భూస్వాములే లేరు!  | CM KCR Says 98 Percent of The Farmers In Telangana Are Under 10 Acres | Sakshi
Sakshi News home page

భూస్వాములే లేరు! 

Published Tue, Sep 15 2020 1:32 AM | Last Updated on Tue, Sep 15 2020 2:48 AM

CM KCR Says 98 Percent of The Farmers In Telangana Are Under 10 Acres - Sakshi

సోమవారం శాసనమండలికి వెళ్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అసలు ఇప్పుడు భూస్వాములే లేరని, మొత్తంగా పది ఎకరాల్లోపు ఉన్న రైతులే 98.38%గా ఉన్నారని సీఎం కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఇరవై ఐదు ఎకరాలు పైబడిన రైతులు 6,679 మంది మాత్రమే ఉన్నారని, వీరి చేతుల్లో 2,24,733 ఎకరాల విస్తీర్ణమున్న భూములే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు ఎవరూ లేరన్నారు. రెండు, మూడు ఎకరాలున్న వారు భూస్వాములా అని ప్రశ్నిస్తూ... మూడెకరాల్లోపు భూములున్న వారిలో  98.7% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఉన్నారన్నారు. గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీల్లోని గిరిజనుల భూముల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఈ భూములు  కేంద్రం పరిధిలో, 1/70 చట్టానికి అనుగుణంగా యథాతథంగా కొనసాగుతాయని, నమోదైన రైతులకు రైతుబంధు, బీమా, ఇతర సౌకర్యాలు ప్రభుత్వపరంగా యథావిధిగా కొనసాగిస్తా మన్నారు. ఇవి తప్ప మిగతా భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటాయన్నారు. సోమవారం శాసనమండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టాక సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణలోని 7 మండలాలను అప్రజాస్వామికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని, ఆర్డినెన్స్‌ జారీచేసి అరాచకంగా దెబ్బకొట్టిందన్నారు. ఏడాదిలో 10 నెలలు విద్యుత్‌ ఉత్పత్తి చేసే 440 మెగావాట్ల సీలేరు ప్రాజెక్ట్‌ను కూడా తరలించి కేంద్రం శాశ్వతనష్టం కలగజేయ డంపై తాము బంద్‌ను కూడా నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఆన్‌రికార్డ్‌గా తాను ఈ విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. 

వక్ఫ్, ఎండోమెంట్‌ భూముల పరిరక్షణకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టిన విధంగా క్రైస్తవ సంస్థల భూముల విషయంలో స్పందించడం సాధ్యం కాదన్నారు. క్రైస్తవ సంస్థల భూముల లెక్కలు లేవన్నారు. భూముల వివరాలు సమర్పించి, తమకు కూడా బోర్డు ఉండాలని క్రైస్తవ సంస్థల పెద్దలు నిర్ణయిస్తే ఆలోచిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో భూసర్వేను ఏడాది, ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని, ఇందుకోసం జిల్లాల వారీగా ఎక్కడిక్కడ ఏజెన్సీల సహాయం తీసుకుంటామన్నారు. అన్ని అత్యాధునిక హంగులు, సాంకేతికతతో ధరణి పోర్టల్‌ను త్వరలోనే రూపొందించేందుకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామన్నారు. పారదర్శకంగా ఉండేలా ఈ పోర్టల్‌ను రూపొందించి పబ్లిక్‌ డొమెయిన్‌లో పెడతామని, ప్రపంచంలోని ఏమూల నుంచైనా వివరాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని, అయితే దీనిలో మార్పలు చేయడం మాత్రం సాధ్యం కాదని చెప్పారు. వెబ్‌సైట్‌ అందుబాటులో వచ్చాక పాస్‌పుస్తకాలు కూడా అప్రస్తుతమైపోతాయని, వీటి వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయ్యే అవకాశముందన్నారు. కౌలుదారులను పట్టించుకోమని, అది తమ పార్టీ పాలసీ అని చెప్పారు. రక్షిత కౌలుదారుల చట్టం తీసుకురావడం ఆనాడు సరైందే కాని ఇప్పుడు కాదన్నారు. బంజారాహిల్స్‌లో ఎవరైనా తమ ఇళ్లు అద్దెకు ఇచ్చాక, కిరాయిదారుల పేర్లను సొంతదారుల్లో ఎలా చేర్చలేమో ఇది కూడా అంతేనన్నారు. భూమి అనుభవదారుల కాలమ్‌ ఉండదని స్పష్టం చేశారు. రైతుల భూముల రక్షణ, వారి క్షేమం కోరి కొత్త చట్టం తెచ్చామని, వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు నిర్ణయం కూడా వారి ప్రయోజనాల కోసమే తీసుకున్నామన్నారు. 


వ్యవసాయేతర భూములకు ‘మెరూన్‌’ కలర్‌లో పాసుపుస్తకాలు
కొత్త రెవెన్యూచట్టంలో భాగంగా వ్యవసాయేతర భూములకు ‘మెరూన్‌’ కలర్‌ పాస్‌బుక్‌లు జారీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వ్యవసాయేతర భూములను తేలిగ్గా గుర్తించేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. భూమి శిస్తు వసూలు వంటివి లేకపోవడంతో, వీఆర్‌ఓల పాత్ర అప్రస్తుతంగా  మారిందని, అయితే వీరిలో కొందరిని ఊరికి ఒకరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నామని, ఆ మేరకు అవసరం కూడా ఉందన్నారు. నీరడి, ఇతర పనుల కోసం నీటిపారుదల శాఖలో వీరి సేవలు ఉపయోగించుకునే వీలుందన్నారు. రిజిస్ట్రేషన్‌లో భాగంగా కౌలు, అనుభవదారుల కాలమ్‌ ఉండదని, దానిని అందులో పెట్టబోమని కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్నామన్నారు. ఈ చట్టంలో సబ్‌రిజిష్ట్రార్‌లకు కూడా తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే అధికారం, ఎక్కడికక్కడ భూముల ధరలు నిర్ణయించే అధికారం ఉండదని స్పష్టం చేశారు. మొత్తంగా రెవెన్యూశాఖ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి చెప్పారు. అవినీతిని కేవలం వీఆర్‌ఓలకు పరిమితం చేయడం సరికాదని, ఇటీవల అడిషనల్‌ కలెక్టర్, ఎమ్మార్వో, ఇతర అధికారుల అవినీతి  ఉదంతాలు కూడా బయటపడ్డాయన్నారు. లాండ్‌ రికార్డ్స్‌ అప్‌డేషన్‌పై దృష్టిపెట్టాలని, నేటికి 10 నుంచి 12 లక్షల మంది రైతుల పాస్‌పుస్తకాలు రాలేదన్నారు. రెవెన్యూ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని జీవన్‌రెడ్డి కోరగా... సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ అది సాధ్యం కాదన్నారు. అసెంబ్లీ లాగే ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. చర్చ అనంతరం చివరకు ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. స్వాతంత్య్రసమరయోధులు, మాజీ సైనికులకు గతంలో కేటాయించిన భూములకు రక్షణ ఎలా అని బీజేపీ సభ్యుడు ఎన్‌.రామచంద్రరావు ప్రశ్నించారు. వీఆర్‌ఓల వంటి క్షేత్రస్థాయి మెకానిజంను మళ్లీ ఏర్పాటు చేస్తారా అన్న దానిపై స్పష్టతనివ్వాలన్నారు. ఎంఐఎం సభ్యులు అమీనుల్‌ జాఫ్రీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, డి.రాజేశ్వరరావు, టీచర్‌ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దనరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు.

ఎన్‌ఆర్‌ఐలకు వెసులుబాటు..
కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు లేని కారణంగా పాస్‌పోర్టో మరే ఇతర ఆధారంతోనో వారి భూము లను కాపాడేందుకు చర్యలు చేపడతామన్నారు. వారి భూములను రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇందుకు అనుగుణంగా ఒక మెకానిజం తీసుకొస్తామన్నారు. కొత్త రెవెన్యూచట్టం చేశాక న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు, అడ్డంకులను వందకు వంద శాతం ఎదుర్కొంటామన్నారు. ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం తహసీల్దార్‌లకు సైతం లేదని, బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫొటోతో సహా అన్ని వివరాలు నమోదు చేస్తేనే «ఇందులో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. అరగంటలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్‌డేషన్‌ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. రెవెన్యూ కోర్టుల స్థానంలో ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్‌లు పని చేస్తాయని సీఎం వెల్లడించారు. శతాబ్దాల భూ వివాదాల పీడ విరగడయ్యేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement