రత్తయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ సుబ్బారావు, ఎస్సై సోమశేఖర్
ఒంగోలు సబర్బన్/నాగులుప్పలపాడు: రెవెన్యూ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం రైతును బలితీసుకున్నాయి. నాగులుప్పలపాడులోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఎలుకల మందు తిని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన రైతు నడిపినేని రత్తయ్య (68) ఆత్మహత్య చేసుకోవడానికి స్థానిక రెవెన్యూ అధికారులే కారణమని అతని కుటుంబ సభ్యులు, కుమారుడు శ్రీనివాసులు ఆరోపించారు. రైతు మృతదేహానికి ఒంగోలు రిమ్స్‌లో బుధవారం పోస్టుమార్టం పూర్తికాగా, అతని కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నాగులుప్పలపాడు మండలంలోని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన నడిపినేని రత్తయ్యకు భార్య వరమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రామంలో తమకు ఉమ్మడిగా ఉన్న 4.54 ఎకరాల పొలంలో రత్తయ్య వ్యవసాయం చేస్తున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వరుస కరువుతో పంటలు చేతికిరాక పెద్ద మొత్తంలో అప్పుల చేయాల్సి వచ్చింది. నాలుగేళ్లుగా వర్షాలు లేక కనపర్తి ఎత్తిపోతల పథకం కింద మాగాణి సాగు నిలిచిపోయింది. గుండ్లకమ్మ ఎడమ కాలువ కింద గత నాలుగేళ్లలో అధికారులు చుక్క నీరు వదల్లేదు. దీంతో భూములు బీళ్లుగా మారాయి. దీంతో అప్పు తీర్చే దారి లేక ఉన్న ఇంటిని తెలిసిన వారి వద్ద రత్తయ్య తాకట్టు పెట్టాడు.
అప్పుకు సంబంధించి ప్రతి నెలా వడ్డీలు చెల్లించాలి. ఇప్పటికే అప్పులు రూ.15 లక్షలు దాటడంతో తమకు ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి అప్పులు తీరుద్దామని అనుకున్నాడు. కానీ, ఆ పొలం ఆన్‌లైన్‌లో తన తండ్రి రంగయ్య పేరుతో ఉంది. వెబ్ ల్యాండ్ నమోదులో ఏర్పడిన పొరపాటును సరిదిద్దాలని నాగులుప్పలపాడు రెవెన్యూ అధికారుల చుట్టూ రెండేళ్లుగా రత్తయ్య ప్రదక్షిణలు చేస్తున్నా వారు కనికరించలేదు. అవినీతికి అలవాటుపడిన రెవెన్యూ అధికారులు.. రత్తయ్య నుంచి మామూళ్లు అందలేదన్న కారణంతో అతని పని గురించి పట్టించుకోలేదు. ఒకవైపు అప్పులోళ్ల ఒత్తిళ్లు.. మరోవైపు రెవెన్యూ అధికారుల వేధింపులు వెరసి చివరకు తనువు చాలించడమే పరిష్కారమార్గమని రత్తయ్య భావించాడు. గత సోమవారం రాత్రి పొద్దుపోయాక నాగులుప్పలపాడులోని మండల కార్యాలయాల సముదాయంలో గల గృహనిర్మాణ శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగులోకి రాగా, సీఐ సుబ్బారావు, ఎస్సై సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, బుధవారం పోస్టుమార్టం పూర్తిచేశారు.
రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలి : రైతు సంఘాల నేతల డిమాండ్
రైతు రత్తయ్య ఆత్మహత్యకు కారణమైన నాగులుప్పలపాడు మండల రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వివిధ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్థానిక రిమ్స్‌లో రత్తయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల ధనదాహం వల్లే రైతు రత్తయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. ఆన్‌లైన్ అక్రమాలతో రైతుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రత్తయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో రైతు సంఘాల నేతలు చుండూరు రంగారావు, వడ్డె హనుమారెడ్డి, చావల సుధాకర్, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బైరపనేని సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment