Land mutation
-
ఒకే క్లిక్‌తో భూమి భద్రం
సాక్షి, హైదరాబాద్: భూమి హక్కుకు ‘కొత్త’కళ వచ్చింది. ‘రెవెన్యూ’పరిధులు, పరిమితులు నూతన బాట పట్టాయి. ఇకపై వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు ఒక చోటుకు, మ్యుటేషన్‌కు మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాయింట్ రిజిస్ట్రార్ల హోదాలో తహసీల్దార్లే ఆ రెండు పనులు చేసి రైతుకు వెంటనే పాసు పుస్తకం ఇచ్చేస్తారు. పంట రుణాల కోసం రైతులు పాసు పుస్తకాలను కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే అన్నీ చూసుకుని బ్యాంకర్లు రుణాలిస్తారు. డిజిటల్ రికార్డులే భూమిని భద్రంగా ఉంచుతాయి. బ్యాంకులకు భరోసా ఇస్తాయి. భూ వివాదాలకు, రెవెన్యూ విభాగానికి ఇక నుంచి సంబంధం ఉండదు. రెవెన్యూ కోర్టులన్నీరద్దయ్యాయి. ఇక భూమి హక్కుపై కిరికిరి వస్తే సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకోవాల్సిందే. ధ్రువీకరణలు స్థానిక సంస్థల దారి మళ్లాయి. వీఆర్వోల వ్యవస్థ రద్దు, వీఆర్ఏలకు పేస్కేల్, ఇతర శాఖల్లో సమానశ్రేణిలో విలీనం. ఇదీ స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం. సాధికారతకు సాంకేతికత.... యాజమాన్య హక్కుల బదలాయింపు, పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేసే పరిస్థితికి కొత్త చట్టంతో చెక్ పడింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే మ్యుటేషన్ (భూ బదలాయింపు), పాస్ పుస్తకాన్ని అక్కడికక్కడే జారీ చేయనుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ మొదలు పాస్ పుస్తకం పంపిణీ, ధరణి వెబ్సైట్ రికార్డుల నమోదు వరకు అంతా చిటికెలోనే పూర్తి కానుంది. ఈ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితికి కూడా ఫుల్స్టాప్ పడింది. భూ లావాదేవీలకు వెబ్సైట్ ద్వారా స్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్/సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సమయానికి పత్రాలిచ్చి సేవలు పొందాలి. భూములను కుదవపెడితే ధరణి వెబ్సైట్లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం, పట్టాదారు పాస్ పుస్తకం ఏకీకృతం చేయడం ద్వారా కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ సేవలు అందుతాయి. రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్ విధానంలో రుణాలు అందనున్నాయి. ‘ధరణి’మంత్రం... రెవెన్యూ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్న సర్కారు.. ఇకపై ప్రతి భూ లావాదేవీని ఆన్ లైన్ లోనే నిక్షిప్తం చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ధరణి వెబ్సైట్ సేవలు విస్తృతం చేయనుంది. భూముల క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు, ఈసీల మొదలు ప్రతీది ఈ పోర్టల్‌లోనే తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. ఈ మేరకు పార్ట్–ఏ(వ్యవసాయ), పార్ట్–బీ(వ్యవసాయేతర) భూములకు వేర్వేరు ధరణి పోర్టళ్లను రెండు విధాలుగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రభుత్వ, నిషేధిత, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఆటోమేటిక్ లాక్ వ్యవస్థను కూడా ఈ వెబ్సైట్లో పొందుపరుచనున్నారు. ప్రతి గ్రామంలోని భూ హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయనున్నారు. అలాగే ధరణి వెబ్సైట్లో నిక్షిప్తం చేసే సమాచారాన్ని వేర్వేరు సర్వర్లలోనూ, వేర్వేరు చోట్ల భద్రపరచనున్నారు. తహసీల్దార్ కమ్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్... తహసీల్దార్ ఇక కొత్త అవతారమెత్తనున్నారు. ఇన్నాళ్లూ రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే ఈ అధికారి ఇకపై జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందించనున్నారు. అంటే ఇక నుంచి తహసీల్దార్ కూడా రిజిస్ట్రేషన్లను చేయనున్నారన్నమాట. వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్లే చక్కబెడతారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 530 మండలాల్లో రిజిస్రేషన్లు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారాలను తాజా చట్టం ద్వారా దాఖలుపరిచారు. డాక్యుమెంట్ల నమూనాలను నేరుగా క్రయవిక్రయదారులే వివరాలు పూరించి ఇచ్చే ఏర్పాటు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్.... రెవెన్యూ కోర్టుల కథ ముగిసింది. వీటిస్థానే ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ వరకు ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన ప్రభుత్వం.. వీటి పరిధిలో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్‌కు బదలాయించనుంది. ప్రతి వేయి కేసులకో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ కేసుల పరిష్కారానికి నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశించనుంది. తర్వాత ఈ ట్రిబ్యునళ్లను కూడా ఎత్తివేస్తారు. అనంతరం ఎలాంటి భూ వివాదాలకైనా న్యాయస్థానాలనే ఆశ్రయించాలి. ఈ ట్రిబ్యునల్‌కు రిటైర్డ్ జడ్జి లేదా ఇతర సభ్యులతో కూడిన కమిటీ ప్రాతినిథ్యం వహించనుంది. విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులే అంతిమం. వీఆర్ఏలకు పే స్కేల్.... గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ)కు తీపి కబురు అందజేసింది. ఇప్పటివరకు గౌరవ వేతనంపై పనిచేస్తున్న వీఆర్ఏలకు ఇకపై అర్హతనుబట్టి పే స్కేల్‌ను వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 22,900 మంది పనిచేస్తుండగా.. పదో తరగతిని విద్యార్హతగా ప్రకటిస్తే సుమారు 8 నుంచి 10వేల మందికి పేస్కేల్ రానుంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.260 కోట్ల మేర భారం పడనుంది. కాగా, 5,480 మంది వీఆర్వోలతోపాటు వీరిని కూడా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వీఆర్ఏలలో కొందరి సేవలను మాత్రం రెవెన్యూశాఖలోనే వినియోగించుకోనుంది. ‘స్థానికం’గానే కుల ధ్రవీకరణ.... ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపడింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వీరి నుంచి తప్పించిన ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలు, పుర/నగర పాలక సంస్థల్లోనే కులధ్రువీకరణ పత్రాలను అందజేయనుంది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే, ఇతర సర్వే ఆధారంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆదాయ వనరులు, ఆస్తుల సమాచారం ఉన్నందున.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు ఈ డేటాబేస్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఇతర రాష్ట్రాలు గనుక అభ్యంతరం తెలిపిన పక్షంలో వీటిని అప్పటికప్పుడు జారీ చేసే అధికారాలను తహసీల్దార్లకు దాఖలుపరిచారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. భూమి హక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతోపాటు సర్వీసు నుంచి తొలగింపు(భర్తరఫ్, శిక్ష). కొత్త చట్టం వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది. పట్టాదారు పాస్ పుస్తకం హక్కు పత్రంగా పరిగణన. కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు. పాయిగా, జాగీరు, సంస్థానాలు, మక్తా, ఉహ్మ్లి, ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి. ఒకవేళ సయోధ్య కుదరకపోతే నిర్ణీత గడువు తర్వాత ఆ భూమిని లాక్‌లో పెడతారు. ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. జారీ చేసిన చేసిన తహసీల్దార్‌ను బర్తరఫ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతారు. అలాగే తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటారు. కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారిపై ఎటువంటి దావా వేసే వీలులేదు. ఇప్పటివరకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంది. వ్యవసాయ రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు. ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది. -
సర్కారీ భూములన్నీ స్వాహా!
సాక్షి, అమరావతి : మొన్న రాజధాని భూముల కుంభకోణం.. నిన్న విశాఖ భూముల మాయాజాలం.. మధ్యలో సదావర్తి గుడి భూముల స్కామ్... రాష్ట్రంలో వీట న్నింటినీ తలదన్నే రీతిలో మరో భారీ భూ కుంభకోణం జరుగుతోంది. శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలన్నది నానుడి. అయితే అధికారపార్టీ నేతలు మాత్రం సర్కారు భూములను కైంకర్యం చేయడానికి సవాలక్ష ఎత్తులు వేస్తున్నారు. ‘డీమ్డ్ మ్యుటేషన్ల’ ముసుగులో భారీగా భూములు కొల్లగొడుతున్నారు. ఇందుకు సూత్రధారులు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కాగా పాత్రధారులు క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు. సామదాన భేద దండోపాయాలతో కొంతమంది అధికారులను లొంగదీసుకుంటున్న నాయకులు ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. నాలుగునెలల వ్యవధిలో 1.17 లక్షల డీమ్డ్ మ్యుటేషన్లు జరిగాయంటే రాష్ట్రంలో సర్కారీ భూములను ఏ స్థాయిలో కైంకర్యం చేసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ డీమ్డ్ మ్యుటేషన్లంటే ఏమిటి? అధికారపార్టీ నాయకులు వీటిని వరంలా ఎలా మార్చుకున్నారో వివరంగా చూద్దాం.. మ్యుటేషన్.. డీమ్డ్ మ్యుటేషన్... తాజా మార్పులకు అనుగుణంగా భూ యాజమాన్య రికార్డులను సవరించడాన్ని ‘మ్యుటేషన్’ అంటారు. వంశపారంపర్యంగా, లేదా కొనుగోలు ద్వారా వచ్చిన భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలంటూ రెవెన్యూ శాఖకు మీసేవ కేంద్రాల ద్వారా పెద్ద సంఖ్యలో అర్జీలు వస్తుంటాయి. కొంతమంది తప్పుడు రికార్డులు సృష్టించి ప్రభుత్వ భూములు తమవంటూ రికార్డుల సవరణ కోసం దరఖాస్తులు చేస్తుంటారు. భూ యాజమాన్య హక్కుల ప్రత్రం (1–బి), భూ అనుభవ పుస్తకం (అడంగల్) తదితర రెవెన్యూ రికార్డుల్లో యజమాని పేరును, లేదా విస్తీర్ణాన్ని మార్చడాన్ని, అదనంగా సర్వే నంబర్లను చేర్చుతూ సవరణలు చేయడాన్ని రెవెన్యూ పరిభాషలో మ్యుటేషన్ అని అంటారు. ఉదాహరణకు కృష్ణా జిల్లా నందిగామ మండలం పరిటాల గ్రామంలోని 120 సర్వే నంబరులో పది ఎకరాల భూమి ప్రభుత్వానిది అని రెవెన్యూ రికార్డుల్లో ఉందనుకుందాం. ఈ భూమి వంశపారంపర్యంగా తనదని, అందువల్ల రికార్డులను సరిచేసి ఈ భూమి యజమానిగా తన పేరు నమోదు చేయాలంటూ నారాయణ అనే వ్యక్తి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారనుకుందాం. ఇలా వచ్చిన అర్జీని తహశీల్దారు పరిశీలించి రికార్డులను సరిచూసి వాస్తవాలు నిర్ధారించి 21 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. అర్జీలోని వివరాలు తప్పయితే తిరస్కరించాలి. వాస్తవమైతే తదనుగుణంగా మార్పు చేర్పులు (మ్యుటేషన్) చేయాలి. ఇలా తహసీల్దారు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయని ఆమోదించి సంతకంతో చేసిన మ్యుటేషన్ల విషయంలో ఏమైనా తప్పులు జరిగినట్లు భవిష్యత్తు విచారణల్లో తేలితే వారిపై చర్యలు తీసుకోవచ్చు. అర్జీ వచ్చిన నెల రోజుల్లోగా పరిష్కరించని పక్షంలో డీమ్డ్ (ఆటోమేటిక్) మ్యుటేషన్ అయిపోతుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇలాంటి మ్యుటేషన్లకు తహసీల్దార్ల బాధ్యత ఉండదని అధికారులు అంటున్నారు. అందుకే చాలామంది నాయకులు తహసీల్దార్లను నయానో భయానో లొంగదీసుకుని సర్కారు భూములను ఆటోమేటిక్ మ్యుటేషన్ల ఖాతాలో వేసేలా చేస్తున్నారు. ఆ లొసుగే వారికి ఆసరా.. ‘నెల రోజులు దాటి పెండింగులో ఉన్న దరఖాస్తులు ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లే. ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు (మ్యుటేషన్) చేయాలి..’ అనే ఉత్తర్వులను కొందరు నాయకులు వరంగా మార్చుకుని ప్రభుత్వ భూములను తమ పేర్లతో రికార్డుల్లో నమోదు చేయించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారమంతా అధికారపార్టీ నాయకుల మోసపూరిత వైఖరితో పక్కా స్కెచ్‌తో సాగుతోంది. ‘డీమ్డ్’ ఉత్తర్వుల్లోని ఈ లొసుగును అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా ప్రభుత్వ భూములను సంపన్నులు, అధికార పార్టీకి చెందిన బడా, చోటా మోటా నాయకులు తమ పేరుతో రాయించుకుంటున్నారు. నాలుగునెలల్లో 1.17 డీమ్డ్ మ్యుటేషన్లు.. డీమ్డ్ మ్యుటేషన్ల కుంభకోణం ఇటీవల బయటపడిన విశాఖ జిల్లా భూ కుంభకోణాన్ని మించిపోయేలా ఉందని రెవెన్యూవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కేవలం మూడు, నాలుగు నెలల స్వల్ప కాలంలో ఏకంగా 1.17 లక్షల మ్యుటేషన్లు డీమ్డ్ ఖాతాలో జరిగిపోయాయి. తాజాగా తహసీల్దార్లతో రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు జరిపిన సమీక్షలో డీమ్డ్ మ్యుటేషన్ల అంశం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ‘ ఇలా మీరు పరిశీలించి, ఆమోదించకుండా.. కావాలనే జాప్యం చేసి.. దరఖాస్తును పక్కన పెట్టి.. జీవోను అడ్డం పెట్టుకుని.. డీమ్డ్ మ్యుటేషన్లు చేయడం దారుణం. ఇక నుంచి కచ్చితంగా ఇలా జరగకుండా చూడండి. మాచేతికి మకిలి అంటదనే చందంగా మీరు (తహశీల్దార్లు) వ్యవహరిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి విధానం కాదు...’ అని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అధికారికంగా బయటకు చెప్పకపోయినా ఇందులో భారీ అక్రమాలు (సరిదిద్దుకోలేని తప్పులు) జరిగిపోయాయని రెవెన్యూ శాఖలో వినిపిస్తోంది. తహశీల్దార్లపై తీవ్ర స్థాయిలో వత్తిళ్లు.. రకరకాలుగా ప్రలోభపెట్టి, అనేక రకాలుగా బెదిరించి తహశీల్దార్లపై తీవ్ర స్థాయిలో వత్తిడి తెచ్చి అధికారపార్టీ నేతలు తామనుకున్నది సాధించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోని ఒక తహశీల్దారును అధికార పార్టీ మండల నాయకుడు కలిసి ‘నీకు ఇవ్వాల్సింది ఇస్తాను. నీకూ ప్రొటోకాల్, ఇతర ఖర్చులు ఉంటాయి కదా. ఆ పది ఎకరాలు నాపేరుతో ఎక్కించు ఏమీ కాకుండా చూసుకుంటా...’ అని చెప్పారు. ‘ప్రభుత్వ భూమి మాదంటూ మీరు తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేస్తే దానిని మేము ఆమోదించడం సరికాదు.. రేపు విచారణ జరిగితే దొరికిపోతాం.’ అని ఆ అధికారి తెలిపారు. ‘ఎందుకు ఆందోళన? మా దరఖాస్తు ఆమోదించకుండా గడువు ముగిసే (నెల రోజులు దాటే) వరకూ పెండింగులో పెట్టు. తర్వాత డీమ్డ్ (ఆటోమేటిక్) మ్యుటేషన్ కింద రెవెన్యూ రికార్డుల్లో ఆ భూ యాజమాన్య హక్కులు మాకు దక్కేలా నమోదు చేయి..’ అని తహశీల్దారుపై సదరు నాయకుడు వత్తిడితెచ్చారు. ఆ నాయకుడిని ఎదిరించలేక.. ఏమీ చేయలేక ఆ తహశీల్దారు ఆయన చెప్పినట్లే చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఓ సీనియర్ అధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ‘‘చాలా చోట్ల ఇదే తంతు సాగుతోంది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. బయటకు చెప్పలేకపోతున్నాం గానీ ఈ వ్యవహారంలో భారీ భూకుంభకోణం సాగుతున్నట్లు స్పష్టమవుతోంది ’’ అన్నారు. ‘‘వాస్తవంగా ఇలాంటి జీవో జారీ చేయడమే తప్పు.. మ్యూటేషన్ దరఖాస్తులు నిర్దిష్ట గడువులోగా పరిశీలించి.. పరిష్కరించాలని జీవో ఉండాలి. కానీ దీనికి భిన్నమైన స్ఫూర్తితో జీవో ఇచ్చారు.’’ అని ఆ అధికారి వివరించారు. అన్ని జిల్లాల్లో అదే తీరు... నెల్లూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలు భారీగా ప్రభుత్వ భూములను అనుచరుల పేర్లతో సొంతం చేసుకున్నారు. ఇతర నాయకులు, వారి అనుచరులు కూడా ఇదే బాటలో సర్కారు భూములను మాయం చేశారు. ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కూడా భారీ భూ అక్రమాలు జరిగాయి. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో ఒక టీడీపీ నాయకుడు బినామీ పేర్లతో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న నేపథ్యంలో భూముల ధరలు పెరిగాయి. విశాఖపట్నానికి సమీపంలో విమానాశ్రయానికి దగ్గరలోని భూమిని ఒక మంత్రి బినామీ పేర్లతో భారీగా కైవసం చేసుకున్నారని అధికారులు అంటున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి మోసాలు అధికంగా జరిగాయి. ఈ జిల్లాలో మొత్తం మ్యుటేషన్లలో 29.53 శాతం డీమ్డ్ ఖాతాలోనివే కావడాన్ని అధికారులు ఎత్తిచూపుతున్నారు. అక్రమాలు ఎక్కువగా జరిగాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా అక్రమాలు అధికంగానే సాగాయి. ఈ జిల్లాలో 25.74 శాతం డీమ్డ్ మ్యుటేషన్లు జరిగాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో సుమారు 19 శాతం మ్యుటేషన్లు అధికారుల అనుమతితో సంబంధం లేకుండా జరిగిపోయాయి. ‘భూమి ఎవరిది? ఏమిటి? ఆధారాలున్నాయా? అనే అంశాలతో సంబంధం లేకుండా గత మూడు, నాలుగు నెలల్లో 1.17 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. అంటే ఎన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఇందులో ప్రయివేటు వ్యక్తుల ఖాతాల్లో చేరిపోయాయో లెక్కకు అందడం లేదని, ఒకవేళ విచారణ జరిపినా ఆధారాలు లేకుండా చేసేసి ఉంటారు....’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. -
ఏసీబీ వలలో రొంపల్లి వీఆర్ఓ
బంట్వారం: భూమి మ్యుటేషన్ కోసం ఓ రైతు నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటూ రొంపల్లి వీఆర్ఓ శివకుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, బాధితుడి కథనం ప్రకారం.. మండల పరిధిలోని రొంపల్లి గ్రామానికి చెందిన దరిపురం నర్సింలు గతేడాది మే నెలలో రెండెకరాల 32 గుంటాల పొలాన్ని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసి తన భార్య శశికళ పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. భూమి మ్యుటేషన్(మార్పిడి) కోసం ఆయన అదే నెల 30న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన పత్రాలను బంట్వారం తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించా డు. దీనిపై విచారణ జరిపి మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ రొంపల్లి వీఆర్ఓ శివకుమార్‌కు సూచించారు. వీఆర్ఓ శివకుమార్ 6 నెలలుగా రైతు నర్సింలును కార్యాలయానికి తిప్పించుకున్నాడు. దీంతో విసుగు చెందిన నర్సింలు ఈనెల 27న వీఆర్ఓను గట్టిగా ప్రశ్నించగా.. డబ్బులు ఇవ్వందే పనులు ఎలా చేస్తారు..? అంటూ సమాధానమిచ్చాడు. రూ. 6 వేలు లంచంగా ఇస్తే పని అవుతుందని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని నర్సింలు వీఆర్ఓను బతిమాలాడు. చేసేది లేక చివరికి రూ.4 వేలు ఇస్తానని అంగీకరించాడు. వీఆర్ఓ తీరుతో విసుగు చెందిన రైతు రెండు రోజుల క్రితం నగరంలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు గురువారం నర్సింలు వీఆర్వోకు డబ్బులిచ్చేందుకు బంట్వారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. ఓ గదిలో ఉన్న వీఆర్ఓ శివకుమార్ దగ్గరకు వెళ్లగా జనాలు ఎక్కువగా కనిపించారు. కొద్దిసేపు నిరీక్షించమంటూ వీఆర్ఓ రైతు నర్సింలుకు కనుసైగ చేశాడు. అందరూ వెళ్లిపోయాక నర్సింలు రూ. 3 వేలు వీఆర్ఓ శివకుమార్ చేతికిచ్చాడు. రూ. 4 వేలు చెప్పాను కదా అంటూ వీఆర్ఓ నర్సింలును గద్దించాడు. ‘నా దగ్గర ఇంతే ఉన్నాయి సార్..’ అంటూ నర్సింలు ప్రాధేయపడడంతో వీఆర్ఓ డబ్బులు తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే మాటువేసిన హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, సునీల్‌లు వీఆర్ఓ శివకుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో చేతులను కెమిక ల్తో పరీక్షించగా డబ్బులు తీసుకున్నట్లుగా తేలింది. కోర్టులో హాజరుపరుస్తాం.. వీఆర్ఓ శివకుమార్ రైతు నర్సింలు నుంచి రూ.3 వేలు తీసుకున్నట్లు నిర్ధారణ జరిగిందని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. లంచగొండి వీఆర్ఓను శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అవినీతి అధికారుల గురించి 9440446140 నంబర్లో సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఏసీబీ అధికారులకు వీఆర్వో పట్టుబడడం స్థానికంగా కలకలం రేగింది. ఎక్కడ చూసినా జనం ఈ విషయమే చర్చించుకుంటూ కనిపించారు.