stamp vendors
-
దస్తావేజు లేఖర్ల వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
– ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు – దస్తావేజు లేఖర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి ఒంగోలు సబర్బన్ : దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ ధ్వజమెత్తారు. జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వేమూరి కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం దస్తావేజు లేఖర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం దస్తావేజు లేఖర్లపై కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తొలి నుంచి వస్తున్న దస్తావేజు లేకర్ల వ్యవస్థను రూపు మాపాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. స్థిరాస్తి విక్రయాలతో పాటు ఇతర రిజిస్ట్రేషన్లను ఆన్లైన్ ద్వారా చేయించుకోవాలని చూడటం ప్రజలను ఇబ్బంది పెట్టడమేనన్నారు. రోడ్డున పడనున్న కుటుంబాలు సంఘ రాష్ట్ర కార్యదర్శి జి.వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వందలాది మంది కుటుంబాలు ఏళ్ల తరబడి ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నాయని, రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తే ప్రజలు అవస్థలు పడటంతో పాటు దస్తావేజు లేఖర్లకు జీవనోపాధి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు పెళ్లూరి మాలకొండ నరసింహారావు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ సుబ్బారావు, సభ్యులు మహ్మద్, నాగభూషణంతో పాటు జిల్లా కార్యదర్శి శ్రీనివాస చక్రవర్తి, కోశాధికారి మహంకాళి వీరబ్రహ్మాచారి, ములుకుట్ల నాగేశ్వరరావు, అడపా శ్రీనివాసరెడ్డి, షేక్ ఇద్రీజ్, గౌరవాధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరావు, జీఎస్ భావనారాయణ, ఎస్కే దాదాసాహెబ్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షునిగా పెళ్లూరి మళ్లీ ఎన్నిక దస్తావేజు లేఖర్ల జిల్లా సదస్సు సందర్భంగా పెళ్లూరి మాలకొండ నరసింహారావును మళ్లీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పెళ్లూరిని రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి తెలిపారు. ఆయనతో పాటు చీరాలకు చెందిన హేమారావును కూడా రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
వైఎస్ఆర్ జిల్లా: బద్వేల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ దాడులు చేసింది. నిన్నటి నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఈ రోజు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించింది. అయితే ఇప్పటివరకూ ఏసీబీ అధికారులు నలుగురు స్టాంప్ వెండర్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ నలుగురు స్టాంప్ వెండర్స్ నుంచి రూ. లక్షా 22 వేల 220 లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
స్టాంప్ వెండర్లకు సర్కారు షాక్!
సాక్షి, విజయవాడ బ్యూరో: రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ-స్టాంపింగ్ విధానం ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల దాదాపు 25 వేల మంది స్టాంప్ వెండర్లు ఉపాధి కోల్పోనున్నారు. చాలా ఏళ్లుగా అమల్లో ఉన్న చలానా పద్ధతిలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రైవేట్ సేవలకు ప్రభుత్వం తెరలేపింది. ముంబైకి చెందిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐ)కు ఈ-స్టాంపింగ్ విధానాన్ని అప్పగించేలా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని నెల రోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ-స్టాంపింగ్ విధానం ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. కర్ణాటకలో అనేక అవతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ-స్టాంపింగ్ అమలు కోసం ప్రైవేట్ ఏజెన్సీకి కమీషన్‌గా ఏటా రూ.25 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇకపై స్టాక్ హోల్టింగ్ కంపెనీ ప్రతినిధులు