అవినీతి ఊబిలో రెవెన్యూ శాఖ
-
నెల రోజుల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు తహసిల్దార్లు
-
కలెక్టర్ హెచ్చరించినా అధికారుల తీరు మారలే..
హన్మకొండ అర్బన్ : ‘అవినీతికి పాల్పడటం అంటే ప్రజల రక్తం తాగటమే... పదే పదే హెచ్చరించినా మీ పద్ధతి మారడం లేదు. ఇప్పటికే ఒక తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. మరో ఇద్దరు నాముందే ఉన్నారు. పద్ధతులు మార్చుకోండి. లేకుంటే అనుభవించాల్సి ఉంటుంది’ అంటూ అవినీతి విషయంలో తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ 20 రోజుల క్రితం జిల్లా స్థాయి సమావేశంలో హెచ్చరించారు. మరిపెడ తహసీల్దార్ మంజుల, ఆర్‌ఐ బోజ్య రేషన్ డీలర్ల నుంచి రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడిన సందర్భంగా కలెక్టర్ ఈ హెచ్చరిక చేశారు. అయినా.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. రైతు నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా చిట్యాల మండలం పంగిడిపల్లి వీఆర్వో రవీందర్... మరి నా సంగతేంటని అండినందుకు తహసీల్దార్ పాల్‌సింగ్‌లను సోమవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు తహసీల్దార్లు, ఆర్‌ఐ, వీఆర్వో ఏసీబీకి చిక్కడం.. ఆ శాఖలో జరుగుతున్న అవినీతిని తెలియజేస్తోంది.
టోల్ ఫ్రీ ఫిర్యాదులతో హెచ్చరికలు
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు రెవెన్యూ అధికారుల అవినీతిపై ఫిర్యాదులు కుప్పలుగా వచ్చాయి. వాటిపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఫిర్యాదులు పరిశీలించారు. ఈ సందర్బంగా రెవెన్యూ సిబ్బందిని ఘాటుగా హెచ్చరించారు. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్వోలను ఇటీవలే మూకుమ్మడిగా 46 మందిని ఏకంగా డివిజన్లు మారుస్తూ బదిలీ కూడా చేశారు.
రవీందర్‌పైనా ఫిర్యాదు..
ప్రస్తుతం చిట్యాల మండలం పంగిడిపల్లి వీఆర్వో కొత్తూరి రవీందర్‌పై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వీఆర్వో నుంచి సంజాయిషీ కోరుతూ అధికారులు మొమో కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం గమనార్హం.
కలెక్టర్ హెచ్చరించినా....
కలెక్టర్ హెచ్చరించినా ములుగు డివిజన్‌లోని ఓ అధికారి అవినీతి వ్యహారం మారలేదని తెలుస్తోంది. ఇటీవల వీఆర్‌ఏల నుంచి మళ్లీ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కాగా, ఒకటి రెండు మండలాల్లో ఏసీబీ అధికారులు రెక్కీ నిర్వహించారని సమాచారం తెలుసుకున్న కొందరు అధికారులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.