
ముంబై: పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ను కలపడం ద్వారా ఇంధనం ధరను, కాలుష్యాన్ని కూడా తగ్గించే విధానాన్ని తమ ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తానే ప్రకటన చేస్తానన్నారు. లీటర్ పెట్రోల్ ఖరీదు దాదాపు 80 రూపాయలు ఉంటుండగా, బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే లీటర్ మిథనాల్ మాత్రం రూ.22కే లభిస్తుందనీ, చైనాలో అయితే ఈ ధర మరీ రూ.17 మాత్రమేనని గడ్కారీ వివరించారు.
స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోల్వో ముంబై కోసం పూర్తిగా మిథనాల్‌తో నడిచే ప్రత్యేక బస్సులను తయారుచేసిందనీ, త్వరలోనే 25 బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. మిథనాల్‌ను ముంబైలో ఉన్న స్థానిక పరిశ్రమల నుంచే ఉత్పత్తి చేయవచ్చనీ, వాటి నుంచి వచ్చే ఇంధనాన్నే ఈ బస్సులకు వాడతామన్నారు. పెట్రోలియం శుద్ధి పరిశ్రమలను నిర్మించేందుకు రూ.70 వేల కోట్లు ఖర్చవుతుండగా, మిథనాల్‌పై అయితే ఈ వ్యయం రూ.లక్షన్నర కోట్లుగా ఉంటున్నప్పటికీ...మిథనాల్‌పై దృష్టి పెట్టాల్సిందిగా తాను పెట్రోలియం శాఖ మంత్రికి సూచించానన్నారు.
దేశంలో పెరిగిపోతున్న వాహనాల సంఖ్యపై గడ్కారీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము సగటున రోజుకు 28 కిలో మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామనీ, త్వరలోనే దీనిని 40 కిలో మీటర్లకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. 2018లో 20 వేల కిలోమీటర్ల పొడవైన రహదారులను నిర్మిస్తామన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయనీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘జాతీయ రహదారుల, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ’ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్–నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ను స్థాపించామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment