![CM KCR to distribute Podu Lands in Asifabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/30/KCR-1.jpg.webp?itok=s-sYDPcw)
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు.
పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు.
కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌కు బయలుదేరతారు. పట్టణంలో తొలుత కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
సమీపంలోని పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, చివరగా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోడు రైతులకు పట్టా పుస్తకాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు ప్రగతిభవన్ చేరుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment