్పీలు సుబ్బారెడ్డి, స్వామి, డీఎస్పీలు రవిశంకర్‌రెడ్డి, వెంకటనారాయణ, రవికుమార్, ఇలియాజ్‌బాషా, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
సంచలన కేసులు ఛేదించాం
Published Wed, Dec 30 2015 2:11 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
Advertisement