ఒకే క్లిక్‌తో భూమి భద్రం  | Telangana Govt Introduces Bills To Simplify Land Deals | Sakshi
Sakshi News home page

ఒకే క్లిక్‌తో భూమి భద్రం 

Published Thu, Sep 10 2020 2:14 AM | Last Updated on Thu, Sep 10 2020 7:47 AM

Telangana Govt Introduces Bills To Simplify Land Deals  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూమి హక్కుకు ‘కొత్త’కళ వచ్చింది. ‘రెవెన్యూ’పరిధులు, పరిమితులు నూతన బాట పట్టాయి. ఇకపై వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు ఒక చోటుకు, మ్యుటేషన్‌కు మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాయింట్‌ రిజిస్ట్రార్ల హోదాలో తహసీల్దార్లే ఆ రెండు పనులు చేసి రైతుకు వెంటనే పాసు పుస్తకం ఇచ్చేస్తారు. పంట రుణాల కోసం రైతులు పాసు పుస్తకాలను కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే అన్నీ చూసుకుని బ్యాంకర్లు రుణాలిస్తారు. డిజిటల్‌ రికార్డులే భూమిని భద్రంగా ఉంచుతాయి. బ్యాంకులకు భరోసా ఇస్తాయి. భూ వివాదాలకు, రెవెన్యూ విభాగానికి ఇక నుంచి సంబంధం ఉండదు. రెవెన్యూ కోర్టులన్నీరద్దయ్యాయి. ఇక భూమి హక్కుపై కిరికిరి వస్తే సివిల్‌ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకోవాల్సిందే. ధ్రువీకరణలు స్థానిక సంస్థల దారి మళ్లాయి. వీఆర్వోల వ్యవస్థ రద్దు, వీఆర్‌ఏలకు పేస్కేల్, ఇతర శాఖల్లో సమానశ్రేణిలో విలీనం. ఇదీ స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం. 

సాధికారతకు సాంకేతికత.... 
యాజమాన్య హక్కుల బదలాయింపు, పాస్‌ పుస్తకాల కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేసే పరిస్థితికి కొత్త చట్టంతో చెక్‌ పడింది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే మ్యుటేషన్‌ (భూ బదలాయింపు), పాస్‌ పుస్తకాన్ని అక్కడికక్కడే జారీ చేయనుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ మొదలు పాస్‌ పుస్తకం పంపిణీ, ధరణి వెబ్‌సైట్‌ రికార్డుల నమోదు వరకు అంతా చిటికెలోనే పూర్తి కానుంది. ఈ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితికి కూడా ఫుల్‌స్టాప్‌ పడింది. భూ లావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్‌/సబ్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలిచ్చి సేవలు పొందాలి. భూములను కుదవపెడితే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం, పట్టాదారు పాస్‌ పుస్తకం ఏకీకృతం చేయడం ద్వారా కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో రెవెన్యూ సేవలు అందుతాయి. రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్‌ విధానంలో రుణాలు అందనున్నాయి.  

‘ధరణి’మంత్రం... 
రెవెన్యూ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్న సర్కారు.. ఇకపై ప్రతి భూ లావాదేవీని ఆన్‌ లైన్‌ లోనే నిక్షిప్తం చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ధరణి వెబ్‌సైట్‌ సేవలు విస్తృతం చేయనుంది. భూముల క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు, ఈసీల మొదలు ప్రతీది ఈ పోర్టల్‌లోనే తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. ఈ మేరకు పార్ట్‌–ఏ(వ్యవసాయ), పార్ట్‌–బీ(వ్యవసాయేతర) భూములకు వేర్వేరు ధరణి పోర్టళ్లను రెండు విధాలుగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రభుత్వ, నిషేధిత, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఆటోమేటిక్‌ లాక్‌ వ్యవస్థను కూడా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుచనున్నారు. ప్రతి గ్రామంలోని భూ హక్కుల రికార్డును డిజిటల్‌ స్టోరేజ్‌ చేయనున్నారు. అలాగే ధరణి వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసే సమాచారాన్ని వేర్వేరు సర్వర్లలోనూ, వేర్వేరు చోట్ల భద్రపరచనున్నారు. 

