సాక్షి, హైదరాబాద్: ‘ఈ రోజు చరిత్రాత్మకమైనది. ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడే రోజు. రైతులకు సరళీకృతమైనటువంటి చట్టం కోసం కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాం. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇప్పుడు అంతే సంతోషంగా ఉన్నా. ప్రతీ కుటుంబానికి వర్తించే బిల్లు ఇది’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శాసనసభలో బుధవారం రెవెన్యూ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆయన బిల్లులోని ముఖ్యాంశాలను వివరించారు. ప్రపంచంలో ఇంతటి అత్యుత్తమైన బిల్లు మరోటి లేదన్నారు. ‘కొత్త చట్టంతో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూతగాదాల పీడ విరగడవుతుంది. అధికారుల దయాదక్షిణ్యాల మీద ప్రజలు ఆధారపడాల్సిన పని ఉండదు. వారసత్వ భూ మార్పిడి సమస్యలు కూడా తీరిపోతాయి. కుటుంబ సభ్యులు తమ సమాచారాన్ని రాసి ఇస్తే ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారమవుతాయి. ఇకనైనా అవినీతి అంతం కావాలి’అని అన్నారు. అంతులేని అవినీతికి ఈ బిల్లు అడ్డుకట్ట వేస్తుందన్నారు. ‘భూములన్నింటినీ డిజిటలైజ్డ్ సర్వే చేస్తాం. డిజిటల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ తయారవుతుంది. అది కూడా ప్రజలకు ఐటీ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన ఇంకేం అన్నారంటే...
వారి ఉద్యోగాలకు ఢోకా లేదు...
‘వీఆర్వో, వీఆర్‌ఏల ఉద్యోగాల భద్రతకు ఎటువంటి డోకా లేదు. అవసరాల మేరకు వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేస్తాం. భూసంస్కరణలను క్రమబద్ధీకరించడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా పాలకులు పూర్తిస్థాయిలో మార్పును తీసుకురాలేకపోయారు. అంతులేని అవినీతి కారణంగా ప్రజలకు, రెవెన్యూ శాఖకు మధ్య విద్వేషపూరిత వాతావరణం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేళ్లుగా దీన్ని చక్కదిద్దడానికి కసరత్తు చేస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన మొదలుపెట్టాం. మధ్యలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగింది. కరోనా మహమ్మారి రాకతో ఆరేడు మాసాలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. రెవెన్యూ బాధ్యతలను నేనే స్వీకరించా. సెక్రటరీని కూడా నియమించలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే దీన్ని చూస్తున్నారు. మూణ్నాలుగు నెలలుగా మళ్లీ భూరికార్డుల ప్రక్షాళనపై దృష్టి పెట్టా. రెవెన్యూ ఉద్యోగులతోనూ నేరుగా మాట్లాడా. తమకు గౌరవం, ఉద్యోగ భద్రత కావాలని అడిగారు. వారి ఉద్యోగ భద్రతకు డోకా ఉండదు. ప్రజలకు దీంతో మేలు జరుగుతుంది. రాష్ట్రంలో వీఆర్‌ఏలు 22,900 మంది ఉన్నారు. వీరిలో దళితులు, బీసీలే ఎక్కువ. ఇప్పుడు వీరికి స్కేల్ ఇచ్చి గుర్తిస్తాం. కొందరిని రెవెన్యూలో, మరికొందరిని ఇరిగేషన్, మున్సిపల్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తాం. ఈ ప్రక్రియ మూణ్నాలుగు నెలల్లో పూర్తవుతుంది. వీరికి స్కేల్ పోస్టులు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 260 కోట్ల వరకూ అదనపు భారం పడుతుంది.
వారి అధికారాలకు కత్తెర...
‘సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న 5,480 మంది వీఆర్వోలను తీసేయం. ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నాం. వీరికి ప్రత్యామ్నాయ సేవలు ఐటీ ద్వారానే జరుగుతాయి. తహసీల్దార్లు, ఆర్టీఓలు ఉంటారు. అయితే వారి అధికారాలు పోతాయి. రాజ్యాంగం ప్రకారం చట్టం నిర్దేశించినట్లుగా పనిచేయాలి. ప్రస్తుతం ఎలా ఉందంటే తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లే ఉత్తర్వులు జారీ చేస్తారు. మళ్లీ వీరే కోర్టులు నిర్వహిస్తారు. ఇది కొంచెం వికారంగా ఉంది. అందుకే కొత్త చట్టం అమల్లోకి వచ్చాక, ఈ మూడు రెవెన్యూ కోర్టులుండవు. సివిల్ కోర్టు, సెషన్ కోర్టు, హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వంటి న్యాయ వ్యవస్థ ఉండగా మళ్లీ ఈ రెవెన్యూ కోర్టులెందుకు?. ఈ మూడు కోర్టుల్లో కలుపుకొని మొత్తం 16,137 కేసులున్నాయి. వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటుచేస్తాం. మూడునాలుగు నెలల్లో కేసులు పరిష్కరించేలా కృషిచేస్తాం. ఆ తర్వాత భూ తగాదా కేసులుండవు. ఒకటో అరో కేసులొచ్చినా వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. ఎక్కడికెళ్లినా ఎకరా రూ.10 లక్షలకు పైనే ఉంది. ప్రస్తుత భూ వివాదాలు తీవ్ర రూపం దాల్చకుండా ఉండాలంటే భూరికార్డుల క్రమబద్ధీకరణ జరగాల్సిందే. రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తారా? అని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నూతన విధాన అమలుకు ఎంత ఖర్చైనా వెనుకాడవద్దని చెప్పా. గతంలో నిజాం హయాంలో తర్వాత ఇప్పటి వరకూ భూరికార్డుల సర్వే చేయలేదు.
అక్షాంశాలు, రేఖాంక్షాల ఆధారంగా..
‘ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి భూమిని సర్వే చేయిస్తాం. ప్రతి ఇంచునూ కొలుస్తాం. అక్షాంశాలు, రేఖాంశాలతో భూమి హద్దుల(కోఆర్డీనేట్)ను నిర్ణయిస్తాం. ఇక బలహీనుల భూమిని బలవంతులు దౌర్జన్యంగా ఆక్రమించుకోలేరు. ఇటువంటి పోర్టల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. హరియాణాలో ఉన్నా ఇంత లోతుగా లేదు. ఎలక్ట్రానిక్ ధరణి పోర్టల్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒకటి వ్యవసాయ భూములు.. రెండోది వ్యవసాయేతర భూములు. రాష్ట్రంలో 1.12 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగముంది. ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా చూసుకోవచ్చు. డౌన్లోడ్, కాపీ కూడా చేసుకోవచ్చు. మల్టీపుల్ సర్వర్లలో, దేశంలో సురక్షితమైన ప్రాంతాల్లో వీటి రికార్డులు భద్రపరుస్తారు. ఒకవేళ ఏదైనా విపత్తు వచ్చినా ఇతర ప్రాంతాల్లో వీటి రికార్డులుంటాయి. కొన్ని బ్యాంకులు రుణాలివ్వడానికి రైతులను తిప్పించుకుంటున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం (ఎన్‌కంబెన్స్) ధరణి పోర్టల్‌లో లభ్యమవుతుంది. గతంలో కొందరు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. కొత్త టెక్నాలజీతో రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావుండదు. ప్రసిద్ధ స్థలాల వివరాలను ముందే పొందుపర్చి ఉంచుతాం గనుక సాఫ్ట్‌వేర్ ఆటోమెటిక్‌గా తిరస్కరిస్తుంది. అన్ లాక్ చూపిస్తుంది.
జాయింట్ రిజిస్ట్రార్లుగా తహసీల్దార్‌లు...
తహసీల్దార్‌లను జాయింట్ రిజిస్ట్రార్లుగా చేస్తాం. వ్యవసాయ భూములను వీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. స్లాట్‌ను రైతులే బుక్ చేసుకోవచ్చు. ఆ సమయానికి వచ్చి పోతే సరిపోతుంది. వెంటనే సంబంధిత డాక్యుమెంట్లు కూడా అందజేస్తారు. వ్యవసాయేతర భూములను ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. మొత్తం రాష్ట్రంలో గ్రామ, పురపాలక, జీహెచ్‌ఎంసీ పరిధిలో కలుపుకొని 89.47 లక్షల ఆస్తులు ఆన్ లైన్‌లో ఉన్నాయి. ధరణి పోర్టల్‌లోకి ఇవన్నీ వస్తాయి. రిజిస్ట్రేషన్, ఎమ్మార్వో కార్యాలయాల్లో డాక్యుమెంట్లను ఎవరికి వారు సొంతంగా రాసుకోవచ్చు. దానికి సంబంధించిన నమూనా కాపీని ఆయా కార్యాలయాల్లో ప్రభుత్వమే అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ డాక్యుమెంట్ రాసుకోవడానికి వీలు పడని వారు నిర్దేశిత ఫీజు చెల్లించి రాయించుకోవచ్చు. అలా రాసే వారికి లైసెన్సు కూడా ప్రభుత్వమే ఇస్తుంది.
కుల ధ్రువీకరణ పత్రాలను కూడా ఇక నుంచి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లోనే ఇస్తారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ ఆస్తుల ప్రాతిపదికన జారీచేస్తారు. ఆ డేటా బేస్ అంతా ప్రభుత్వం వద్ద ఉంటుంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనిపై సుదీర్ఘంగా శుక్రవారం చర్చ జరుగుతుందన్నారు. దీనికి ముందు ముఖ్యమంత్రి వీఆర్వో పోస్టుల రద్దు బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి కేటీఆర్.. మున్సిపల్ లా సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment