Methanol
-
సీఓ2 నుంచి మిథనాల్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కార్బన్డయాక్సైడ్ (సీఓ2) వాయువు నుంచి మిథనాల్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గు గనుల సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంట్‌ను రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రక్రియలో భాగంగా బొగ్గును మండించడంతో పెద్ద మొత్తంలో కార్బన్డయాక్సైడ్ విడుదలవుతుంది. రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ సేకరించి, హైడ్రోజన్‌తో రసాయన చర్యకు గురిచేయడం ద్వారా మిథనాల్ ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ కేంద్రం చిమ్నీకి అనుసంధానం చేసి మిథనాల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి ఇది పూర్తవుతుందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కర్బన ఉద్గారాలను 99.9 శాతం వరకు వాతా వరణంలో కలవకుండా నివారించేందుకు ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపి టేటర్స్ (ఈఎస్పీ)ను ఏర్పాటు చేశామని ఓ ప్రకటనలో చెప్పారు. దీంతో అనుమతించిన పరిమితులకు లోబడే కర్బన ఉద్గారాలను విద్యుత్ కేంద్రం విడుదల చేస్తుండగా, వాటినీ రీసైకిల్ చేసి మిథనాల్‌ను తయారు చేయనున్నట్లు వివరించారు. విజయవంతమైతే భారీ ప్లాంట్మిథనాల్ ప్లాంట్‌కి సంబంధించిన సివిల్ పనులు పూర్తి కాగా..కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేటర్, కంప్రెషర్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోల్ ఇండియా అనుబంధ పరిశోధన సంస్థ ‘సీఎంపీడీఐఎల్’ ఆర్థిక సహకారంతో ఇథనాల్ ప్లాంట్‌ను చేపట్టారు. నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ సంస్థలకు అప్పగించారు. ప్లాంట్ రోజుకి 180 కేజీల మిథనాల్‌ను ఉత్పత్తి చేయనుండగా, సింగరేణి సంస్థ విక్రయించడం లేదు. ప్రయోగాత్మక ప్లాంట్ విజయవంతమైతే వ్యాపార విస్తరణలో భాగంగా భారీ మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్‌ను నిర్మించి వాణిజ్య విక్రయాలు జరపాలని సంస్థ భావిస్తోంది. మిథనాల్‌ను ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో వినియోగిస్తారు. దేశంలో 120 మిలియన్ టన్నుల మిథనాల్‌ను వినియోగిస్తుండగా, 80 మిలియన్ టన్నులు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. -
పెట్రోలియం దిగుమతులకు చెక్!
న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుతో శిలాజ ఇంధనాలైన పెట్రోలియం తదితర ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సూచించారు. థర్మల్ ప్లాంట్లపై ఆధారపడడం భవిష్యత్తులో తగ్గుతుందంటూ.. మెథనాల్ తయారీకి పరిశ్రమ ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మెథనాల్‌ను శుద్ధ ఇంధనంగా పేర్కొంటూ, భారీ వాణిజ్య వాహనాల్లోనూ దీన్ని వినియోగించొచ్చన్నారు. మెథనాల్‌తో నడిచే ఓడను నిర్మించాలంటూ ఓ విదేశీ కంపెనీ కోచి్చన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచి్చనట్టు చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలోని మనేక్షా కేంద్రంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ మెథనాల్ సెమినార్, ఎక్స్పోను నీతి ఆయోగ్ నిర్వహిస్తున్నట్టు సారస్వత్ ప్రకటించారు. 2016లో అమెరికాకు చెందిన మెథనాల్ ఇనిస్టిట్యూట్‌తో నీతిఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకోగా.. ఈ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టులు, ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించి సాధించిన పురోగతిని సెమినార్లో తెలియజేస్తామని చెప్పారు. ఉత్పత్తులు, టెక్నాలజీలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెథనాల్ తయారీ, వినియోగానికి వీలుగా ప్రభుత్వం ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోందని, ఆ తర్వాత పెద్ద స్థాయి మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలతో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 0.7 మిలియన్ మెట్రిక్ టన్నుల మెథనాల్ తయారీ సామర్థ్యం ఉండగా.. డిమాండ్ 4 మిలియన్ టన్నులు మేర ఉండడం గమనార్హం. -
మిథనాల్ ప్లాంట్ జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్/రామచంద్రాపురం (పటాన్చెరు): బొగ్గు నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు దేశంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన కోల్ టు మిథనాల్ (సీటీఎం) ప్లాంట్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శనివారం జాతికి అంకితం చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రోజుకు 0.25 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను బీహెచ్ఈఎల్ అభివృద్ధి చేసింది. ఎక్కువ బూడిద ఉండే భారతీయ బొగ్గు నుంచి 99 శాతం స్వచ్ఛతతో మిథనాల్‌ను ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఎక్కువ బూడిద కలిగి ఉండే భారతీయ బొగ్గును మిథనాల్‌గా మార్చే పరిజ్ఞానం అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో ఆత్మనిర్భర్ భారత్ కింద అభివృద్ధి చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. స్వదేశీ ఉత్పాదక రంగాన్ని నిర్మించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా తయారీ రంగం ప్రాముఖ్యతను ప్రభుత్వం ప్రజలందరికీ తెలియజేసిందన్నారు. పరిశోధన, అభివృద్ధికి బీహెచ్ఈఎల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని సంస్థ సీఎండీ నలిన్ సింఘాల్ పేర్కొన్నారు. -
అలా చేస్తే.. ఇక పెట్రోల్ అవసరం లేదు: నితిన్ గడ్కరీ
వాహనాల్లో ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ ఇంజిన్లను ప్రవేశపెట్టాలని కార్ల తయారీదారులకు ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఒక కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగిస్తూ.. ఎలక్ట్రిక్ వాహనలను, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ''నిన్న, నేను ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లను తయారు చేయమని కార్ల తయారీదారులకు సలహా ఇవ్వడానికి ఒక ఫైల్ పై సంతకం చేశాను. ఈ ఇంజిన్లను కార్ల తయారీదారులు తయారు చేయడానికి ఆరు నెలలు సమయం ఇచ్చాము' అని ఆయన అన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ లేదా ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అనేది గ్యాసోలిన్, మిథనాల్ లేదా ఇథనాల్ కలయికతో తయారు చేసిన ప్రత్యామ్నాయ ఇంధనం. టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు ఇప్పటికే తమ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి తెలిపారు. ''త్వరలో, కార్లు కూడా 100 శాతం ఇథనాల్ ఇంధనంతో నడుస్తాయి. కాబట్టి, మాకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. అలాగే గ్రీన్ ఫ్యూయల్ వాడకం వల్ల భారీగా డబ్బు ఆదా అవుతుంది' అని గడ్కరీ అన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ఎలా పని చేస్తుంది? ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ అనేది ఒక అంతర్గత దహన యంత్రం. ఈ ఇంధనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల ఇంధనంతో పని చేయగలదు. సాధారణ భాషలో చెప్పాలంటే ఈ ఇంజిన్‌లో పెట్రోల్, ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ మిక్సర్‌లోని ఇంధన పరిమాణానికి అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే ఫ్యూయల్ మిక్సర్ సెన్సార్ లాగా పనిచేస్తుంది. ఫ్యూయల్ కంపోజిషన్ సెన్సార్, ఈసీయు ప్రోగ్రామింగ్ వంటి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, ఇంజిన్ పరిమాణాన్ని సెట్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. (చదవండి: క్యాబ్ యూజర్ల కష్టాలకు చెక్.. సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చిన ఓలా!) -
దేశీయంగా మిథనాల్ పరిశ్రమలు అవసరం
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): దేశీయంగా మిథనాల్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఏయూలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సమావేశ మందిరంలో శనివారం ఎక్సైజ్–ప్రొహిబిషన్ శాఖ నిర్వహించిన రెగ్యులేషన్ ఆఫ్ మిథనాల్–2021 సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశీయంగా, ప్రధానంగా విశాఖ కేంద్రంగా మిథనాల్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు స్థాపించాలని దీనికి అవసరమైన సహకారాన్ని, అనుమతులను మంజూరు చేయడానికి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తాను కామర్స్ కమిటీ చైర్మన్‌గా సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని చెప్పారు. మిథనాల్ పరిశ్రమలు స్థాపించే దిశగా ప్రతిపాదన పంపితే పరిశీలిస్తామన్నారు. మిథనాల్ ఉత్పత్తి అవసరాన్ని ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. విశాఖలో ఉన్న పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు రూ.120 కోట్లు వస్తాయని అంచనా ఉందన్నారు. సీఎస్ఆర్ నిధులను ప్రభుత్వ సంస్థలకు వెచ్చించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విశాఖలో 70 కోట్ల లీటర్లు మిథనాల్ వినియోగం జరుగుతోందని చెప్పారు. పెరుగుతోన్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా మిథనాల్ కనిపిస్తోందన్నారు. మిథనాల్ తయారీ, స్టోరేజ్, ట్రాన్స్‌పోర్టేషన్ వంటి విభిన్న అంశాలను సమన్వయం చేస్తూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూలోని ఐపీఆర్ సెల్‌తో నూతన ఆలోచనలతో వచ్చే వారికి పేటెంట్లు సాధించే దిశగా ఉచితంగా సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏయూ హెచ్ఆర్డీసీ సెంటర్ సంచాలకుడు ఆచార్య పాల్, ఏయూ ఫార్మసీ కళాశాల ఆచార్యులు మురళీ కృష్ణ కుమార్, హైకోర్టు న్యాయవాది వివేక్ జ్ఞాని, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిపో మేనేజర్–2 రమణ, విశ్రాంత అధికారి గోపాలకృష్ణ, సీఐ శ్రీనివాస్ ప్రసంగించారు. ఎక్సైజ్ అధికారులకు జ్ఞాపికలను బహూకరించారు. -
వారెవ్వా! కార్బన్‌డయాక్సైడ్‌తో పిండిపదార్థం..
బ్రెడ్డు ముక్క మొదలు.. కాగితం ముక్క వరకూ దేనినైనా పిండిపదార్థం లేకుండా తయారు చేయడం అసాధ్యం. పిండి పదార్థం తయారీకి బోలెడంత నీరు, భూమి అవసరం. కానీ, ఇవేవీ లేకుండా.. కేవలం కాలుష్య కారక కార్బన్డయాక్సైడ్ అనే వాయువునే పిండిపదార్థంగా మార్చగలిగితే? చైనా శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మారుస్తుంటాయి. ఈ ప్రక్రియలో దాదాపు 60 వరకూ జీవరసాయనిక చర్యలు జరుగుతుంటాయి. ఇంతకంటే సులువుగా పిండిపదార్థాన్ని ఉత్పత్తి చేసేందుకు ఉన్న మార్గాలపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగప్రక్రియ కంటే ఎన్నోరెట్లు వేగంగా కృత్రిమ పద్ధతుల్లో కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చడంలో విజయం సాధించారు. సేంద్రియ ఉత్ప్రేరకం సాయంతో కార్బన్‌డయాక్సైడ్‌ను మెథనాల్‌గా, ఆ తరువాత కృత్రిమ ఎంజైమ్‌ల సాయంతో చక్కెరలుగా మార్చడం, వీటి నుంచి పిండిపదార్థం తయారు చేయడం ఈ ప్రక్రియ సారాంశం. మొక్కజొన్న కంటే 8.5 రెట్లు ఎక్కువ పిండి పదార్థాన్ని తయారు చేయగలగడం కొత్త పద్ధతి ప్రత్యేకత. పిండిపదార్థాన్ని ఇలా కొత్తపద్ధతిలో తయారు చేసుకుంటే పర్యావరణానికి నష్టం చేకూరుస్తున్న కీటకనాశినులు, ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, పిండిపదార్థం కోసం ఉపయోగిస్తున్న పంటభూమిని కూడా ఇతర అవసరాలకు వాడవచ్చని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త చీ టావో తెలిపారు. చదవండి: గుండెను గడ్డ కట్టించి, నిల్వచేశారు! -
భెల్ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో..
ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుత దేశ అవసరాలకు తగ్గట్టుగా గ్రీన్ ఎనర్జీ విభాగంలో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన తొలి పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించింది. తొలి అడుగు హైదరాబాద్‌లో కర్బన ఉద్ఘారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక విధాలైన టెక్నాలజీలు వస్తున్నాయి. అందులో భాగంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలుష్యంతో ఎక్కువ శక్తిని ఇచ్చే ఇంధనాన్ని తయారు చేసే టెక్నాలజీని భెల్ అభివృద్ధి చేసింది. అందులో భాగంగా బొగ్గు నుంచి మిథనాల్ ఉత్పత్తి చేసే ప్లాంటుని పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో భెల్ ప్రారంభించింది. ఉమ్మడి పరిష్కారం సాధారణంగా మిథనాల్‌ని నేచురల్ గ్యాస్ నుంచి తయారు చేస్తారు. అయితే మన దేశంలో సహాయ వాయు నిల్వలు సమృద్ధిగా లేకపోవడంతో ప్రతీసారి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అంతేకాదు అధికంగా విదేశీ మారక ద్రవ్యం దీనిపై ఖర్చు చేస్తోంది. మరోవైపు మన దేశంలో బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నా వాటిలో బూడిద శాతం ఎక్కువగా ఉంటోంది. అందువల్లే కాలుష్యం ఎక్కువ వస్తోందనే నెపంతో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనేక కోర్రీలు ఎదురవుతున్నాయి. ఈ రెండు సమస్యలకు ఉమ్మడి పరిష్కారంగా భెల్ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. బూడిద నుంచి మీథేన్ సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న పలు ఏరియాల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో యాష్ (బూడిద) కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. ఈ బొగ్గుకి డిమాండ్ కూడా తక్కువ. ఇలాంటి బొగ్గును ప్రత్యేక పద్దతిలో ప్రాసెస్ చేసి మిథనాల్‌గా మార్చే పరిశ్రమను హైదరాబాద్‌లో భెల్ ప్రారంభించింది. ప్రతీ రోజు ఈ ప్లాంటు నుంచి రోజుకు 0.25 టన్నుల మిథనాల్ ఉత్పత్తి అవుతోంది. దీని ప్యూరిటీ 99 శాతంగా ఉండటం గమనార్హం. నీతి అయోగ్ సహకారంతో ఇండియాలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నా అందులో యాష్ కంటెంట్ ఎక్కువగా ఉండటం సమస్యగా మారింది. దీంతో ఈ బొగ్గును పూర్తి స్థాయిలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ బొగ్గును మిథనాల్ మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిని భెల్‌కి 2016లో నీతి అయోగ్ అప్పటించింది. ఐదేళ్ల శ్రమ నీతి అయోగ్ సూచలనలు అనుసరించి కోల్ టూ మిథనాల్ ప్రాజెక్టుకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నుంచి రూ. 10 కోట్లు కేటాయించారు. ఐదేళ్ల శ్రమ అనంతరం తొలి ప్రాజెక్టు హైదరాబాద్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ద్రవరూప మిథనాల్‌ని డీజిల్‌కి ప్రత్యామ్నాయంగా వాడుకునే వీలుంది. చదవండి : Reliance AGM 2021:ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీదే... భవిష్యత్ భారత్‌దే -
రూ.2 లక్షల కోట్లకు మిథనాల్ వాటా
న్యూఢిల్లీ: మిథనాల్ వినియోగం రూ.11,000 కోట్ల స్థాయి నుంచి వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్ కృషి చేస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తద్వారా పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని పెంచడంతో పాటు, చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకుంటామని స్పష్టంచేశారు. ఢిల్లీలో శుక్రవారం ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి నాసిరకం విడిభాగాలను దిగుమతి చేసుకోవడం ద్వారా నాణ్యతలో రాజీ పడొద్దంటూ తయారీదారులకు సూచించారు. నాణ్యత, ప్రమాణాలకు ప్రాధాన్యమివ్వాలని, లేదంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. ‘‘భారత్ ప్రస్తుతం విద్యుత్ మిగులు దేశం. సమృద్ధిగా బొగ్గు, సౌర విద్యుత్ వనరులు ఉన్నాయి. తక్కువ ఖర్చులో దిగుమతులకు ప్రత్యామ్నాయాలు తేవాలని, కాలుష్యం లేని రవాణా విధానాలైన ఎలక్ట్రిక్ వాహనాలు తదితరాలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ప్రయత్నం’’ అని మంత్రి వివరించారు. ఇజ్రాయెల్‌లో మిథనాల్ లీటర్ రూ.12, చైనాలో రూ.16 ఉంటే మన దగ్గర రూ.22 ఉందని, పెట్రోల్, డీజిల్ కంటే చౌక అని చెప్పారాయన. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో గత ఏడాది కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు దేశంలోని చాలా ప్రాంతాలను చేరాయని తెలియజేశారు. చమురు దిగుమతుల రూపంలో పెద్ద ఎత్తున తరలిపోతున్న విదేశీ మారకానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మిథనాల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రణాళికల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐదు టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ రిక్షాల ఆవిష్కరణ... ∙ఈ కార్యక్రమంలోనే కెటో మోటార్స్, ౖMðటోగ్రీన్ టెక్నాలజీస్ కలసి ఎలక్ట్రిక్ ఆటో ‘ౖMðటో’ను ఆవిష్కరించాయి. వచ్చే రెండేళ్లలో భారత్‌లో 10 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చే యడం ద్వారా, ఇతర దేశాలకు ఎగుమతి కేం ద్రంగా భారత్‌ను చేసుకుంటామని కైటో గ్రీన్ టెక్నాలజీస్ ఎండీ గ్రేసన్ రిచర్డ్స్ చెప్పారు. రెండేళ్లలో తాము భారత్‌లో 5 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని, అధిక వేగంతో కూడిన ఎలక్ట్రిక్ ఆటో ‘సూపర్ కింగ్’లను 20,000 యూనిట్లను తయారు చేస్తామని గోయంకా ఎలక్ట్రిక్స్ సీఈవో జాఫర్ ఇక్బాల్ ఈ సందర్భంగా చెప్పారు. సార్తి బ్రాండ్ ఈ రిక్షా ‘షావక్’ను ఇదే కార్యక్రమంలో ఆవిష్కరించింది. 1,000 యూనిట్లను తయారు చేసే ప్రణాళికతో ఉన్నట్టు కంపెనీ ఎండీ సార్తి తెలిపారు. ఏడాదిలోగా దేశంలోనేలిథియం బ్యాటరీల తయారీ వచ్చే ఏడాది కాలంలో దేశంలో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి అనంత్‌గీతే తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్, అమెరికా సంస్థ మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నట్టు చెప్పా రు. ‘‘ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీలను 100% దిగుమతి చేసుకుంటున్నాం. వీటిని ఏడాదిలోగా దేశంలోనే తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి’’ అని చెప్పారు. ఎలక్ట్రిక్ ఆటో కైటోను మంత్రి ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని ఆర్థిక శాఖను కోరామని, దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలను దాదాపు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం గమనార్హం. -
మీ పెట్రోల్ బిల్లు తగ్గబోతుంది.. ఎలా?
న్యూఢిల్లీ : వాహనాదారులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. తగ్గేటప్పుడు ఒకటి, రెండు పైసల్లో తగ్గినా.. పెరిగేటప్పుడు మాత్రం రెండకెల్లోనే ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ ధరల ప్రభావంతో, మన దేశంలో కూడా ఆయిల్ ధరలు వాహనదారులకు వాత పెడుతున్నాయి. ద్రవ్యోల్బణానికి, కరెంట్ అకౌంట్ లోటుకు పెను ముప్పులా మారుతున్న ఈ పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నీతి ఆయోగ్ పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ఓ సరికొత్త ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. దీంతో నెలవారీ మీ పెట్రోల్ బిల్లు తగ్గిపోనుందట. అదే మిథనాల్. ప్రతి ఒక్క వాహనదారుడు కచ్చితంగా తమ వాహన పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్ కలిపి వాడేలా ఆదేశాలు జారీచేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేబినెట్ నోట్‌ను కూడా కేంద్రం ముందు ఉంచింది. ఒకవేళ కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదిస్తే, మీ నెలవారీ పెట్రోల్ బిల్లు కనీసం 10 శాతం తగ్గిపోనుందట. అంతేకాక ప్రభుత్వ ఆయిల్ దిగుమతి బిల్లు కూడా క్రమంగా తగ్గేందుకు ఇది సహకరించనుందని తెలిసింది. దీనిపై జూలై చివరి వారంలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా దీనిపై సీనియర్ ప్రభుత్వ అధికారులతో సమావేశం జరిపారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘మిథనాల్ ఎకానమీ’ రోడ్‌మ్యాప్‌ను కూడా నీతి ఆయోగ్ రూపొందించింది. రవాణా వ్యవస్థ, గృహ అవసరాలకు 15 శాతం మిశ్రమ ఇంధనాన్ని వాడితే 2030 నాటికి క్రూడ్ దిగుమతుల్లో వార్షికంగా 100 బిలియన్ డాలర్ల తగ్గింపు పొందవచ్చని నీతి ఆయోగ్ తన ప్రణాళికలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 10 శాతం ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వాడుతున్నారు. ఎథనాల్ ధర లీటరు 42 రూపాయలు. ఒకవేళ మిథనాల్ మిశ్రమం వాడితే లీటరుకు 20 రూపాయల కంటే తక్కువగానే నమోదు కానుంది. దీంతో పెట్రోల్ ధరలు 10 శాతం తగ్గిపోనున్నాయి. మిథనాల్ వాడకంతో ఇంధన ధరలు, దేశీయ వార్షిక ఆయిల్ దిగుమతి బిల్లు తగ్గడమే కాకుండా.. కాలుష్యం కూడా నిర్మూలించవచ్చు. మిథనాల్‌తో 20 శాతం క్రూడ్ వినియోగాన్ని రీప్లేస్ చేస్తే, దేశీయ కాలుష్యం 40 శాతం తగ్గిపోనుందని నీతి ఆయోగ్ చెబుతోంది. ఒక్కసారి నీతి ఆయోగ్ రూపొందించిన ఈ పైలట్ ప్రాజెట్లు విజయవంతమైతే, ప్రభుత్వం ఈ మిథనాల్ కమర్షియల్ ప్రొడక్షన్‌ను బొగ్గు నుంచి చేపట్టడం ప్రారంభించనుంది. బొగ్గు నుంచి మిథనాల్ ఉత్పత్తి చేసే కమర్షియల్ ప్రొడక్షన్‌కు పుణే, హైదరాబాద్, తిరుచ్చి ప్రాంతాల్లో రూ.100 కోట్లతో మూడు ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్‌లను సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నడుపుతోంది. అంతేకాక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్‌లు సిద్ధమై ఉన్నాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గనులను కేటాయించాయి. అయితే మిథనాల్‌ను సరఫరా చేయడమే మన రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాల్ అని ఓ ఆయిల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కాగ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారి దేశంగా భారత్ ఉంది. 2900 కోట్ల లీటర్ల పెట్రోల్, 9000 కోట్ల లీటర్ల డీజిల్‌ను వార్షికంగా మన దేశంలో వినియోగిస్తున్నాం. -
త్వరలోనే చౌకగా పెట్రోల్
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలోనే పెట్రోల్ చౌకగా లభ్యం కానుంది. కేంద్ర ప్రభుత్వం నేడు మిథనాల్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీతో పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్ మిశ్రమాన్ని కలుపనున్నారు. దీంతో పెట్రోల్ ధరలు దిగి వస్తాయని, కాలుష్యాన్ని కూడా అరికట్ట వచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్ల శాఖమంత్రి నితిన్ గడ్కారీ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. లీటర్ పెట్రోల్ ధర రూ.80తో పోలిస్తే, బొగ్గు నుంచి ఉత్పత్తికి అయ్యే మిథనాల్ ఖర్చు లీటరుకు కేవలం రూ.22లు మాత్రమేనని చెప్పారు. చైనా అయితే ఏకంగా దీన్ని రూ.17కే ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీపక్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) సహా ముంబై చుట్టుపక్కల చాలా కర్మాగారాలు మిథనాల్‌ను ఉత్పత్తి చేయగలవని కేంద్ర మంత్రి అన్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఖర్చులూ తగ్గుతాయని, కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. స్వీడన్ ఆటో మేజర్ వోల్వో మిథనాల్‌తో నడిచే స్పెషల్ ఇంజీన్‌ను రూపొందించిందనీ, స్థానికంగా తయారైన ఇంధనంతో 25 బస్సులను త్వరలో నడపనున్నట్లు గడ్కారీ తెలిపారు. అలాగే ఇథనాల్ వినియోగం కూడా పెరగాల్సి ఉందన్నారు. -
పెట్రోల్ ధర తగ్గుతుంది!
ముంబై: పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ను కలపడం ద్వారా ఇంధనం ధరను, కాలుష్యాన్ని కూడా తగ్గించే విధానాన్ని తమ ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తానే ప్రకటన చేస్తానన్నారు. లీటర్ పెట్రోల్ ఖరీదు దాదాపు 80 రూపాయలు ఉంటుండగా, బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే లీటర్ మిథనాల్ మాత్రం రూ.22కే లభిస్తుందనీ, చైనాలో అయితే ఈ ధర మరీ రూ.17 మాత్రమేనని గడ్కారీ వివరించారు. స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోల్వో ముంబై కోసం పూర్తిగా మిథనాల్‌తో నడిచే ప్రత్యేక బస్సులను తయారుచేసిందనీ, త్వరలోనే 25 బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. మిథనాల్‌ను ముంబైలో ఉన్న స్థానిక పరిశ్రమల నుంచే ఉత్పత్తి చేయవచ్చనీ, వాటి నుంచి వచ్చే ఇంధనాన్నే ఈ బస్సులకు వాడతామన్నారు. పెట్రోలియం శుద్ధి పరిశ్రమలను నిర్మించేందుకు రూ.70 వేల కోట్లు ఖర్చవుతుండగా, మిథనాల్‌పై అయితే ఈ వ్యయం రూ.లక్షన్నర కోట్లుగా ఉంటున్నప్పటికీ...మిథనాల్‌పై దృష్టి పెట్టాల్సిందిగా తాను పెట్రోలియం శాఖ మంత్రికి సూచించానన్నారు. దేశంలో పెరిగిపోతున్న వాహనాల సంఖ్యపై గడ్కారీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము సగటున రోజుకు 28 కిలో మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామనీ, త్వరలోనే దీనిని 40 కిలో మీటర్లకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. 2018లో 20 వేల కిలోమీటర్ల పొడవైన రహదారులను నిర్మిస్తామన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయనీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘జాతీయ రహదారుల, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ’ (ఎన్హెచ్ఐడీసీఎల్–నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ను స్థాపించామని ఆయన చెప్పారు. -
దీనిపై కేంద్రం కొత్త పాలసీ: త్వరలో
సాక్షి, ముంబై: త్వరలోనే పెట్రోల్ రేట్లను తగ్గించే పాలసీని తీసుకురానున్నామని కేంద్ర రోడ్ల శాఖామంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రకటించనున్నట్టు ముంబయిలో తెలిపారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ విధానాన్ని ప్రకటించనున్నామని శనివారం వెల్లడించారు. పెట్రోలులో 15 శాతం మెథనాల్ మిశ్రమాన్ని ద్వారా ధరలు దిగి వస్తాయన్నారు. తద్వారా కాలుష్యాన్ని కూడా అరికట్ట వచ్చని చెప్పారు. బొగ్గునుంచి లీటర్ పెట్రోల్ ధర రూ. 80లతో పోలిస్తే , మిథనాల్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు కేవలం రూ .22లు మాత్రమేనని చెప్పారు. చైనా రూ.17 లకే లీటర్ ఉత్పత్తి చేస్తోందన్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఖర్చులూ తగ్గుతాయి, కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. దీపక్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) సహా ముంబై చుట్టుపక్కల చాలా కర్మాగారాలు మెథనాల్‌ను ఉత్పత్తి చేయగలవని కేంద్ర మంత్రి అన్నారు. స్వీడన్ ఆటో మేజర్ వోల్వో మిథనాల్ తో నడిచే స్పెషల్ ఇంజీన్‌ను రూపొందించిందనీ, లోకల్‌గా తయారైన ఇంధనతో 25 బస్సులను త్వరలో నడపనున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే ఇథనాల్ వినియోగం కూడా పెరగాల్సి ఉందన్నారు. పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి చమురు శుద్ధికర్మాగారాలు నెలకొల్పే బదులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు తెలిపారు. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌పై గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రోజుకు 28 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నామని, దాన్ని 40 కిలోమీటర్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. -
రష్యాలో బాత్‌లోషన్ తాగి 49 మంది మృతి
-
రష్యాలో బాత్‌లోషన్ తాగి 49 మంది మృతి
మాస్కో: స్నానానికి ఉపయోగించే బాత్‌లోషన్ లో ఆల్కహాల్ ఎక్కువగా కలిసిఉంటుందని నమ్మి దాన్ని తాగి 49 మంది మద్యపానప్రియులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన సోమవారం రష్యాలోని ఇర్కుట్సక్ నగరంలో జరిగింది. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. రష్యాలో తాగుడుకు బానిసైన వారిలో దాదాపు 20శాతం మంది(1.2కోట్ల జనాభా) ఆల్కాహాల్ కలసిన గృహోపకరణ ద్రవాలు, ఔషధాలు, పరిమళద్రవ్యాలను మత్తుకోసం వినియోగిస్తున్నారు. 49 మంది మరణించంతో ఇర్కుట్సక్ సిటీలో అత్యవసర పరిస్థితిని విధించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావించి అధికారులు ప్రతీ అపార్ట్మెంటు, ఇంటిని సోదా చేస్తున్నారు. బాత్‌లోషన్ లో ఇథైల్ ఆల్కాహల్కు బదులుగా విషతుల్యమైన మిథనాల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాత్‌లోషన్ బాటిళ్లపై ‘ఆల్కహాల్ వాటా 93 శాతం’ అని రాసి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
మిథనాల్.. పెట్రోల్ ప్రత్యామ్నాయం
భవిష్యత్తులో పెట్రో ఉత్పత్తుల దిగుమతి రహిత దేశంగా భారత్ ►ఏడాదికి రూ. 4.5 లక్షల కోట్ల ఆదా.. ►మిథనాల్ వాడకంపై నీతి ఆయోగ్ సదస్సులో ఏకాభిప్రాయం ►పెట్రోల్‌లో కలిపి వాడవచ్చంటున్న పరిశోధకులు ►గ్రామీణ, పట్టణ చెత్త, బొగ్గు బూడిద నుంచి తయారీ న్యూఢిల్లీ: మిథనాల్... దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని మార్చే సంజీవని... పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన ఇంధనం... ఇది సాకారమైతే ఏడాదికి రూ.4.5 లక్షల కోట్ల ఖర్చుకు ఫుల్స్టాప్ పెట్టొచ్చు. ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల దిగుమతికి భారత్ వెచ్చిస్తోన్న మొత్తం అది. ముడిచమురు ధరలు చుక్కల్ని తాకితే అది రూ. 7.5 లక్షల కోట్లకు పైనే.. అందుకే భారత్‌ను పెట్రో దిగుమతి రహిత దేశంగా మార్చేస్తే... అగ్రదేశాల జాబితాలో చే రవచ్చని కేంద్రం భావిస్తోంది. మిథనాల్ ఎకానమీని నిజం చేస్తామంటోంది... దేశ దిగుమతుల్లో ముడిచమురు, సహజవాయువుల వాటా 60 శాతంపైనే... ఈ పెట్రో దిగుమతులు లేకపోతే దేశ ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుందన్న అంచనాల నేపథ్యంలో మిథనాల్‌ను ఇంధనంగా తెరపైకి తీసుకొచ్చారు. గతవారం ఢిల్లీలో మిథనాల్ ఎకానమీపై నీతి ఆయోగ్ ప్రత్యేక సదస్సు నిర్వహించింది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మిథనాల్ వాడితే భారత్ ఇంధన స్వయం సమృద్ధి దేశంగా మారుతుందంటూ ఏకాభిప్రాయం వ్యక్తమైంది. భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదాతో పాటు, పర్యావరణానికి మేలు చేయవచ్చని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, మేథావులు, పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సదస్సులో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడుతూ... త్వరలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి రహిత దేశంగా భారత్ మారుతుందనే ధీమా వ్యక్తం చేశారు. మిథనాల్ తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయమని, చెత్త నుంచి సంపద సృష్టిగా పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో మురికి నీటిని అమ్మి రూ. 18 కోట్లు సంపాదించామని, ఆ నీటి నుంచి మిథనాల్ ఉత్పత్తి చేశారన్నారు. పెట్రోల్‌లో సులువుగా మిథనాల్ మిక్సింగ్ అమెరికాలోని మిథనాల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం సరైన ఇంధన ప్రత్యామ్నాయం మిథనాల్. మిథనాల్‌ను ఇంధనంగా చేర్చాలంటూ ఇప్పటికే పరిశ్రమ వర్గాల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. చైనాలో 15 నుంచి 20 శాతం పెట్రో ఉత్పత్తుల్లో మిథనాల్‌ను కలిపి వినియోగిస్తున్నారు. పెట్రోల్‌లో 10 శాతం మిథనాల్ కలిపినా ప్రస్తుతం తయారుచేస్తోన్న కార్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయని, భవిష్యత్తులో మిశ్రమ ఇంధనాలతో నడిచే ఇంజిన్లు వస్తాయని, అప్పుడు 85 శాతం మిథనాల్ కలపవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ కాలుష్యానికి చెక్ మిథైల్ ఆల్కహాలు, ఉడ్ ఆల్కహాలుగా పిలిచే మిథనాల్... ఆల్కహాల్ రూపాల్లో ఒకటి. బీరు, విస్కీ, ఇతర మత్తు పానీయాల్లో ఉండే ఇథైల్ ఆల్కహాలుకు విరుద్ధ రూపం. శరీరంలోకి ప్రవేశిస్తే కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి అంధత్వాన్ని కలిగిస్తుంది. మోతాదు ఎక్కువైతే మరణమే. త్వరగా ఆవిరైపోయే ఈ పదార్థం ఎలాంటి రంగు లేకుండా పెట్రోల్‌లో కలిసిపోతుంది. పెట్రోల్‌కు ఇది మంచి ప్రత్యామ్నాయమని, దీనికి దగ్గరి రూపం డై మిథైల్ ఈథర్‌ను డీజిల్ ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్ పేర్కొంది. మండించినప్పుడు పొగ విడుదల చేయని దీనితో నల్లటి కర్బన సమస్య ఉండదు. ఉత్పత్తి సామర్థ్యం 3,500 కోట్ల లీటర్లు మొన్నటి నీతి ఆయోగ్ సదస్సులో సభ్యుడు వీకే సారస్వత్ మాట్లాడుతూ... భారత్‌లో విస్తారమైన వ్యవసాయ చెత్త నుంచి, అధిక బూడిదతో కూడిన బొగ్గు నుంచి మిథనాల్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఇరాన్ నుంచి భారత్ అధికంగా మిథనాల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అయితే దక్షిణ కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ జీకే సూర్యప్రకాశ్ లెక్కల ప్రకారం... భారత్‌కు 3,500 కోట్ల లీటర్ల మిథనాల్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తి చేయొచ్చు. గ్లోబల్ వార్మింగ్‌ను నివారించవచ్చు. ‘నీతి’ లెక్కల ప్రకారం... మిథనాల్ ఉత్పత్తికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చెత్తే ముఖ్య ఆధారం. పంట అనంతరం వరి, గోధుమ గడ్డిని తగులపెట్టేస్తున్నారు. ఈ చెత్త నుంచి మిథనాల్‌ను తయారుచేయొచ్చని నీతి ఆయోగ్ పేర్కొంది. -
కళాభవన్ మణి మృతి కేసులో ట్విస్ట్
కొచ్చి: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై మిస్టరీ కొనసాగుతోంది. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన అంశాలతో ఆయన మృతిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(సీఎఫ్ఎస్ఎల్) నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెలుగు చూసింది. అయితే కళాభవన్ మణి శరీరంలో ఎంత శాతం మిథనాల్ ఉంది, అది ఎంతవరకు ఆయన మరణానికి కారణం అయిందనేది వెల్లడి కాలేదు. పురుగు మందుల అవశేషాలు లేవని తేల్చింది. ఫోరెన్సిక్ నివేదికపై స్పష్టత కోసం సీఎఫ్ఎస్ఎల్ ను కేరళ పోలీసులు సంప్రదించనున్నారు. మణి శరీరంలో ప్రమాదకరమైన క్రిమిసంహారిణి 'క్లోర్ పిరిఫొస్' అవశేషాలు ఉన్నట్టు కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రం అంతకుముందు వెల్లడించింది. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి ఈ ఏడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆరని మంటలు
►ఆరు బయో డీజిల్ ట్యాంకులు పూర్తిగా దగ్ధం ►మరో 24 గంటల వరకు మంటలు అదుపు చేయడం కష్టమే ►పదో నంబర్ ట్యాంక్ నుంచి ఆయిల్ లీకేజీ ►సంఘటన స్థలంలోనే అధికారులతో కలెక్టర్ సమీక్ష ►మరో మూడు ట్యాంకులకు పాక్షిక నష్టం ►మిథనాల్ , హైస్పీడ్ డీజిల్ ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు అగ్నిమాపక దళాల నిర్విరామ శ్రమ.. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలించలేదు. 24 గంటలు గడిచినా బయో డీజిల్ మంటలు రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మిగిలిన ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలుగుతున్నారే తప్ప పూర్తిగా ఆర్పలేకపోతున్నారు. గగనతలం నుంచి మంటలను ఆర్పే అంశాన్ని నేవీ అధికారులు పరిశీలించినా.. దానిపైనా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. మరోవైపు డీజిల్ పొగల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగనంపూడి(విశాఖపట్నం): దువ్వాడ ఎస్ఈజెడ్లోని బయో మాక్స్ ప్లాంట్‌లో రేగిన మంటలు బుధవారం రాత్రికి కూడా అదుపులోకి రాలేదు. ప్రమాదస్థాయిని అంచనా వేయడం కష్టంగా మారడంతో అధికారులు, యాజమాన్య ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. మంగళవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో ఇప్పటికే ఆరు ట్యాంకులు పూర్తిగా మంటలకు ఆహుతి కాగా, మరో మూడు పాక్షికంగా దగ్ధమయ్యాయి. బయో డీజిల్ ట్యాంకులను ఆనుకొని ఉన్న 10, 11, 12 ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ఫోమ్ చల్లి చల్చబరుస్తున్నారు. అలాగే కార్యాలయ సముదాయాన్ని అనుకొని ఉన్న నాలుగు మిథనాల్ ట్యాంకర్లు, రెండు హైస్పీడ్ డీజిల్ ట్యాంకులకు వేడి ప్రభావం లేకుండా బ్రాండిక్స్‌కు చెందిన ఫోమ్ స్ప్రెడ్డింగ్ మిషన్‌తో ఫోమ్‌ను చల్లుతూ వేడి ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో ప్రాధమిక అంచనా మేరకు రూ.120 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు బయోమ్యాక్స్ సంస్థ ఏజీఎం శ్రీనివాసరావు తెలిపారు. హెలికాప్టర్‌తో పర్యవేక్షణ: మంటలు అదుపులోకి రాకపోవడంతో నేవీ అధికారుల సాయంతో హెలికాప్టర్లో పర్యవేక్షించారు. గగనతలం ద్వారా నేవల్ హెలికాప్టర్ నుంచి మంటలను అదుపు చేయడానికి ఏ మేరకు అవకాశం ఉందో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఉదయం పదకుండున్నర గంటలకు ఆ ప్రక్రియ చేపట్టారు. ట్యాంకుల్లోని ఆయిల్ పూర్తిగా ఆవిరయ్యే వరకు మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనపడకపోవడంతో చేసేది లేక హెలికాప్టర్ వెనుదిరిగింది. ఇతర ట్యాంకులకు మంటలు అంటుకోకుండా చర్యలు చేపట్టడం తప్ప ప్రత్యామ్నాయం కనపడకపోవడంతో సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. లీకే జీలను అరికట్టాలి బయోమ్యాక్ ఆవరణలోని 10వ ట్యాంక్ నుంచి ఆయిల్ లీక్ అవుతుండడంతో మంటలు వాటికి కూడా అంటుకొనే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టారు. లీకేజీని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వెంటనే తెలపాలని, తగిన సహాయం అందిస్తామని జిల్లా కలెక్టర్ యాజమాన్య ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఫోమ్ చల్లడం తప్ప వేరే మార్గం కనిపించకపోవడంతో ఆ ప్రక్రియ కొనసాగించాలని జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, నేవల్ ఇన్చార్జి సుజిత్రెడ్డిలను కలెక్టర్ ఆదేశించారు. ఫైర్ సిబ్బంది నిర్విరామశ్రమ వివిధ విభాగాలకు చెందిన అధికారులతోపాటు ఫైర్ సిబ్బంది నిర్విరామంగాశ్రమించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బయో డీజిల్ మంటల వల్ల వెలువడుతున్న పొగ వల్ల ఏర్పడే కాలుష్యాన్ని అంచనా వేయడానికి కాలుష్య నియంత్రణ పరికరాన్ని తీసుకువచ్చిన ఆ శాఖ అధికారులను బయోమ్యాక్స్ యాజమాన్య ప్రతినిధులు పట్టించుకోపోవడంపై అధికారులు మండిపట్టారు. ఉదయం నుంచి తాళాలు లేవని, కరెంటు లేదని చెబుతూ తమను పనిచేయకుండా అడ్డుకున్నారని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సైంటిస్ట్ సోమసుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలం వద్ద్ద కలెక్టర్, నేవల్ అధికారులు, డీఎఫ్‌వో ప్రమాదం జరిగిన వెంటనే మంగళవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ యువరాజ్ అప్పటి నుంచి అక్కడే ఉండి నేవల్ ఇన్చార్జిఅధికారి సుజిత్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, సంస్థ అధికారులతో చర్చించారు. పరిస్థితిని సమీక్షించారు. మంటలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు.