రేషన్ బియ్యంతో తీరొక్క దందా
అక్రమ ఆదాయానికి అనేక మార్గాలు
అక్రమార్కుల అడ్డాలు.. కిరాణాలే నిల్వ కేంద్రాలు
అనువైన సమయాల్లో రవాణా
కరీంనగర్: రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. రూపం.. దారులు మారాయే తప్ప అక్రమ వ్యాపారం ఆగడం లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చెందిన ఓ బియ్యం డాన్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పొస్) ద్వారా రేషన్ తీసుకోని కార్డుదారుల సరుకు నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్టపడగా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరింది.
కార్డుదారులు తీసుకునే బియ్యం కోళ్లకు దాణాగా మారడం ఆందోళనకర పరిణామం. పేద ప్రజల కడుపు నింపాల్సిన రేషన్‌బియ్యం కోళ్లకు ఆహారంగా.. బీర్ల తయారీకి వినియోగించడం విడ్డూరం. పీడీ యాక్టు అమలులో తాత్సారం.. కఠినంగా వ్యవహరించకపోవడం అక్రమ దందాకు వరంగా మా రింది. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారితో కొందరు అధికారుల ఉదాసీన వైఖరి, మామూళ్ల మాటున ప్రోత్సహించడం యథేచ్ఛగా దందా సాగడానికి ప్రధాన కారణం. పలువురు రేషన్ డీలర్లు కార్డుదారుల వేలిముద్ర తీసుకుని బియ్యం ఇచ్చినట్లు ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టడం, తీసుకున్న బియ్యాన్ని కార్డుదారులు దళారులకు విక్రయించడం అప్రతిహాతంగా సాగుతోంది.
కిరాణా, రేషన్ దుకాణాలే అడ్డాలు..
జిల్లాకేంద్రం నుంచి కుగ్రామం వరకు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం విరాజిల్లుతోంది. రేషన్ దుకాణాల్లో క్లోజింగ్ బ్యాలెన్స్(సీబీ) చూపించే వరకు బియ్యం నిల్వ చేసుకునే అవకాశముండగా సీబీలోపు పక్కదారి పట్టిస్తున్నారు. వేలిముద్ర వేసి వెళ్లినవారి బియ్యానికి ప్రత్యేక రిజిష్టర్ ఏర్పాటు చేసుకుని లెక్కలు వేసుకున్న అనంతరం దళారులు, మిల్లర్లకు అంటగడుతున్నారు. దళారులు కొనుగోలు చేసే బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తుండగా పలువురు నేరుగా ఇతర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిరాణ దుకాణ నిర్వాహకులు కూడ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుండగా అనుకూల సమయాల్లో దళారులకు విక్రయిస్తున్నారు.
దళారులు పుట్టుకొస్తున్నారు..
చోటామోటా బియ్యం డాన్‌లతో పాటు భారీ డాన్‌ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గకపోవడం సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరు, వట్టి కేసులే కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దందా చేసే అక్రమార్కులపై పదుల సంఖ్యలో కేసులున్నప్పటికి కఠినశిక్షలు లేకపోవడంతో మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. పీడీయాక్టు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించినా తదనుగుణ చర్యలకు నిబంధనలు ప్రతికూలమనే కుంటిసాకులతో 6ఏ కేసులతోనే సరిపుచ్చుతున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. కాగా రేషన్ బియ్యం పక్కదారి పట్టించేవారెవరైనా వదిలేదిలేదని పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అక్రమ ఆదాయానికి అనేక మార్గాలు..
సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పలుదారుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ విధానం కొనసాగడం పరిపాటి. ఇదే సమయంలో పలువురు మిల్లర్లు దళారులను ఏర్పా టు చేసుకుని బియ్యం కొనుగోలు చేసి సీఎంఆర్‌గా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే తమకున్న సంబంధంతో బయటకు పొక్కకుండా చూస్తున్నారు.
తినుబండారాల తయారీ కేంద్రాలకు బియ్యం తరలుతోంది. తక్కువ ధరకు లభ్యమవడంతో వీటికే మొగ్గు చూపుతున్నారు.
కాలక్రమేణ టిఫిన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తుండగా సదరు కేంద్రాలకు ఇవే బియ్యం సరఫరా చేస్తున్నారు. దోశ, ఇడ్లీ, వడ ఇతర వాటిలో వీటినే కలిపేస్తుండగా పలువురు నిర్వాహకులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గడిస్తున్నారు.
కోళ్ల ఫారాలకు తరలింపు ఎక్కువైంది. మక్కల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది యజమానులు తక్కువ ధరకు వస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
బీర్లు తయారీ చేసే పరిశ్రమలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. గతంలో పట్టుబడిన కేసుల్లో 20కి పైగా ఇలాంటి రవాణానేనని పౌరసరఫరాలశాఖలోని ఓ అధికారి వివరించారు.
సన్నరకాల దిగుబడి తక్కువగా ఉండటం సన్నబియ్యం ఆశించినస్థాయిలో లేకపోవడం రేషన్ బియ్యాన్నే ఫాలిష్ చేసి కలుపుతున్నారని సమాచారం.
అనుకూల అధికారుల సహకారంతో బియ్యాన్ని మçహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడి ప్రజలు దొడ్డుబియ్యాన్ని అమితంగా ఇష్టపడుతారు. అక్కడ కిలో రూ.26–30 వరకు ధర పలుకుతుండటంతో భారీగా ఆదాయం గడిస్తున్నారు.
ఇవి చదవండి: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
Comments
Please login to add a commentAdd a comment