సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే సాగులో ఉన్న 11.5 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీ ప్రక్రియను ఈ (ఫిబ్రవరి) నెలాఖరుకల్లా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో పంపిణీ చేయాల్సిన భూములకు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయిందని, నివేదికలు కూడా సిద్ధమయ్యాయని వెల్లడించారు. పంపిణీ చేసే పోడు భూములకు పట్టా ఇవ్వడంతోపాటు విద్యుత్ కనెక్షన్, రైతుబంధు, నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
పోడు భూముల పంపిణీ తర్వాత క్షేత్రస్థాయిలో గిరిజన గణన జరిపి భూమిలేని వారికి ‘దళితబంధు’తరహాలో ‘గిరిజన బంధు’అమలు చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో పోడు భూముల సమస్యపై కాంగ్రెస్ సభ్యులు పొదెం వీరయ్య, ధనసరి అనసూయ (సీతక్క), బీఆర్‌ఎస్ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన
ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘పోడు భూముల విషయంలో మాకు స్పష్టమైన విధానం ఉంది. సాగు చేసుకునే వారికి పట్టాలు ఇవ్వాలని ఇటీవలే ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఆ భూములు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తాం. ఏయే జిల్లాల్లో ఎంత భూమిని పంపిణీ చేయాలో సర్వే చేసి, నివేదికలు కూడా సిద్ధం చేశారు. కానీ.. అఖిలపక్షంతోపాటు స్థానిక సర్పంచి, ఎంపీటీసీ, స్థానిక గిరిజన ప్రతినిధులు సంతకాలు పెడితేనే పోడు భూములకు పట్టాలిస్తాం.
పోడు భూములు హక్కుకాదు.. దురాక్రమణ
కొన్నిచోట్ల గొత్తికోయలను తీసుకొచ్చి అడవులను నరికేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అనే ఫారెస్టు అధికారిని ఛత్తీస్‌ఘడ్ నుంచి వచి్చన గొత్తికోయలు హత్య చేశారు. ఇదేం పద్ధతి. పోడు భూముల గురించి అందరూ మాట్లాడుతున్నారు. పోడు భూములు గిరిజనుల హక్కు కాదు.. దురాక్రమణ. దయతలచి ఇస్తే తీసుకోవాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు సరైన పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. పోడు భూములు, అటవీ భూములు కొన్ని పార్టీలకు ఆట వస్తువులుగా మారాయి. గతంలో ఎన్నికలకు ముందు పోడు భూములకు పట్టాలు అని ఇష్టమొచి్చనట్టు చేశారు.
పోడు భూముల పేరుతో ఆందోళన చేస్తే హీరోలు అనుకుంటున్నారు. విచక్షణారహితంగా అడవులను నరికేయడం సరికాదు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అడవులను రక్షించాల్సిన బాధ్యత మనమీద ఉంది. గిరిజనుల హక్కులను కాపాడాల్సిందే.. మరి రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా వద్దా? ఆలోచించాలి. అంతటా అడవులు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు నర్సాపూర్ అడవుల్లో సినిమా షూటింగులు జరిపేవారు. ఇప్పుడు ఎడారి అయింది. అడవులను పునరుద్ధరించుకునేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికి రాష్ట్రంలో 7.8 శాతం గ్రీనరీ పెరిగిందని ప్రశంసలు వస్తున్నాయి. బ్రెజిల్, చైనా తర్వాత తెలంగాణలోనే గ్రామాల్లో ప్రజా ప్రతినిధులకు టార్గెట్లు పెట్టి నిర్బంధంగా మొక్కలు నాటించి గ్రీనరీని పెంచే ప్రయత్నం చేస్తున్నాం.
భూముల కోసం పెళ్లిళ్లు..
ఇక నుంచి పోడు లేదు.. అటవీ దురాక్రమణ ఉండొద్దు. అడవులు అంతరించిపోవడం సమాజానికి ప్రమాదకరం. అడవుల సంరక్షణ జరగాలి. పోడు భూముల విషయంలో గిరిజనుల పేరిట అగ్రవర్ణాల వాళ్లు అటవీ భూములు పొందుతున్నారు. గిరిజన తెగకు చెందిన ఆడపిల్లలను పెళ్లి చేసుకొని ఎకరాల కొద్దీ భూములను ఆక్రమించుకుంటున్నారు.
అటవీ సంపదను దోపిడీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పలువురు ఉన్నత కులాలవారు అటవీ భూములను కబ్జాచేశారు. 10, 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా? గిరిజనుల హక్కులను కాపాడాల్సిందే. అలాగే అటవీ హక్కులను కూడా కాపాడాలి. గతంలో మా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు పోడు భూముల విషయంలో జోక్యం చేసుకుంటే కేసులు పెట్టారు. ఎవరినీ ఉపేక్షించేది లేదు. పోడు భూములకు సంబంధించి ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద ఇచి్చనవి ఎన్నో లెక్కచూసుకొని ఇస్తాం. గతంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చిన వారికి రైతుబంధు కూడా ఇస్తున్నాం. కొన్ని అటవీ గ్రామాల్లో గిరిజనుల విజ్ఞప్తి మేరకు రూ. 400 కోట్లు వెచి్చంచి మూడో ఫేజ్ విద్యుత్ సౌకర్యం కలి్పంచాం. అయితే అటవీ అధికారుల వ్యవహారశైలి కూడా మారాల్సిన అవసరం ఉంది. శవ దహనానికి కట్టెలు తీసుకొచ్చినా కొందరు అతి చేస్తున్నారు. దీనిపై అటవీశాఖ మంత్రి, అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇస్తాం.
సాయుధ దళాలతో పహారా
గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయవద్దు. అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులను సహించబోం. మన రాష్ట్రం కాని గొత్తికోయల దౌర్జన్యం మంచిది కాదు. అడవిని నరికేసి భూములు ఇవ్వామని అడగడం ఏంటి? అడవుల నరికివేతకు ఎక్కడో చోట ఫుల్‌స్టాప్ పడాలి. అడవులకు సరిహద్దులు పెట్టి సాయుధ దళాలతో పహారా ఏర్పాటుచేస్తాం. గిరిజనుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత’’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
గిరిజనులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: పొదెం వీరయ్య
ప్రశ్నోత్తరాల సమయంలో పోడుభూముల సమస్యపై కాంగ్రెస్ సభ్యుడు పొదెం వీరయ్య మాట్లాడారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో 12 మంది గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. పోడు భూముల మీద ఆధారపడి ఈ తండాలో 39 కుటుంబాలు జీవనం సాగిస్తుంటే.. అటవీ చట్టాల కింద కేసులు పెట్టి 12 మందిని ఆదిలాబాద్ జైలుకు పంపారని వివరించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కోయపోచగూడలో అటవీ అధికారులు దుశ్శాసన పర్వం చూపించారని ఆందోళన వ్యక్తం చేశారు. చేపలుపట్టుకోవడానికి, పొయ్యిలకు కట్టెలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్లినా.. కొట్టి హింసించి, అటవీ చట్టాల కింద గిరిజనులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోడుసాగులో ఉన్నవారిని కూడా దున్నుకోనివ్వడం లేదన్నారు. దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానమిస్తూ.. కోయపోచగూడలో 12 మందిపై పెట్టిన కేసులను ఎత్తివేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
లిఖిత పూర్వక హామీ ఇస్తేనే..
పోడు భూముల పంపిణీ తర్వాత అడవిలో ఒక్క చెట్టు కూడా నరకబోం.. మళ్లీ పోడు భూములనే మాటెత్తం. అడవులను రక్షిస్తామని సర్పంచి నుంచి ఎంపీటీసీ, అఖిలపక్ష గిరిజన ప్రతినిధుల దాకా సంతకాలు పెడితేనే పోడు భూములను పంపిణీ చేస్తాం. అందుకు సిద్ధంగా లేని వారికి భూములు ఇవ్వం. ఇక నుంచి పోడు భూములను రక్షిస్తామని.. పట్టాలు ఇచ్చాక గజం భూమిని కూడా ఆక్రమించబోమని ప్రభుత్వానికి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి. ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తాం. భూములు పొందిన తర్వాత వారే అటవీ సంపదను కాపాడే హక్కుదారులు కావాలి
– అసెంబ్లీలో సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment