జీవో నంబర్ 1పై ఏఎన్‌యూలో మేధావుల ఐక్య వేదిక సమావేశం
ఏఎన్‌యూ: ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపాడేందుకు రోడ్లపై బహిరంగ సభల విషయంలో నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేధావుల ఐక్యవేదిక కొనియాడింది. జీవో నంబర్ 1లో బహిరంగ సమావేశాలు నిషేధమనే పదమే లేదని వక్తలు గుర్తు చేశారు. నియంత్రణకు, నిషేధానికి చాలా వ్యత్యాసం ఉందనేది గుర్తించాలని సూచించారు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. ప్రజా సంరక్షణ చర్యలు చేపట్టడం పాలకుల కనీస బాధ్యతనే విషయం మరిచిపోకూడదన్నారు.
ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం అమల్లోకి తెస్తే దానిపై అవగాహన కల్పించడం మీడియా బాధ్యత అని తెలిపారు. ఇలా కాకుండా ప్రభుత్వ నిర్ణయాలను భూతద్దంలో చూపుతూ.. ఇవి ప్రజలకు నష్టమన్నట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని.. ఇతరుల హక్కులు, స్వేచ్ఛ, ప్రాణాలను హరించకూడదని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ఆవశ్యకత, ఇందులోని అంశాలపై విద్యావేత్తలు, మేధావులు సమాజానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అలాగే పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా స్పందించాలని కోరారు. మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో బుధవారం జీవో నంబర్ 1పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే..
రాజకీయ కోణంలో చూడకూడదు..
సామాన్యుల ప్రాణాలు పరిరక్షించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను రాజకీయకోణంలో చూడటం సరికాదు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుంది? కందుకూరు, గుంటూరు ఘటనలపై పౌరహక్కులు, దళిత సంఘాలు కూడా స్పందించకపోవడం విచారకరం. ఇదే ఘటన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో జరిగితే అక్కడ సమాజమంతా గొంతెత్తేది. మరణించిన వారికి కనీసం సంతాప సభ కూడా నిర్వహించకపోవడం హర్షణీయమా? కనీసం భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగనీయబోమని ప్రకటించకుండా యధావిధిగా సభలు, సమావేశాలు నిర్వహించడం సరైన పనేనా? ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంపై మేధావులు సమాజానికి అవగాహన కల్పించాలి.
–ఆచార్య పి.రాజశేఖర్, వీసీ, ఏఎన్‌యూ
మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం..
సమాజానికి ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ ఉత్తర్వులపై సమాజానికి అవగాహన కల్పించడం విద్యావేత్తలు, మేధావుల బాధ్యత. ప్రభుత్వ ఉత్తర్వులపై మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం.
–ఆచార్య శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్, ఆర్కిటెక్చర్ కళాశాల, ఏఎన్‌యూ
ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయని గుర్తించాలి..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆసక్తి ఉన్నవారు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఆ నిర్ణయమే తప్పంటే ఎలా? ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయనేది గుర్తించాలి.
–ఆచార్య బి.కరుణ, రిజిస్ట్రార్, ఏఎన్‌యూ
ప్రభుత్వ చర్యను అందరూ హర్షించాలి..
సమాజంలోని పౌరులందరి హక్కులు, స్వేచ్ఛ కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను అందరూ హర్షించాలి.
– ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రెక్టార్, ఏఎన్‌యూ
ఎవరికీ ఇబ్బంది లేనిచోట నిర్వహించుకోవాలి..
ఎవరికీ ఇబ్బంది లేనిచోట బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలి. అసలు సమావేశాలే నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేస్తే ఇబ్బంది కానీ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా జరుపుకోండంటే తప్పెలా అవుతుంది?
– ఆచార్య కె.సునీత, ఓఎస్‌డీ, ఏఎన్‌యూ
ఈ జీవోతో ఇబ్బందులేమీ లేవు..
జీవో నంబర్ 1తో ఇబ్బందులేమీ లేవు. దీనిలోని వాస్తవాలను అందరూ గ్రహించాలి. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడే చర్యలను ఎవరు చేపట్టినా హర్షించాలి.
–ఆచార్య కె.మధుబాబు, డీన్, సీడీసీ, ఏఎన్‌యూ
Comments
Please login to add a commentAdd a comment