ఉంటారు. లావాదేవీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించినందుకు వారికి 0.65 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త విధానం అమలైతే తమ ఉపాధి దెబ్బతింటుందని రాష్ట్రంలో 25 వేల మంది స్టాంప్ వెండర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెండర్ల యూనియన్ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి మంత్రి కేఈ కృష్ణమూర్తిని కలిశారు. తమ ఇబ్బందులను తెలియజేశారు. అయితే, ఈ-స్టాంపింగ్‌పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, మీ ఉపాధి దెబ్బతింటే మేము ఏమీ చేయలేమని వారు చేతులెత్తేయడం గమనార్హం. వద్దన్న విధానమే ముద్దు రిజిస్ట్రేషన్ల శాఖలో కొన్నేళ్లుగా ఈ-స్టాంపింగ్ విధానాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. 2003లో టీడీపీ సర్కారు హయాంలో రూ.32 వేల కోట్ల తెల్గీ స్టాంపుల కుంభకోణం వెలుగుచూసింది. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి అక్రమాలపై సంచలనం రేగింది. ఈ నేపథ్యంలో 2004లో ఈ-స్టాంపింగ్ ప్రతిపాదనను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తిరస్కరించారు. వేలాది మంది స్టాంప్వెండర్ల పొట్టకొట్టే ఈ విధానాన్ని ఆయన అంగీకరించలేదు. ఇవేమీ పట్టని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఈ-స్టాంపింగ్ అమలుపై మంత్రివర్గ ఆమోదం తీసుకుంది. -
తప్పొకరిది.. శిక్ష మరొకరికి
ఫ్రాంకింగ్, స్టాంప్ పత్రాల కుంభకోణంలో విచిత్రం తప్పు చేసింది ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు కోర్టు చుట్టూ తిరుగుతోంది స్టాంపు వెండర్లు కరీంనగర్ అర్బన్ : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఫ్రాంకింగ్, స్టాంపు పత్రాల కుంభకోణంలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు చేసిన తప్పునకు స్టాంపు వెండర్లు శిక్ష అనుభవిస్తున్నారు. చలాన్ చెల్లించకుండా కొనుగోలు చేసిన పాపానికి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. హుజూరాబాద్, మంథని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన విజయ్‌భాస్కర్, సురేశ్ స్టాంపుల లోడింగ్ వ్యవహారంలో రూ. 9లక్షలు, స్టాంపుల విక్రయాలలో రూ.8 లక్షలకుపైగా కాజేసి జేబులు నింపుకున్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సురేశ్‌ను అరెస్టు చేశారు. భాస్కర్ మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. పాపం.. స్టాంప్ వెండర్స్ స్టాంపు పత్రాలు అమ్ముకుంటూ జీవనం సాగి స్తున్న వెండర్లు చేయని తప్పునకు ఇరుక్కుపోయారు. జిల్లాలోని శైలజ, రవీందర్, కిషన్, రామస్వామి లెసైన్సు పొంది అమ్మకాలు జరుపుతున్నారు. వీరు కొంతకాలంగా అమ్మకాలు సాగిస్తుండడంతో సదరు సీనియర్ అసిస్టెంట్లు పరిచయమయ్యారు. సాధారణంగా వీరు చలాన్ తీసి స్టాంపులు కొనుగోలు చేయాలి. కానీ సదరు సీనియర్ అసిస్టెంట్లను నమ్మి డబ్బులు వారికిచ్చి కొనుగోలు చేశారు. వారు చలాన్ తీయకుండా స్టాంపు పత్రాలు వీరికి అందజేశారు. విచారణలో ఈ విషయం వెలుగుచూడడంతో ఇప్పుడు వెండర్లు పోలీస్‌స్టేషన్, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు తిరిగి చెల్లించిన అధికారులు ఈ కుంభకోణం బయటకు రావడంతో సదరు అధికారులు డబ్బులు తిరిగి చెల్లించారు. స్టాం పు వెండర్ల నుంచి డబ్బులు రికవరీ చేసినట్లు చూపించారు. అయితే తమను అన్యాయంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని వెం డర్లు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశా రు. తప్పు చేయనిదే ఇద్దరు అధికారులు డబ్బులు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియదా? సాధారణంగా జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో ఫ్రాంకింగ్ మిషన్‌లో స్టాంపులు లోడింగ్ చేయా ల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన చాలన్లు చెల్లించారో లేదో ఆయన పరిశీలించాలి. అయితే సీనియర్ అసిస్టెంట్లను రిజిస్ట్రార్ నమ్మడంతోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు చర్చ సాగుతోంది.