స్వర్ణ ప్రియాంక
టీ.నగర్: చెన్నైలో ఇంజినీరింగ్ చదువుతున్న ఆంధ్రకు చెందిన విద్యార్థిని అదృశ్యమైనట్లు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా కొండపి మండలం చోడవరం గ్రామానికి చెందిన స్వర్ణ వెంకటనరసు అనే రైతు కుమార్తె స్వర్ణ ప్రియాంక చెన్నై తాంబరం భారత్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ (సీఎస్‌డీ) నాలుగో ఏడాది చదువుతోంది. కళాశాల అనుమతితో ప్రైవేటు గృహాన్ని అద్దెకు తీసుకుని కడపకు చెందిన ఇతర అమ్మాయిలతో కలిసి ఉండేది.
ఈ నెల 20వ తేదీ సాయంత్రం చెన్నై ఎగ్మూరు నుంచి బయల్దేరే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌కు వస్తున్నానని.. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో తనను రిసీవ్ చేసుకోమని తల్లిదండ్రులకు ఫోను చేసి తెలిపిందని, అయితే సదరు విద్యార్థిని ఒంగోలులో దిగలేదని, ఆమె సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా రింగవుతున్నా లిఫ్ట్ కాలేదని తెలిసింది. ఇదిలా ఉండగా స్వర్ణ ప్రియాంక 20వ తేదీ తన స్నేహితురాళ్లతో కలిసి కడపకు వెళ్తున్నట్టు కొందరికి చెప్పినట్టు తెలిసింది. 22వ తేదీ సాయంత్రం వరకు ఫోన్ రింగవుతూనే ఉండగా తండ్రి వెంకటనరుసు చెన్నై చేరుకుని ద్రావిడదేశం అధ్యక్షుడు కృష్ణారావు తరఫున తాంబరం సేలయూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలా ఉండగా 22 సాయంత్రం తర్వాత అమ్మాయి సెల్‌ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉందని, చివరిగా సెల్‌ఫోన్ సిగ్నల్ రాయపురం ప్రాంతంలో వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో కేసు పరిష్కరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment