దస్తావేజు లేఖర్ల వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
– ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు
– దస్తావేజు లేఖర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి
ఒంగోలు సబర్బన్ : దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ ధ్వజమెత్తారు. జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వేమూరి కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం దస్తావేజు లేఖర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం దస్తావేజు లేఖర్లపై కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తొలి నుంచి వస్తున్న దస్తావేజు లేకర్ల వ్యవస్థను రూపు మాపాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. స్థిరాస్తి విక్రయాలతో పాటు ఇతర రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్ ద్వారా చేయించుకోవాలని చూడటం ప్రజలను ఇబ్బంది పెట్టడమేనన్నారు.
రోడ్డున పడనున్న కుటుంబాలు
సంఘ రాష్ట్ర కార్యదర్శి జి.వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వందలాది మంది కుటుంబాలు ఏళ్ల తరబడి ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నాయని, రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తే ప్రజలు అవస్థలు పడటంతో పాటు దస్తావేజు లేఖర్లకు జీవనోపాధి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు పెళ్లూరి మాలకొండ నరసింహారావు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ సుబ్బారావు, సభ్యులు మహ్మద్, నాగభూషణంతో పాటు జిల్లా కార్యదర్శి శ్రీనివాస చక్రవర్తి, కోశాధికారి మహంకాళి వీరబ్రహ్మాచారి, ములుకుట్ల నాగేశ్వరరావు, అడపా శ్రీనివాసరెడ్డి, షేక్ ఇద్రీజ్, గౌరవాధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరావు, జీఎస్ భావనారాయణ, ఎస్‌కే దాదాసాహెబ్ పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షునిగా పెళ్లూరి మళ్లీ ఎన్నిక
దస్తావేజు లేఖర్ల జిల్లా సదస్సు సందర్భంగా పెళ్లూరి మాలకొండ నరసింహారావును మళ్లీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పెళ్లూరిని రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి తెలిపారు. ఆయనతో పాటు చీరాలకు చెందిన హేమారావును కూడా రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.