సాక్షి, కోలారు: కోడి మాంసమంటే ప్రజలు వద్దు బాబోయ్ అంటున్నారు. చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతుండడంతో భయాందోళనలను వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో కోళ్ల వ్యాపారానికి దెబ్బ తగులుతోంది. గత 15 రోజుల నుంచి సోషల్ మీడియాలో కోడి మాంసం వల్ల కరోనా జబ్బు సోకుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు కోడి మాంసం కొనడానికి వెనుకంజ వేస్తుండగా, గిరాకీలు లేక కోళ్ల ఫారందారులను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. హోటళ్లలో చికెన్ వంటకాలకు డిమాండు లేక వ్యాపారాలు తగ్గిపోయినట్లు యజమానులు చెబుతున్నారు. ఫారాల్లో కోళ్లు అమ్ముడుపోవడం లేదని నిట్టూరుస్తున్నారు.
అమ్ముడుపోని కోళ్లు
కోలారు జిల్లావ్యాప్తంగా సుమారు 300లకు పైగా కోళ్లఫారంలు ఉన్నాయి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి కోళ్ల పారం నిర్వహిస్తున్నారు. రైతులు, ఔత్సాహికులు ఫారాలను నిర్వహిస్తున్నారు. కోళ్లను కొనక పోవడం వల్ల భారీగా నష్టం కలుగుతోందని తెలిపారు. వైరస్ భయంతో ప్రజలు కోడి మాంసం తినడం లేదు.
భారీగా తగ్గిన ధరలు
కోళ్ల ఫారంలలో కోళ్ల ధర కేజీకి 80 నుంచి రూ. 30కి పడిపోయింది. దీని వల్ల ప్రతి కిలోకు 50 రూపాయల నష్టం కలుగుతోంది. బంగారుపేట తాలూకాలోనే వందకు పైగా కోళ్ల ఫారంలు ఉన్నాయి. బూదికోట ఫిర్కాలో 30 సుగుణ కోళ్ళ ఫారంలు ఉన్నాయి. కొనేవారు లేక వాటిలో కోళ్లు పెద్దసంఖ్యలో కిక్కిరిశాయి. ఫారం కోడి పుట్టిన 40 రోజులకు 2.5 నుంచి 3 కిలోల వరకు బరువు తూగుతుంది. పలు కంపెనీల వారు, చికెన్ వ్యాపారులు కోళ్ళ ఫారంకు వచ్చి కోళ్లను ఖరీదు చేస్తారు. వైరస్ భయంతో గిరాకీ తగ్గిందని కంపెనీలు 50 రోజుల నుంచి ఫారం వైపునకు రావడం లేదు. దీంతో ఫారం యజమానులు గగ్గోలు పెడుతున్నారు. చికెన్ షాపుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు ధర భారీగా తగ్గడంతో కొందరు ఇదే అదను అని ధైర్యం చేసి ఫుల్లుగా లాగిస్తున్నారు.
కోళ్లకు, కరోనాకు సంబంధం లేదు
జగదీష్‌కుమార్ దీనిపై స్పందిస్తూ, కరోనా వైరస్‌కు– కోళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సోషల్ మీడియా తప్పు ప్రచారం వల్ల ఇలా జరుగుతోంది దీనిపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని తెలిపారు. చికెన్‌ను నిర్భయంగా తినవచ్చని అన్నారు.
– పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment