Low prices
-
చౌక 5జీ ఫోన్ల మోత!
5జీ ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? పండుగ సీజన్ వరకు కాస్త ఓపిక పట్టండి! ఎందుకంటారా? భారీగా ఆదా చేసే చాన్స్ రాబోతోంది. రాబోయే పండుగల్లో చౌక 5జీ ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ప్రధానంగా హ్యాండ్సెట్ల తయారీలో కీలకమైన 5జీ చిప్సెట్లను చిప్ తయారీ బ్రాండ్లు తక్కువ ధరల్లో విడుదల చేస్తుండటంతో ఫోన్ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతోంది. దీంతో ఈ ఏడాది చివరికల్లా దేశంలో 5జీ హ్యాండ్సెట్ల మార్కెట్ భారీగా ఎగబాకుతుందనేది పరిశ్రమ వర్గాల అంచనా.మనం ఇప్పటికే 5జీ యుగంలోకి అడగుపెట్టేశాం. ఒకపక్క టెలికం కంపెనీలు 5జీ నెట్వర్క్ విస్తరణకు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. మరోపక్క మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు కూడా 5జీ హ్యాండ్సెట్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీంతో ఫోన్ కొనుగోలుదారులకు ఇక ‘పండుగే’! ప్రస్తుతం దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల ధర రూ. 11,000–13,000 మధ్య ప్రారంభమవుతోంది. కొన్ని ఫోన్ బ్రాండ్లు అప్పుడప్పుడు ప్రమోషనల్ ఆఫర్లను అందిస్తుండటంతో ధర కొంచెం తగ్గుతోంది. అయితే, చిప్ తయారీ సంస్థలు చౌక 5జీ చిప్సెట్లను అందుబాటులోకి తెస్తుండటంతో ఫోన్ రేట్లు భారీగా దిగిరానున్నాయి. చిప్.. చిప్.. హుర్రే! తాజాగా భారత్ కోసం చైనా చిప్సెట్ బ్రాండ్ యూనిసాక్ ‘టీ760’ చిప్‌సెట్‌ను విడుదల చేసింది. ప్రధాన మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు అందుబాటు ధరల్లో 5జీ ఫోన్ల విడుదలకు చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో రూ. 10,000 లోపు ధరల్లో 5జీ ఫోన్లకు మార్గం సుగమం కానుంది. యూనిసాక్ బాటలోనే మొబైల్ చిప్సెట్లలో దిగ్గజ బ్రాండ్లైన క్వాల్కామ్, మీడియాటెక్ కూడా చౌక 5జీ చిప్సెట్లను అందించనున్నాయి. ‘అతి త్వరలోనే’ బడ్జెట్, ఎంట్రీలెవెల్ 5జీ హ్యాండ్సెట్ల కోసం చిప్సెట్లను తీసుకొస్తామని క్వాల్కామ్ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. మీడియాటెక్ ‘డైమెన్సిటీ 6000 సిరీస్’ ఎంట్రీలెవెల్ చిప్సెట్ చౌకగా స్మార్ట్ ఫోన్లను అందించేందుకు వీలుకల్పిస్తుందని ఆ కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ అనూజ్ సిద్ధార్థ్ చెప్పా రు. ‘2జీ, 4జీ విభాగాల్లో యూనిసాక్ చిప్సెట్ల వాటా పటిష్టంగా ఉంది. టీ760తో భారత్‌లో అందరికీ చౌక 5జీ ఫోన్లను అందించడమే మా లక్ష్యం. దీనికోసం కీలక ఫోన్ తయారీదారులతో జట్టు కడుతున్నాం. టీ760 చిప్సెట్ మెరుగైన పనితీరుతో భారత్ 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తాం’ అని యూనిసాక్ కంపెనీ పేర్కొంది. ఇక 5జీ మార్కెట్ జోరు... చిప్సెట్ల రేట్లు దిగిరావడం, చౌక ఫోన్ల లభ్యతతో ఈ ఏడాది చివరికల్లా 5జీ ఫోన్ల మార్కెట్ వాటా రెండంకెల స్థాయికి చేరుకోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘రూ. 10,000 విభాగంలో 5జీ ఫోన్ల వాటా ఈ ఏడాది మే నాటికి కేవలం 1.4 శాతం మాత్రమే ఉంది. చౌక చిప్సెట్ల ప్రభావంతో డిసెంబర్ నాటికి ఈ వాటా 10 శాతానికి చేరుకోనుంది’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. ట్రాన్సియన్ హోల్డింగ్స్ (టెక్నో, ఇన్ఫినిక్స్, ఐటెల్ తదితర మొబైల్ బ్రాండ్స్), హెచ్ఎండీ గ్లోబల్ (నోకియా బ్రాండ్), రియల్మీ, రెడ్మీ వంటి కంపెనీలు దసరా, దీపావళి పండుగ సీజన్లో చౌక 5జీ హ్యాండ్సెట్లను ప్రవేశపెట్టే సన్నాహాల్లో ఉన్నాయి. ‘ట్రాన్సియన్ వంటి కీలక తయారీదారు భారీ ప్రణాళికల్లో ఉండటంతో రూ.10,000 లోపు 5జీ హ్యాండ్సెట్ల మార్కెట్ దూసుకుపోనుంది. 5జీ ఫోన్ల విడుదలకు సంబంధించి మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నాం’ అని ట్రాన్సియన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరిజీత్ తలపాత్ర పేర్కొన్నారు.ఈ ఏడాది మే నాటికి రూ.10,000 లోపు 5జీ హ్యాండ్సెట్ల అమ్మకాల వాటా: 1.4% డిసెంబర్ కల్లా దేశీ ఫోన్ల మార్కెట్లో 5జీ మొబైల్స్ సేల్స్ పరిమాణం (కౌంటర్ పాయింట్ అంచనా): 10% ఎంట్రీలెవెల్ 5జీ సెగ్మెంట్లో టాప్ కంపెనీలు: ట్రాన్సియన్, హెచ్ఎండీ గ్లోబల్, రియల్మీ, రెడ్మీ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
AICPDF: ఎఫ్ఎంసీజీ.. అన్నేసి ప్యాక్‌లు వద్దు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం తక్కువ ధరల ప్యాక్‌లను ప్రవేశపెట్టడం వల్ల ప్రస్తుత నెట్‌వర్క్‌పై అదనపు భారం పడినట్టు పంపిణీదారులు పేర్కొంటున్నారు. ప్యాకింగ్ సైజులను నాలుగు ప్రధాన కేటగిరీలుగా ప్రామాణీకరించాలని కోరుతున్నారు. ఆరంభ ప్యాక్, చిన్న ప్యాక్, మధ్యస్థ ప్యాక్, పెద్ద ప్యాక్ ఇలా నాలుగు విభాగాలుగా ఉండాలని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్ (ఏఐసీపీడీఎఫ్) డిమాండ్ చేసింది. గ్రామీణ మార్కెట్లలో విక్రయాలు పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తక్కువ ధరల ప్యాక్‌లను ప్రవేశపెట్టాయి. దీంతో ధరల పరంగా వినియోగదారుల్లో అయోమయం ఏర్పడినట్టు, స్టాక్ నిర్వహణ పరంగా సవాళ్లు ఎదురవుతున్నట్టు ఏఐసీపీడీఎఫ్ తెలిపింది. ఒకే ధరలో పరిమాణం పరంగా వ్యత్యాసం ఉంటుండడం వినియోగదారుల్లో అయోమయాన్ని కలిగిస్తున్నట్టు ఏఐసీపీడీఎఫ్ ప్రెసిడెంట్ ధైర్యíÙల్ పాటిల్ చెప్పారు. నిల్వ వసతులు పరిమితంగా ఉన్నప్పుడు కంపెనీలు తీసుకొచ్చే ఇన్నేసి రకాల సైజుల ఉత్పత్తులను నిర్వహించడం పెద్ద సవాలుగా పేర్కొన్నారు. దీంతో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను నాలుగు ప్రామాణిక ప్యాక్ సైజులు కింద వర్గీకరించాలని కేంద్ర ప్రజా పంపిణీ శాఖకు ఏఐసీపీడీఎఫ్ సూచించింది. ‘‘ప్రామాణిక ప్యాకేజింగ్ సైజులకు ఉత్పత్తులను క్రమబద్ధీకరించడం వల్ల నిర్వహణ సులభతరం అవుతుంది. రిటైలర్లకు సంక్లిష్టతలు తగ్గుతాయి. వినియోగదారుల్లో అయోమయాన్ని పోగొట్టొచ్చు’’అని పేర్కొంది. ఒకవైపు మార్కెట్ విస్తరణతోపాటు, మ రోవైపు ఉత్పత్తుల పంపిణీ నెట్వర్క్ సాఫీగా నడిచేందుకు వీలుగా ప్యాకింగ్ సైజులు ఉండాలని అభిప్రాయపడింది. కంపెనీలు ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు తాము ప్రోత్సాహం ఇస్తామని, మరింత వ్యవస్థీకృత, వినియోగదారు అనుకూల మార్కెట్ కోసం కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఏఐసీపీడీఎఫ్ అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీల డీలర్లు, పంపిణీదారులు, స్టాకిస్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. -
చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్‌లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ రేటు కంటే తక్కువ ధర అని సామాన్య ప్రజలకు ఆశ చూపిస్తూ.. తనది కాని స్థలంలో ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తానని నమ్మబలుకుతూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్న బిల్డర్లకు కంచె వేయాలని డెవలపర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరాయి. అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) కింద విక్రయాలను చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు అనుమతులను, రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సూచించా రు. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు ఆయా ప్రాజెక్ట్‌లకు రుణాలను మంజూరు చేయవద్దని కోరాయి. నిర్మాణ రంగానికి భద్రత, భరోసా కల్పించకపోతే గ్లోబల్ హైదరాబాద్ ఎదుగుదలకు యూడీఎస్ డెవలపర్లు విరోధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ, రెరాలకు శాశ్వత కమిషనర్లను నియమించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ప్రజలలో విస్తృతమైన అవగాహన చేపట్టాలని సూచించారు. శుక్రవారం క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంఘాల సమావేశం జరిగింది. ► గతంలో చైనా కంపెనీలు పోన్జీ స్కీమ్‌లతో ఎలాగైతే అమాయక కస్టమర్ల నుంచి కోట్ల రూపాయాలను కొల్లగొట్టాయో.. అదే విధంగా యూడీఎస్ విక్రయాలతో కొందరు డెవలపర్లు తయారయ్యారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు ఆరోపించారు. ప్రారంభ దశలోనే ఆయా డెవలపర్లను ఆడ్డుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులు గాల్లో కలిసిపోతాయని తెలిపారు. గత ఏడాదిన్నర క్రితం ఒకట్రెండు యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసిన కస్టమర్లు నిర్మాణ పనులు ప్రారంభం కాక, కట్టిన డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవటంతో రోజూ డెవలపర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. సంఘటిత నిర్మాణ రంగానికి యూడీఎస్ ఒక కేన్సర్ మహమ్మారి లాగా తయారవుతోందని... దీన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించాలి. లేకపోతే ఝాడ్యం ముదిరి బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ► హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడమే పరమావధిగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లు చేపట్టడుతున్నారు. మార్కెట్ రేటు కంటే 50 శాతం తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండటంతో కస్టమర్లు ఆశ పడుతున్నారు. ముందు వెనకా ఆలోచించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకపోయినా, ఆయా స్థలానికి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా లేదా సంబంధిత భూమి కన్జర్వేషన్ జోన్ లేదా 111 జీవో పరిధిలో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు. కస్టమర్ల పెట్టుబడులకు భరోసా లేదు. భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా కొనుగోలుదారులు మోసపోయామని తెలుసుకొని వినియోగదారుల ఫోరంకు, రెరాకు వెళ్లినా లాభం ఉండదు. సివిల్ కోర్ట్‌కు పోతే ఎన్నేళ్లు పడుతుందో బహిరంగ రహస్యమే. ► గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, మన రాష్ట్రంలో రెరా అమలు అంతంత మాత్రంగానే సాగుతోందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ మార్కెట్లో 60–70 శాతం కొనుగోళ్లు అంతిమ గృహ కొనుగోలుదారులు, 30–40 శాతం పెట్టుబడిదారులుంటారు. ఇలాంటి చోట కస్టమర్ల పెట్టుబడులకు భద్రత కల్పించాల్సిన రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమ పద్దతిలో నిర్మాణాలు, విక్రయాలు చేపడుతున్న డెవలపర్లను ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు డెవలపర్ల సంఘాలు ప్రభుత్వంతో కలిసి వస్తాయని తెలిపారు. ► రెరాలో డెవలపర్లే కాదు కొనుగోలుదారులకు శిక్ష ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు. రెరాలో నమోదు కాని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయాలన్న ప్రాథమిక నిబంధనలను మరిచిపోయి తక్కువ ధర అని ఆశ పడి యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసినందుకు మీకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం, రెరా న్యాయం చేయవని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణా రెడ్డి తెలిపారు. సామాన్య, మధ్యతరగతి నుంచి ముందస్తు సొమ్ము వసూలు చేసి.. అక్రమ డెవలపర్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎవరు చేస్తున్నారో చెప్పరు! యూడీఎస్, ప్రీలాంచ్లలో కొనుగోలు చేయొద్దని, కష్టార్జితాన్ని బూదిదపాలు చేసుకోవద్దని కొనుగోలుదారులకు డెవలపర్ల సంఘాలు సూచిస్తుండటం ప్రశంసించదగ్గ పరిణామమే. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లను ఎవరు చేపడుతున్నారో తెలపమని విలేకరులు ప్రశ్నించగా.. ప్రమోటర్ల పేర్లు బయటకు రాకుండా ఏజెంట్లతో దందా నడిపిస్తున్నారని సమాధానం ఇచ్చారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా సంఘటిత డెవలపర్లకు ఏజెంట్లకు 1.5–2 శాతం కమీషన్ ఇస్తుంటే.. యూడీఎస్ డెవలపర్లు మాత్రం 5–10 శాతం కమీషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయని, కానీ, చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఆడిట్ బుక్స్ పరిశీలిస్తే తతంగం బయటపడుతుందని పేర్కొన్నారు. డెవలపర్ల సంఘాల దృష్టికి వచ్చిన యూడీఎస్ ఏజెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తదితరలు పాల్గొన్నారు. ► జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గృహ కొనుగోలుకు ముందు కొనుగోలుదారులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే.. వారికి మార్గనిర్ధేశనం చేయాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. దీంతో అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలతో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కన్జర్వేషన్ జోన్, 111 జీవో పరిధిలోనూ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని దీంతో హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ రేట్‌ను అంచనా వేయకుండా నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండా ఆకాశంలో మేడలు కడతామని ఆశచూపిస్తూ అమాయకులను కలలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ► చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు డెవలపర్లు అక్రమంగా ప్రాజెక్ట్‌లు, విక్రయాలు చేపడుతున్నారు. తక్కువ ధర అని ఆశ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంఘటిత నిర్మాణ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలపర్లపై కూడా ఉందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ సీ ప్రభాకర్‌రావు అన్నారు. అందుకే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ► నోయిడా, గ్రేటర్ నోయిడాలో విక్రయించిన యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో ధర మార్కెట్ రేటుతో సమానంగా విక్రయించారు. అయినా సరే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అలాంటిది మన దగ్గర మార్కెట్ రేటు కంటే సగం ధరకే యూడీఎస్ స్కీమ్‌లో విక్రయాలు చేపడుతున్నారు. మరి, ఇక్కడెలా నిర్మాణాలు చేయగలరనేది కొనుగోలుదారులు ప్రశ్నించుకోవాలని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు అన్నారు. చిన్న వస్తువును కొంటే ఐఎస్ఐ మార్క్ ఉందా? బ్రాండెడేనా అనా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఈ రోజుల్లో.. లక్షల్లో వెచ్చించే గృహ కొనుగోలు సమయంలో డెవలపర్ చరిత్ర, నిర్మాణ అనుమతులు, రెరా నమోదు వంటి కీలక అంశాలు పరిశీలించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రిస్క్ లేని చోట పది గజాలు తక్కువైనా మంచిది గడువు లోగా నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఓపెన్‌స్పేస్, పార్క్‌లు, సెట్‌బ్యాక్స్, పర్మిషన్స్, అంతస్తుల సంఖ్య.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కొనుగోలుకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. ఎకరం రూ.50 కోట్లు ఉంటే 50 అంతస్తులు, రూ.40 కోట్లు ఉంటే 40 ఫ్లోర్లు.. ఇలా ఎంత రేటు ఉంటే అన్ని అంతస్తులు నిర్మిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు రేటు తక్కువ చూపించేందుకే ఈ అసత్య ప్రచారమని తెలిపారు. -
అతి తక్కువ ధరలకే కూరగాయాల విక్రయం
-
కోడి కూర.. మాకొద్దు బాబోయ్
సాక్షి, కోలారు: కోడి మాంసమంటే ప్రజలు వద్దు బాబోయ్ అంటున్నారు. చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతుండడంతో భయాందోళనలను వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో కోళ్ల వ్యాపారానికి దెబ్బ తగులుతోంది. గత 15 రోజుల నుంచి సోషల్ మీడియాలో కోడి మాంసం వల్ల కరోనా జబ్బు సోకుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు కోడి మాంసం కొనడానికి వెనుకంజ వేస్తుండగా, గిరాకీలు లేక కోళ్ల ఫారందారులను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. హోటళ్లలో చికెన్ వంటకాలకు డిమాండు లేక వ్యాపారాలు తగ్గిపోయినట్లు యజమానులు చెబుతున్నారు. ఫారాల్లో కోళ్లు అమ్ముడుపోవడం లేదని నిట్టూరుస్తున్నారు. అమ్ముడుపోని కోళ్లు కోలారు జిల్లావ్యాప్తంగా సుమారు 300లకు పైగా కోళ్లఫారంలు ఉన్నాయి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి కోళ్ల పారం నిర్వహిస్తున్నారు. రైతులు, ఔత్సాహికులు ఫారాలను నిర్వహిస్తున్నారు. కోళ్లను కొనక పోవడం వల్ల భారీగా నష్టం కలుగుతోందని తెలిపారు. వైరస్ భయంతో ప్రజలు కోడి మాంసం తినడం లేదు. భారీగా తగ్గిన ధరలు కోళ్ల ఫారంలలో కోళ్ల ధర కేజీకి 80 నుంచి రూ. 30కి పడిపోయింది. దీని వల్ల ప్రతి కిలోకు 50 రూపాయల నష్టం కలుగుతోంది. బంగారుపేట తాలూకాలోనే వందకు పైగా కోళ్ల ఫారంలు ఉన్నాయి. బూదికోట ఫిర్కాలో 30 సుగుణ కోళ్ళ ఫారంలు ఉన్నాయి. కొనేవారు లేక వాటిలో కోళ్లు పెద్దసంఖ్యలో కిక్కిరిశాయి. ఫారం కోడి పుట్టిన 40 రోజులకు 2.5 నుంచి 3 కిలోల వరకు బరువు తూగుతుంది. పలు కంపెనీల వారు, చికెన్ వ్యాపారులు కోళ్ళ ఫారంకు వచ్చి కోళ్లను ఖరీదు చేస్తారు. వైరస్ భయంతో గిరాకీ తగ్గిందని కంపెనీలు 50 రోజుల నుంచి ఫారం వైపునకు రావడం లేదు. దీంతో ఫారం యజమానులు గగ్గోలు పెడుతున్నారు. చికెన్ షాపుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు ధర భారీగా తగ్గడంతో కొందరు ఇదే అదను అని ధైర్యం చేసి ఫుల్లుగా లాగిస్తున్నారు. కోళ్లకు, కరోనాకు సంబంధం లేదు జగదీష్‌కుమార్ దీనిపై స్పందిస్తూ, కరోనా వైరస్‌కు– కోళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సోషల్ మీడియా తప్పు ప్రచారం వల్ల ఇలా జరుగుతోంది దీనిపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని తెలిపారు. చికెన్‌ను నిర్భయంగా తినవచ్చని అన్నారు. – పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్‌కుమార్ -
పెట్రోల్ ధర తగ్గుతుంది!
ముంబై: పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ను కలపడం ద్వారా ఇంధనం ధరను, కాలుష్యాన్ని కూడా తగ్గించే విధానాన్ని తమ ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తానే ప్రకటన చేస్తానన్నారు. లీటర్ పెట్రోల్ ఖరీదు దాదాపు 80 రూపాయలు ఉంటుండగా, బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే లీటర్ మిథనాల్ మాత్రం రూ.22కే లభిస్తుందనీ, చైనాలో అయితే ఈ ధర మరీ రూ.17 మాత్రమేనని గడ్కారీ వివరించారు. స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోల్వో ముంబై కోసం పూర్తిగా మిథనాల్‌తో నడిచే ప్రత్యేక బస్సులను తయారుచేసిందనీ, త్వరలోనే 25 బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. మిథనాల్‌ను ముంబైలో ఉన్న స్థానిక పరిశ్రమల నుంచే ఉత్పత్తి చేయవచ్చనీ, వాటి నుంచి వచ్చే ఇంధనాన్నే ఈ బస్సులకు వాడతామన్నారు. పెట్రోలియం శుద్ధి పరిశ్రమలను నిర్మించేందుకు రూ.70 వేల కోట్లు ఖర్చవుతుండగా, మిథనాల్‌పై అయితే ఈ వ్యయం రూ.లక్షన్నర కోట్లుగా ఉంటున్నప్పటికీ...మిథనాల్‌పై దృష్టి పెట్టాల్సిందిగా తాను పెట్రోలియం శాఖ మంత్రికి సూచించానన్నారు. దేశంలో పెరిగిపోతున్న వాహనాల సంఖ్యపై గడ్కారీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము సగటున రోజుకు 28 కిలో మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామనీ, త్వరలోనే దీనిని 40 కిలో మీటర్లకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. 2018లో 20 వేల కిలోమీటర్ల పొడవైన రహదారులను నిర్మిస్తామన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయనీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘జాతీయ రహదారుల, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ’ (ఎన్హెచ్ఐడీసీఎల్–నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ను స్థాపించామని ఆయన చెప్పారు. -
మీ బడ్జెట్లోనే.. స్మార్ట్ అయిపోండిలా..!
-
‘చౌక’ సరుకులపై సర్కారు నీళ్లు!
విలేజ్ మాల్స్ ప్రతిపాదనను పక్కన పెట్టిన ప్రభుత్వం దసరా నుంచి 18 వస్తువులను చౌకగా అందిస్తామని హామీ కొత్త సంవత్సరం వస్తున్నా పట్టించుకోని పౌరసరఫరాల శాఖ సాక్షి, హైదరాబాద్: విలేజ్ మాల్స్ ద్వారా చౌక ధరలకు సరుకులు అందుతాయనుకుంటున్న ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. దసరా నుంచి విలేజ్ మాల్స్ ద్వారా 18 రకాల సరుకులను చౌక ధరలకే అందిస్తామని ప్రకటించిన పౌరసరఫరాల శాఖ.. ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదు. కొత్త సంవత్సరం వస్తున్నా దాని గురించి ఆలోచించడంలేదు. ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేసిందని, ఇక విలేజ్ మాల్స్ కథ కంచికి చేరినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దసరా నుంచి రాష్ట్రవ్యాప్తంగా 46 వేల గ్రామాల్లో విలేజ్ మాల్స్ ఏర్పాటు చేసి 18 రకాల వస్తువులను సరసమైన ధరలకు అందిస్తామని పౌరసరఫరాల కార్పొరేషన్ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. ఉత్పత్తిదారుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసిన వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా తక్కువ ధరతో ప్రజలకు అందించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రజలు నిత్యం వినియోగించే కాఫీ పొడి, టీ పొడి, సబ్బులు, టాల్కం పౌడర్, డిటర్జెంట్లు, టూత్‌పేస్టులు తదితర 18 రకాల వస్తువులను విక్రయించాలని నిర్ణయించారు. తర్వాత మరిన్ని వస్తువులను ఇందులో చేర్చాలని యోచించారు. తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన సంస్థలకు చెందిన వస్తువులను చౌక ధరల దుకాణాల డీలర్ల ద్వారా అమ్మించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ‘‘46 వేల చౌక దుకాణాల్లో సరుకులు అమ్మితే తయారీ సంస్థలకు కూడా మేలు జరుగుతుంది. ఉత్పత్తి సంస్థలు రాష్ట్ర స్థాయి అధీకృత డీలర్లకు ఇచ్చే ధరలకే వస్తువులను చౌక ధరల దుకాణాలకు సరఫరా చేస్తారు. దీంతో చౌక దుకాణాలను విలేజ్ మాల్స్‌లా మార్చి తక్కువ ధరకు గ్రామీణ ప్రజలకు సరుకులు అందించవవచ్చు. దీని వల్ల ప్రజలకు మేలు జరగడమేకాకుండా చౌక దుకాణాల డీలర్ల ఆదాయం కూడా కొంత పెరుగుతుంది’’ అని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఇది మంచి ఆలోచన అయినా దీనిని ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఈ విషయమై పౌరసరఫరాల సంస్థ అధికారులను సంప్రదించగా.. ‘‘కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలను క్రమబద్ధంగా నిర్వహించాలంటేనే తలనొప్పి తప్పడంలేదు. కొత్త తలనొప్పులు ఎక్కడ తెచ్చుకుంటాం’’ అని ప్రశ్నిస్తున్నారు. ఉన్న పథకాలను సక్రమంగా నిర్వర్తించడానికే ప్రాధాన్యం ఇస్తామని పౌరసరఫరాల అధికారి ఒకరు అన్నారు.