జీవో నంబర్ 1ని స్వాగతిస్తూ సంఘీభావం తెలుపుతున్న మేధావులు
ఏయూ క్యాంపస్: ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1 నిలుస్తుందని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. జీవోను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఎవరి స్వేచ్ఛను ప్రభుత్వం హరించలేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏయూ, విశాఖ నగర మేధావుల వేదిక సంయుక్తంగా బుధవారం ‘ప్రజల ప్రాణాలకు రక్ష జీవో నంబర్ 1’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి.
ప్రభుత్వం ప్రజల ప్రాణాలను రక్షించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకువచ్చిన జీవో ఇదని వక్తలు స్పష్టం చేశారు. దీన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది చిన్నారావు, డాక్టర్ ఎ.కె.ఎం.పవార్, ఆచార్య ఎన్.సత్యనారాయణ, డాక్టర్ రాజమాణిక్యం, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, డాక్టర్ బాలకోటయ్య, డాక్టర్ అంబేడ్కర్ రాజు, డాక్టర్ ఎ.సీతారత్నం, డాక్టర్ రాజ్‌కుమార్, తదితరులు ప్రసంగించారు.
జీవో నంబర్ 1 మన బాధ్యతను గుర్తు చేసింది. ఈ జీవోతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగదు.
– ఆచార్య జేమ్స్ స్టీఫెన్, అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్, ఏయూ
ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా సమావేశాలు పెట్టుకోవచ్చని జీవో స్పష్టం చేస్తోంది. దీన్ని వక్రీకరిస్తూ ఎమర్జెన్సీని తలపిస్తోందని ప్రచారం చేయడం సరికాదు.
– ఆచార్య కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్ కళాశాల
ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని జీవో స్పష్టం చేస్తోంది.
– ఆచార్య ఎన్.ఎ.డి.పాల్, బీసీడీఈ సమన్వయకర్త
విమర్శించే వ్యక్తులు ముందుగా జీవోను చదివి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది.
– ఆచార్య పి.విశ్వనాథం, గౌరవ ఆచార్యులు, డీసీఎంఎస్ విభాగం
ఏయూ మహిళా ఉద్యోగుల సంఘం తరఫున జీవో నంబర్ 1ని తాము స్వాగతిస్తున్నాం. ఇటువంటి జీవోలు ప్రజల రక్షణకు, భద్రతకు ఉపయుక్తంగా నిలుస్తాయి.
– ఆచార్య టి.శోభశ్రీ, ప్రిన్సిపాల్, ఐఏఎస్‌ఈ
జీవో నంబర్ 1 అప్రజాస్వామికం అనడం సరికాదు. కందుకూరు, గుంటూరు ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఈ జీవో తీసుకువచ్చారు.
– ఆచార్య పి.అర్జున్, గౌరవ ఆచార్యులు, సోషల్ వర్క్ విభాగం
నిషేధం, ఆంక్షలకు వ్యత్యాసం ఉందనే విషయాన్ని గమనించకుండా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈ జీవోపై వాస్తవాలు తెలిపే విధంగా విస్తృత చర్చలు జరపాలి.
– పాకా సత్యనారాయణ, న్యాయవాది
ప్రజల ప్రాణాలు ఎంతో ప్రధానం. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం అర్థరహితం.
– ఆచార్య విజయ్‌మోహన్, డీన్, విద్యార్థి వ్యవహారాలు
కొంత మంది ఏకపక్షంగా ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. ఇది సరికాదు.
– ఆచార్య ఎస్.పుల్లారావు, అర్థశాస్త్ర విభాగాధిపతి
అన్ని పార్టీలకు ఈ జీవో వర్తిస్తుంది, ఎక్కడా నిషేధం లేదు.. కేవలం నిబంధనలు మాత్రమే ఉన్నాయి. వీటిని అనుసరిస్తూ సమావేశాలు, ర్యాలీలు జరుపుకోవడానికి ఇబ్బంది ఏముంది?
– ఆచార్య ఎ.పల్లవి, క్రీడా విభాగాధిపతి, ఏయూ
Comments
Please login to add a commentAdd a comment