ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై అన్నీ అపోహలే | Indian Intellectual Forum On AP Land Titling Act | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై అన్నీ అపోహలే

Published Tue, Apr 30 2024 5:40 AM | Last Updated on Tue, Apr 30 2024 7:11 AM

ఇండియన్‌ ఇంటెలెక్చువల్‌ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో  మాట్లాడుతున్న సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లం

ఇండియన్‌ ఇంటెలెక్చువల్‌ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లం

రెవెన్యూ, న్యాయపరమైన అంశాలు తెలియనివారు మాట్లాడుతున్నారు

భూములు లాక్కుంటారనేది శుద్ధ అబద్ధం.. అందరితో సంప్రదించాకే చట్టం అమలు చేస్తాం 

టైట్లింగ్‌ యాక్ట్, రీ సర్వే, ఈ–స్టాంపింగ్‌ అద్భుతమైన సంస్కరణలు

స్టాంప్‌ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఈ–స్టాంపింగ్‌

ఇండియన్‌ ఇంటెలెక్చువల్‌ ఫోరం రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

సాక్షి, అమరావతి: ల్యాండ్‌టైట్లింగ్‌ చట్టంపై అవ­గాహన లేకుండా కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఇండియన్‌ ఇంటెలెక్చువల్‌ ఫోరం మండిపడింది. రెవెన్యూ, న్యాయపరమైన అంశాలు తెలియనివారు దీనిపై మాట్లాడుతున్నారని ధ్వజ­మెత్తింది. ప్రభుత్వం భూములు లాక్కుంటుందనేది శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం ఇండియన్‌ ఇంటెలెక్చువల్‌ ఫోరం ఆధ్వర్యంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లం, భూచట్టాల నిపుణుడు సునీల్‌ కుమార్, తది­తరులు పాల్గొన్నారు. 

అజేయ కల్లం మాట్లాడుతూ ఈ చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇక ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూముల రీ సర్వే పూర్తయ్యాక టైట్లింగ్‌ మొదలవుతుందని, అప్పుడే డిక్లరేషన్‌ జరుగుతుందన్నారు. తీసుకువచ్చే మార్పులు చేర్పుల గురించి కోర్టుకు తెలిపాక, అందరితో సంప్రదించాక ఈ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. టైట్లింగ్‌ యాక్ట్, రీ సర్వే, ఇ–స్టాంపింగ్‌ విధానాలు అద్భుతమైన సంస్కరణలని కొనియాడారు. 

ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్‌ టైటిల్స్‌ కోర్టులు ఇవ్వాలి తప్ప రెవెన్యూ శాఖకు ఏం పని అంటున్నారని, దీనిపై నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. ఆర్‌ఓఆర్‌ లేక ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం చేసే అధికారం కేవలం కార్వనిర్వాహక వ్యవస్థకే ఉంటుందన్నారు. కోర్టుల్లో కేవలం వివాదాల పరిష్కారానికి, వాటిపై అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. 

భూ రికార్డుల వ్యవస్థను భ్రష్టు పట్టించినవారే ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు తీసుకువస్తున్న ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1983 నుంచే భూ రికార్డుల వ్యవస్థ భ్రష్టు పట్టడం మొదలైందన్నారు. ప్రతి సంవత్సరం జమాబందీ, అజమాయిషీ సర్వేలు చేస్తూ కచ్చితమైన రికార్డుల వ్యవస్థగా ఉన్న కరణం వ్యవస్థను ప్రత్యామ్నాయం లేకుండా ఒక్కసారిగా రద్దు చేశారని విమర్శించారు. 

దీంతో పదేళ్లపాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకుండాపోయారన్నారు. దీనివల్లే వివాదాలు పెరిగాయని, నకిలీలు, రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థను తీసుకువçస్తుంటే దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

12కి పైగా రాష్ట్రాల్లో ఇ–స్టాంపింగ్‌ వ్యవస్థ 
తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాత కేంద్ర ప్రభుత్వం స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందని అజేయ కల్లం గుర్తు చేశారు. ఇప్పుడున్న స్టాంప్‌ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఆ సంస్థ ఇ–స్టాంపింగ్‌ వ్యవస్థను తెచ్చిందన్నారు. మహారాష్ట్రలో 2015లో ఈ విధానాన్ని తొలిసారి అమలు చేశారని, అది విజయవంతమయ్యాక ఇప్పుడు 12కిపైగా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. 2016లో మన రాష్ట్రంలోనూ తాను రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్‌ను ఆహ్వానించి పైలెట్‌ ప్రాజెక్టు చేయమన్నానని గుర్తు చేశారు. 

ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఇ–స్టాంపింగ్‌ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. దాని ట్రయల్స్‌ కోసం 16 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 135 డాక్యుమెంట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ మెమో ఇస్తే.. దానికి, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి లింకు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇ–స్టాంపులు జిరాక్స్‌ పేపర్లు కావన్నారు. అందులో నాన్‌–జ్యుడీషియల్‌ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు.

నల్లచట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరం: భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్‌
భూ చట్టాల నిపుణులు, నల్సార్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని నల్ల చట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం ద్వారా భూములు లాగేసుకుంటారని, కోర్టులకు అధికారాలు ఉండవని, అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్‌ రిజిస్టర్‌ అధికారికి ఇస్తున్నారని, ఆయన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారనే ప్రచారాలు పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. 

ఈ చట్టం అమలు జరగకపోతే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఉన్న భూములకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి హక్కులను కాపాడుతుందే తప్ప భూములను లాక్కునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఒక రిజిస్టర్‌ తయారు చేస్తుందని, దాన్ని ప్రజలందరికీ  అందుబాటులో పెడతారన్నారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. 

రీ సర్వే ద్వారా తయారయ్యే రికార్డును టైటిల్‌ రిజిస్టరింగ్‌ చట్టం కింద ప్రకటిస్తారని, అది ఆన్‌లైన్‌లో అందరికీ అందబాటులో ఉంటుందని వివరించారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనేది తప్పని, ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్న కేసులు అలాగే నడుస్తాయన్నారు. అలాగే భూములు అమ్మాలన్నా, దానం చేయాలన్నా టైటిల్‌ రిజిస్ట్రార్‌ అనుమతి కావాలనేది అపోహేనని తేల్చిచెప్పారు. 

కొత్త చట్టం తహశీల్దార్‌కి, సబ్‌ రిజిస్ట్రార్‌కి ఉన్న అధికారాలను ఒక చోటకు చేరుస్తుందన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ జరిగి రికార్డులోనూ మార్పు కూడా జరిగిపోతోందన్నారు. భూముల రీ సర్వే పూర్తయితే భూములకు సంబంధించి 80 రకాల సమస్యల్లో చాలావరకు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement