హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగం నష్టాల ఊబి నుంచి గట్టెక్కాలంటే దేశ స్థాయిలో ఎగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు డిమాండ్ చేశారు. అప్పుడే రైతుకు మద్దతు ధర లభిస్తుందని, పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పారు.
‘ఉత్పత్తి వ్యయాలకు తగ్గట్టుగా మాత్రమే గుడ్డు ధర నిర్ణయించాలి. మార్కెట్లో ధర విషయంలో పూర్తిగా బోర్డుదే తుది నిర్ణయం కావాలి. తద్వారా రైతులకు, వినియోగదార్లకు ప్రయోజనం ఉంటుంది. బోర్డుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ప్రభుత్వమే గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. లేదా ప్రైవేటు గిడ్డంగులను లీజుకు తీసుకోవాలి.
డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాను కట్టడి చేయాలి. బోర్డు కార్యరూపంలోకి వస్తే కొత్తగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పౌల్ట్రీకి పూర్తిగా వ్యవసాయ రంగ హోదా ఇచ్చి ప్రయోజనాలు కల్పించాలి’ అని వివరించారు. రైతులు ఒక్కో గుడ్డు ఉత్పత్తిపై సగటున 50–60 పైసలు, బ్రాయిలర్‌పై రూ.10–20 నష్టపోతున్నారని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కాసర్ల మోహన్ రెడ్డి తెలిపారు.
నేటి నుంచి పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో..
పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో 22–25 తేదీల్లో ఇక్కడి హైటెక్స్‌లో జరుగనుంది. తొలిరోజు నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్ నిర్వహిస్తారు. 370 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రధర్ రావు పొట్లూరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment