మద్యానికి బానిసై మగువ కోసం.. | Cops Arrest 4 Affenders In Robbery Case At Prakasam | Sakshi
Sakshi News home page

బంధువుల ఇళ్లకు కన్నం

Published Thu, Sep 5 2019 8:24 AM | Last Updated on Thu, Sep 5 2019 11:29 AM

Cops Arrest 4 Affenders In Robbery Case At Prakasam - Sakshi

కేసుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ రవిచంద్ర, పక్కన సీఐ విజయ్‌కుమార్, ఎస్సైలు

సాక్షి, కందుకూరు (ప్రకాశం): వారంతా నిండా పాతికేళ్లు కూడా నిండని యువకులు. ప్రస్తుతం కాలేజీల్లో ఇంటర్, బీటెక్, ఎంబీఏ వంటివి చదువుతున్నారు. కానీ ఏం లాభం మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. ఇంకేముంది.. చదువులను పక్కన పెట్టి తిరగడం మొదలుపెట్టారు. జులాయిగా తిరగడానికి అవసరమైన డబ్బుల కోసం చోరీల బాటపట్టారు. ఎవరో తెలియని వారి ఇంట్లో దొంగతనం చేయడం కంటే సొంత బంధువులు ఇళ్లయితే సులువని భావించారు. బంధువుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు, డబ్బులు కాజేసి జల్సాలు చేశారు. అయితే ఇక్కడ దొంగతనం బాధితులంతా మేనమామలు, పెద్దనాన్న కావడం, దొంగతనం చేసిన వారు వారి మేనళ్లులే కావడం విచిత్రంగా మారింది. కందుకూరు ప్రాంతంలో జరిగిన కేసులను పోలీసులు చేధించగా ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలను కందుకూరు డీఎస్పీ రవిచంద్ర బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

కందుకూరు పట్టణంలోని సాయినగర్‌ 7వ లైన్‌లో చిప్స్‌ వ్యాపారి మాలెం లక్ష్మీనారాయణ నివాసం ఉంటున్నాడు. లక్ష్మీనారాయణ ఇంట్లో గత నెలలో దొంగతనం జరిగింది. ఇంట్లోని 14 సవర్ల బంగారం చోరీకి గురైంది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ దొంగతనం చేసింది అతని మేనల్లుడు ప్రణీత్‌రెడ్డిగా నిర్ధారించాడు. ప్రణీత్‌రెడ్డి ప్రస్తుతం విజయవాడలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యసనాలకు అలవాటు పడ్డ ప్రణీత్‌రెడ్డి మేనమామ ఇంట్లోనే దొంగతనం చేసి డబ్బులు కాజేయాలని పన్నాగం పన్నాడు. ముందుగానే ఆ ఇంటి డూప్లికేట్‌ తాళం చేయించి ఉంటాడు. గత నెల 22న మేనమాన ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న ప్రణీత్‌రెడ్డి తన వద్ద ఉన్న డూప్లికేట్‌ తాళం సహాయంతో ఇంట్లోకి వెళ్లాడు.

తరువాత బీరువా పగలగొట్టి అందులోని 14 సవర్ల బంగారం తీసుకున్నాడు. అయితే లాకర్లలో మరికొంత బంగారం ఉన్న విషయం తెలియక వదిలేశాడు. తరువాత పోలీసులకు వేలిముద్రలు దొరకకూడదనే ఉద్దేశంతో బీరువాలోని విలువైన వస్తువులన్నీ తగలబెట్టాడు. వీటిలో వేల రూపాయల విలువ చేసే చీరలు కూడా ఉన్నాయి. తరువాత పక్క ఇంట్లో ఉన్న బైక్‌ తీసుకుని పారిపోయాడు. చోరీ చేసిన బంగారంలో ఓ చైన్‌ను రూ. 10వేలకు విక్రయించి జల్సా చేశాడు. మిగిలిన బంగారం కూడా అమ్మే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించడంతో ఓ యువకుడు బైక్‌ తీసుకెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు ప్రణీత్‌రెడ్డిని అరెస్టు చేసి, ఆ యువకుడి వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురితో కలిసి..
ఉలవపాడులోని రిజర్వు కాలనీవాసి రసూల్‌ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని ఇంట్లో దొంగతనం జరిగి 4 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులోనూ 9వ తరగతి చదువుతున్న రసూల్‌ మేనల్లుడే ప్రధాన నిందితుడు. నిందితుడు బీటెక్‌ చదివే అబ్దుల్‌ మజీద్, బంగారు పనిచేసే సర్వేపల్లి నాగరాజు, కంచర్ల తేజ అనే యువకులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. అంతా కలిసి నాలుగు సవర్ల బంగారం కాజేసి జల్సాల కోసం ఖర్చు చేశారు.

పెదనాన్న ఇంట్లోనే చోరీ..
ఉలవపాడు మండలం మన్నేటికోటలో జరిగిన మరో దొంగతనం కేసు ఆసక్తికరంగా ఉంది. గ్రామానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ లైన్‌మెన్‌ తాటికొండ శ్రీనివాసరావు ఇంట్లో దొంగతనం జరిగి 10 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.  పోలీసుల విచారణలో శ్రీనివాసుల తమ్ముడి కొడుకే దొంగ అని తేలింది. అతను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. చెన్నైలో ఎంబీఏ చదువుతున్న పొదిలి అవినాష్‌ అనే యువకుడితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. కాజేసిన బంగారాన్ని అమ్ముకుని జల్సాలు చేశారు. అయితే పోలీసులు చోరీ అయిన బంగారం మొత్తాన్ని రికవరీ చేశారు.

సిబ్బందికి ప్రత్యేక అభినందనలు
ఈ సందర్భంగా మూడు కేసులను చేధించిన పోలీస్‌ సిబ్బందిని డీఎస్పీ రవిచంద్ర ప్రత్యేక అభినందనలు తెలిపారు. దొంగతనాలకు నిందితులను అరెస్టు చేయడంతో పాటు, సొత్తు రికవరీ చేశామన్నారు. కృషి చేసిన ఎస్సైలు, కానిస్టేబుల్స్, ఐడీ పార్టీ సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో సీఐ విజయ్‌కుమార్, పట్టణ, ఉలవపాడు ఎస్సైలు కేకే తిరుపతిరావు, శ్రీకాంత్, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మద్యానికి.. మగువకి ఖర్చు.. 
మూడు కేసుల్లో మొత్తం ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురు విద్యార్థులే కావడం గమనార్హం. 9,10వ తరగతి చదివే స్కూల్‌ పిల్లలు ఉండడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దొంగతనం చేసి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం ఈ వయసులో వారికి ఏమొచ్చిందని పోలీసులు ఆరా తీస్తే వారు చెప్పిన మాటలు విని నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవడం మద్యం తాగడానికి, వ్యభిచార గృహాలకు ఖర్చు చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న విచారణలో తేలింది. మగువ కోసమే ఒక్కొక్కరు రూ 5వేల వరకు ఖర్చు చేశారనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. నిండా 25 ఏళ్లు కూడా నిండని విద్యార్థులు ఈ వ్యసనాలకు బానిసలు కావడంపై పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement