revenue departement
-
ఏపీ: జిరాక్సులు కాదు.. ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారు
సాక్షి, అమరావతి/అక్కిరెడ్డిపాలెం (గాజువాక): స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా జిరాక్సు కాపీలు మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అనేక మంది తమకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లకూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని వినియోగదారులు తెలిపారు. పలుచోట్ల నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఆస్తి పత్రాలను ప్రభుత్వం వద్దే ఉంచుకుంటారనే ప్రచారం నిజం కాదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తోంది. అనుమానాలు సృష్టిస్తున్న సోషల్ మీడియా ప్రచారం భూముల రిజిస్ట్రేషన్‌పై సోషల్ మీడియా, టీడీపీ ప్రచారం చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ విన్న వారు మాత్రం అది నిజమేనని భ్రమపడుతున్నారు. అనుమానం ఉన్నవారు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే.. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు, ఇస్తున్న డాక్యుమెంట్లు ఒరిజినల్సా, జిరాక్సులా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి అసలు సంబంధమే లేదనే విషయం కూడా అక్కడికి వెళ్లిని వారికి అవగతమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసమే జిరాక్సుల ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. భూ హక్కు చట్టంపై వదంతులు నమ్మొద్దు ఆస్తి తాలూకా ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపుతున్న ఆర్.కృష్ణగాజువాక ప్రాంతానికి చెందిన ఈయన పేరు ఆర్.కృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎస్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల గాజువాకలోని ఓ ఆస్తిని ఈయన కొనుగోలు చేశారు. గాజువాక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం తన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైట్లింగ్‌పై వస్తున్న వదంతులను, సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కొందరు వక్రీకరించడంపై అనుమానం వచ్చి సబ్ రిజిస్ట్రార్‌ను వివరణ కోరాను. ఆస్తి హక్కు పత్రాల ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని అడిగాను. ఈ వదంతులన్నీ అవాస్తవమని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆస్తి హక్కుదారునైన నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశారు. సోషల్ మీడియాలో భూ హక్కు చట్టంపై వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలే. వీటిని ఎవరూ నమ్మవద్దు’ అని చెప్పారు. ఈ విషయాలపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.ఒరిజినల్సే ఇచ్చారు ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒరిజనల్ దస్తావేజులు ఇచ్చారు. ఒరిజినల్స్ ఇవ్వడం లేదు, జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు నిజం కాదు. – తాతినేని రామ్మోహనరావు, గోపువానిపాలెం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా ఆ ప్రచారం నిజం కాదు నా తల్లితో కలిసి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. పావు గంటలో రిజ్రస్టేషన్ చేశారు. వెంటనే డాక్యుమెంట్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదు. మా చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – ప్రసాద్, చింతలపూడి, ఏలూరు జిల్లాఒరిజినల్ తీసుకున్నాను నేను భీమునిపట్నం రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో స్థలం కొన్నాను. రిజిస్ట్రేషన్ కోసం వెళితే వెంటనే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి కొత్త విధానంలో డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారని అడిగాను. అది అబద్ధమని చెప్పారు. వెంటనే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – శ్రీకాంత్, భీమిలి, విశాఖ జిల్లా -
బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టాం.. : మంత్రి పొంగులేటి
మహబూబ్‌నగర్: ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ చేసిన అవినీతిని శ్వేతపత్రంలో ఎండగట్టామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలమూరు న్యాయయాత్రలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోటలో గురువారం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ఎకరాకై నా నీళ్లు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను పట్టించుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరులో చేపట్టిన ప్రాజెక్టులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాల్వల్లో కంప, జమ్ము తొలగించి నీళ్లు పారించి పూలు జల్లి తామే అంతా చేశామని గొప్పలు చెప్పుకొన్నారని విమర్శించారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పాలమూరుకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కార్యక్రమానికి వచ్చే ముందు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఏం మాట్లాడాలి అని అడిగితే.. దేవరకద్ర నియోజవర్గంలో 100 పడకల ఆస్పత్రి, మండలానికో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేద్దామని చెప్పారన్నారు. ధరణి పేరుతో రైతుల భూములు లాక్కున్న వారి నుంచి తిరిగి తీసుకుని ప్రజలకు ఇస్తామన్నారు. పాలమూరును కాపాడేందుకే న్యాయయాత్ర.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి చల్లా వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని కాపాడేందుకు రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ను ఆదర్శంగా తీసుకుని ‘పాలమూరు న్యాయ యాత్ర’ చేపట్టానన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటంబానికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను మభ్యపెట్టారు! రాజాపూర్: తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారు.. ఇప్పుడు అధికారం కోల్పోయి రెండు నెలలు కూడా పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారంలో ఉండి కాలయాపన చేసింది మీరు కాదా అని విమర్శించారు. కృష్ణానది నీటిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదన్నారు. ఇంకా వారే అధికారంలో ఉన్నట్లు భ్రమపడుతూ కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై నెట్టాలని చూడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నారన్నారు. సమావేశంలో రంగారెడ్డిగూడ మాజీ సర్పంచ్‌లు జనంపల్లి శశికళారెడ్డి, దుష్యంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!? -
లబ్ధి చేకూరేలా.. ఫైల్ తొక్కి పెట్టిందెవరు?
కరీంనగర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులు కమిషనర్లుగా పదోన్నతి పొందిన వ్యవహారం ఓ ఉన్నతాధికారి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. సదరు అధికారులపై చార్జెస్ ఫ్రేమ్ అయి ఉన్నా ఆ ఫైల్‌ను తొక్కి పెట్టి, దొడ్డిదారిన పదోన్నతి వచ్చేట్లు చేయడంలో గతంలో కరీంనగర్లో పనిచేసి, వెళ్లిన ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. ‘ఆరోపణలున్నా అందలం’ పేరిట ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో విచారణ చేపట్టాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ సీడీఎంఏను కోరిన విషయం విధితమే. రెండున్నరేళ్ల కిందటి ఈ వ్యవహారం ఇప్పటివరకు ఎందుకు వెలుగు చూడలేదు? ఆన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఏసీఆర్)లో తప్పుడు సమాచారాన్ని ఎవరు సీడీఎంఏకు పంపించారన్న అంశాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. అప్పట్లో ఆదేశించినా లేఖ రాయలే.. 2021లో నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న అధికారి, అకౌంటెంట్లపై ఆరోపణలు రావడం, అప్పటి కమిషనర్ ఇరువురిపై చార్జెస్ ఫ్రేమ్ చేయడం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సీడీఎంఏకు నివేదించాలని అప్పటి కలెక్టర్ నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ ఈ విషయమై నగరపాలక సంస్థ సీడీఎంఏకు ఎలాంటి లేఖ రాయలేదు. దీంతో విచారణ అంశం అటకెక్కింది. అటు చార్జెస్ ఫ్రేమ్ ఫైల్‌ను, ఇటు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తొక్కి పెట్టి, అడ్డదారిలో ఇద్దరు అధికారులకు లబ్ధి చేకూరేలా చేయడంలో గతంలో పని చేసిన ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. ఉద్యోగి పదోన్నతికి ముందు సీడీఎంఏకు పంపించే ఏసీఆర్లోనూ చార్జెస్ ఫ్రేమ్ అంశాన్ని పొందుపరచకుండా, క్లీన్ ఇమేజ్‌తో పంపించడంలోనూ ఆ ఉన్నతాధికారిదే కీలక పాత్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీఆర్ను స్వయంగా ఉద్యోగి పూర్తి చేసినప్పటికీ, సంబంధిత ఉన్నతాధికారే సీడీఎంఏకు పంపించాల్సి ఉంటుంది. అన్నీ తెలిసి, సదరు అధికారులతో కుమ్మక్కవడం వల్లే తప్పుడు సమాచారాన్ని పంపించారన్న ఆరోపణలున్నాయి. నగరపాలక సంస్థ కోరిన మేరకు సీడీఎంఏ ఒకవేళ విచారణకు ఆదేశిస్తే నిజాలు వెల్లడి కానున్నాయి. ఇవి చదవండి: కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్.. -
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో " స్ట్రెయిట్ టాక్ "
-
పనికి ముందే రేటు.. కావాలనే లేటు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి వివాదమూ లేని భూములను కూడా వివాదంలో ఉంచేందుకు అవతలి పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఆన్లైన్లో రెడ్‌మార్క్ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ భూమిని అమ్మడానికి, కొనడానికీ ఉండదు. చిన్న చిన్న ఫైళ్లకు కూడా డబ్బు అడగడం, ఇవ్వకపోతే ఫైలును నెలల తరబడి పెండింగులో పెట్టడం ఇక్కడ మామూలైంది. ముఖ్య అధికారి మామూళ్ల పర్వం తహసీల్దార్ కార్యాలయ ముఖ్య అధికారి ప్రతి పనికీ రేటు కట్టి యథేచ్ఛగా మామూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు జనన, మరణ ధృవీకరణ పత్రాలకూ లంచం తీసుకుంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు అధికారి అవినీతి వైఖరి నచ్చక ఒక దశలో ఇక్కడ పనిచేస్తున్న వీఆర్ఓలు సమ్మెలోకి వెళ్లాలని అసోసియేషన్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. తహసీల్దార్‌కు ఆర్డీఓ ఆఫీసులోని ఒక ఏఓ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) సహకరిస్తున్నారని, ఇవన్నీ ఆర్డీఓకు తెలిసినా మిన్నకుండిపోతున్నారని సమాచారం. దాదాపు 7 లక్షల మందికి ఈ తహసీల్దార్ కార్యాలయమే దిక్కు. ఈ నేపథ్యంలో భూముల సమస్యలపై ఇక్కడకు వచ్చే వేలాదిమంది పరిస్థితి వేదనాభరితంగా మారింది. రాప్తాడు నియోజకవర్గం మన్నీల పరిధిలోని భూమి(సర్వే నెం.25–4)కి సంబంధించి ఆర్ఓఆర్ (రైట్స్ ఆఫ్ రికార్డ్స్)కు యజమాని దరఖాస్తు చేసుకున్నారు. నెలల తరబడి తిరిగినా అనంతపురం తహసీల్దార్ కార్యాలయ అధికారులు కనికరించలేదు సరికదా.. ఆయన భూమిని వేరే వారి పేరున ఉన్నట్టు హక్కు పత్రాలు రాశారు. డైక్లాట్‌లో తనపేరే ఉన్నా తహసీల్దార్ అవతలి వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఇలా చేసినట్టు యజమాని ఆరోపిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం నారాయణపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.93–2లోని 2.84 ఎకరాల భూమిని వివాదంలో (డిస్ప్యూట్ ల్యాండ్ కింద) పెట్టారు. ఎలాంటి ఆర్డరు గానీ, ఆర్డీఓ కోర్టు నుంచి ఆదేశాలు గానీ లేకుండానే భారీగా డబ్బు తీసుకుని ఈ విధంగా చేసినట్టు తేలింది. నిజమైన హక్కుదారుడు మాత్రం బాధితుడిగా మిగిలిపోయాడు. సోములదొడ్డి గ్రామ పరిధిలోని సర్వే నెం.212–1ఎ లోని 5.50 ఎకరాల భూమిని ఇటీవలే వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్ కిందకు బదిలీ చేశారు. దీనికి సంబంధించి కిందిస్థాయిలో ఎలాంటి కన్వర్షన్ రిపోర్టు గానీ, అధికారుల సంతకాలు గానీ లేవు. నేరుగా తహసీల్దారే అన్నీ చేసేశారు. ఇందులో భారీగా డబ్బు చేతులు మారినట్టు తెలిసింది. ఉపేక్షించేది లేదు.. ఆర్‌ఓఆర్‌లు, ల్యాండ్ కన్వర్షన్లకు డబ్బు అడిగితే ఉపేక్షించేది లేదు. హక్కుదారులకు న్యాయం చేయకుండా ఫిర్యాదులను బట్టి భూములను వివాదాల్లో పెట్టడం సరి కాదు. దీనిపై ప్రత్యేక విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. – కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ (చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి) -
తెరపైకి ‘పోడు’ గోడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ పరిరక్షణ, పోడు భూములు, ఆక్రమణల అంశానికి మరోసారి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే నెపంతో అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో వేసిన పంటలు నాశనం చేయడంతో పాటు మొక్కలు నాటి తమను వాటిల్లో వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పోడు రైతులు వాపోతున్నారు. 2005 తర్వాత రాష్ట్రంలో కొత్తగా పోడు అనేదే లేదని, తెలంగాణ ఏర్పడ్డాక గత ఏడేళ్లలో అటవీ భూముల్లో ఆక్రమణలు భారీగా పెరగడంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోందని అటవీ, రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి, జిల్లాల వారీగా పోడు భూములు, వాటిలో ఇంకా ఎవరెవరికి, ఎన్ని ఎకరాల్లో పట్టాలు ఇవ్వాలో లెక్క తేల్చే పనిలో పడింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం అటవీ శాఖ ఏయే జిల్లాల్లో పోడు కింద ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాల్లో అటవీ ఆక్రమణలు జరిగాయి, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్) కింద ఎంతమేర హక్కు పత్రాలు ఇచ్చారో లెక్కలు తీసేపనిలో పడింది. దేశ వ్యాప్తంగా అటవీ భూములు పంపిణీ చేస్తే అడవులతో పాటు పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని ఎన్జీవో సంస్థలు కేసు వేయడంతో ఆర్వోఎఫ్ఆర్ కింద భూముల పంపిణీపై 2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ సహా ఏపీ, త్రిపుర ఇతర రాష్ట్రాల్లో అప్పట్నుంచీ పోడు భూముల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ, సర్వే విభాగాలు ఉమ్మడిగా మొత్తం రాష్ట్రంలోని అటవీ భూముల సర్వే నిర్వహిస్తే అటవీ విస్తీర్ణం, ఆక్రమణలు, పోడు, ఇతర అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వపరంగా ఇతర చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల: అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా, అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఈ విస్తీర్ణం పది శాతం వరకే ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ భూముల ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన అడవే కనిపించకుండా పోయే స్థితి దాపురిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద హక్కు పత్రాల పంపిణీ రాష్ట్రంలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–ఆర్ఓఎఫ్ఆర్) కింద 2017 చివరినాటికి 11 లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ అందాయి. వాటిలో 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు) దరఖాస్తు చేయగా సామూహిక (కమ్యూనిటీ) క్లెయిమ్స్ కింద 3,427 దరఖాస్తులు (4,70,605 ఎకరాలకు) అందాయి. వాటిలో వ్యక్తిగత క్లెయిమ్స్‌లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు. 721 సామూహిక క్లెయిమ్స్ కింద 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలు అందజేశారు. మిగతా వాటి లో కొన్ని క్లెయిమ్స్ తిరస్కరించగా కొన్ని పెండింగ్‌లో ఉన్నట్టుగా అటవీ, ఎస్టీ సంక్షే మ శాఖలకు చెందిన రికార్డులను బట్టి స్పష్టమవుతోంది. గిరిజనేతరుల ఆక్రమణతో... పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు, గిరిజనులను తమ బినామీలుగా చేసుకుని ఆదివాసీలు కాని వారు, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి తమ స్వాధీనంలో పెట్టుకోవడం పెద్ద సమస్యగా మారిందని అటవీ అధికారులు చెబుతున్నారు. వీరికి రాజకీయ పార్టీల అండకూడా ఉందని అంటున్నారు. పోడు పట్టాలున్న ఆదివాసీలు, పేద ఎస్సీ, బీసీ వర్గాల వారిని ముందుంచి, వారి భూముల పక్కల నుంచి ఆక్రమణలు మొదలుపెట్టి చెట్లు కొట్టడం, అటవీ భూఆక్రమణ విస్తీర్ణం క్రమంగా పెంచుకోవడంతో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. అమ్ముకోకూడదు.. కుదవ పెట్టకూడదు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మారుమూల అడవుల్లోని ఆదివాసీలకు పోడు సాగు జీవనాధారంగా ఉండేది. జీవనోపాధి కోసం అడవుల్లో చెట్లు లేని చోట సాగుచేసి ఆ భూమిలో సారం తగ్గగానే ఒకటి, రెండేళ్లలోనే చెట్లు కొట్టకుండానే మరోచోటుకు తరలిపోవడం జరిగేది. పారలు, ఎడ్లు వంటి వాటిని ఉపయోగించకుండా వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా పోడు నిర్వచనమే మారిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో పోడు వ్యవసాయానికి 1907లో నిజాం నవాబు అనుమతించాడు. కొన్నేళ్ల తరబడి పోడు సాగు చేసుకునే వారికి ఆ భూమిపై హక్కును కల్పించినా, దున్నుకోవాలి తప్ప అమ్ముకోకూడదు, కుదవపెట్టకూడదు, ఈ భూములకు బ్యాంకులు రుణాలు సైతం ఇస్తాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటవీహక్కుల చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదించిన వారికే ఈ పట్టాలు ఇవ్వాలి. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా.. రాష్ట్రంలో మొత్తం 7,37,595 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూమి ఆక్రమణలకు గురైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లాల్లో రెవెన్యూ శాఖ 1,09,584 ఎకరాల్లో పట్టాలిచ్చినట్టు అటవీ అధికారులు తమ నివేదికల్లో తేల్చారు. అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 2.15 లక్షల ఎకరాలు, అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 9 వేల ఎకరాల అటవీశాఖ భూములకు రెవెన్యూశాఖ పట్టాలు అందజేసినట్టు పేర్కొన్నారు. -
Andhra Pradesh: గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి : పారదర్శకత కోసం గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖల సమన్వయంతో రీసర్వే ప్రాజెక్టు ఫేజ్–1లోని 51 గ్రామ సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. 1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్–6 ప్రకారం నిర్దేశించిన గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రజత్ భార్గవ అధికారులను కోరారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సచివాలయ కార్యదర్శులకు అవసరమైన శిక్షణను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషగిరిబాబును ఆదేశించారు. సమావేశంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ ఉదయభాస్కర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ కాదు.. ‘భూ పరిపాలన’ శాఖ!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖ స్వరూపంలో మార్పు వచ్చినందున.. విధులు, బాధ్యతలు మారనున్నందున ఆ శాఖ పేరును మారుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. భూరికార్డుల ప్రక్షాళన నుంచి తహశీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతల అప్పగింత వరకు రెవెన్యూ శాఖలో పూర్తిస్థాయి సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. రెవెన్యూకు కొత్తపేరు పెడతామని కేసీఆర్ స్వయంగా చెప్పిన నేపథ్యంలో ఈ శాఖ పేరును ‘భూపరిపాలన శాఖ’ గా మారుస్తారనే చర్చ జరుగుతోం ది. ఈ మేరకు గతంలోనే తమతో సీఎం కేసీఆర్ చర్చించారని, ఆ సందర్భంలోనే రెవెన్యూ శాఖ పేరు మార్పును ఆయన ధ్రువీకరించారని రెవెన్యూ ఉద్యోగ సంఘాలంటున్నాయి. రెవెన్యూ ఉన్నతాధికారుల వద్ద రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. భూపరిపాలన లేదంటే భూనిర్వహణ శాఖగా మార్చే ప్రతిపాదనలను రెవెన్యూ శాఖ పరిశీలిస్తోందని, దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. పైలట్ ప్రాజెక్టుగా ఓ గ్రామంలో సర్వే ధరణి పోర్టల్‌పై సమీక్ష సందర్భంగా సీఎం ప్రకటించిన విధంగా త్వరలోనే రాష్ట్రంలోని వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే ప్రారంభించేందుకు కూడా రెవెన్యూ వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే భూముల సర్వే పూర్తిచేసిన రాష్ట్రాల పరిస్థితిని అధ్యయనం చేసిన రెవెన్యూ వర్గాలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సర్వే తీరును కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ సర్వేపై ఓ నివేదికను కూడా సీఎం కేసీఆర్‌కు అందజేసినట్టు సమాచారం. అయితే, రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న భూములు సెడెస్టల్ (మరఠ్వాడా) సర్వే ప్రకారం ఉన్నాయని, ఈ విధానంలో ఉన్న భూముల సర్వేను కదిలించడం అంత సులభం కాదనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందువల్ల పైలట్ ప్రాజెక్టుగా తొలుత రాష్ట్రంలోని ఓ గ్రామం యూనిట్‌గా సర్వేను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ శాఖ ఉన్నతాధికారులున్నారు. ఈ గ్రామంలోని భూములను సర్వే చేసి అన్ని వ్యవసాయ భూములకు కోఆర్డినేట్లు ఇవ్వాలని, ఈ ప్రక్రియను పూర్తిగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా భూముల డిజిటల్ సర్వేకు ముందుకెళ్లాలనే ఆలోచనలో రెవెన్యూ వర్గాలున్నాయి. మరోవైపు ప్రస్తుతం భూముల సర్వేలో అమలవుతోన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను డిజిటలైజ్ విధానంలో ఉపయోగించుకోవడం ద్వారా భూముల అక్షాంశాలు, రేఖాంశాలు గుర్తించి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డ్రోన్ సర్వే చేపడితే ఎలా ఉంటుందనేది కూడా రెవెన్యూ శాఖ పరిశీలిస్తోంది . ‘భూముల సర్వే ద్వారా ప్రగతిశీల ఫలితాలు వస్తాయన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనుభవాలు చెపుతున్నది కూడా ఇదే. అందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, జీపీఎస్ లేదా డ్రోన్ సర్వే పద్ధతుల్లోని సాధ్యాసాధ్యాలు, అవసరమయ్యే సిబ్బంది, పట్టే కాలపరిమితి, అయ్యే ఖర్చు, ఈ విధానాల ద్వారా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో వచ్చిన ఫలితాలు, సమస్యలు... తదితర అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంది. వీటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై పకడ్బందీ కార్యాచరణ పూర్తవుతుంది’అని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఏదిఏమైనా భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను సర్వే చేపట్టాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని, అందుకు అనుగుణంగానే వీలున్నంత త్వరలో ప్రణాళిక ప్రారంభమవుతుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. -
రెవెన్యూ వ్యవస్థ: ‘టైటిల్’ గ్యారంటీ
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ‘టైటిల్ గ్యారంటీ’ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. యూపీఏ సర్కారు 2011లో రూపొందించిన భూ హక్కుల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త్త ముసాయిదాను రూపొందించే బాధ్యతను నీతి ఆయోగ్‌కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు నూతన ముసాయిదా చట్టం–2020, నియమాల(రూల్స్)ను తయారు చేసిన నీతి ఆయోగ్ వాటిని రాష్ట్ర ప్రభు త్వాలకు పంపింది. కేంద్రం రూపొందించిన టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంతో పాటు మహారాష్ట్ర చట్టాన్ని కూడా జతపరిచింది. ఈ రెండింటిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా టైటిల్ గ్యారంటీ చట్టాలను రూపొందించు కోవాలని స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు (రెగ్యులేషన్లు) పంపింది. ఇప్పటికే హరియాణాలో ప్రయో గాత్మకంగా అమలు చేస్తున్న ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ 2024లోపు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. భూ వివాదాలకు అంతిమ పరిష్కారం టైటిల్ గ్యారంటీ చట్టంతోనే సాధ్యపడుతుం దని కేంద్ర సర్కారు భావిస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారంటీని 2020లోపు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా కూడా తయారు చేసింది. ఆ తర్వాత కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావ డంతో ఈ చట్టంలో మార్పులు, చేర్పులు చేసి కొత్త ముసాయిదాను రూపొం దించే బాధ్యతను నీతి ఆయోగ్‌కు మోదీ ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే అగర్వాల్ నేతృత్వంలోని కమిటీ ముసాయిదాకు తుదిరూపు ఇచ్చింది. ఈ డ్రాఫ్టును తాజాగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు పంపింది. ప్రస్తుతం ఉన్న రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) స్థానే కంక్లూజివ్ టైటిల్‌ను తేవాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం రెండు రిజిస్టర్లే..! టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంలో పలు కీలకాంశా లను నీతి ఆయోగ్ పొందుపరిచింది. భూములకు సంబం ధించి పదుల సంఖ్యలో ఉన్న రిజిస్టర్ల స్థానంలో రెండు రిజిస్టర్లనే నిర్వహించాలని అభిప్రాయపడింది. అవి టైటిల్ రిజిష్టర్, దానికి అనుబంధంగా వివాదాల రిజిష్టర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. భూ సర్వే, ఇతరత్రా సంస్కరణలకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం ఇదివరకే అంగీకరించింది. భూ భారతి, మొదలు సమగ్ర భూ సర్వేకు కూడా నిధులను విడుదల చేసింది. దీంట్లో భాగంగానే టైటిల్ గ్యారంటీ చట్టం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను అందజేసేందుకు సుముఖంగా ఉంది. ముసాయిదా చట్టంలో ముఖ్యాంశాలు: – అన్ని రకాల భూములకు ఇక ఓకే ఒక రికార్డు. వివాదాలు ఉంటే తాత్కాలికంగా మరో రికార్డులో. – వివాద పరిస్కారాలకు ట్రిబ్యూనళ్ల ఏర్పాటు. – రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వమే పూచీకత్తు. యజమానికి నష్టం జరిగితే పరిహారం. – రికార్డుల్లోకి ఎక్కిన వివరాలను రెండేళ్ల తరువాత మార్చే వీలు ఉండదు – భూముల సర్వే చేసి ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఏపీలో ఇప్పటికే చట్టానికి ఆమోదం టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకంటే ఒకడుగు ముందుంది. గతేడాది ఏపీ అసెంబ్లీ టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ చట్టం అమలుకు ఆయువు పట్టయిన భూ సమగ్ర సర్వేను వచ్చేడాది జనవరి నుంచి శ్రీకారం చుట్టడానికి ముహూర్తం ఖరారు చేసింది. మన రాష్ట్రంలో ఇలా.. తెలంగాణలోనూ కంక్లూజివ్ టైటిల్‌ను తీసుకురావాలని గత మూడేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించింది. ఈ క్రమంలో కంప్యూటర్ ఆధారిత భూ రికార్డుగా ప్రకటించిన ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. పార్ట్–బీ, పెండింగ్ కేసులను కొలిక్కి తేవడానికి సమగ్ర భూ సర్వేను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మూడుచింతలపల్లిలో జరిగిన ధరణి ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు. దీంతో మన రాష్ట్రం కూడా టైటిల్ గ్యారంటీ చట్టం వైపు అడుగులేస్తుందని చెప్పవచ్చు. -
బయటపడుతున్న రెవెన్యూ లీలలు!
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): రెవెన్యూ శాఖలోని కొందరు వీఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారు. బడాబాబుల వద్ద డబ్బులు తీసుకుని చిన్న, సన్నకారు రైతుల భూములను మరొకరికి పట్టా చేసి ఇచ్చారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో తమకు గతంలో జరిగిన అన్యాయాన్ని బాధితులు ఇప్పుడు వెల్లబోసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకపోవడంతో ఇతరులకు పట్టా చేసి ఇచ్చిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన చిట్యాల నర్సుబాయి అనే వృద్ధురాలికి 921 సర్వే నంబర్లో 21 గుంటల భూమి ఉంది. ఈ భూమిని నర్సుబాయి కుటుంబ సభ్యులు చాలా ఏళ్ల కిందనే కొనుగోలు చేశారు. అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కాగా తెలంగాణ ప్రభుత్వం సాదా బైనామాలపై ఉన్న భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని నిర్ణయించగా తమ గ్రామ వీఆర్వోకు వినతి పత్రం సమర్పించింది. సాదా బైనామాపై ఉన్న భూమిని పట్టా మార్పిడి చేయడానికి ఈ గ్రామ వీఆర్వో లంచం అడగగా నర్సుబాయి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. అంతే నర్సుబాయికి సంబంధించిన భూమిని మరో మోతుబరి రైతు పేరిట పట్టా మార్పిడి చేశారు. సాదాబైనామాలకు సంబంధించిన కాగితాలు నర్సుబాయి వద్ద ఉండగా పట్టా మార్పిడి ఆమె పేరిట కాకుండా ఎలాంటి కాగితాలు లేని వ్యక్తి పేరిట పట్టా చేశారు. ఇదే తొర్తి గ్రామానికి చెందిన కుండ మధు 781 సర్వే నంబర్లో 24 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఇతను 2007లో ఆర్వోఆర్లో దరఖాస్తు చేసుకుని తన పేరిట పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ సైతం తీసుకున్నాడు. ఈ భూ మిని మధు సాగు చేస్తున్నాడు. కానీ భూ ప్రక్షాళనలో భాగంగా మధుకు డి జిటల్ పాసు పుస్తకం రావాల్సి ఉంది. అప్పటికే మధుకు సంబంధించిన భూమి మరో బడా రైతు పేరిట పట్టా చేయబడింది. ఆర్వోఆర్కు సంబంధించిన ప్రొసీడింగ్‌తో పాటు ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నా రికార్డులలో మాత్రం మధు పేరుకు బదులు మరోకరి పేరు ఉంది. ఇలా నర్సుబాయి, మధులకు భూమి ఉన్నా రెవెన్యూ రికార్డులలో అక్రమాలు చోటు చేసుకోవడంతో రైతుబంధుకు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందలేక పోయారు. తమ భూమికి సంబంధించిన రికార్డులను సరి చేసి తమకు పట్టా పాసు పుస్తకం జారీ చేయాలని వీఆర్వో, ఇతర అధికారులకు విన్నవించగా ఏదో ఒక సాకు చెబుతూ పట్టా సర్టిఫికెట్లను జారీ చేయలేదు. కాగా రికార్డులను సరిచేస్తామని వీఆర్వో నమ్మించడంతో బాధితులు ఎక్కడ కూడా తమ బాధ చెప్పుకోలేదు. చివరకు వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో పట్టాల మార్పిడిలో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఒక నర్సుబాయి, కుండ మధులకు సంబంధించిన సమస్యనే కాదు. ఎంతో మంది చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన సమస్య. చిన్న సన్నకారు రైతుల భూములను డబ్బులు ఇచ్చిన వారి పేరిట పట్టా మార్పిడి చేసిన అవినీతి వీఆర్వోల బాగోతం ఇది. కబ్జా కాలమ్ రద్దుతో అసలు సమస్య కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం పహణీలలో కబ్జా కాలమ్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కబ్జా కాలం రద్దు కావడంతో పట్టా పాసు పుస్తకాలు రాని భూముల యజమానుల పరిస్థితి అగమ్యగోచరం కానుంది. తొర్తికి చెందిన చిట్యాల నర్సుబాయి, కుండ మధులు ఇది వరకు కబ్జా కాలంలో ఉండగా కబ్జా కాలం రద్దయితే యాజమాన్య హక్కులను పూర్తిగా కోల్పోతారు. సమగ్ర దర్యాప్తు జరిపితేనే.. తొర్తితో పాటు పలు గ్రామాల్లో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వచ్చి బాధితులకు న్యాయం జరగాలంటే భూ రికార్డులపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాదా బైనామాలపై ఉన్న భూముల పట్టాల మార్పిడికి చిన్న, సన్నకారు రైతులు వీఆర్వోలు అడిగినంత ఇచ్చుకోకపోవడంతో భూముల యజమానులు మారిపోయారు. వీఆర్వోలు గ్రామాలలో తిష్టవేసి ఉన్నంత కాలం పట్టాల మార్పిడికి సంబంధించి వారు ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకున్నారు. వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో తమకు గతంలో జరిగిన అన్యాయాన్ని బాధితులు ఇప్పుడు వెల్లబోసుకుంటున్నారు. అసైన్డ్ భూములది అదే పరిస్థితి.. అసైన్డ్ భూములను గతంలో పొందిన కొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో భూములను విక్రయించుకున్నారు. ఈ భూములకు సంబంధించి పట్టాల మార్పిడికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసైన్డ్ భూముల పట్టాల మార్పిడిని రిజిస్ట్రేషన్ పద్ధతిలో కాకుండా సాదాబైనామాలపై మార్పిడి చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఒక్కో ఎకరం భూమి పట్టా మార్పిడికి రూ. 25వేల వరకు కింది స్థాయి ఉద్యోగులు వసూలు చేశారు. కొందరు డబ్బులు ఇవ్వకపోవడంతో సాదాబైనామా దరఖాస్తులను వీఆర్వోలు పక్కన పడేశారు. ప్రతి రెవెన్యూ కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు పడి ఉన్నాయి. అవినీతి వీఆర్వోలపైనే చర్యలు తీసుకువాలి అధికారం తమ చేతిలో ఉందనే ధీమాతో కొందరు వీఆర్వోలు తమ పరిధిలోని గ్రామాల్లో అడ్డగోలుగా దోచుకున్నారు. అక్రమంగా ఎన్నో రకాల ఆస్తులను కొందరు అవినీతి వీఆర్వోలు సంపాదించుకున్నారు. ప్రభుత్వం విచారణ చేపట్టి ఇలాంటి వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఒకే క్లిక్‌తో భూమి భద్రం
సాక్షి, హైదరాబాద్: భూమి హక్కుకు ‘కొత్త’కళ వచ్చింది. ‘రెవెన్యూ’పరిధులు, పరిమితులు నూతన బాట పట్టాయి. ఇకపై వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు ఒక చోటుకు, మ్యుటేషన్‌కు మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాయింట్ రిజిస్ట్రార్ల హోదాలో తహసీల్దార్లే ఆ రెండు పనులు చేసి రైతుకు వెంటనే పాసు పుస్తకం ఇచ్చేస్తారు. పంట రుణాల కోసం రైతులు పాసు పుస్తకాలను కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే అన్నీ చూసుకుని బ్యాంకర్లు రుణాలిస్తారు. డిజిటల్ రికార్డులే భూమిని భద్రంగా ఉంచుతాయి. బ్యాంకులకు భరోసా ఇస్తాయి. భూ వివాదాలకు, రెవెన్యూ విభాగానికి ఇక నుంచి సంబంధం ఉండదు. రెవెన్యూ కోర్టులన్నీరద్దయ్యాయి. ఇక భూమి హక్కుపై కిరికిరి వస్తే సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకోవాల్సిందే. ధ్రువీకరణలు స్థానిక సంస్థల దారి మళ్లాయి. వీఆర్వోల వ్యవస్థ రద్దు, వీఆర్ఏలకు పేస్కేల్, ఇతర శాఖల్లో సమానశ్రేణిలో విలీనం. ఇదీ స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం. సాధికారతకు సాంకేతికత.... యాజమాన్య హక్కుల బదలాయింపు, పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేసే పరిస్థితికి కొత్త చట్టంతో చెక్ పడింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే మ్యుటేషన్ (భూ బదలాయింపు), పాస్ పుస్తకాన్ని అక్కడికక్కడే జారీ చేయనుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ మొదలు పాస్ పుస్తకం పంపిణీ, ధరణి వెబ్సైట్ రికార్డుల నమోదు వరకు అంతా చిటికెలోనే పూర్తి కానుంది. ఈ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితికి కూడా ఫుల్స్టాప్ పడింది. భూ లావాదేవీలకు వెబ్సైట్ ద్వారా స్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్/సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సమయానికి పత్రాలిచ్చి సేవలు పొందాలి. భూములను కుదవపెడితే ధరణి వెబ్సైట్లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం, పట్టాదారు పాస్ పుస్తకం ఏకీకృతం చేయడం ద్వారా కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ సేవలు అందుతాయి. రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్ విధానంలో రుణాలు అందనున్నాయి. ‘ధరణి’మంత్రం... రెవెన్యూ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్న సర్కారు.. ఇకపై ప్రతి భూ లావాదేవీని ఆన్ లైన్ లోనే నిక్షిప్తం చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ధరణి వెబ్సైట్ సేవలు విస్తృతం చేయనుంది. భూముల క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు, ఈసీల మొదలు ప్రతీది ఈ పోర్టల్‌లోనే తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. ఈ మేరకు పార్ట్–ఏ(వ్యవసాయ), పార్ట్–బీ(వ్యవసాయేతర) భూములకు వేర్వేరు ధరణి పోర్టళ్లను రెండు విధాలుగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రభుత్వ, నిషేధిత, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఆటోమేటిక్ లాక్ వ్యవస్థను కూడా ఈ వెబ్సైట్లో పొందుపరుచనున్నారు. ప్రతి గ్రామంలోని భూ హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయనున్నారు. అలాగే ధరణి వెబ్సైట్లో నిక్షిప్తం చేసే సమాచారాన్ని వేర్వేరు సర్వర్లలోనూ, వేర్వేరు చోట్ల భద్రపరచనున్నారు. తహసీల్దార్ కమ్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్... తహసీల్దార్ ఇక కొత్త అవతారమెత్తనున్నారు. ఇన్నాళ్లూ రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే ఈ అధికారి ఇకపై జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందించనున్నారు. అంటే ఇక నుంచి తహసీల్దార్ కూడా రిజిస్ట్రేషన్లను చేయనున్నారన్నమాట. వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్లే చక్కబెడతారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 530 మండలాల్లో రిజిస్రేషన్లు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారాలను తాజా చట్టం ద్వారా దాఖలుపరిచారు. డాక్యుమెంట్ల నమూనాలను నేరుగా క్రయవిక్రయదారులే వివరాలు పూరించి ఇచ్చే ఏర్పాటు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్.... రెవెన్యూ కోర్టుల కథ ముగిసింది. వీటిస్థానే ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ వరకు ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన ప్రభుత్వం.. వీటి పరిధిలో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్‌కు బదలాయించనుంది. ప్రతి వేయి కేసులకో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ కేసుల పరిష్కారానికి నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశించనుంది. తర్వాత ఈ ట్రిబ్యునళ్లను కూడా ఎత్తివేస్తారు. అనంతరం ఎలాంటి భూ వివాదాలకైనా న్యాయస్థానాలనే ఆశ్రయించాలి. ఈ ట్రిబ్యునల్‌కు రిటైర్డ్ జడ్జి లేదా ఇతర సభ్యులతో కూడిన కమిటీ ప్రాతినిథ్యం వహించనుంది. విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులే అంతిమం. వీఆర్ఏలకు పే స్కేల్.... గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ)కు తీపి కబురు అందజేసింది. ఇప్పటివరకు గౌరవ వేతనంపై పనిచేస్తున్న వీఆర్ఏలకు ఇకపై అర్హతనుబట్టి పే స్కేల్‌ను వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 22,900 మంది పనిచేస్తుండగా.. పదో తరగతిని విద్యార్హతగా ప్రకటిస్తే సుమారు 8 నుంచి 10వేల మందికి పేస్కేల్ రానుంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.260 కోట్ల మేర భారం పడనుంది. కాగా, 5,480 మంది వీఆర్వోలతోపాటు వీరిని కూడా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వీఆర్ఏలలో కొందరి సేవలను మాత్రం రెవెన్యూశాఖలోనే వినియోగించుకోనుంది. ‘స్థానికం’గానే కుల ధ్రవీకరణ.... ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపడింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వీరి నుంచి తప్పించిన ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలు, పుర/నగర పాలక సంస్థల్లోనే కులధ్రువీకరణ పత్రాలను అందజేయనుంది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే, ఇతర సర్వే ఆధారంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆదాయ వనరులు, ఆస్తుల సమాచారం ఉన్నందున.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు ఈ డేటాబేస్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఇతర రాష్ట్రాలు గనుక అభ్యంతరం తెలిపిన పక్షంలో వీటిని అప్పటికప్పుడు జారీ చేసే అధికారాలను తహసీల్దార్లకు దాఖలుపరిచారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. భూమి హక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతోపాటు సర్వీసు నుంచి తొలగింపు(భర్తరఫ్, శిక్ష). కొత్త చట్టం వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది. పట్టాదారు పాస్ పుస్తకం హక్కు పత్రంగా పరిగణన. కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు. పాయిగా, జాగీరు, సంస్థానాలు, మక్తా, ఉహ్మ్లి, ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి. ఒకవేళ సయోధ్య కుదరకపోతే నిర్ణీత గడువు తర్వాత ఆ భూమిని లాక్‌లో పెడతారు. ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. జారీ చేసిన చేసిన తహసీల్దార్‌ను బర్తరఫ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతారు. అలాగే తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటారు. కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారిపై ఎటువంటి దావా వేసే వీలులేదు. ఇప్పటివరకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంది. వ్యవసాయ రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు. ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది. -
ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాకాల శాసనసభ మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రంగా పరిగణిస్తామన్నారు. ఇకపై సబ్ రిజిస్ట్రార్ అధికారాలను తహశీల్దార్‌కు అప్పగిస్తామని తెలిపారు. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డులు డిజిటల్ స్టోరేజ్‌లో ఉంటాయని తెలిపారు. కొత్త పట్టాదారు పుస్తకం హక్కుల రికార్డుగా పరిగణిస్తామని వివరించారు. ఆ రికార్డులో పట్టాదారు పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం అన్ని ఉంటాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు ఈ చట్టం వర్తించదని తెలిపారు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఏ రకమైన రిజిస్ట్రేషన్ కోసమైనా ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవటం తప్పనిసరి అని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ దస్తాలు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలని చెప్పారు. మ్యూటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదని హామీ ఇచ్చారు. వారిని స్కేల్ ఉద్యోగులుగా పరిగణిస్తామని తెలిపారు. వీఆర్వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. వీఆర్ఎస్ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం తీసుకువస్తామని చెప్పారు. రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయ కూడదన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగింపు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేయిస్తామని తెలిపారు. అన్ని వివరాలతో ధరణి పోర్టల్ ఉంటుందని చెప్పారు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ విభాగాలుగా ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ధరణి పోర్టల్‌ను ఎక్కడి నుంచైనా ఓపెన్ చేసుకోవచ్చు వివరించారు. ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. నిషేధిత భూములు ఇకపై రిజిస్ట్రేషన్లు కావని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారానికి 16 ఫాప్ట్ ట్రాక్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తహశీల్దార్లను జాయింట్ సబ్రిజిస్ట్రార్లుగా చేస్తామని తెలిపారు. వ్యవసాయ భూములను జాయింట్ సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారని చెప్పారు. వ్యవసాయేతర భూములను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారని సీఎం కేసీఆర్ వివరించారు. ఇక శాసనసభలో మంత్రి కేటీఆర్ మున్సిపల్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను కలెక్టర్లు స్వాధీనం చేసుకునే పని వేగవంతంగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలంతా రెవెన్యూ రికార్డులను కలెక్టర్లకు అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తుంది. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. (తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!) ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల వద్ద నుంచి రికార్డులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు 60 శాతం రెవెన్యూ రికార్డులు కలెక్టరేట్‌కు చేరాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వీఆర్వోలు, వీఆర్ఏలు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయకుండా, స్వచ్ఛందంగా రెవెన్యూ రికార్డులను అప్పగిస్తున్నారని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడంతో ఒకింత ఆందోళన, మరికొంత ఆనందం నెలకొంది. వీఆర్వోలు, వీఆర్ఏలు బాధపడుతుండగా ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బాధతో వీఆర్ఏ, వీఆర్వోలు స్వాగతిస్తూనే తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. మాతృసంస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వేరే శాఖకు వెళ్లమంటే తమకు ఇబ్బందేనని అభిప్రాయపడుతున్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
-
తహసీల్దార్ కారులో రెండు లక్షలు లభ్యం
సాక్షి, కృష్ణా జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో అన్ని తహసీల్దార్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం రెవెన్యూ అధికారులను, సిబ్బందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. మండల తహసీల్దార్ టీ.చంద్రశేఖర్ నాయుడును అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు అతని నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. (అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్) రెవెన్యూ కార్యాలయంతో పాటు, అధికారుల వాహనాలను స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ చంద్రశేఖర్ నాయుడు కారులో రెండు లక్షరూపాయలు డిప్యూటీ తహసీల్దార్ కారులో లక్ష రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో మహేశ్వర రాజు, హ్యాపీ కృపానందం, నజీరుద్దిన్ బృందం పాల్గొన్నారు. (తెలుగు తమ్ముళ్ల వీరంగం, కెమెరాలో రికార్డు) గుంటూరు: రాజుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాస్ పుస్తకాల మంజూరులో అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు: గూడురు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. కర్నూలు: ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. భారీగా లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ తన సిబ్బందితో కలసి పట్టణంలోని పాత, కొత్త తహసీల్దార్ కార్యాలయాలపై దాడి చేశారు. పాత కార్యాలయం అడ్డాగా కొందరు వీఆర్వోలు అక్రమాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రామయ్యను కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు సాయంత్రం తెలుపుతామన్నారు. అలాగే రేషన్ డీలర్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. శ్రీకాకుళం : జిల్లాలో పలు తహశీలార్ల కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సంతకవిటి కార్యాలయంలో తనిఖీలు చేస్తుండగా వీఆర్వోలు, సిబ్బంది పరారయ్యారు. అనంతపురం: కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. భూ రికార్డులకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది అవినీతిపై విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు విజయనగరం: బలిజపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. -
కదులుతున్న ‘పాముల పుట్ట’
సాక్షి, హైదరాబాద్/కీసర/అల్వాల్ : ఉన్నతాధికారుల ద్వారా మాత్రమే వెలువడే డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్‌ఫైల్స్‌ను సైతం నకిలీవి సృష్టించి లంచాలు మరుగుతున్నారంటే రెవెన్యూ వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో తిష్టవేసి కూర్చుందో అర్థం చేసుకోవచ్చు. ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజు వ్యవహారంలో కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కీసర మండలం రాంపల్లి దాయరలో పట్టాదారు, కౌలుదారుల మధ్య భూ వివాదం నడుస్తోంది. 19 ఎకరాలకు సంబంధించిన వివాదంలో 8 ఎకరాలకు సంబంధించి పట్టాదారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అందుకు అనుగుణంగా ఆ భూమిని వారి పేరు మీదకు మార్చాల్సి ఉంది. మరో 11 ఎకరాల వివాదం ఆర్డీఓ పరిధిలో ఉంది. 8 ఎకరాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తహసీల్దార్‌ను సంప్రదించి ఈ భూమిని పట్టాదారుల పేర చేయాలని కోరారు. దీనికి తహసీల్దార్ రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన, మేడ్చల్ కలెక్టర్ ద్వారా వెలువడాల్సిన డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్ ఫైల్‌ను తన కార్యాలయంలోనే తయారుచేసి, వాటిని తీసుకొని తహసీల్దార్ నాగరాజు రియల్టర్ కందాడి అంజిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు. అప్పటికే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్ అక్కడ డబ్బులతో ఉన్నారు. దీనిపై ఉప్పందుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. పత్రాలు సృష్టించినట్టు అంగీకారం! తహసీల్దార్, వీఆర్ఏ, రియల్టర్లను శనివారం ఏసీబీ కార్యాలయంలో విచారించారు. కలెక్టర్ పేరిట పత్రాలు సృష్టించినట్టు తహసీల్దార్ ఈ విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. ఇందులో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది ప్రమేయం ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇదే భూమికి సంబంధించిన 11 ఎకరాలకు ఆర్డీఓ నుంచి ఆదేశాలు రానున్నట్టు విచారణలో తహసీల్దార్ చెప్పినట్లు సమాచారం. కాగా, శనివారం ఉదయం కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ సీఐలు గంగాధర్, నాగేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్ గదిలో ఉన్న రికార్డులు, కంప్యూటర్ రికార్డులు, ఇటీవల తహసీల్దార్ చేసిన ముటేషన్లు, రికార్డుల మార్పులు, చేర్పులు, ఫైళ్ల క్లియరెన్స్‌ను పరిశీలించారు. రాంపల్లి దాయరలోని సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల భూములకు సంబంధించిన కాస్రా పహాణీ నుంచి ఇప్పటివరకు పహాణీ రికార్డులు, నాగరాజు తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాక రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులు తదితర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్‌డిస్క్, తహసీల్దార్ బీరువాలో లభించిన పలు ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలించి, కొన్నిటిని వెంట తీసుకెళ్లారు. కార్యాలయంలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న, ఆర్ఐ శశికళ ఇతర సిబ్బందిని ప్రశ్నించారు. బార్గా పెంట్‌హౌస్ టెంపుల్ అల్వాల్‌లో గల కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. రూ. 28 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారం లభ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం శామీర్‌పేట డిప్యూటీ తహసీల్దార్ ఉన్న సమయంలో ఇదే ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనూ పలు ఆస్తుల దస్తావేజులు దొరికాయి. ఇంటిపైని పెంట్‌హౌస్‌ను బార్ గా మలిచారు. పెద్ద మొత్తంలో లభ్యమైన విదేశీ మద్యాన్ని చూసి అధికారులు కంగుతిన్నారు. మూడంతస్తుల ఈ భవనంలో కింది ఫ్లోర్లను అద్దెకు ఇవ్వగా మొదటి అంతస్తులో నాగరాజు ఉంటున్నారు. నాగరాజు వద్దే ఆ భూముల రికార్డులు: ఆర్డీఓ రాంపల్లిదాయరలోని సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల వివాదాస్పద భూములకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులన్నీ తహసీల్దార్ నాగరాజు వద్దే ఉన్నాయని కీసర ఆర్డీఓ రవికుమార్ తెలిపారు. ఈ వివాదాస్పద భూముల్లోని ఐదెకరాలను ఏసీబీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఓ ఉన్నతాధికారి రాంపల్లిదాయరకు చెందిన రైతుల నుంచి కొన్నారని, ఆయనకు గతం లో పట్టాదారు పాసుపుస్తకాలు కూడా రెవెన్యూ కార్యాలయం నుంచి ఇచ్చారన్నారు. కాగా కీసర తహసీల్దార్ నాగరాజు ఇటీవల ఈ పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేయాలని ఓ ఫైల్ తయారు చేసి తమ కార్యాలయానికి పంపాడన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశామన్నారు. ఈ భూములకు సంబంధించిన రికార్డుల మార్పుచేర్పుల్లో తహసీల్దార్ పాత్రపై పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. -
ఏపీ: రాష్ట్రమంతా భూముల రీసర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనుషులకు ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య) ఇచ్చినట్లుగా ప్రతి ల్యాండ్ బిట్‌కు భూధార్ నంబరు కేటాయించి అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం జీఓ జారీ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో రీసర్వే ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్టిన రూ.200.15 కోట్లకు పరిపాలనామోదం ఇవ్వాలని సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. (కరోనా టెస్టుల్లో ఏపీ మరో రికార్డు) దీంతోపాటు కొన్ని పరికరాల కొనుగోలుకు అనుమతి కోరారు. ‘రీసర్వే ఫేజ్–1, ఫేజ్–2 కోసం 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల స్థాయి పెంపు, నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలి. 11,158 రోవర్స్ కొనుగోలుకు పరిపాలనామోదం ఇవ్వాలి’ అని సర్వే డైరెక్టర్ కోరారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం అనుమతించింది. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, కొలతల్లో ఏమాత్రం లోపం లేనివిధంగా రీసర్వే పనులు చేపట్టాలని ఆదేశించింది. (మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా కరెంట్ బిల్లు..) -
భూ ఆక్రమణ నిజమే:రెవెన్యూ శాఖ
-
రేవంత్ భూ ఆక్రమణ నిజమే
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిలపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను రెవెన్యూ వర్గాలు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై మరింత లోతుగా విచారించేందుకుగాను ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయనపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న రెవెన్యూ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోనికి వస్తుం డడం, స్థానికుల నుంచి సాక్ష్యాధారాలు కూడా లభిస్తుండడంతో ప్రత్యేకంగా విచారణ చేయించడం ద్వారా రేవంత్ అక్రమాలను పూర్తి స్థాయిలో వెలికితీయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జరుగుతున్న విచారణలో రేవంత్ సోదరులిద్దరూ ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రైవేటు భూములతోపాటు రోడ్లను కూడా వదల్లేదని వెల్లడయినట్టు తెలుస్తోంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అధికార వర్గాలందించిన సమాచారం ప్రకారం... గోపనపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 34లో ఎకరా 11 గుంటలు, సర్వే నెం 126, కోమటికుంటలో ఎఫ్టీఎఫ్ బఫర్‌జోన్‌లో ఎకరా 14 గుంటల భూమిని రేవంత్ సోదరులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ భూముల ఆక్రమణలతో చెరువులోకి నీళ్లు రాకుండా రేవంత్ అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, వాల్టా చట్టాన్ని, తెలంగాణ రెవెన్యూ ఫస్లీ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు తగిన ఆధారాలు కూడా రెవెన్యూ విచారణలో వెలుగులోకి వస్తున్నట్టు సమాచారం. గోపనపల్లి సర్వే నెంబర్ 127లో ఐదెకరాల 21 గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేయించుకున్నారని, సర్వే నెంబర్ 128, 160లలో 10 గుంటల ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేశారని, సర్వే నెంబర్ 127లో వందేళ్ల నుంచి ఉన్న బండ్ల బాటను కూడా వదలకుండా కబ్జా చేశారనే ఆరోపణలు రేవంత్ ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాల్లో ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి డి.శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు అధికారుల పాత్ర కూడా ఉందని, అందులో ఒకరు మృతి చెందగా, మరొకరు రిటైర్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరింత లోతుగా విచారణ జరిపించడం ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ బయటకు తీయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. స్థానికుల ఆరోపణల ఆధారంగా.. గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్‌రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్ చేసినందుకు డబ్బులిస్తామని చెప్పి ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారు. స్థానికులు కొందరు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించగా స్టేటస్కో ఉత్తర్వులు వచ్చాయని అంటున్నారు. అయితే, ఈ విషయంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా ఈ భూమి మ్యుటేషన్ జరిగిందని నిర్ధారించి సీఎస్‌కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని, తప్పుడు మ్యుటేషన్లు చేశారని ఆ నివేదికలో కలెక్టర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భూమితో పాటు ఇతర ఆరోపణలపై కూడా ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండడం గమనార్హం. -
తహసీల్దార్‌పై దాడికి తెగబడిన టీడీపీ నాయకులు
పొందూరు: అధికారం కోల్పోయినా టీడీపీ నాయకుల అలవాట్లు మాత్రం పోలేదు. పీఠంపై ఉన్నన్నాళ్లు అధికారులపై పెత్తనం చెలాయించి, వారిపై దాడులకు దిగిన ఆ పార్టీ నేతలు ప్రతిపక్షానికి చేరినా ధోరణి మార్చుకోవడం లేదు. పొందూరు మండలంలోని వీఆర్ గూడెంలో ఇళ్ల స్థలాలు చదును చేయడానికి వచ్చిన రెవెన్యూ, హౌసింగ్ సిబ్బంది పై టీడీపీ నాయకులు మంగళవారం దాడికి తెగబడ్డారు. తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అధికారులు భయాందోళనకు గురయ్యారు. మండలంలోని వీఆర్‌గూడెం గ్రామం మధ్యలో ఉన్న చిన్న గుట్టపై పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చేందుకు తహసీల్దార్ తామ రాపల్లి రామకృష్ణ ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థల సేకరణ, రాళ్లను కొట్టించడం, చదును చేయించడం, రోడ్డు వేయించడం వంటి పనులు చేస్తున్నారు. ఈ ప్రక్రియ సుమారు రెండు నెలలుగా జరుగుతోంది. పనుల్లో హౌసింగ్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురుకావడంతో మంగళవారం త హసీల్దార్ అక్కడకు పరిశీలన కోసం వెళ్లారు. అక్కడ ఆవులు కట్టి ఉండడంతో వాటిని పక్కకు తీసుకెళ్లాలని ఆదేశించారు. పనులు ప్రారంభమయ్యాక కొందరు ఆ ప్రాంతానికి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ కొన్నేళ్ల కిందట తమకు పట్టాలు ఇచ్చారని చెప్పారు. దీంతో తహసీల్దార్ స్పందిస్తూ.. ఆ స్థలంలో ఇళ్లు కట్టకపోవడంతో ‘డీమ్డ్ టు బి కేన్సిల్డ్’ అని చెప్పి పట్టాకాగితాలు తీసి చదివారు. దీన్ని భరించలేని టీడీపీ నాయకులు ‘మాకు రూల్స్ చెప్పొద్దు’ అంటూ కాగితాలు లాగేసుకున్నారు. అరగంట తర్వాత సువ్వారి మధుసూదనరావు అనే టీడీపీ నేత వచ్చి అధికారులను నేరుగా బెదిరించారు. ఆయనతో పాటు మరికొంత మంది వచ్చి అధికారులను నెట్టేశారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా విలేజ్ సర్వేయర్ శ్వేత, ఆర్.కృష్ణకుమారిలను తోసేశారు. వారితో పాటు మరో ఆర్ఐ నారాయణమూర్తి, వీఆర్ఓ సాయి, హౌసింగ్ సిబ్బందిపై కూడా దౌర్జన్యానికి దిగారు. దీంతో అధికారులంతా భయపడ్డారని తహసీల్దార్ చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులపై దాడి చేసిన సువ్వారి శ్రీనివాసరావు, సువ్వారి మధుసూదనరావు, పేడాడ గోవిందరావు, పల్ల రాజారావు, గండబోన పాపయ్యలతో పాటు మరో ఐదుగురుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కేసు నమోదు చేశారు. అధికారులకు రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం నుంచి రెవెన్యూ సిబ్బంది తమ విధులను బాయ్‌కాట్ చేయనున్నారు. వీరికి జిల్లాలోని తహసీల్దార్లు, సిబ్బంది మద్దతు తెలుపనున్నారని తెలిసింది. -
రెవె‘న్యూ’ లుక్ వచ్చేనా!
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని సీఎం చేసిన ప్రకటనతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్న సర్కారు.. కొత్త చట్టం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. గతేడాది లోక్‌సభ ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతుతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. త్వరలోనే రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతను తరచూ ప్రస్తావిస్తున్నా.. ఈ చట్టం ఎలా ఉంటుందనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అయితే, చట్ట రూపకల్పన కోసం రెవెన్యూ ఉన్నతాధికారులతో సీఎం త్వరలోనే భేటీ అవుతారని, ఆ తర్వాత స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవినీతి శాఖగా అపఖ్యాతిని మూటగట్టుకున్న రెవెన్యూను సంపూర్ణంగా సంస్కరించాల్సిన అవసరముందని గత అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా.. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టానికి ఆమోదముద్ర వేస్తామని తేల్చి చెప్పారు. చట్టాలపై సమాచారం: రెవెన్యూ వ్యవస్థకు సత్వర చికిత్స, కొత్త చట్టానికి రూపకల్పన దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాలను ఏకీకృతం చేసేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలతో పాటు, కొత్త చట్టంలో ఎలాంటి సంస్కరణలు తేవాలనే కోణంలో కలెక్టర్ల నుంచి సమాచారం సేకరించింది. ఇనామ్, అసైన్డ్, రక్షిత కౌలుదారు, ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర కేటగిరీల భూములకు సంబంధించి చట్టాల అవశ్యకతపై ఇప్పటికే నివేదికలు కూడా తెప్పించుకుంది. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు వివిధ మార్గాల్లో అభిప్రాయసేకరణ జరుపుతున్న ప్రభుత్వం.. న్యాయపరమైన అవరోధాలు రాకుండా నల్సార్ విశ్వవిద్యాలయం న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరిపింది. ఒకే గొడుగు కిందకు.. ఇప్పటివరకు మనుగడలో ఉన్న 124 చట్టాలు/నియమాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు, కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడటం, గజిబిజిగా ఉన్న చట్టాలను సులభతరం చేస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నిర్దేశించిన టైటిల్ గ్యారంటీ చట్టం అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే ఏపీ ఒకడుగు ముందుకేసి ఈ చట్టానికి ఆమోదముద్ర వేయడంతో ఇదే తరహా చట్టాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందనే దిశగా ఆలోచన చేస్తోంది. అయితే, ఈ చట్టం అమలు అనుకున్నంత సులువు కాదని ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. తెలంగాణ ల్యాండ్‌రెవెన్యూ కోడ్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2019ను ప్రవేశపెట్టాలనే వాదన రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కోడ్‌తో ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానే ఒకే చట్టం మనుగడలోకి రానుంది. ఈ రెండింటితో పాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ చట్టం–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ సాగుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టం కొలబద్దగా చట్ట స్ఫూర్తి దెబ్బతినకుండా కొత్త చట్టానికి తుదిరూపు ఇవ్వాలనే కోణంలోనూ ఆలోచన చేస్తోంది. ఉద్యోగుల్లో గడబిడ! రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో, వీఆర్ఏల సేవలు చాలించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన, ఆన్లైన్ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేయడంతో వీరిని ఇతర సేవలను మళ్లించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త రెవెన్యూ చట్టం ఎవరి కొలువులకు ఎసరు తెస్తుందోననే ఆందోళన ఉద్యోగవర్గాల్లో కనిపిస్తోంది. అయితే, కొత్త చట్టం తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ తమపై అవినీతిపరులంటూ అపప్రద మోపి చట్టం చేస్తామనడం సరికాదని రెవెన్యూ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. బహుళ ప్రజానీకంతో సంబంధమున్న శాఖ కావడంతోనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి తప్ప శాఖ పూర్తిగా అవినీతిమయం కాలేదని చెబుతున్నాయి. ఎన్నికల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు తాము అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగితే బాగుంటుదనేది రెవెన్యూ సంఘాల వాదనగా కనిపిస్తోంది. శాఖతో సంబంధం లేని పనులను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూడకుండా రెవెన్యూ శాఖ అభివృద్ధి చెందేలా ప్రజలకు సరళతర సేవలందించేలా చట్టం తీసుకొస్తే తామే స్వాగతిస్తామంటున్నారు. అయితే, ఈ విషయంలో తమ సేవల గురించి ప్రభుత్వ పెద్దలకు సానుభూతితో వివరించాల్సిన ఐఏఎస్ అధికారులు అన్ని విధులు చేయించుకుంటూనే అనుసంధానకర్తలుగా వ్యవహరించకపోవడం బాధాకరమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కొత్త చట్టం ఎలా ఉంటుంది.. అటు ప్రజలతో పాటు ఇటు ఉద్యోగ వర్గాలకు అనుకూలంగా ఉంటుందా.. ఏకపక్షంగా ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే. ఉద్యోగుల్లో గడబిడ! రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో, వీఆర్ఏల సేవలు చాలించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన, ఆన్లైన్ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేయడంతో వీరిని ఇతర సేవలకు మళ్లించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త రెవెన్యూ చట్టం ఎవరి కొలువులకు ఎసరు తెస్తుందోననే ఆందోళన ఉద్యోగవర్గాల్లో కనిపిస్తోంది. అయితే, కొత్త చట్టం తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ తమపై అవినీతిపరులంటూ అపప్రథ మోపి చట్టం చేస్తామనడం సరికాదని రెవెన్యూ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. బహుళ ప్రజానీకంతో సంబంధమున్న శాఖ కావడంతోనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి తప్ప శాఖ పూర్తిగా అవినీతిమయం కాలేదని చెబుతున్నాయి. ఎన్నికల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు తాము అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగితే బాగుంటుందనేది రెవెన్యూ సంఘాల వాదనగా కనిపిస్తోంది. శాఖతో సంబంధం లేని పనులను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూడకుండా రెవెన్యూ శాఖ అభివృద్ధి చెందేలా ప్రజలకు సరళతర సేవలందించేలా చట్టం తీసుకొస్తే తామే స్వాగతిస్తామంటున్నారు. అయితే, ఈ విషయంలో తమ సేవల గురించి ప్రభుత్వ పెద్దలకు సానుభూతితో వివరించాల్సిన ఐఏఎస్ అధికారులు అన్ని విధులు చేయించుకుంటూనే అనుసంధానకర్తలుగా వ్యవహరించకపోవడం బాధాకరమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కొత్త చట్టం ఎలా ఉంటుంది.. అటు ప్రజలతో పాటు ఇటు ఉద్యోగ వర్గాలకు అనుకూలంగా ఉంటుందా.. ఏకపక్షంగా ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే. -
‘రెవెన్యూ’లో బదిలీలలు
జిల్లా కేంద్రంలోని ఓ తహసీల్ కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ఐ విధుల నిర్వహణ చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. బదిలీ అనివార్యమని తెలవడంతో పావులు కదిపాడు. తనకున్న పరిచయంతో తహసీల్దార్‌తో కలెక్టర్ పరిపాలనా కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేయించి ప్రస్తుతమున్న చోటే ఆర్ఐని కొనసాగించాలని, బదిలీ చేయవద్దని ఫోన్ చేయించాడు. ఈ విషయం ప్రస్తుతం బయటకు పొక్కడంతో రెవెన్యూ వర్గాల్లో చర్చగా మారింది. బదిలీల జాబితాలో ఉన్న ఈ ఒక్క ఆర్ఐయే కాదు... మరి కొందరు కూడా ఆశిస్తున్న ప్రాంతాలకు వెళ్లడానికి పైరవీలు చేసినట్లు విశ్వనీయ సమాచారం. సాక్షి, ఇందూరు(నిజామాబాద్): రెవెన్యూ శాఖలో త్వరలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఎక్కువ కాలం ఒకే చోట పని చేస్తున్న వారికి స్థాన చలనం కల్పించడానికి జిల్లా కలెక్టర్ పరిపాలనా కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా మండల తహసీల్ కార్యాలయాల్లో రెండు సంవత్సరాల పాటు పని చేస్తున్న వారిని గుర్తించి వారి బదిలీలకు రెవెన్యూ ఉన్నతాధికారులు ఫైలును రూపొందించారు. దాదాపు 16 మందికి పైగా ఆర్ఐలను ప్రస్తుతం పని చేస్తున్న స్థానాల నుంచి వేరే మండలాలకు బదిలీ చేయడానికి మండలాలు కూడా ఖరారు కాగా, అప్రూవల్ కోసం సంబంధిత ఫైలు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లింది. అయితే సీసీఎల్ఏను మరోసారి సంప్రదించి ఫైలును నివేదించాలని కలెక్టర్ పరిపాలనా అధికారులకు సూచించారు. కలెక్టర్ సంతకమే తరువాయి కావడంతో మరో వారం రోజుల్లో బదిలీల ఉత్తర్వులు వెలుబడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బదిలీల ఫైలు రూపుదిద్దుకుంటున్న సందర్భంలోనే పలువురు ఆర్ఐలు పావులు కదిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశిస్తున్న మండలాలకు బదిలీ అయ్యేందుకు ఉన్నతాధికారుల సిఫార్సులు చేయించారని, మరి కొందరు పని చేస్తున్న స్థానంలోనే మరికొన్ని రోజులు కొనసాగేందుకు తమదైన రీతిలో పైరవీలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్ఐల ఫైలు కలెక్టర్ వద్ద నిలిచిపోవడంతో కాస్త నిరాశకు గురయ్యారు. ఆశించిన మండలాలు రాకపోతే ఎలా అని అంతర్మథనంలో పడ్డారు. డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలు... ఆర్ఐల బదిలీల పక్రియ పూర్తి కాగానే డిప్యూటీ తహసీల్దార్ బదిలీలు కూడా చేపట్టాలని కలెక్టర్ పరిపాలనా అధికారులు భావిస్తున్నారు. ఇందుకు జిలాల్లో ఎక్కువ కాలం అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు ఒకేచోట పని చేస్తున్న వారి వివరాలను సేకరించడానికి కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 20 మంది వరకు డిప్యూటీ తహసీల్దార్లు బదిలీలకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఐల బదిలీలు కాగానే తమ బదిలీలే ఉంటాయని తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్లు కూడా ఆశిస్తున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమకున్న బలంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. -
రెవె‘న్యూ’ సవాళ్లు..!
సాక్షి, సిరిసిల్ల: భూమి సూర్యుడి చుట్టు తిరిగితే.. మనిషి భూమి చుట్టు తిరుగుతున్నారు. మార్కెట్లో భూమి విలువ గణనీయంగా పెరిగడంతో భూవివాదాలు తలెత్తుతున్నాయి. భూమి కోసం మనిషి ఎంతకైనా తెగించే పరిస్థితి దాపురించింది. పట్టణీకరణ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరిట సాగులో లేని భూములకు సైతం పెట్టుబడి సాయం ఇవ్వడంతో పట్టా ఉంటే చాలు.. కబ్జాలో లేకున్నా సరే అన్న రీతిలో భూమి హక్కుల కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. ఆరు నెలలపాటు భూరికార్డుల ప్రక్షాళన పేరిట అధికారులు తాతల నాటి భూరికార్డులను శుద్ధి చేసేందుకు ఉపక్రమించగా.. ఇదే అదనుగా అనేక ప్రాంతాల్లో కొత్త సమస్యలకు తెరలేచింది. భూరికార్డుల శుద్ధీకరణలో లోటుపాట్లుతో.. రెవె‘న్యూ’ సవాళ్లను ఎదుర్కొంటోంది. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే వ్యక్తి సజీవంగా దహనం చేయడంతో రెవెన్యూ యంత్రాంగంలో అభద్రతాభావం నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన భూప్రక్షాళన కొత్త సమస్యలకు తెరలేపినట్లు అయింది. ఉమ్మడి జిల్లాలో భూ సమస్యలు.. సవాళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాంకేతిక సమస్యలు.. రెవెన్యూ శాఖను సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. ఆన్లైన్ సమస్యలు, ధరణి సైట్ సరిగా లేకపోవడం, స్థానిక అధికారులకు తెలియకుండానే రికార్డుల్లో తప్పులు రావడం వంటి సమస్యలు ఉన్నాయి. కానీ కొన్ని మండలాల్లో పైరవీకారుల ప్రవేశంతో రికార్డుల్లో అధికారులు చేయి చేసుకుని కావాలనే మార్పులు చేసినట్లు ఆరోపణలున్నాయి. పార్క్–బీ పేరిట వివాదాస్పదమైన భూములను, కోర్టు కేసులు, అటవీ భూములు, దేవాదాయ భూములు, చెరువు శిఖం భూములు, అన్నదమ్ముల వివాదాలు ఉన్న భూములను పార్ట్–బీలో చేర్చారు. దీంతో ఆ భూముల జోలికి వెళ్లకుండానే రెవెన్యూ అధికారులు ఉమ్మడి జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు. దీంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. తాము కబ్జాలో ఉన్నామని, తమకు పాస్ బుక్కులు ఎందుకు జారీ కావడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. క్షేత్రస్థాయి సర్వేలు సమగ్రంగా లేక.. సాంకేతిక సమస్యలు అడ్డు రావడంతో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో రికార్డులను శుద్ధిచేయలేకపోయారు. ఈ కారణంగా ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి. కొందరు రెవెన్యూ అధికారులు రైతులను డబ్బులు డిమాండ్ చేస్తూ.. ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు రెవెన్యూ అవినీతికి అద్దం పడుతోంది. పని ఒత్తిడి కారణంగా సాప్ట్వేర్ సమస్యలతో రెవెన్యూ యంత్రాంగం సతమతమవుతోంది. ఏదీ ఏమైనా టైటిల్ గ్యారంటీ లేక.. భూవివాదాల పరిష్కరం లేక.. రెవెన్యూ క్షేత్రస్థాయి సిబ్బందికి భూరికార్డులపై అవగాహన లేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. ఏడాదిగా చర్యలు లేవు.. మాది పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం. గ్రామ శివారులోని సర్వే నంబర్ 91లో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎస్సీ కార్పేషన్ ద్వారా కొనుగోలు చేశారు. ఊరిలోని ఎస్సీలకు పంపిణీ చేశారు. అదే భూమిని సదరు పట్టాదారు సోలార్ కంపెనీకి విక్రయించాడు. గ్రామ వీఆర్వో.. ఆర్ఐను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. చిన్న ఉద్యోగులను బలి చేసి ఊరుకున్నారు. ఏడాదిగా అసలు బాధ్యులపై ఎలాంటి చర్యలు లేవు. – రవీందర్‌రెడ్డి, నాగారం పని ఒత్తిడి ఉంది.. రెవెన్యూ అధికారులపై చాలా పని ఒత్తిడి ఉంది. ఏళ్ల నాటి భూసమస్యలు స్వల్ప కాలంలో తీర్చాలంటే కాదు. సాంకేతిక సమస్యలు ఉన్నాయి. సాఫ్వేర్ సమస్యలు ఉన్నాయి. భూమి విషయంలో సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు. కోర్టు వివాదాలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉండగా.. అన్నింటికీ రెవెన్యూను బాధ్యులను చేస్తున్నారు. తహసీల్దార్ సజీవ దహనం ఎంతో బాధించింది. – ఎన్.ఖిమ్యానాయక్, డీఆర్వో, రాజన్న సిరిసిల్ల -
అవినీతిని సహించేది లేదు..!
సాక్షి, అనంతపురం అర్బన్: రెవెన్యూ సేవల్లో అవినీతికి తావిస్తే సహించేది లేదంటూ ఉద్యోగులను కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి భూ సేకరణ, ఇతర అంశాలపై అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు, సర్వేయర్లతో గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆయన సమీక్షించారు. నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలును సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఉన్నతాధికారులకు సమర్పించే నివేదికల్లో సమగ్ర సమాచారం ఉండలన్నారు. తప్పుడు నివేదిక సమర్పిస్తే ఏస్థాయి అధికారిపైన అయినా కఠిన చర్యలు తప్పవన్నారు. అవినీతిరహిత పాలన అందించే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు ఫిర్యాదులు అధికంగా పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డు మంజూరుతో పాటు ఆర్థికేతర సమస్యలు వస్తున్నాయి. ప్రతి నిరుపేదకూ ఇంటిని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌర సేవల్లో అవినీతికి తావివ్వకూడదన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది ద్వారా అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపతే సంబంధిత తహసీల్దారుపై చర్యలు ఉంటాయన్నారు. భూ లభ్యతకు సంబంధించి 22–ఎ మేరకు వివరాల జాబితాను సక్రమంగా సిద్ధం చేసుకోవాలన్నారు. భూమి వివరాలను, స్పందన ఫిర్యాదులను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలన్నారు. భూ సమస్యలను సర్వేయర్లు, వీఆర్ఓలు సమన్వయ సహకారం అందించుకుంటూ పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం పలు మండలాల్లో ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వ భూములు గుర్తింపు గురించి సంబంధిత తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఆర్డీఓ ఆర్.కూర్మనాథ్, సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ మచ్ఛీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భూనిర్వాసితులకు వెంటనే న్యాయం చేయండి పెనుకొండ: భూనిర్వాసితులకు కియా కార్ల పరిశ్రమలో వెంటనే ఉద్యోగావకాశాలు కల్పించి తగిన న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లోని పిల్లలకు ఇంతవరకూ ఉద్యోగాలు ఇవ్వకపోవడం కేవలం స్కిల్ డెవలప్మెంట్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా కార్ల పరిశ్రమకు అవసరమైన ఆర్ఓబి (ఓవర్‌బ్రిడ్జి) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలన్నారు. నైపుణ్యమున్న వారిని కియాకు పంపితే వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఈ సందర్భంగా కలెక్టర్‌కు కియా లీగల్ హెడ్ జూడ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ గోపీకృష్ణ, అహుడా వీసీ మురళీకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా పెనుకొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమలో ఈనెల 31న కార్మాస్ ప్రొడెక్షన్ సెంటర్ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు కియా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిసింది. రూ.1.10 కోట్లతో ఆర్థో ఓటీ అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ.1.10 కోట్లతో ఏర్పాటు చేసిన అధునాత ఆపరేషన్ థియేటర్లను కలెక్టర్ సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఆస్పత్రిలో అధునాతన పద్ధతుల్లో ఎముకల శస్త్రచికిత్స విభాగాలు(మాడ్యులర్,నాన్ మాడ్యులర్) ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కీళ్లు, మోకాళ్ల మార్పిడితో పాటు కుంటి కాళ్లను సరిచేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు నమ్మకం కల్గించేలా వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ డాక్టర్ బాబూలాల్, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ నవీన్‌కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ లలిత, ఏఓ డాక్టర్ శౌరి, ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ ఆత్మారాం, మేనేజర్ శ్వేత ఉన్నారు. -
రెవెన్యూ అధికారులే చంపేశారు
ఒంగోలు సబర్బన్/నాగులుప్పలపాడు: రెవెన్యూ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం రైతును బలితీసుకున్నాయి. నాగులుప్పలపాడులోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఎలుకల మందు తిని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన రైతు నడిపినేని రత్తయ్య (68) ఆత్మహత్య చేసుకోవడానికి స్థానిక రెవెన్యూ అధికారులే కారణమని అతని కుటుంబ సభ్యులు, కుమారుడు శ్రీనివాసులు ఆరోపించారు. రైతు మృతదేహానికి ఒంగోలు రిమ్స్‌లో బుధవారం పోస్టుమార్టం పూర్తికాగా, అతని కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నాగులుప్పలపాడు మండలంలోని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన నడిపినేని రత్తయ్యకు భార్య వరమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రామంలో తమకు ఉమ్మడిగా ఉన్న 4.54 ఎకరాల పొలంలో రత్తయ్య వ్యవసాయం చేస్తున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వరుస కరువుతో పంటలు చేతికిరాక పెద్ద మొత్తంలో అప్పుల చేయాల్సి వచ్చింది. నాలుగేళ్లుగా వర్షాలు లేక కనపర్తి ఎత్తిపోతల పథకం కింద మాగాణి సాగు నిలిచిపోయింది. గుండ్లకమ్మ ఎడమ కాలువ కింద గత నాలుగేళ్లలో అధికారులు చుక్క నీరు వదల్లేదు. దీంతో భూములు బీళ్లుగా మారాయి. దీంతో అప్పు తీర్చే దారి లేక ఉన్న ఇంటిని తెలిసిన వారి వద్ద రత్తయ్య తాకట్టు పెట్టాడు. అప్పుకు సంబంధించి ప్రతి నెలా వడ్డీలు చెల్లించాలి. ఇప్పటికే అప్పులు రూ.15 లక్షలు దాటడంతో తమకు ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి అప్పులు తీరుద్దామని అనుకున్నాడు. కానీ, ఆ పొలం ఆన్లైన్లో తన తండ్రి రంగయ్య పేరుతో ఉంది. వెబ్ ల్యాండ్ నమోదులో ఏర్పడిన పొరపాటును సరిదిద్దాలని నాగులుప్పలపాడు రెవెన్యూ అధికారుల చుట్టూ రెండేళ్లుగా రత్తయ్య ప్రదక్షిణలు చేస్తున్నా వారు కనికరించలేదు. అవినీతికి అలవాటుపడిన రెవెన్యూ అధికారులు.. రత్తయ్య నుంచి మామూళ్లు అందలేదన్న కారణంతో అతని పని గురించి పట్టించుకోలేదు. ఒకవైపు అప్పులోళ్ల ఒత్తిళ్లు.. మరోవైపు రెవెన్యూ అధికారుల వేధింపులు వెరసి చివరకు తనువు చాలించడమే పరిష్కారమార్గమని రత్తయ్య భావించాడు. గత సోమవారం రాత్రి పొద్దుపోయాక నాగులుప్పలపాడులోని మండల కార్యాలయాల సముదాయంలో గల గృహనిర్మాణ శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగులోకి రాగా, సీఐ సుబ్బారావు, ఎస్సై సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, బుధవారం పోస్టుమార్టం పూర్తిచేశారు. రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలి : రైతు సంఘాల నేతల డిమాండ్ రైతు రత్తయ్య ఆత్మహత్యకు కారణమైన నాగులుప్పలపాడు మండల రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వివిధ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్థానిక రిమ్స్‌లో రత్తయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల ధనదాహం వల్లే రైతు రత్తయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. ఆన్లైన్ అక్రమాలతో రైతుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రత్తయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో రైతు సంఘాల నేతలు చుండూరు రంగారావు, వడ్డె హనుమారెడ్డి, చావల సుధాకర్, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బైరపనేని సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.