తహసీల్దార్‌ కమ్‌ సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌... 
తహసీల్దార్‌ ఇక కొత్త అవతారమెత్తనున్నారు. ఇన్నాళ్లూ రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే ఈ అధికారి ఇకపై జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా సేవలందించనున్నారు. అంటే ఇక నుంచి తహసీల్దార్‌ కూడా రిజిస్ట్రేషన్లను చేయనున్నారన్నమాట. వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత సబ్‌ రిజిస్ట్రార్లే చక్కబెడతారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 530 మండలాల్లో రిజిస్రేషన్లు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారాలను తాజా చట్టం ద్వారా దాఖలుపరిచారు. డాక్యుమెంట్ల నమూనాలను నేరుగా క్రయవిక్రయదారులే వివరాలు పూరించి ఇచ్చే ఏర్పాటు కూడా ఏర్పాటు చేయనున్నారు.  

ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్‌.... 
రెవెన్యూ కోర్టుల కథ ముగిసింది. వీటిస్థానే ఫాస్ట్‌ ట్రాక్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు కానుంది. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ వరకు ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన ప్రభుత్వం.. వీటి పరిధిలో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్‌కు బదలాయించనుంది. ప్రతి వేయి కేసులకో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ కేసుల పరిష్కారానికి నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశించనుంది. తర్వాత ఈ ట్రిబ్యునళ్లను కూడా ఎత్తివేస్తారు. అనంతరం ఎలాంటి భూ వివాదాలకైనా న్యాయస్థానాలనే ఆశ్రయించాలి. ఈ ట్రిబ్యునల్‌కు రిటైర్డ్‌ జడ్జి లేదా ఇతర సభ్యులతో కూడిన కమిటీ ప్రాతినిథ్యం వహించనుంది. విచారణ తరువాత ట్రిబ్యునల్‌ ఉత్తర్వులే అంతిమం. 

వీఆర్‌ఏలకు పే స్కేల్‌.... 
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ)కు తీపి కబురు అందజేసింది. ఇప్పటివరకు గౌరవ వేతనంపై పనిచేస్తున్న వీఆర్‌ఏలకు ఇకపై అర్హతనుబట్టి పే స్కేల్‌ను వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 22,900 మంది పనిచేస్తుండగా.. పదో తరగతిని విద్యార్హతగా ప్రకటిస్తే సుమారు 8 నుంచి 10వేల మందికి పేస్కేల్‌ రానుంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.260 కోట్ల మేర భారం పడనుంది. కాగా, 5,480 మంది వీఆర్వోలతోపాటు వీరిని కూడా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వీఆర్‌ఏలలో కొందరి సేవలను మాత్రం రెవెన్యూశాఖలోనే వినియోగించుకోనుంది. 

‘స్థానికం’గానే కుల ధ్రవీకరణ.... 
ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపడింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వీరి నుంచి తప్పించిన ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలు, పుర/నగర పాలక సంస్థల్లోనే కులధ్రువీకరణ పత్రాలను అందజేయనుంది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే, ఇతర సర్వే ఆధారంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆదాయ వనరులు, ఆస్తుల సమాచారం ఉన్నందున.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు ఈ డేటాబేస్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఇతర రాష్ట్రాలు గనుక అభ్యంతరం తెలిపిన పక్షంలో వీటిని అప్పటికప్పుడు జారీ చేసే అధికారాలను తహసీల్దార్లకు దాఖలుపరిచారు.  

మరికొన్ని ముఖ్యాంశాలు.. 

  • భూమి హక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్‌ చర్యలతోపాటు సర్వీసు నుంచి తొలగింపు(భర్తరఫ్, శిక్ష). 
  • కొత్త చట్టం వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది. 
  • పట్టాదారు పాస్‌ పుస్తకం హక్కు పత్రంగా పరిగణన. 
  • కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. 
  • ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు. 
  • పాయిగా, జాగీరు, సంస్థానాలు, మక్తా, ఉహ్మ్లి, ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు. 
  • జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి. 
  • ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి. ఒకవేళ సయోధ్య కుదరకపోతే నిర్ణీత గడువు తర్వాత ఆ భూమిని లాక్‌లో పెడతారు. 
  • ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. జారీ చేసిన చేసిన తహసీల్దార్‌ను బర్తరఫ్‌ చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు పెడతారు. అలాగే తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటారు. 
  • కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారిపై ఎటువంటి దావా వేసే వీలులేదు. 
  • ఇప్పటివరకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంది. 
  • వ్యవసాయ రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు. ఇది సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1908 కింద విచారణకు అర్హత ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement