poultry farms
-
కోళ్ల దాణా.. బీర్ల తయారీ!
కరీంనగర్: రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. రూపం.. దారులు మారాయే తప్ప అక్రమ వ్యాపారం ఆగడం లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చెందిన ఓ బియ్యం డాన్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పొస్) ద్వారా రేషన్ తీసుకోని కార్డుదారుల సరుకు నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్టపడగా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరింది.కార్డుదారులు తీసుకునే బియ్యం కోళ్లకు దాణాగా మారడం ఆందోళనకర పరిణామం. పేద ప్రజల కడుపు నింపాల్సిన రేషన్‌బియ్యం కోళ్లకు ఆహారంగా.. బీర్ల తయారీకి వినియోగించడం విడ్డూరం. పీడీ యాక్టు అమలులో తాత్సారం.. కఠినంగా వ్యవహరించకపోవడం అక్రమ దందాకు వరంగా మా రింది. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారితో కొందరు అధికారుల ఉదాసీన వైఖరి, మామూళ్ల మాటున ప్రోత్సహించడం యథేచ్ఛగా దందా సాగడానికి ప్రధాన కారణం. పలువురు రేషన్ డీలర్లు కార్డుదారుల వేలిముద్ర తీసుకుని బియ్యం ఇచ్చినట్లు ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడం, తీసుకున్న బియ్యాన్ని కార్డుదారులు దళారులకు విక్రయించడం అప్రతిహాతంగా సాగుతోంది.కిరాణా, రేషన్ దుకాణాలే అడ్డాలు..జిల్లాకేంద్రం నుంచి కుగ్రామం వరకు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం విరాజిల్లుతోంది. రేషన్ దుకాణాల్లో క్లోజింగ్ బ్యాలెన్స్(సీబీ) చూపించే వరకు బియ్యం నిల్వ చేసుకునే అవకాశముండగా సీబీలోపు పక్కదారి పట్టిస్తున్నారు. వేలిముద్ర వేసి వెళ్లినవారి బియ్యానికి ప్రత్యేక రిజిష్టర్ ఏర్పాటు చేసుకుని లెక్కలు వేసుకున్న అనంతరం దళారులు, మిల్లర్లకు అంటగడుతున్నారు. దళారులు కొనుగోలు చేసే బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తుండగా పలువురు నేరుగా ఇతర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిరాణ దుకాణ నిర్వాహకులు కూడ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుండగా అనుకూల సమయాల్లో దళారులకు విక్రయిస్తున్నారు.దళారులు పుట్టుకొస్తున్నారు..చోటామోటా బియ్యం డాన్లతో పాటు భారీ డాన్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గకపోవడం సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరు, వట్టి కేసులే కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దందా చేసే అక్రమార్కులపై పదుల సంఖ్యలో కేసులున్నప్పటికి కఠినశిక్షలు లేకపోవడంతో మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. పీడీయాక్టు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించినా తదనుగుణ చర్యలకు నిబంధనలు ప్రతికూలమనే కుంటిసాకులతో 6ఏ కేసులతోనే సరిపుచ్చుతున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. కాగా రేషన్ బియ్యం పక్కదారి పట్టించేవారెవరైనా వదిలేదిలేదని పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.అక్రమ ఆదాయానికి అనేక మార్గాలు..సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పలుదారుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ విధానం కొనసాగడం పరిపాటి. ఇదే సమయంలో పలువురు మిల్లర్లు దళారులను ఏర్పా టు చేసుకుని బియ్యం కొనుగోలు చేసి సీఎంఆర్‌గా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే తమకున్న సంబంధంతో బయటకు పొక్కకుండా చూస్తున్నారు.తినుబండారాల తయారీ కేంద్రాలకు బియ్యం తరలుతోంది. తక్కువ ధరకు లభ్యమవడంతో వీటికే మొగ్గు చూపుతున్నారు.కాలక్రమేణ టిఫిన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తుండగా సదరు కేంద్రాలకు ఇవే బియ్యం సరఫరా చేస్తున్నారు. దోశ, ఇడ్లీ, వడ ఇతర వాటిలో వీటినే కలిపేస్తుండగా పలువురు నిర్వాహకులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గడిస్తున్నారు.కోళ్ల ఫారాలకు తరలింపు ఎక్కువైంది. మక్కల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది యజమానులు తక్కువ ధరకు వస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.బీర్లు తయారీ చేసే పరిశ్రమలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. గతంలో పట్టుబడిన కేసుల్లో 20కి పైగా ఇలాంటి రవాణానేనని పౌరసరఫరాలశాఖలోని ఓ అధికారి వివరించారు.సన్నరకాల దిగుబడి తక్కువగా ఉండటం సన్నబియ్యం ఆశించినస్థాయిలో లేకపోవడం రేషన్ బియ్యాన్నే ఫాలిష్ చేసి కలుపుతున్నారని సమాచారం. అనుకూల అధికారుల సహకారంతో బియ్యాన్ని మçహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడి ప్రజలు దొడ్డుబియ్యాన్ని అమితంగా ఇష్టపడుతారు. అక్కడ కిలో రూ.26–30 వరకు ధర పలుకుతుండటంతో భారీగా ఆదాయం గడిస్తున్నారు.ఇవి చదవండి: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు -
దేశ స్థాయిలో ఎగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలి : తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగం నష్టాల ఊబి నుంచి గట్టెక్కాలంటే దేశ స్థాయిలో ఎగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు డిమాండ్ చేశారు. అప్పుడే రైతుకు మద్దతు ధర లభిస్తుందని, పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పారు. ‘ఉత్పత్తి వ్యయాలకు తగ్గట్టుగా మాత్రమే గుడ్డు ధర నిర్ణయించాలి. మార్కెట్లో ధర విషయంలో పూర్తిగా బోర్డుదే తుది నిర్ణయం కావాలి. తద్వారా రైతులకు, వినియోగదార్లకు ప్రయోజనం ఉంటుంది. బోర్డుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ప్రభుత్వమే గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. లేదా ప్రైవేటు గిడ్డంగులను లీజుకు తీసుకోవాలి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాను కట్టడి చేయాలి. బోర్డు కార్యరూపంలోకి వస్తే కొత్తగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పౌల్ట్రీకి పూర్తిగా వ్యవసాయ రంగ హోదా ఇచ్చి ప్రయోజనాలు కల్పించాలి’ అని వివరించారు. రైతులు ఒక్కో గుడ్డు ఉత్పత్తిపై సగటున 50–60 పైసలు, బ్రాయిలర్‌పై రూ.10–20 నష్టపోతున్నారని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కాసర్ల మోహన్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో.. పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 22–25 తేదీల్లో ఇక్కడి హైటెక్స్‌లో జరుగనుంది. తొలిరోజు నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్ నిర్వహిస్తారు. 370 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రధర్ రావు పొట్లూరి తెలిపారు. -
Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఏపీలో కొన్ని ఏరియాల్లో త్రిబుల్ సెంచరీ దాటింది స్కిన్లెస్ చికెన్ కేజీ ధర. ఎండాకాలం, పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ డిమాండ్ పెరిగి.. ధరలూ పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. పది రోజుల గ్యాప్‌లో 70 నుంచి 80 రూపాయల దాకా పెరిగింది. కూరగాయల దిగుబడి తగ్గిపోవడం, హోటల్స్.. రెస్టారెంట్లలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారాలు జోరందుకోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఎండకు కోళ్లు చనిపోతాయనే భయంతో.. కొందరు కోళ్ల ఫారం వ్యాపారులు బరువు పెరగకుండానే వెంటనే అమ్మేస్తున్నారు. -
కోడి కూర.. మాకొద్దు బాబోయ్
సాక్షి, కోలారు: కోడి మాంసమంటే ప్రజలు వద్దు బాబోయ్ అంటున్నారు. చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతుండడంతో భయాందోళనలను వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో కోళ్ల వ్యాపారానికి దెబ్బ తగులుతోంది. గత 15 రోజుల నుంచి సోషల్ మీడియాలో కోడి మాంసం వల్ల కరోనా జబ్బు సోకుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు కోడి మాంసం కొనడానికి వెనుకంజ వేస్తుండగా, గిరాకీలు లేక కోళ్ల ఫారందారులను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. హోటళ్లలో చికెన్ వంటకాలకు డిమాండు లేక వ్యాపారాలు తగ్గిపోయినట్లు యజమానులు చెబుతున్నారు. ఫారాల్లో కోళ్లు అమ్ముడుపోవడం లేదని నిట్టూరుస్తున్నారు. అమ్ముడుపోని కోళ్లు కోలారు జిల్లావ్యాప్తంగా సుమారు 300లకు పైగా కోళ్లఫారంలు ఉన్నాయి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి కోళ్ల పారం నిర్వహిస్తున్నారు. రైతులు, ఔత్సాహికులు ఫారాలను నిర్వహిస్తున్నారు. కోళ్లను కొనక పోవడం వల్ల భారీగా నష్టం కలుగుతోందని తెలిపారు. వైరస్ భయంతో ప్రజలు కోడి మాంసం తినడం లేదు. భారీగా తగ్గిన ధరలు కోళ్ల ఫారంలలో కోళ్ల ధర కేజీకి 80 నుంచి రూ. 30కి పడిపోయింది. దీని వల్ల ప్రతి కిలోకు 50 రూపాయల నష్టం కలుగుతోంది. బంగారుపేట తాలూకాలోనే వందకు పైగా కోళ్ల ఫారంలు ఉన్నాయి. బూదికోట ఫిర్కాలో 30 సుగుణ కోళ్ళ ఫారంలు ఉన్నాయి. కొనేవారు లేక వాటిలో కోళ్లు పెద్దసంఖ్యలో కిక్కిరిశాయి. ఫారం కోడి పుట్టిన 40 రోజులకు 2.5 నుంచి 3 కిలోల వరకు బరువు తూగుతుంది. పలు కంపెనీల వారు, చికెన్ వ్యాపారులు కోళ్ళ ఫారంకు వచ్చి కోళ్లను ఖరీదు చేస్తారు. వైరస్ భయంతో గిరాకీ తగ్గిందని కంపెనీలు 50 రోజుల నుంచి ఫారం వైపునకు రావడం లేదు. దీంతో ఫారం యజమానులు గగ్గోలు పెడుతున్నారు. చికెన్ షాపుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు ధర భారీగా తగ్గడంతో కొందరు ఇదే అదను అని ధైర్యం చేసి ఫుల్లుగా లాగిస్తున్నారు. కోళ్లకు, కరోనాకు సంబంధం లేదు జగదీష్‌కుమార్ దీనిపై స్పందిస్తూ, కరోనా వైరస్‌కు– కోళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సోషల్ మీడియా తప్పు ప్రచారం వల్ల ఇలా జరుగుతోంది దీనిపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని తెలిపారు. చికెన్‌ను నిర్భయంగా తినవచ్చని అన్నారు. – పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్‌కుమార్ -
‘కోళ్లు’ కోలేని దెబ్బే.. !
సాక్షి, ఆలమూరు (తూర్పుగోదావరి) : వెరీ విరులెంట్ న్యూ కేస్టల్ డిసీజ్ (వీవీఎన్డీ) వైరస్ సోకి సుమారు 2200 కోళ్లు మృతి చెందిన ఆలమూరు మండలంలోని బడుగువానిలంక కోళ్ల ఫారాన్ని జిల్లా పశుసంవర్ధకశాఖ డీడీ, రోగ నిర్ధారణ వైద్యాధికారి కె.రామకృష్ణ బుధవారం పరిశీలించారు. ఆలమూరు పశుసంవర్ధకశాఖ ఏడీ ఓ రామకృష్ణతో కలిసి కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేశారు. ఈ వ్యాధి నివారణ సాధ్యం కాదని, ముందస్తు జాగ్రత్తలే తీసుకోవాలి తప్ప వైరస్ నియంత్రణకు చికిత్స లేదని తెలిపారు. గత వారంలో ఆత్రేయపురం మండలంలోని వద్దిపర్రులో వీవీఎన్డీ వైరస్ సోకి వేలాది బాయిలర్ కోళ్లు మృతి చెందడం వల్లే ప్రస్తుత పరిస్థితి కారణమని అభిప్రాయపడ్డారు. వేగంగా సోకే స్వభావం కలిగిన ఈ వైరస్ గోదావరి అవతలి నుంచి ఇవతల ఉన్న బడుగువానిలంకలోని కోళ్ల ఫారంలోకి చేరిందన్నారు. కోళ్ల రైతులు వీవీఎన్డీ వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. లేయర్ ఫారంలో పెంపకం సాగించే కోళ్లకు ఐదో రోజు నుంచి ఏడాది పాటు ప్రతినెలా తప్పనిసరిగా లాసోటా టీకాలను వేయించాలని సూచించారు. అనంతరం ఆలమూరు ఏడీఏ కార్యాలయంలో వీవీఎన్డీ వైరస్ నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఆలమూరు మండల పశు వైద్యా«ధికారి జి.భానుప్రసాద్, సీహెచ్.మౌనిక తదితరులు పాల్గొన్నారు. వీవీఎన్డీ వైరస్ సోకి మృతి చెందిన కోళ్ల ఫారాన్ని పునరుద్ధరించే విధానం ► ఒకసారి వైరస్ సోకి కోళ్లు మృతి చెందిన ఫారంలో మూడు నెలల పాటు విరామం ప్రకటించాలి. ► కోళ్ల ఫారంలో ఉన్న పాత మట్టిని, ఇసుకను తీసివేసి బయట పారబోయాలి. అనంతరం ఆ ఫారాన్ని పరిశుభ్రం చేసి కొత్త ఇసుకను, మట్టిని సమకూర్చుకోవాలి. ► డిసినిఫికెంటెండ్, గ్లీజర్ల్డ్హైడ్ మందులో క్లోరుసులాన్ను మిశ్రమం చేసి కోళ్లఫారంలో పిచికారీ చేయాలి. ► ఒకేసారి ఎక్కువ కోళ్లు పెంపకం చేపట్టకుండా కేవలం 15 నుంచి 20 వరకు మాత్రమే పెంచుకుని పరీక్షించుకోవాలి. ► వ్యాధి నిరోధక లక్షణాలు కనిపించకపోతే మరో ఏడు వారాల నుంచి ఎనిమిది వారాలలోపు కోళ్ల ఫారంలో పెంపకాన్ని చేపట్టవచ్చు. ► ప్రతి 2–3 ఏళ్లకు తప్పనిసరిగా టీకాలు వేయిస్తూ ఫారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించుకునే విధానం ► బ్రాయిలర్ ఫారం : కోడి పెంపకం ప్రారంభించిన ఐదో రోజున లాసోటా లేదా ఆర్2బీను వాడాలి. బూస్టర్ ఒక నెల తరువాత, మళ్లీ రెండో నెల తరువాత తప్పనిసరిగా వేయాలి. ► పెరటి కోళ్లకు టీకాలు ► ఇంటాఓ క్యూలర్ (కళ్లల్లో చుక్కల మందు) ఐదు, ఆరో రోజున వేయాలి. ► టీకాలు వేసే రెండు రోజుల ముందు తప్పనిసరిగా ఆల్బెండజోల్ పాముల మందును కోళ్లకు నోటి ద్వారా అందించాలి. ► నిమిరోల్ 1 చుక్క మందును వేస్తే విటమిన్ ఏ సమృద్ధిగా లభించి రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ► నిట్రోప్యూరంటన్ మందును ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ను తగ్గించుకోవచ్చు. -
'ఈగ'లు మోత మోగిస్తున్నాయ్!
‘ఈగ’ సినిమా ఇతివృత్తం ఏమిటి ? ప్రతీకారేచ్ఛతో రగిలిపోయి విలన్‌పై కక్ష తీర్చుకోవడం. ఒక మనిషిని నానా తిప్పలు పెట్టి ‘ఈగ’ను చూస్తేనే జడుసుకుని చచ్చేలా ప్రవర్తిస్తుంది. ఒక ఈగ చుట్టూ అల్లిన ఈ కథ ఔరా అనిపించక మానదు. అదే లక్షలాది ఈగలు ఒక గ్రామం మీద దాడి చేస్తే..? గ్రామంలోని చిన్నా పెద్దా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఈగల బారిన పడితే వారి ఆందోళన అంతా ఇంతా కాదు. అసలు ఒక గ్రామం మీద ఇన్ని ఈగలు ఎలా దాడి చేస్తున్నాయి? పంట పొలాలు మొదలు, తినే భోజనం, తాగునీరు.. అన్నీ ఈగలమయం అయితే .. సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ కథనం చదివితే తెలుస్తుంది..! సాక్షిప్రతినిధి, నల్లగొండ : చిట్యాల మండలం ఎలికట్టె గ్రామం. ఒక్కసారిగా ఎగిరొచ్చి వాలిపోతున్న ఈగలు ఆ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఊరికి కిలోమీటరు దూరంలో సుమారు డెబ్బై ఎకరాల్లో నెలకొల్పిన పౌల్ట్రీ ఫామ్స్‌తో ఈ సమస్య తలెత్తిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 18 షెడ్లలో ఏర్పాటు చేసిన బాయిలర్ పౌల్ట్రీ ఫామ్స్‌లో గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో సుమారు పది లక్షల కోళ్లను పెంచుతున్నారు. ఈ కోళ్లకు వేసే దాణాతోపాటు ఫామ్స్‌లో వ్యర్థాలతో ఈగలు వృద్ధి చెందాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఈగలు పుట్టుకురావడంతో అదే స్థాయిలో గ్రామ ప్రజలను అనారోగ్యం కూడా వెదుక్కుంటూ వచ్చింది. ఎలికట్టెలో అత్యధిక గౌడ కులస్తులు కులవృత్తి కల్లుగీతపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు తీసే కల్లు ఈగలతో నిండిపోయి ఎవరూ తాగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి జీవనభృతికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కోళ్ల ఫామ్స్ ఏర్పాటుతో మొదలైన ఈగల సమస్య ఎలికట్టెతో పాటు మునుగోడు మండలంలోని రత్తిపల్లి, ఊకొండి గ్రామాలనూ సతాయిస్తోంది. వీటి నివారణ చేపట్టాలని ఎలికట్టె గ్రామ ప్రజలు గడిచిన మూడు నెలలుగా విడత విడతలుగా ఆందోళన చేపట్టారు. కలెక్టర్, డీహెచ్ఎంఓ, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు. ఈనెల 19వ తేదీన ఎలికట్టె గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఎలికట్టె, రత్తిపల్లి, ఊకొండి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సరైన అనుమతులు పొందకుండానే కోళ్ల ఫామ్‌ను నిర్మించారని, నిబంధనలకూ నీళ్లొదిలారన్నది గ్రామ ప్రజల ప్రధాన అభియోగం. నిద్రనటిస్తున్న యాజమాన్యం ! గ్రామం మొత్తం వ్యాపించిన ఈగలతో స్థానికులు సతమతమవుతున్నా కోళ్ల ఫామ్ యాజమాన్యం ఈగల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్థుల ఆరోపణ. ఈ నెల19న గ్రామస్తులు ఆందోళనతో చర్చలకు వచ్చిన కోళ్ల ఫామ్ యజమాని ఈగల నివారణకు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారుల సమక్షంలో మాటిచ్చారని గ్రామస్తులు చెప్పారు. రెండేళ్లుగా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం వల్లే సమస్య జఠిలం అయ్యిందని వాపోతున్నారు. వాస్తవానికైతే, కోడిగుడ్ల ఫామ్‌ను నిత్యం శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఏసీలు వాడాలి. ఫామ్ చుట్టూరా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి. కోళ్లనుంచి వచ్చే వ్యర్ధాలను కంపోస్టు యార్డులకు తరలించాలి. ఫామ్స్‌లోనే కాకుండా స మీప గ్రామాల్లో దుర్వాసన రాకుం డా, ఈగలు పెరిగిపోకుండా మందుసులు స్ఫ్రే చేయాలి. కానీ.. ఇవేవీ వా స్తవంలో జరగకపోవడంతో ఒక్కో గ్రా మానికి సమస్య వ్యాప్తిచెందుతోంది. -
నష్టాలతో మూతపడ్తున్న కోళ్ల ఫారాలు
-
ఇంటి కోడి.. లాభాల ఒడి
► ఆసక్తి ఉంటే చాలు తక్కువ శ్రమ, ఖర్చుతో అధిక లాభాలు ► మామునూరులో కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం ► ఏటా 1.20లక్షల పిల్లల ఉత్పత్తి మామునూరు(వర్ధన్నపేట) : జీవనోపాధికి చాలా మార్గాలు ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అట్టడుగు వర్గాల వారు, నిరక్షరాస్యులకు అవి అందుబాటులో ఉండవు. ఈ సమస్యకు పరిష్కారం చూపడంలో పశు సంవర్థక శాఖ ముందుం టోంది. తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎవరి పనులు వారు చేసుకుంటూనే ఇంటి వద్ద ఎంచుకోదగిన తేలికైన ఉపాధి మార్గమే పెరటి కోళ్ల పెంపకం. మామునూరులో ఉత్పత్తి కేంద్రం వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం మామునూరులో వనరాజా, గిరిరాజ, రాజశ్రీ ఇతర కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. 2007లో దీనిని ప్రారంభించగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి వనరాజా కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం ఇది ఒక్కటే కావడం విశేషం. గుడ్లను హ్యాచింగ్ చేసేందుకు 10వేల గుడ్లను స్టోరేజీ సామర్థం కలిగిన ఇంక్యుబేటర్ ఏర్పాటు చేశారు. ఇంక్యుబేటర్‌లో 18 రోజుల వరకు గుడ్లను పొదిగి ఆ తర్వాత 5వేల గుడ్ల సామర్థ్యం కలిగిన హాచింగ్ యూనిట్లోకి మారుస్తారు. అందులో మూడు రోజులపాటు ఉంచుతారు. మొత్తం 21 రోజుల పాటు కృత్రిమంగా పొదిగించిన తర్వాత పిల్ల లు బయటకు వస్తాయి. బ్రూడింగ్(పెంచడం) చేసిన అనంతరం అవసరం ఉన్నవారికి అందజేస్తున్నారు. ప్రతీనెల ఉత్పత్తి అయిన కనీసం 10వేల కోడి పిల్లలను రఘనాథపల్లి మండలం కోమళలో ఉన్న మదర్ యూనిట్ ద్వారా అందజేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడి వనరాజా, గిరిరాజా, గ్రామప్రియ, రాజశ్రీ కోడిపిల్లలు సబ్సిడీపై సరఫరా అవుతున్నాయి. ఈ ఫామ్‌లో ఏడాదికి రూ.1.20లక్షల పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. వనరాజా పెరటి కోళ్లను వివిద శాఖల అధికారులు రాయితీపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీపై అందజేస్తున్నారు. సబ్సిడీ ఇలా.. పెరటికోళ్ల పెంచుకునేందుకు ఆసక్తి ఉన్న రైతులు, యువత, మహిళలు మార్చి, ఏప్రిల్, మే నెలలో ముందుగా మండల పశువైద్యాధికారిని సంప్రదించి ధరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి మండలానికి 20 నుంచి 30 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లా అధికారి ఆమోదం తెలిపిన జాబితా వచ్చాక మండల పశువైద్యశాఖ అధికారుల ద్వారా మామునూరు కోళ్ల ఉత్పత్తి కేంద్రంలో 45 కోళ్ల చొప్పున సబ్సిడీపై అందజేస్తారు. రెండు విడతలుగా 25, 20 కోళ్లను పంపిణీ చేస్తారు. 4–6వారాల వయస్సు ఉన్న ఈ పిల్లలకు ఒక్కో దానికి మొత్తం ధర రూ.68 ఉండగా.. రూ.50 సబ్సిడీ పోగా రూ.18 చెల్లిస్తే కోళ్లు ఇస్తారు. వనరాజా కోళ్ల పెంపకం.. గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకోవడానికి వనరాజ కోళ్లు అనుకూలం, లాభదాయకం. పెంపకం ఖర్చులు చాలా తక్కువగా ఉండడంతో పాటు గుడ్డు పెద్దసైజులో వస్తుంది. ఆరు వారాల వయస్సులో కోడి 700 నుంచి 850 గ్రాముల బరువు ఉంటే దేశవాళీ కోడి కేవలం 250నుంచి 400వరకు బరువు ఉంటుంది. దేశవాళీ కోడిగుడ్లు బరువు కేవలం 28నుంచి 40గ్రాముల మధ్యలో ఉంటాయి. పెరటికోళ్ల రకాలు.. వనరాజా, గిరిరాజా, గ్రామరాజా, రాజశ్రీ కోళ్లు ఆత్యంత ఆకర్షణ లక్షణాలతో రంగు ల రెక్కలతో ఉంటాయి. వీటికి అధిక రోగ నిరోధక శక్తి ఉంటుంది. పెద్ద సైజు గుడ్లు ఉత్పాదన, పెంపంకంపై ఖర్చు తక్కువ, ఎక్కువ రోజుల వరకు బతికే కలిగే సామర్థ్యం వీటి గుడ్లను దేశీ కోళ్లు కూడా పొదగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. పెంపకంలో జాగ్రత్తలు 4–6వారాల వయస్సు దాటిన తర్వాత వీటీని పెరట్లో పెంపకానికి విడిచిపెట్టొచ్చు. సాయంకాలం ఆయ్యే సరికి ఇవి తమ గూటికి చేరుకునేటట్టు మొదటి నుండే అలవాటు చేయాలి. రోగాల బారిన పడినప్పుడు ఒక డోసు వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది. పెరటి కోళ్ల పెంపకం లాభదాయకం.. పెరటి కోళ్ల పెంపకం అత్యంత లాభదాయకం. మండల పశువైద్యాధికారి అందించిన జాబితా ప్రకారం సబ్సిడీపై లబ్ధిదారులకు కోళ్లను అందజేస్తాం. మనరాజా కోడి పిల్లలు అవసరం, ఆసక్తి ఉన్న వారు నేరుగా లేక 98490 01612 నంబర్లో సంప్రదించవచ్చు. వనరాజా కోళ్లు పెంపకం చేపడితే అదనపు అదాయం సమకూరుతుంది. తక్కువ కాల పరిమితిలో మంచి మాంసం, గుడ్ల ద్వారా సంపాదన లభిస్తుంది. వీటి పెంపకంలో ఖర్చు కూడా చాలా తక్కువ.– డాక్టర్ ఎం.డీ.జాకీర్ అలీ, ఫాం ఇన్చార్జి