కరీంనగర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులు కమిషనర్లుగా పదోన్నతి పొందిన వ్యవహారం ఓ ఉన్నతాధికారి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. సదరు అధికారులపై చార్జెస్ ఫ్రేమ్ అయి ఉన్నా ఆ ఫైల్‌ను తొక్కి పెట్టి, దొడ్డిదారిన పదోన్నతి వచ్చేట్లు చేయడంలో గతంలో కరీంనగర్‌లో పనిచేసి, వెళ్లిన ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. ‘ఆరోపణలున్నా అందలం’ పేరిట ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో విచారణ చేపట్టాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ సీడీఎంఏను కోరిన విషయం విధితమే. రెండున్నరేళ్ల కిందటి ఈ వ్యవహారం ఇప్పటివరకు ఎందుకు వెలుగు చూడలేదు? ఆన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఏసీఆర్)లో తప్పుడు సమాచారాన్ని ఎవరు సీడీఎంఏకు పంపించారన్న అంశాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి.
అప్పట్లో ఆదేశించినా లేఖ రాయలే..
2021లో నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న అధికారి, అకౌంటెంట్‌లపై ఆరోపణలు రావడం, అప్పటి కమిషనర్ ఇరువురిపై చార్జెస్ ఫ్రేమ్ చేయడం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సీడీఎంఏకు నివేదించాలని అప్పటి కలెక్టర్ నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ ఈ విషయమై నగరపాలక సంస్థ సీడీఎంఏకు ఎలాంటి లేఖ రాయలేదు. దీంతో విచారణ అంశం అటకెక్కింది. అటు చార్జెస్ ఫ్రేమ్ ఫైల్‌ను, ఇటు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తొక్కి పెట్టి, అడ్డదారిలో ఇద్దరు అధికారులకు లబ్ధి చేకూరేలా చేయడంలో గతంలో పని చేసిన ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగి పదోన్నతికి ముందు సీడీఎంఏకు పంపించే ఏసీఆర్‌లోనూ చార్జెస్ ఫ్రేమ్ అంశాన్ని పొందుపరచకుండా, క్లీన్ ఇమేజ్‌తో పంపించడంలోనూ ఆ ఉన్నతాధికారిదే కీలక పాత్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీఆర్‌ను స్వయంగా ఉద్యోగి పూర్తి చేసినప్పటికీ, సంబంధిత ఉన్నతాధికారే సీడీఎంఏకు పంపించాల్సి ఉంటుంది. అన్నీ తెలిసి, సదరు అధికారులతో కుమ్మక్కవడం వల్లే తప్పుడు సమాచారాన్ని పంపించారన్న ఆరోపణలున్నాయి. నగరపాలక సంస్థ కోరిన మేరకు సీడీఎంఏ ఒకవేళ విచారణకు ఆదేశిస్తే నిజాలు వెల్లడి కానున్నాయి.
ఇవి చదవండి: కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్..
Comments
Please login to add a commentAdd a comment