సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ పరిరక్షణ, పోడు భూములు, ఆక్రమణల అంశానికి మరోసారి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే నెపంతో అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో వేసిన పంటలు నాశనం చేయడంతో పాటు మొక్కలు నాటి తమను వాటిల్లో వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పోడు రైతులు వాపోతున్నారు. 2005 తర్వాత రాష్ట్రంలో కొత్తగా పోడు అనేదే లేదని, తెలంగాణ ఏర్పడ్డాక గత ఏడేళ్లలో అటవీ భూముల్లో ఆక్రమణలు భారీగా పెరగడంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోందని అటవీ, రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి, జిల్లాల వారీగా పోడు భూములు, వాటిలో ఇంకా ఎవరెవరికి, ఎన్ని ఎకరాల్లో పట్టాలు ఇవ్వాలో లెక్క తేల్చే పనిలో పడింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం అటవీ శాఖ ఏయే జిల్లాల్లో పోడు కింద ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాల్లో అటవీ ఆక్రమణలు జరిగాయి, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్‌వోఎఫ్‌ఆర్) కింద ఎంతమేర హక్కు పత్రాలు ఇచ్చారో లెక్కలు తీసేపనిలో పడింది.
దేశ వ్యాప్తంగా అటవీ భూములు పంపిణీ చేస్తే అడవులతో పాటు పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని ఎన్జీవో సంస్థలు కేసు వేయడంతో ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద భూముల పంపిణీపై 2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ సహా ఏపీ, త్రిపుర ఇతర రాష్ట్రాల్లో అప్పట్నుంచీ పోడు భూముల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ, సర్వే విభాగాలు ఉమ్మడిగా మొత్తం రాష్ట్రంలోని అటవీ భూముల సర్వే నిర్వహిస్తే అటవీ విస్తీర్ణం, ఆక్రమణలు, పోడు, ఇతర అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వపరంగా ఇతర చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల: అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా, అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఈ విస్తీర్ణం పది శాతం వరకే ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ భూముల ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన అడవే కనిపించకుండా పోయే స్థితి దాపురిస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద హక్కు పత్రాల పంపిణీ
రాష్ట్రంలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–ఆర్‌ఓఎఫ్‌ఆర్) కింద 2017 చివరినాటికి 11 లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ అందాయి. వాటిలో 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు) దరఖాస్తు చేయగా సామూహిక (కమ్యూనిటీ) క్లెయిమ్స్ కింద 3,427 దరఖాస్తులు (4,70,605 ఎకరాలకు) అందాయి.
వాటిలో వ్యక్తిగత క్లెయిమ్స్‌లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు. 721 సామూహిక క్లెయిమ్స్ కింద 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలు అందజేశారు. మిగతా వాటి లో కొన్ని క్లెయిమ్స్ తిరస్కరించగా కొన్ని పెండింగ్‌లో ఉన్నట్టుగా అటవీ, ఎస్టీ సంక్షే మ శాఖలకు చెందిన రికార్డులను బట్టి స్పష్టమవుతోంది.
గిరిజనేతరుల ఆక్రమణతో...
పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు, గిరిజనులను తమ బినామీలుగా చేసుకుని ఆదివాసీలు కాని వారు, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి తమ స్వాధీనంలో పెట్టుకోవడం పెద్ద సమస్యగా మారిందని అటవీ అధికారులు చెబుతున్నారు. వీరికి రాజకీయ పార్టీల అండకూడా ఉందని అంటున్నారు. పోడు పట్టాలున్న ఆదివాసీలు, పేద ఎస్సీ, బీసీ వర్గాల వారిని ముందుంచి, వారి భూముల పక్కల నుంచి ఆక్రమణలు మొదలుపెట్టి చెట్లు కొట్టడం, అటవీ భూఆక్రమణ విస్తీర్ణం క్రమంగా పెంచుకోవడంతో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
అమ్ముకోకూడదు.. కుదవ పెట్టకూడదు
కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మారుమూల అడవుల్లోని ఆదివాసీలకు పోడు సాగు జీవనాధారంగా ఉండేది. జీవనోపాధి కోసం అడవుల్లో చెట్లు లేని చోట సాగుచేసి ఆ భూమిలో సారం తగ్గగానే ఒకటి, రెండేళ్లలోనే చెట్లు కొట్టకుండానే మరోచోటుకు తరలిపోవడం జరిగేది. పారలు, ఎడ్లు వంటి వాటిని ఉపయోగించకుండా వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా పోడు నిర్వచనమే మారిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో పోడు వ్యవసాయానికి 1907లో నిజాం నవాబు అనుమతించాడు.
కొన్నేళ్ల తరబడి పోడు సాగు చేసుకునే వారికి ఆ భూమిపై హక్కును కల్పించినా, దున్నుకోవాలి తప్ప అమ్ముకోకూడదు, కుదవపెట్టకూడదు, ఈ భూములకు బ్యాంకులు రుణాలు సైతం ఇస్తాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటవీహక్కుల చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదించిన వారికే ఈ పట్టాలు ఇవ్వాలి.
రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా..
రాష్ట్రంలో మొత్తం 7,37,595 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూమి ఆక్రమణలకు గురైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లాల్లో రెవెన్యూ శాఖ 1,09,584 ఎకరాల్లో పట్టాలిచ్చినట్టు అటవీ అధికారులు తమ నివేదికల్లో తేల్చారు. అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 2.15 లక్షల ఎకరాలు, అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 9 వేల ఎకరాల అటవీశాఖ భూములకు రెవెన్యూశాఖ పట్టాలు అందజేసినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment