స్టాంప్ వెండర్లకు సర్కారు షాక్!
సాక్షి, విజయవాడ బ్యూరో: రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ-స్టాంపింగ్ విధానం ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల దాదాపు 25 వేల మంది స్టాంప్ వెండర్లు ఉపాధి కోల్పోనున్నారు. చాలా ఏళ్లుగా అమల్లో ఉన్న చలానా పద్ధతిలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రైవేట్ సేవలకు ప్రభుత్వం తెరలేపింది. ముంబైకి చెందిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐ)కు ఈ-స్టాంపింగ్ విధానాన్ని అప్పగించేలా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని నెల రోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.
ఈ-స్టాంపింగ్ విధానం ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. కర్ణాటకలో అనేక అవతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ-స్టాంపింగ్ అమలు కోసం ప్రైవేట్ ఏజెన్సీకి కమీషన్‌గా ఏటా రూ.25 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇకపై స్టాక్ హోల్టింగ్ కంపెనీ ప్రతినిధులు ఉంటారు. లావాదేవీలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించినందుకు వారికి 0.65 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
కొత్త విధానం అమలైతే తమ ఉపాధి దెబ్బతింటుందని రాష్ట్రంలో 25 వేల మంది స్టాంప్ వెండర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెండర్ల యూనియన్ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి మంత్రి కేఈ కృష్ణమూర్తిని కలిశారు. తమ ఇబ్బందులను తెలియజేశారు. అయితే, ఈ-స్టాంపింగ్‌పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, మీ ఉపాధి దెబ్బతింటే మేము ఏమీ చేయలేమని వారు చేతులెత్తేయడం గమనార్హం.
వద్దన్న విధానమే ముద్దు
రిజిస్ట్రేషన్ల శాఖలో కొన్నేళ్లుగా ఈ-స్టాంపింగ్ విధానాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. 2003లో టీడీపీ సర్కారు హయాంలో రూ.32 వేల కోట్ల తెల్గీ స్టాంపుల కుంభకోణం వెలుగుచూసింది. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి అక్రమాలపై సంచలనం రేగింది. ఈ నేపథ్యంలో 2004లో ఈ-స్టాంపింగ్ ప్రతిపాదనను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తిరస్కరించారు. వేలాది మంది స్టాంప్‌వెండర్ల పొట్టకొట్టే ఈ విధానాన్ని ఆయన అంగీకరించలేదు. ఇవేమీ పట్టని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఈ-స్టాంపింగ్ అమలుపై మంత్రివర్గ ఆమోదం తీసుకుంది.