సాక్షి, అమరావతి : మొన్న రాజధాని భూముల కుంభకోణం.. నిన్న విశాఖ భూముల మాయాజాలం.. మధ్యలో సదావర్తి గుడి భూముల స్కామ్... రాష్ట్రంలో వీట న్నింటినీ తలదన్నే రీతిలో మరో భారీ భూ కుంభకోణం జరుగుతోంది. శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలన్నది నానుడి. అయితే అధికారపార్టీ నేతలు మాత్రం సర్కారు భూములను కైంకర్యం చేయడానికి సవాలక్ష ఎత్తులు వేస్తున్నారు. ‘డీమ్డ్ మ్యుటేషన్ల’ ముసుగులో భారీగా భూములు కొల్లగొడుతున్నారు. ఇందుకు సూత్రధారులు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కాగా పాత్రధారులు క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు. సామదాన భేద దండోపాయాలతో కొంతమంది అధికారులను లొంగదీసుకుంటున్న నాయకులు ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. నాలుగునెలల వ్యవధిలో 1.17 లక్షల డీమ్డ్ మ్యుటేషన్లు జరిగాయంటే రాష్ట్రంలో సర్కారీ భూములను ఏ స్థాయిలో కైంకర్యం చేసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ డీమ్డ్ మ్యుటేషన్లంటే ఏమిటి? అధికారపార్టీ నాయకులు వీటిని వరంలా ఎలా మార్చుకున్నారో వివరంగా చూద్దాం..
మ్యుటేషన్.. డీమ్డ్ మ్యుటేషన్...
తాజా మార్పులకు అనుగుణంగా భూ యాజమాన్య రికార్డులను సవరించడాన్ని ‘మ్యుటేషన్’ అంటారు. వంశపారంపర్యంగా, లేదా కొనుగోలు ద్వారా వచ్చిన భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలంటూ రెవెన్యూ శాఖకు మీసేవ కేంద్రాల ద్వారా పెద్ద సంఖ్యలో అర్జీలు వస్తుంటాయి. కొంతమంది తప్పుడు రికార్డులు సృష్టించి ప్రభుత్వ భూములు తమవంటూ రికార్డుల సవరణ కోసం దరఖాస్తులు చేస్తుంటారు. భూ యాజమాన్య హక్కుల ప్రత్రం (1–బి), భూ అనుభవ పుస్తకం (అడంగల్) తదితర రెవెన్యూ రికార్డుల్లో యజమాని పేరును, లేదా విస్తీర్ణాన్ని మార్చడాన్ని, అదనంగా సర్వే నంబర్లను చేర్చుతూ సవరణలు చేయడాన్ని రెవెన్యూ పరిభాషలో మ్యుటేషన్ అని అంటారు.
ఉదాహరణకు కృష్ణా జిల్లా నందిగామ మండలం పరిటాల గ్రామంలోని 120 సర్వే నంబరులో పది ఎకరాల భూమి ప్రభుత్వానిది అని రెవెన్యూ రికార్డుల్లో ఉందనుకుందాం. ఈ భూమి వంశపారంపర్యంగా తనదని, అందువల్ల రికార్డులను సరిచేసి ఈ భూమి యజమానిగా తన పేరు నమోదు చేయాలంటూ నారాయణ అనే వ్యక్తి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారనుకుందాం. ఇలా వచ్చిన అర్జీని తహశీల్దారు పరిశీలించి రికార్డులను సరిచూసి వాస్తవాలు నిర్ధారించి 21 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. అర్జీలోని వివరాలు తప్పయితే తిరస్కరించాలి. వాస్తవమైతే తదనుగుణంగా మార్పు చేర్పులు (మ్యుటేషన్) చేయాలి. ఇలా తహసీల్దారు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయని ఆమోదించి సంతకంతో చేసిన మ్యుటేషన్ల విషయంలో ఏమైనా తప్పులు జరిగినట్లు భవిష్యత్తు విచారణల్లో తేలితే వారిపై చర్యలు తీసుకోవచ్చు. అర్జీ వచ్చిన నెల రోజుల్లోగా పరిష్కరించని పక్షంలో డీమ్డ్ (ఆటోమేటిక్) మ్యుటేషన్ అయిపోతుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇలాంటి మ్యుటేషన్లకు తహసీల్దార్ల బాధ్యత ఉండదని అధికారులు అంటున్నారు. అందుకే చాలామంది నాయకులు తహసీల్దార్లను నయానో భయానో లొంగదీసుకుని సర్కారు భూములను ఆటోమేటిక్ మ్యుటేషన్ల ఖాతాలో వేసేలా చేస్తున్నారు.
ఆ లొసుగే వారికి ఆసరా..
‘నెల రోజులు దాటి పెండింగులో ఉన్న దరఖాస్తులు ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లే. ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు (మ్యుటేషన్) చేయాలి..’ అనే ఉత్తర్వులను కొందరు నాయకులు వరంగా మార్చుకుని ప్రభుత్వ భూములను తమ పేర్లతో రికార్డుల్లో నమోదు చేయించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారమంతా అధికారపార్టీ నాయకుల మోసపూరిత వైఖరితో పక్కా స్కెచ్‌తో సాగుతోంది. ‘డీమ్డ్’ ఉత్తర్వుల్లోని ఈ లొసుగును అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా ప్రభుత్వ భూములను సంపన్నులు, అధికార పార్టీకి చెందిన బడా, చోటా మోటా నాయకులు తమ పేరుతో రాయించుకుంటున్నారు.
నాలుగునెలల్లో 1.17 డీమ్డ్ మ్యుటేషన్లు..
డీమ్డ్ మ్యుటేషన్ల కుంభకోణం ఇటీవల బయటపడిన విశాఖ జిల్లా భూ కుంభకోణాన్ని మించిపోయేలా ఉందని రెవెన్యూవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కేవలం మూడు, నాలుగు నెలల స్వల్ప కాలంలో ఏకంగా 1.17 లక్షల మ్యుటేషన్లు డీమ్డ్ ఖాతాలో జరిగిపోయాయి. తాజాగా తహసీల్దార్లతో రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు జరిపిన సమీక్షలో డీమ్డ్ మ్యుటేషన్ల అంశం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ‘ ఇలా మీరు పరిశీలించి, ఆమోదించకుండా.. కావాలనే జాప్యం చేసి.. దరఖాస్తును పక్కన పెట్టి.. జీవోను అడ్డం పెట్టుకుని.. డీమ్డ్ మ్యుటేషన్లు చేయడం దారుణం. ఇక నుంచి కచ్చితంగా ఇలా జరగకుండా చూడండి. మాచేతికి మకిలి అంటదనే చందంగా మీరు (తహశీల్దార్లు) వ్యవహరిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి విధానం కాదు...’ అని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అధికారికంగా బయటకు చెప్పకపోయినా ఇందులో భారీ అక్రమాలు (సరిదిద్దుకోలేని తప్పులు) జరిగిపోయాయని రెవెన్యూ శాఖలో వినిపిస్తోంది.
తహశీల్దార్లపై తీవ్ర స్థాయిలో వత్తిళ్లు..
రకరకాలుగా ప్రలోభపెట్టి, అనేక రకాలుగా బెదిరించి తహశీల్దార్లపై తీవ్ర స్థాయిలో వత్తిడి తెచ్చి అధికారపార్టీ నేతలు తామనుకున్నది సాధించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోని ఒక తహశీల్దారును అధికార పార్టీ మండల నాయకుడు కలిసి ‘నీకు ఇవ్వాల్సింది ఇస్తాను. నీకూ ప్రొటోకాల్, ఇతర ఖర్చులు ఉంటాయి కదా. ఆ పది ఎకరాలు నాపేరుతో ఎక్కించు ఏమీ కాకుండా చూసుకుంటా...’ అని చెప్పారు. ‘ప్రభుత్వ భూమి మాదంటూ మీరు తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేస్తే దానిని మేము ఆమోదించడం సరికాదు.. రేపు విచారణ జరిగితే దొరికిపోతాం.’ అని ఆ అధికారి తెలిపారు. ‘ఎందుకు ఆందోళన? మా దరఖాస్తు ఆమోదించకుండా గడువు ముగిసే (నెల రోజులు దాటే) వరకూ పెండింగులో పెట్టు. తర్వాత డీమ్డ్ (ఆటోమేటిక్) మ్యుటేషన్ కింద రెవెన్యూ రికార్డుల్లో ఆ భూ యాజమాన్య హక్కులు మాకు దక్కేలా నమోదు చేయి..’ అని తహశీల్దారుపై సదరు నాయకుడు వత్తిడితెచ్చారు. ఆ నాయకుడిని ఎదిరించలేక.. ఏమీ చేయలేక ఆ తహశీల్దారు ఆయన చెప్పినట్లే చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని ఓ సీనియర్ అధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ‘‘చాలా చోట్ల ఇదే తంతు సాగుతోంది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. బయటకు చెప్పలేకపోతున్నాం గానీ ఈ వ్యవహారంలో భారీ భూకుంభకోణం సాగుతున్నట్లు స్పష్టమవుతోంది ’’ అన్నారు. ‘‘వాస్తవంగా ఇలాంటి జీవో జారీ చేయడమే తప్పు.. మ్యూటేషన్ దరఖాస్తులు నిర్దిష్ట గడువులోగా పరిశీలించి.. పరిష్కరించాలని జీవో ఉండాలి. కానీ దీనికి భిన్నమైన స్ఫూర్తితో జీవో ఇచ్చారు.’’ అని ఆ అధికారి వివరించారు.
అన్ని జిల్లాల్లో అదే తీరు...
నెల్లూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలు భారీగా ప్రభుత్వ భూములను అనుచరుల పేర్లతో సొంతం చేసుకున్నారు. ఇతర నాయకులు, వారి అనుచరులు కూడా ఇదే బాటలో సర్కారు భూములను మాయం చేశారు. ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కూడా భారీ భూ అక్రమాలు జరిగాయి. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో ఒక టీడీపీ నాయకుడు బినామీ పేర్లతో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న నేపథ్యంలో భూముల ధరలు పెరిగాయి. విశాఖపట్నానికి సమీపంలో విమానాశ్రయానికి దగ్గరలోని భూమిని ఒక మంత్రి బినామీ పేర్లతో భారీగా కైవసం చేసుకున్నారని అధికారులు అంటున్నారు.
నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి మోసాలు అధికంగా జరిగాయి. ఈ జిల్లాలో మొత్తం మ్యుటేషన్లలో 29.53 శాతం డీమ్డ్ ఖాతాలోనివే కావడాన్ని అధికారులు ఎత్తిచూపుతున్నారు. అక్రమాలు ఎక్కువగా జరిగాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా అక్రమాలు అధికంగానే సాగాయి. ఈ జిల్లాలో 25.74 శాతం డీమ్డ్ మ్యుటేషన్లు జరిగాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో సుమారు 19 శాతం మ్యుటేషన్లు అధికారుల అనుమతితో సంబంధం లేకుండా జరిగిపోయాయి. ‘భూమి ఎవరిది? ఏమిటి? ఆధారాలున్నాయా? అనే అంశాలతో సంబంధం లేకుండా గత మూడు, నాలుగు నెలల్లో 1.17 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. అంటే ఎన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఇందులో ప్రయివేటు వ్యక్తుల ఖాతాల్లో చేరిపోయాయో లెక్కకు అందడం లేదని, ఒకవేళ విచారణ జరిపినా ఆధారాలు లేకుండా చేసేసి ఉంటారు....’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మరో భారీ భూకుంభకోణం
Published Thu, Dec 14 2017 3:32 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment