ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల చివర్లోగా పోడుభూములపై క్లెయిమ్స్ పరిష్కరించే ప్రక్రియ పూర్తవుతుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇది ముగిశాక కొత్త ఏడాది నుంచి అక్రమంగా అడవుల్లోకి ప్రవేశించకుండా, ఆక్రమణలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. పోడుభూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే నిమిత్తం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారని మంత్రి తెలిపారు.
ఈ భూములపై అందిన క్లెయిమ్స్‌పై ఈ నెలాఖరులోగా సర్వే పూర్తవుతాయని చెప్పారు. ఆ తర్వాత వివిధ కమిటీల ద్వారా సమావేశాలు నిర్వహించి భూమి అప్పగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆ తర్వాత అటవీభూముల జోలికి ఎవరూ వెళ్లకుండా, అక్రమణలు చోటుచేసుకోకుండా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోడుభూముల వివాదాల పరిష్కారం, పులుల దాడుల ఘటనలు, టైగర్ రిజర్వ్‌ల పరిధిలోని గ్రామాల తరలింపు తదితర అంశాలపై శుక్రవారం ‘సాక్షి’తో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు.
అటవీ ప్రాంతాల్లో గుంపులుగా శబ్దాలు చేస్తూ...
అటవీ ప్రాంతాల్లోని పత్తిచేన్లకు గుంపులుగా వెళ్తూ శబ్దాలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. పులుల కదలికలున్న చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను అటవీశాఖ అప్రమత్తం చేసిందని తెలిపారు. ఇటీవల పెద్దపులి దాడిలో ఒక వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ ఆదేశాలు జారీచేశారని చెప్పారు.
అటవీ ప్రాంతాల్లో జనసంచారం లేనిచోట్ల తమకు అనువైన ప్రాంతాల్లో పులులు ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయని చెప్పారు. ఇటీవల కాలంలో ప్రజలపై పులులు దాడులు చేసిన ఘటనలు తగ్గిపోగా తాజాగా ఈ ఉదంతం చోటుచేసుకుందన్నారు. మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్, తడోబాలలో పులుల సంతతి పెరిగిపోవ డంతో రాష్ట్రంలో టైగర్ కారిడార్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి అడుగు పెడుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని రాంపూర్, మైసంపేట గ్రామాలను మంచి పునరావాస ప్యాకేజీ అందించి బయటకు తీసుకొచ్చి నట్టు మంత్రి తెలిపారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఇది జరిగిందని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం, ఇళ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాల్లోనే ఈ గ్రామాలు కొనసాగితే విద్యుత్, మంచినీళ్లు, రోడ్డు వంటివి, స్కూల్, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే జూన్ నెల కల్లా ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉండిపోయిన కొన్ని గ్రామాలు పూర్తిగా బయటకు తీసుకువస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment