కార్యక్రమంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): దేశీయంగా మిథనాల్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఏయూలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సమావేశ మందిరంలో శనివారం ఎక్సైజ్–ప్రొహిబిషన్ శాఖ నిర్వహించిన రెగ్యులేషన్ ఆఫ్ మిథనాల్–2021 సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశీయంగా, ప్రధానంగా విశాఖ కేంద్రంగా మిథనాల్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు స్థాపించాలని దీనికి అవసరమైన సహకారాన్ని, అనుమతులను మంజూరు చేయడానికి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తాను కామర్స్ కమిటీ చైర్మన్‌గా సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని చెప్పారు. మిథనాల్ పరిశ్రమలు స్థాపించే దిశగా ప్రతిపాదన పంపితే పరిశీలిస్తామన్నారు. మిథనాల్ ఉత్పత్తి అవసరాన్ని ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.
విశాఖలో ఉన్న పరిశ్రమల నుంచి సీఎస్‌ఆర్ నిధులు రూ.120 కోట్లు వస్తాయని అంచనా ఉందన్నారు. సీఎస్‌ఆర్ నిధులను ప్రభుత్వ సంస్థలకు వెచ్చించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విశాఖలో 70 కోట్ల లీటర్లు మిథనాల్ వినియోగం జరుగుతోందని చెప్పారు. పెరుగుతోన్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా మిథనాల్ కనిపిస్తోందన్నారు. మిథనాల్ తయారీ, స్టోరేజ్, ట్రాన్స్‌పోర్టేషన్ వంటి విభిన్న అంశాలను సమన్వయం చేస్తూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూలోని ఐపీఆర్ సెల్‌తో నూతన ఆలోచనలతో వచ్చే వారికి పేటెంట్‌లు సాధించే దిశగా ఉచితంగా సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏయూ హెచ్‌ఆర్‌డీసీ సెంటర్ సంచాలకుడు ఆచార్య పాల్, ఏయూ ఫార్మసీ కళాశాల ఆచార్యులు మురళీ కృష్ణ కుమార్, హైకోర్టు న్యాయవాది వివేక్ జ్ఞాని, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిపో మేనేజర్–2 రమణ, విశ్రాంత అధికారి గోపాలకృష్ణ, సీఐ శ్రీనివాస్ ప్రసంగించారు. ఎక్సైజ్ అధికారులకు జ్ఞాపికలను బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment