మిథనాల్.. పెట్రోల్ ప్రత్యామ్నాయం | Methanol is a petrol alternative | Sakshi
Sakshi News home page

మిథనాల్.. పెట్రోల్ ప్రత్యామ్నాయం

Published Mon, Sep 12 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

మిథనాల్.. పెట్రోల్ ప్రత్యామ్నాయం

మిథనాల్.. పెట్రోల్ ప్రత్యామ్నాయం

భవిష్యత్తులో పెట్రో ఉత్పత్తుల దిగుమతి రహిత దేశంగా భారత్
     
ఏడాదికి రూ. 4.5 లక్షల కోట్ల ఆదా..
మిథనాల్ వాడకంపై నీతి ఆయోగ్ సదస్సులో ఏకాభిప్రాయం
పెట్రోల్‌లో కలిపి వాడవచ్చంటున్న పరిశోధకులు
గ్రామీణ, పట్టణ చెత్త, బొగ్గు బూడిద నుంచి తయారీ
 
 న్యూఢిల్లీ:
మిథనాల్... దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని మార్చే సంజీవని... పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన ఇంధనం... ఇది సాకారమైతే ఏడాదికి రూ.4.5 లక్షల కోట్ల ఖర్చుకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు. ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల దిగుమతికి భారత్ వెచ్చిస్తోన్న మొత్తం అది. ముడిచమురు ధరలు చుక్కల్ని తాకితే అది రూ. 7.5 లక్షల కోట్లకు పైనే.. అందుకే భారత్‌ను పెట్రో దిగుమతి రహిత దేశంగా మార్చేస్తే... అగ్రదేశాల జాబితాలో చే రవచ్చని కేంద్రం భావిస్తోంది. మిథనాల్ ఎకానమీని నిజం చేస్తామంటోంది...

దేశ దిగుమతుల్లో ముడిచమురు, సహజవాయువుల వాటా 60 శాతంపైనే... ఈ పెట్రో దిగుమతులు లేకపోతే దేశ ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుందన్న అంచనాల నేపథ్యంలో మిథనాల్‌ను ఇంధనంగా తెరపైకి తీసుకొచ్చారు. గతవారం ఢిల్లీలో మిథనాల్ ఎకానమీపై నీతి ఆయోగ్ ప్రత్యేక సదస్సు నిర్వహించింది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మిథనాల్ వాడితే భారత్ ఇంధన స్వయం సమృద్ధి దేశంగా మారుతుందంటూ ఏకాభిప్రాయం వ్యక్తమైంది. భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదాతో పాటు, పర్యావరణానికి మేలు చేయవచ్చని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, మేథావులు, పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సదస్సులో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడుతూ... త్వరలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి రహిత దేశంగా భారత్ మారుతుందనే ధీమా వ్యక్తం చేశారు. మిథనాల్ తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయమని, చెత్త నుంచి సంపద సృష్టిగా పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో మురికి నీటిని అమ్మి రూ. 18 కోట్లు సంపాదించామని, ఆ నీటి నుంచి మిథనాల్ ఉత్పత్తి చేశారన్నారు.

పెట్రోల్‌లో సులువుగా మిథనాల్ మిక్సింగ్
అమెరికాలోని మిథనాల్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం సరైన ఇంధన ప్రత్యామ్నాయం మిథనాల్. మిథనాల్‌ను ఇంధనంగా చేర్చాలంటూ ఇప్పటికే పరిశ్రమ వర్గాల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. చైనాలో 15 నుంచి 20 శాతం పెట్రో ఉత్పత్తుల్లో మిథనాల్‌ను కలిపి వినియోగిస్తున్నారు. పెట్రోల్‌లో 10 శాతం మిథనాల్ కలిపినా ప్రస్తుతం తయారుచేస్తోన్న కార్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయని, భవిష్యత్తులో మిశ్రమ ఇంధనాలతో నడిచే ఇంజిన్లు వస్తాయని, అప్పుడు 85 శాతం మిథనాల్ కలపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
వాతావరణ కాలుష్యానికి చెక్
మిథైల్ ఆల్కహాలు, ఉడ్ ఆల్కహాలుగా పిలిచే మిథనాల్... ఆల్కహాల్ రూపాల్లో ఒకటి. బీరు, విస్కీ, ఇతర మత్తు పానీయాల్లో ఉండే ఇథైల్ ఆల్కహాలుకు విరుద్ధ రూపం. శరీరంలోకి ప్రవేశిస్తే కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి అంధత్వాన్ని కలిగిస్తుంది. మోతాదు ఎక్కువైతే మరణమే. త్వరగా ఆవిరైపోయే  ఈ పదార్థం ఎలాంటి రంగు లేకుండా పెట్రోల్లో కలిసిపోతుంది. పెట్రోల్‌కు ఇది మంచి ప్రత్యామ్నాయమని, దీనికి దగ్గరి రూపం డై మిథైల్ ఈథర్‌ను డీజిల్ ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్ పేర్కొంది. మండించినప్పుడు పొగ విడుదల చేయని దీనితో నల్లటి కర్బన సమస్య ఉండదు.
 
ఉత్పత్తి సామర్థ్యం 3,500 కోట్ల లీటర్లు
మొన్నటి నీతి ఆయోగ్ సదస్సులో సభ్యుడు వీకే సారస్వత్ మాట్లాడుతూ... భారత్‌లో విస్తారమైన వ్యవసాయ చెత్త నుంచి, అధిక బూడిదతో కూడిన బొగ్గు నుంచి మిథనాల్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఇరాన్ నుంచి భారత్ అధికంగా మిథనాల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అయితే దక్షిణ కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ జీకే సూర్యప్రకాశ్ లెక్కల ప్రకారం... భారత్‌కు 3,500 కోట్ల లీటర్ల మిథనాల్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తి చేయొచ్చు. గ్లోబల్ వార్మింగ్‌ను నివారించవచ్చు. ‘నీతి’ లెక్కల ప్రకారం... మిథనాల్ ఉత్పత్తికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చెత్తే ముఖ్య ఆధారం. పంట అనంతరం వరి, గోధుమ గడ్డిని తగులపెట్టేస్తున్నారు. ఈ చెత్త నుంచి మిథనాల్‌ను తయారుచేయొచ్చని నీతి ఆయోగ్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement