టీ తాగేందుకు వచ్చి..మృత్యు ఒడికి | Two Men Died In Car Accident Prakasam | Sakshi
Sakshi News home page

టీ తాగేందుకు వచ్చి..మృత్యు ఒడికి

Published Sat, Nov 3 2018 1:36 PM | Last Updated on Sat, Nov 3 2018 1:36 PM

Two Men Died In Car Accident Prakasam - Sakshi

సంఘటనా స్థలానికి దూరంలో పొలాల్లో పల్టీకొట్టిన కారు , సూర్‌మర్ది (26) , లోబిన్‌మర్ది (32)

ప్రకాశం,భూమిరెడ్డిపల్లె (పామూరు): టీ దుకాణం వద్ద నిలబడి టీ తాగుతున్న ఇద్దరు యువకులను కారు ఢీకొనగా వారు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి 565 జాతీయ రహదారిపై మండలంలోని భూమిరెడ్డిపల్లె బస్‌స్టేజి సమీపంలోని బ్రహ్మారెడ్డికి చెందిన టీ దుకాణం వద్ద చోటు చేసుకుంది. మృతుడి సోదరుడు బలియమర్ది చెప్పిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం కాషియబెడ గ్రామం, ముయిర్‌బోజ్‌ జిల్లాకు చెందిన లోబిన్‌మర్ది (32), సూర్‌మర్ది (26) బలియమర్ది, మరో యువకుడు మొత్తం నలుగురు వారం రోజుల క్రితం భూమిరెడ్డిపల్లె సమీపంలోని జయశ్రీ ఇండస్ట్రీస్‌ అనే తెల్లరాయి క్వారీలో క్రషర్‌కు మరమ్మతులు నిర్వహించేందుకు వచ్చారు.

ఈ సందర్భంలో శుక్రవారం రాత్రి వారు పని ముగించుకుని టీ తాగేందుకు సమీపంలోని 565 జాతీయ రహదారి పక్కన భూమిరెడ్డిపల్లె బస్‌స్టాప్‌కు సమీపంలోని బ్రహ్మారెడ్డికి చెందిన టీ దుకాణం వద్ద నిలబడి టీ తాగుతున్నారు. ఆ సమయంలో కనిగిరికి చెందిన ఎస్‌కే.సుహైల్, షాకీర్‌లు రీనాల్డ్‌ లాగ్డే కారులో పామూరులో పని చూసుకుని తిరిగి వేగంగా కనిగిరి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయి టీ దుకాణం వద్ద టీ తాగుతున్న లోబిన్‌మర్ది (32), సూర్‌మర్ది (26) లను ఢీకొట్టి అదే వేగంతో ముందుకుపోయి పొలాల్లోని ఫెన్సిగ్‌ రాయిని ఢీకొట్టి కారు పొలంలో బోల్తా కొట్టింది. ఘటనలో లోబిన్‌మర్ది, సూర్‌మర్ది అక్కడికక్కడే చనిపోగా టీ దుకాణం నిర్వాహకుడు బ్రహ్మారెడ్డికి గాయాలయ్యాయి.

అతడిని 108 లో కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతుడు లోబిన్‌మర్ది (32) కు భార్య దులరిమర్ది, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మరో మృతుడు సూర్‌మర్ది (26)కి వివాహం కాలేదు. మృతుని సోదరుడు బలియమర్ది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్సై మీరాసాహెబ్‌ ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. కారు నడుపుతున్న ఎస్‌కే.సుహైల్, షాకిర్‌లను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement