ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. | Five Death in Car Accident Cheerala Prakasam | Sakshi
Sakshi News home page

మృత్యు యాత్ర

Published Tue, Jan 21 2020 1:26 PM | Last Updated on Tue, Jan 21 2020 1:26 PM

Five Death in Car Accident Cheerala Prakasam - Sakshi

చీరాల టౌన్‌: వారంతా వేర్వేరు కుటుంబాలకు చెందిన వారైనా ఒకే కుటుంబంలా కలిసి మెలసి ఉండేవారు. సంక్రాంతి సెలవులను సరదాగా గడిపేందుకు తమ చుట్టాల వారు పిలిస్తే పెద్దలు, పిల్లలు 11 మంది కలిసి జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు వెళ్లి చివరకు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు దేవాలయాల్లో ఆనందంగా... భక్తి పారవశ్యంతో గడిపిన వారు తిరుగు ప్రయాణంలో శాశ్వత నిద్రలోకి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న 9 మందిలో ఐదుగురు మృత్యువాతపడగా.. తీవ్రంగా గాయపడిన నలుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈనెల 8 తేదీన రైలులో అహ్మదాబాద్‌ వెళ్లి ద్వారక, కేదార్‌నాథ్‌ దేవాలయాలను సందర్శించిన వీరు తిరుగు ప్రయాణంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబం మొత్తం మరణించగా, మరొక కుటుంబంలో కొడుకు, వేరే కుటుంబంలో ఇంటి యజమానురాలిని కోల్పోయారు. కళ్లెదుటే తమ వారు మృత్యువాత పడటం.. భాష రాకపోవడం.. కనీసం మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు కూడా సాయం చేసే వారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానిది ఒక్కో దీనగాథ. 

ఆ కుటుంబంలో ఎవ్వరూ మిగల్లేదు..!  
జాండ్రపేట విద్యానగర్‌కు చెందిన కామిశెట్టి సుబ్రహ్మణ్యం (43), భార్య రాజేశ్వరి (38), కుమారుడు గణేష్‌ (24) ఈనెల 8న అహ్మదాబాద్‌కు వెళ్లారు. చేనేత వృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జాండ్రపేటకు చెందిన సమీప బంధువు బొడ్డు నాగేంద్రం అహ్మదాబాద్‌లో పనిచేస్తుండటంతో తనకు దగ్గరలోనే ఉన్న సోమ్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించవచ్చని చెప్పడంతో నాగేంద్రం భార్య దుర్గా భవాని (24), సుబ్రహ్మణ్యం తమ్ముడు శివప్రసాద్, కృష్ణవేణి పిల్లలు అఖిల్‌ (12), మాధురిలతో అహ్మదాబాద్‌కు వెళ్లారు. ద్వారక, కేదార్‌నాథ్‌ ఆలయాలను సందర్శించుకున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో ఉన్న వారు ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వాహనం ఆదివారంగుజరాత్‌ రాష్ట్రం సురేంద్రనగర్‌ జిల్లాలోని దేవ్‌పరా వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న 9 మందిలో సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, గణేష్, అఖిల్, దుర్గా భవానీలు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారిలో మాధురి, కుచలత, రుషిత్, నాగేంద్రం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందగా ఈ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు. దీంతో ఆ కుటుంబ బంధువులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతదేహాలు అహ్మదాబాద్‌లోని సివిక్‌ హాస్పిటల్‌లో ఉన్నాయి. వాటిని తీసుకొచ్చేందుకు వారి బంధువులు నలుగురు అహమ్మదాబాద్‌ వెళ్లారు. అయితే మృతదేహాలను స్వగ్రామాలకు తెచ్చేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లను అడిగితే రూ.2 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో వారి దిక్కుతోచని స్థితిలో సాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. రైలులో తీసుకురావాలన్నా ప్రభుత్వ సహాయం అవసరం. 

ఆ ఇంటి దీపం ఆరిపోయింది:  కామిశెట్టి శివప్రసాద్, కృష్ణవేణి దంపతులకు అఖిల్‌ (12), మాధురిలు సంతానం. తన అన్న సుబ్రహ్మణ్యం, వదిన రాజేశ్వరి, అన్న కొడుకు గణేష్‌లు సోమ్‌నాథ్, కేదార్‌నాథ్, ద్వారక వెళ్తుండటంతో తమ పిల్లలను కూడా ఈ యాత్రకు పంపారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తన అన్న, వదిన, అన్నకొడుకుతో పాటుగా రక్తం పంచుకుని పుట్టిన అఖిల్‌(12) సంఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు హఠాన్మరణం చెందడం, కూతురు హాస్పిటల్‌లో విషమ స్థితిలో ఉండటంతో ఆ కుటుంబం రోదిస్తున్న తీరు కలచివేసింది.

నాగేంద్రానికి తోడు కరువు...  
అందరు వస్తే సోమ్‌నాథ్‌ ఆలయం దర్శించవచ్చని చెప్పి అందరినీ తీసుకుని వెళ్లిన నాగేంద్రం 9 మందితో కలిసి హాయిగా యాత్ర చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తన భార్య దుర్గా భవాని (23) కళ్లముందే తనను విడిచి వెళ్లడంతో కన్నీరు మున్నీరయ్యాడు.  

ప్రభుత్వం ఆదుకుంటేనే మా వారిని ఆఖరి చూపు దక్కేనా..
పండుగ వేళ అందరూ ఆనందంగా తీర్ధయాత్రలు చేస్తున్నారు.. మరో రెండు రోజుల్లో ఆనందంగా ఇంటికి చేరుతారని ఆశించిన వారి ఆశలు అడియాసలయ్యాయి. మా వారిని కడసారి చూపు చూసుకోవడానికి ప్రభుత్వం సాయమందించాలని జాండ్రపేట వాసులు వేడుకుంటున్నారు. ఊరు కాని ఊరు..భాష రాదు..మా వారిని మాకు ఆఖరి చూపు చూపించేందుకు అధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలని వేడుకుంటున్నారు.  

విషాదంలో జాండ్రపేట:  నిత్యం మగ్గాల శబ్దాలతో, పిల్లల కేరింతలతో సందడిగా ఉండే జాండ్రపేట విద్యానగర్‌ ప్రాంతంలో ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాండ్రపేటకు చెందిన ఐదుగురు ఒకేసారి మరణించడం, నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో గ్రామంలో విషాదం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement