స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేసి జిరాక్సు కాపీలిస్తున్నారనే ప్రచారం అవాస్తవం
ప్రజలకిచ్చేది ఈ–స్టాంపుల ఒరిజినల్ పత్రాలే
నిత్యం వేలాది మందికి ఒరిజినల్ డాక్యుమెంట్ల జారీ
సాక్షి, అమరావతి/అక్కిరెడ్డిపాలెం (గాజువాక): స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా జిరాక్సు కాపీలు మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అనేక మంది తమకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు.
ఈ–స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లకూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని వినియోగదారులు తెలిపారు. పలుచోట్ల నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఆస్తి పత్రాలను ప్రభుత్వం వద్దే ఉంచుకుంటారనే ప్రచారం నిజం కాదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తోంది.
అనుమానాలు సృష్టిస్తున్న సోషల్ మీడియా ప్రచారం
భూముల రిజిస్ట్రేషన్‌పై సోషల్ మీడియా, టీడీపీ ప్రచారం చేస్తున్న ఐవీఆర్‌ఎస్ కాల్స్ విన్న వారు మాత్రం అది నిజమేనని భ్రమపడుతున్నారు. అనుమానం ఉన్నవారు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే.. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు, ఇస్తున్న డాక్యుమెంట్లు ఒరిజినల్సా, జిరాక్సులా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి అసలు సంబంధమే లేదనే విషయం కూడా అక్కడికి వెళ్లిని వారికి అవగతమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసమే జిరాక్సుల ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
భూ హక్కు చట్టంపై వదంతులు నమ్మొద్దు
ఆస్తి తాలూకా ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపుతున్న ఆర్.కృష్ణ
గాజువాక ప్రాంతానికి చెందిన ఈయన పేరు ఆర్.కృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎస్‌సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల గాజువాకలోని ఓ ఆస్తిని ఈయన కొనుగోలు చేశారు. గాజువాక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం తన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైట్లింగ్‌పై వస్తున్న వదంతులను, సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కొందరు వక్రీకరించడంపై అనుమానం వచ్చి సబ్ రిజిస్ట్రార్‌ను వివరణ కోరాను. ఆస్తి హక్కు పత్రాల ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని అడిగాను. ఈ వదంతులన్నీ అవాస్తవమని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆస్తి హక్కుదారునైన నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశారు. సోషల్ మీడియాలో భూ హక్కు చట్టంపై వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలే. వీటిని ఎవరూ నమ్మవద్దు’ అని చెప్పారు. ఈ విషయాలపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.
ఒరిజినల్సే ఇచ్చారు
ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒరిజనల్ దస్తావేజులు ఇచ్చారు. ఒరిజినల్స్ ఇవ్వడం లేదు, జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు నిజం కాదు.
– తాతినేని రామ్మోహనరావు, గోపువానిపాలెం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా
ఆ ప్రచారం నిజం కాదు
నా తల్లితో కలిసి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. పావు గంటలో రిజ్రస్టేషన్ చేశారు. వెంటనే డాక్యుమెంట్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదు. మా చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు.
– ప్రసాద్, చింతలపూడి, ఏలూరు జిల్లా
ఒరిజినల్ తీసుకున్నాను
నేను భీమునిపట్నం రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో స్థలం కొన్నాను. రిజిస్ట్రేషన్ కోసం వెళితే వెంటనే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి కొత్త విధానంలో డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారని అడిగాను. అది అబద్ధమని చెప్పారు. వెంటనే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు.
– శ్రీకాంత్, భీమిలి, విశాఖ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment