industries establishment
-
ఆహార పరిశ్రమలకు అంకురార్పణ
సాక్షి, అమరావతి: ఆహార పరిశ్రమలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తొలివిడతలో ఏర్పాటు చేస్తున్న యూనిట్ల టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైఎస్సార్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న నాలుగు యూనిట్లకు బుధవారం టెండర్లు పిలిచింది. మిగిలిన వాటికి సంక్రాంతిలోగా టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తోంది. మార్చిలోగా పనులు ప్రారంభించి డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని, 2023 జనవరి నుంచి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.2,389 కోట్లతో 26 యూనిట్లు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏటా పెరుగుతున్న ఉత్పాదకత, ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకొచ్చింది. దీన్లో భాగంగా పార్లమెంటు నియోజకవర్గస్థాయిలో రూ.2,389 కోట్లతో 26 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటి నిర్వహణకు 115 కంపెనీలు ఇప్పటికే ఆసక్తి కనబరిచాయి. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ద్వారా ఏర్పాటు చేస్తున్న వీటికయ్యే వ్యయంలో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మిగిలిన మొత్తాన్ని నాబార్డుతో సహా బహుళజాతి బ్యాంకులు అందించనున్నాయి. తొలివిడతగా రూ.1,289 కోట్లతో 9 జిల్లాల్లో 11 యూనిట్లు ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైన ఈ యూనిట్లకు భూసేకరణ కూడా పూర్తయింది. వీటి కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పద్ధతిలో కనీసం 15 ఏళ్ల పాటు లీజ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్లో టెండర్లు పిలుస్తున్నారు. తొలివిడతగా రూ.233.48 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నాలుగు యూనిట్లకు ఆసక్తిగల బహుళజాతి సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) కోరుతూ బుధవారం టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన 4 యూనిట్లు ఇవే.. తొలివిడతగా నాలుగు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో రూ.33.79 కోట్లతో 5 ఎకరాల్లో రోజుకు 114 టన్నుల సామర్థ్యంతో డ్రైడ్ హనీడిప్డ్ బనానా యూనిట్, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో రూ.24.90 కోట్లతో 7.02 ఎకరాల్లో రోజుకు రెండు టన్నుల సామర్థ్యంతో మామిడి తాండ్ర యూనిట్, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జన్నంపేట వద్ద 9.5 ఎకరాల్లో రోజుకు 127 టన్నుల సామర్థ్యంతో రూ.82.07 కోట్లతో కోకో ప్రాసెసింగ్ యూనిట్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాలలో రూ.92.72 కోట్లతో 15 ఎకరాల్లో రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో డీ హైడ్రేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ యూనిట్లకు టెండర్లు పిలిచారు. వీటిద్వారా ప్రత్యక్షంగా 500 నుంచి 600 మందికి, పరోక్షంగా 1,500 మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మార్చికల్లా పనులకు శ్రీకారం పండించిన ప్రతి పంటను ప్రాసెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్లడం ద్వారా రైతులకు అదనపు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్లకు దశలవారీగా టెండర్లు పిలిచి డిసెంబర్‌కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలివిడతలో 4 యూనిట్లకు టెండర్లు పిలిచాం. మిగిలిన యూనిట్లకు సంక్రాంతిలోగా టెండర్లు పిలవబోతున్నాం. – కురసాల కన్నబాబు,వ్యవసాయశాఖ మంత్రి -
దేశీయంగా మిథనాల్ పరిశ్రమలు అవసరం
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): దేశీయంగా మిథనాల్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఏయూలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సమావేశ మందిరంలో శనివారం ఎక్సైజ్–ప్రొహిబిషన్ శాఖ నిర్వహించిన రెగ్యులేషన్ ఆఫ్ మిథనాల్–2021 సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశీయంగా, ప్రధానంగా విశాఖ కేంద్రంగా మిథనాల్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు స్థాపించాలని దీనికి అవసరమైన సహకారాన్ని, అనుమతులను మంజూరు చేయడానికి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తాను కామర్స్ కమిటీ చైర్మన్‌గా సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని చెప్పారు. మిథనాల్ పరిశ్రమలు స్థాపించే దిశగా ప్రతిపాదన పంపితే పరిశీలిస్తామన్నారు. మిథనాల్ ఉత్పత్తి అవసరాన్ని ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. విశాఖలో ఉన్న పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు రూ.120 కోట్లు వస్తాయని అంచనా ఉందన్నారు. సీఎస్ఆర్ నిధులను ప్రభుత్వ సంస్థలకు వెచ్చించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విశాఖలో 70 కోట్ల లీటర్లు మిథనాల్ వినియోగం జరుగుతోందని చెప్పారు. పెరుగుతోన్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా మిథనాల్ కనిపిస్తోందన్నారు. మిథనాల్ తయారీ, స్టోరేజ్, ట్రాన్స్‌పోర్టేషన్ వంటి విభిన్న అంశాలను సమన్వయం చేస్తూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూలోని ఐపీఆర్ సెల్‌తో నూతన ఆలోచనలతో వచ్చే వారికి పేటెంట్లు సాధించే దిశగా ఉచితంగా సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏయూ హెచ్ఆర్డీసీ సెంటర్ సంచాలకుడు ఆచార్య పాల్, ఏయూ ఫార్మసీ కళాశాల ఆచార్యులు మురళీ కృష్ణ కుమార్, హైకోర్టు న్యాయవాది వివేక్ జ్ఞాని, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిపో మేనేజర్–2 రమణ, విశ్రాంత అధికారి గోపాలకృష్ణ, సీఐ శ్రీనివాస్ ప్రసంగించారు. ఎక్సైజ్ అధికారులకు జ్ఞాపికలను బహూకరించారు. -
పెట్రోల్‌కి ప్రత్యామ్నాయం ఇథనాల్, అడ్డా తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా భావిస్తోన్న ఇథనాల్ తయారీకి తెలంగాణ అడ్డా కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ఇథనాల్ తయారీ ప్లాంటు స్థాపనకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది. వరితో పాటు మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువే. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ‘ఇంధన గ్రేడ్’ఇథనాల్ తయారీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిపాదిస్తోంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేసే 1జీ (ఫస్ట్ జనరేషన్) ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రూ.1000 కోట్లతో స్థాపించే ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల ఇథనాల్ తయారవుతుంది. ప్లాంటు ఏర్పాటుకు వంద ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా. ఈ ప్లాంటు రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకు 4 వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇథనాల్ తయారీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అధికారులతో సమావేశం తెలంగాణలో ఇథనాల్ తయారీ పరిశ్రమ నెలకొల్పే అంశంపై బీపీసీఎల్ ఎగ్జిక్టూటివ్ డైరెక్టర్ (జీవ ఇంధనాలు) అనురాగ్ సరోగి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో భేటీ అయ్యారు. జయేశ్‌ను కలసిన వారిలో బీపీసీఎల్ ఈడీ (ఇంజనీరింగ్, ప్రాజెక్టులు) ఎల్ఆర్ జైన్, కేహెచ్‌పీఎల్ ప్రాజెక్టు లీడర్ బి.మనోహర్ ఉన్నారు. భవిష్యత్తులో ఇథనాల్ ఇథనాల్ తయారీ పరిశ్రమకు తమ మద్దతు ఉంటుందని కేంద్ర మంతత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. పెటట్రోలు ఇథనాల్‌తో నడిచేలా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలంటూ వాహన తయారీదారులకు సూచించారు. అంతకు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ శాతం పెంచాలంటూ ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్రం నుంచి ఇథనాల్ తయారీకి భారీగా మద్దతు దక్కుతున్న తరుణంలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు బీసీసీఎల్ తెలంగాణను ఎంచుకోవడం గమనార్హం -
పరిశ్రమాంధ్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్: గత సర్కారు మాదిరిగా అవాస్తవాలు, లేనివి ప్రచారం చేయడం, గ్రాఫిక్స్ చూపించి అన్యాయం చేయడం మాకు సాధ్యం కాదు. రాష్ట్రం నుంచి కియా వెళ్లిపోయిందని మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన మీడియా దుష్ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్ వస్తోందని, బుల్లెట్ రైలు వస్తోందని, రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ గత ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ అంటూ గ్రాఫిక్స్ చూపించింది. అలాంటి అవాస్తవాలను మా ప్రభుత్వం ప్రచారం చేయదు. సాక్షి, అమరావతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు నాలుగు పోర్టులు, ఆరు విమానాశ్రయాలున్నాయని మంచి రహదారులు, రైల్వే లైన్లు మన బలమని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి భూమి, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతులతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 30 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచస్థాయి అత్యుత్తమ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యం పెంచేలా ఈ కేంద్రాలు పని చేస్తాయన్నారు. టెక్స్టైల్స్ రంగానికి గత సర్కారు రూ.1,100 కోట్లు బకాయిలు పెట్టిందని, వాటిపై కూడా త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. గత సర్కారు కేంద్రంతో కలసి కాపురం చేసినా ప్రత్యేక హోదా తేలేదని, ఎప్పటికైనా హోదా సాధిస్తాననే నమ్మకం తమకు ఉందని సీఎం అన్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే సత్తా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకే ఉందన్నారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో పారిశ్రామిక రంగం–మౌలిక సదుపాయాలపై మేధోమ«థన సదస్సు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, నిపుణులు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ.. విభజనతో చాలా నష్టపోయాం మన ఆర్థిక రథం నడవాలంటే వ్యవసాయం ఒక చక్రం అయితే, రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగం. వాటిలో అభివృద్ధి కనిపిస్తేనే ఆర్థిక రథం పరుగెత్తుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు హోదా ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వలేదు. దీనివల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పారిశ్రామికంగా పలు రాయితీలు ఇన్‌కమ్‌ట్యాక్స్, జీఎస్టీ లాంటి రాయితీలు వచ్చేవి. వాటివల్ల రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చి ఉండేవి. హోదాను ఎప్పటికైనా సాధిస్తాం 2014–19 వరకు కేంద్రంతో కలసి కాపురం చేసినా గత ప్రభుత్వం ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీ సాధించింది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకవేళ కేంద్రంలో పూర్తి మెజార్టీ రాకుండా ఉండి ఉంటే వాళ్లతో బేరం పెట్టే అవకాశం ఉండేది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో వారు మా మద్దతు కోరే అవకాశమే లేకుండా పోయింది. గత సర్కారులా అసత్యాలు చెప్పం మనం ఏదైనా చెప్పేటప్పుడు ఆ మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగానే మేం కూడా రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించామని మాట్లాడితే అర్ధం లేదు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి, 40 లక్షల ఉద్యోగాలు అని ఒకరోజు. నెలకో విదేశీ కంపెనీ అంటూ హడావుడి, రూ.50 వేల కోట్లతో సెమీ కండక్టర్ పార్కు, బుల్లెట్ రైలు వస్తుందని ఒకరోజు, ఎయిర్‌బస్ వచ్చేస్తుందని ఇంకోరోజు, మైక్రోసాఫ్ట్ వచ్చేస్తోందని మరొక రోజు, హైపర్ లూప్ వస్తుందని ఇంకొక రోజు ప్రచారం.. ఇవన్నీ సరిపోవని ఈ మధ్యనే దివాలా తీసిన బీఆర్ «శెట్టి ఈ పక్కనే 1,500 పడకలతో రూ.6 వేల కోట్లతో దిగుతున్నాడని చెప్పారు. ఇవన్నీ నేను కూడా చెబితే అర్ధం ఉండదు. అదేనా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’? గత ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేది. 2014 – 2019 వరకు పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టింది. వాటిలో దాదాపు రూ.968 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు ఇవ్వాల్సినవి. పరిశ్రమలు పెట్టించిన తర్వాత రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటి? ఇక్కడ అంతా బాగుందని ఎలా చెబుతాం? గతంలో పారిశ్రామిక రాయితీలు కూడా అమ్ముకున్నారు. ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్టచెబితే తప్ప రాయితీలు ఇచ్చేవారు కాదు. అలా నేను చెప్పలేను.. డిస్కమ్‌లకు కూడా గత ప్రభుత్వం దాదాపు రూ.20 వేల కోట్లు బకాయి పెట్టింది. ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఏటా క్రమం తప్పకుండా దావోస్ వెళ్లారు. ప్రతి రెండు నెలలకు విదేశీ పర్యటనలు, చెప్పిందే చెప్పారు కానీ ఏమీ సాధించలేదు. అన్నీ అబద్ధాలు చెప్పారు. మీడియా వారికి అనుకూలంగా ఉండడం వల్ల అలా అబద్ధాలు చెబుతూ పోయారు. అవన్నీ నేను చెప్పలేను. పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేది ఒక్కటే. చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం. నిజాయితీ, నిబద్ధత మాలో ఉన్నాయి. మాది 4వ అతి పెద్ద పార్టీ 175 సీట్లకు గానూ 151 సీట్లు, 86 శాతం స్థానాలను గెల్చుకుని రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. ప్రో యాక్టివ్‌గా ఉన్నాం. 22 ఎంపీ స్థానాలను గెల్చి దేశంలోనే 4వ అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ నిలిచింది. అవినీతికి తావే లేదు ఇక్కడ ఎవరికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడా అవినీతికి తావు లేదు. వ్యవస్థలో మార్పు తెస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కోసం కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. సంస్కరణలు చేపట్టి రివర్స్ టెండరింగ్ విధానం. తెచ్చారు. టెండర్లలో ఎల్–1 వచ్చినా అంతకంటే ఎవరైనా తక్కువకు వస్తే రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నాం. దేశంలో అత్యున్నత పోలీసు వ్యవస్థ ఏపీలో ఉంది. గ్రామ స్థాయిలో సచివాలయాల్లో మహిళా పోలీసులున్నారు. ఆ స్థాయిలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. శాంతి భద్రతలకు ఢోకా లేదు. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల విలువైన చేపలు, రొయ్యలు, వ్యవసాయ ఉత్పత్తులు, పొగాకు, కాఫీతోపాటు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేశాం. మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్ నెట్వర్క్ ఉంది. అవసరాలకు తగినట్లుగా పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాగు, సాగు నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ గ్రిడ్స్, కాలువల నుంచి ఢోకా లేకుండా నీరు ఇచ్చేవిధంగా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. పదేళ్లలో అద్భుతమైన మానవ వనరులు.. ► ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో తెలుగు తప్పనిసరి సబ్జెక్‌గా ఉంటుంది. దీనివల్ల వచ్చే 10 ఏళ్లలో సేవా రంగానికి అద్భుతమైన మానవ వనరులు అందించే పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్తుందని గర్వంగా చెప్పగలుగుతా. ► గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో కూడా మన స్థానం మారుతుంది. ఇంటర్ తర్వాత కాలేజీలో చేరుతున్న వారి నిష్పత్తి చూస్తే.. రష్యాలో 82 శాతం, చైనాలో దాదాపు 51 శాతం, బ్రెజిల్లో కూడా దాదాపు 51 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం అది కేవలం 26 నుంచి 28 శాతం వరకు మాత్రమే ఉంది. ► ఈ పరిస్థితి మారాలని 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. 34 దేశాల రాయబారులను పిలిచాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర నెలలు కూడా గడవకముందే డిప్లొమాటిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించి దాదాపు 34 దేశాల రాయబారులను కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఆహ్వానించాం. ఇక్కడ పెట్టుబడి అవకాశాలను వివరించాం. ఇవన్నీ చేస్తుంటే, గత సర్కారు పెద్దమనుషులు, వారి అనుకూల మీడియా దుష్ప్రచారం చేసింది. కియా మోటర్స్ వెళ్లిపోతోందని ప్రచారం చేశారు. అప్పుడు కియా మోటర్స్ ఎండీ స్పందించి ఇక్కడ ఇంత సానుకూలంగా ఉంటే ఎందుకు వెళ్లిపోతామని లేఖ ఇచ్చారు. పరిశ్రమలు–పెట్టుబడులు–ఉద్యోగాలు ► పరిశ్రమల పట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం ఉంది కాబట్టే గత ఏడాది 34,322 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి మొదలు పెట్టాయి. ► 13,122 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. వాటి ద్వారా రూ.2503 కోట్లు పెట్టుబడి రాగా, 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కోవిడ్ వల్ల కాస్త మందగించినా పుంజుకుంటున్నాయి. ► ఇంకా రూ.11,548 కోట్ల పెట్టుబడికి 1,466 కంపెనీలు రెడీగా ఉన్నాయి. వాటికి ఏపీఐఐసీ 1,600 ఎకరాల భూమి కేటాయించింది. మరో 20 ప్రముఖ సంస్థలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు చేయూత ► సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రాష్ట్రంలో దాదాపు 98 వేల యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వాటిని కాపాడుకుంటేనే వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందుకే వైఎస్ఆర్ నవోదయం పథకం ద్వారా 81 వేల ఎంఎస్ఎంఈలకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగేలా బ్యాంకులతో మాట్లాడి ప్యాకేజీలు రెడీ చేసి అండగా నిలిచాం. ► కోవిడ్‌తో చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు మూతబడే స్థితికి చేరుకున్నాయి. వాటికి గత ప్రభుత్వం రూ.968 కోట్ల ప్రోత్సాహక రాయితీలు బకాయి పెడితే మేం ఇస్తామని చెప్పాం. ఇప్పటికే రూ.450 కోట్లు ఇచ్చాం. మిగిలిన మొత్తం కూడా జూన్ 29న ఇవ్వబోతున్నాం. ఇది నిజమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ► ఇవే కాకుండా ఏప్రిల్ నుంచి జూన్ వరకు పవర్‌పై ఫిక్స్డ్ ఛార్జీలు రూ.188 కోట్లు రద్దు చేశాం. కేంద్రం ఇచ్చేవి కూడా పంపిణీ చేసి తోడుగా ఉంటాం.ప్రభుత్వం ఇంకా వాటికి రూ.1200 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటోంది. పెద్ద కంపెనీలకు చాలా చేయాలి.. పెద్ద కంపెనీలకు ఇంకా ఆశించిన స్థాయిలో చేయలేకపోతున్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అందుకోసమే సూచనలు, సలహాలు తీసుకుందామని మిమ్మల్ని ఆహ్వానించాం. ఏంచేస్తే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలలో విశ్వాసం కలుగుతుందో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడేళ్లలో చేయాల్సిన ప్రాజెక్టులు.. ► రాష్ట్రానికి మూడేళ్లలో కొన్ని ప్రాజెక్టులు తప్పనిసరిగా చేయాల్సినవి ఉన్నాయి. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు నిర్మాణం, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావాలి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. అక్కడ మెట్రో రైలు రావాలి. ► ఇంకా 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లతో పాటు 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. జాయింట్ వెంచర్‌కు సిద్ధంగా ఉన్నాం. ప్లాంట్‌కు ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానం కోసం డీఆర్డీవోతో ఒప్పందం చేసుకున్నాం. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ విశాఖలో హైఎండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. టైర్–1 సిటీ కాబట్టి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో విశాఖ పోటీ పడగలుగుతుంది. అక్కడ నిపుణులైనసాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందుబాటులోకి వస్తారు. రాబోయే రోజుల్లో అది కార్యరూపం దాల్చనుంది. సదస్సులో మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు, నిపుణులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు -
బాబు బూటకపు హామీలు..పడకేసిన పరిశ్రమలు
సాక్షి,అమరావతి : గడిచిన ఐదేళ్లలో కొత్త పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ఐదేళ్లలో ఒక్క భారీ తయారీ రంగ పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలే మూతపడ్డ పరిస్థితి. కనీసం విభజన హామీలో పేర్కొన్న భారీ కేంద్ర ప్రాజెక్టులను ఒక్కదాన్ని కూడా సాధించలేదు. కేంద్రంలో అధికారం పంచుకున్నంతకాలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను గాలికొదిలేయడంతో రావాల్సిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. విభజన సమయంలో ప్రత్యేక హోదా ప్రకటించడంతో హైదరాబాద్‌కు చెందిన ఒక ఇన్ఫ్రా కంపెనీ నెల్లూరు వద్ద యూనిట్‌ను ఏర్పాటు చేద్దామనుకుంది. రెండేళ్లు ఎదురుచూసినా ముఖ్యమంత్రి ధోరణి చూసి ఆ కంపెనీ రాష్ట్రంలో యూనిట్ నెలకొల్పే యత్నాన్ని మానుకుని ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లిపోయింది. హోదా వస్తే హైదరాబాద్‌లో యూనిట్లు ఉన్న చాలా సంస్థలు ఇక్కడ కూడా యూనిట్లు నెలకొల్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. చివరకు ముఖ్యమంత్రి హోదా కంటే ప్యాకేజే ఉత్తమం అంటూ చెప్పడంతో ఆయా కంపెనీలు తమ ప్రతిపాదనలను విరమించుకున్నాయి. ఇలాంటి సంఘటనలకు అనేక దాఖలాలున్నాయి. టీడీపీ నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్నా ఒక్క భారీ ప్రాజెక్టును తీసుకురాకపోగా అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ కూడా అటకెక్కింది. ప్రచార పాలసీలు–బూటకపు ఒప్పందాలు గడిచిన ఐదేళ్లుగా పెట్టుబడుల ఆకర్షణ కోసం అనేక పారిశ్రామిక పాలసీలు, భాగస్వామ్య సదస్సులు, విదేశీ పర్యటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ రియాల్టీ షోలను నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా 22కు పైగా పారిశ్రామిక పాలసీలను ప్రకటించింది. పరిశ్రమల రంగంలో 12 పాలసీలు, ఐటీ రంగంలో 9 పాలసీలు, పర్యాటక రంగంలో ఒక పాలసీని విడుదల చేసింది. అదే విధంగా 2016, 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా మూడేళ్లు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ)తో కలిసి వైజాగ్ వేదికగా భాగస్వామ్య సదస్సులను నిర్వహించారు. ఇలా మూడు భాగస్వామ్య సదస్సుల ద్వారా మొత్తం రూ.19.6 లక్షల కోట్ల విలువైన 1,761 ఒప్పందాలు కుదిరినట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. టీ కొట్లో పనిచేసేవారు, రాజకీయ నాయకుల కారు డ్రైవర్లకు సూటు బూటు తొడిగి పారిశ్రామికవేత్తలుగా వేషాలు వేయించి ఒప్పందాలు చేసుకున్న వైనాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన వైనం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని శ్వేతపత్రం సాక్షిగా బయటపడింది. భాగస్వామ్య సదస్సులు కాకుండా రాష్ట్రంలో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు స్వతహాగానే పెట్టుబడులు పెట్టడానికి ముందుకురాగా, మరికొన్ని ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో ఒప్పందాలు కుదిరాయి. ఈ ఐదేళ్లలో మొత్తం 2,622 ఒప్పందాలు ద్వారా రూ.15.48 లక్షల కోట్ల పెట్టుబడులు 32.35 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నట్టు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ గత మూడు భాగస్వామ్య సదస్సుల్లోనే రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాలు వచ్చినట్టు చెప్పగా ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15.48 లక్షలకు తగ్గించేశారు. విభజన హామీల అమల్లో విఫలం రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు వృద్ధిరేటు, ఉపాధి అవకాశాలు పెంచడం కోసం అనేక భారీ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. ఇందులో ముఖ్యమైనది కాకినాడ వద్ద భారీ పెట్రోలియం కాంప్లెక్స్ నిర్మాణం. 2014 విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాకినాడలో గెయిల్–హెచ్‌పీసీఎల్ కలిసి రూ.32,900 కోట్లతో భారీ క్రాకర్, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చాయి. కానీ, ఈ ప్రాజెక్టు లాభదాయకతపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ స్టడీ రూ.5,615 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) అవసరమవుతుందని తేల్చిచెప్పింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నాయి. కానీ ఈ మొత్తం కేటాయించడానికి నిరాకరిస్తూ ఈ మొత్తం కూడా కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయా రాష్ట్రాలే వీజీఎఫ్ భరించాయని కేంద్రం చెప్పింది. కానీ దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు రూ.12,578 కోట్ల రాయితీలను ఇచ్చి హల్దియా సంస్థ చేత పెట్రో కెమికల్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. అదే విధంగా కడప వద్ద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ చేత భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి ఉక్కు లభ్యత గురించి వివరాలను ఇవ్వబోమని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా తొక్కిపెట్టి ఎన్నికల ముందు తామే నిర్మిస్తామంటూ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఎన్నికల తర్వాత నెమ్మదిగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. అదే విధంగా దుగరాజుపట్నం వద్ద ఓడ రేవు ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించింది. దుగరాజపట్నం వద్ద ఏర్పాటుకు సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు రావడంతో మరో ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించమన్నా చూపించకుండా రామాయపట్నం వద్ద రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మైనర్ ఓడరేవు నిర్మాణం చేపట్టింది. పేరుకు రాష్ట్ర ప్రభుత్వమే అయినా ఇందులో 8 బెర్తులను అప్పుడే ప్రైవేటు సంస్థల సొంత వ్యాపారాల కోసం విక్రయించేసింది. కనీసం రామాయపట్నం ఓడరేవును తాము నిర్మిస్తామంటూ కేంద్రం ముందుకు వచ్చినా అనుమతులు ఇవ్వడం లేదు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ఈ కేంద్ర సంస్థలను తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం బలిచేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారంటున్నారు. ఈ ఐదేళ్లలో బందరు ఓడరేవు, భోగాపురం విమానాశ్రయం, భావనపాడు ఓడరేవు వంటి భారీ ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తిరోగమనానికి గణాంకాలే సాక్ష్యం ఓ పక్క పారిశ్రామిక రంగం తిరోగమన దశలో నడుస్తోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. వేగంగా దూసుకుపోతోందంటూ అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది. 2015–16లో 13.89 శాతంగా ఉన్న తయారీ రంగ వృద్ధిరేటు 2017–18 నాటికి 8.36 శాతానికి పడిపోయింది. అలాగే పారిశ్రామిక వృద్ధిరేటు 9.61 శాతం నుంచి 8.49 శాతానికి పడిపోయింది. వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే చెబుతుంటే.. ముఖ్యమంత్రి ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయంటున్నారు. అందులో రూ.1.77 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్పత్తి కూడా ప్రారంభించేశాయని, మరో రూ.5.27 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయంటున్నారు. నిజంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే పారిశ్రామిక వృద్ధిరేటు రెట్టింపుపైగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి భిన్నంగా వృద్ధిరేటు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా వచ్చింది రూ.32,803 కోట్లే లక్షల కోట్ల పెట్టుబడులంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ప్రచారంలోని డొల్లతనాన్ని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీఐపీపీ) బయటపెట్టింది. దేశంలో పెట్టుబడి చేసే ప్రతీ పైసా డీఐపీపీ వద్ద నమోదు కావాల్సిందే. డీఐపీపీ గణాంకాల ప్రకారం గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.1,26,512 కోట్ల విలువైన 733 ఒప్పందాలు మాత్రమే జరిగాయి. అంటే చంద్రబాబు చెబుతున్న రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాలు జరగలేదన్నది స్పష్టమవుతోంది. అలాగే గత ఐదేళ్లలో ఈ ఒప్పందాల్లో కేవలం రూ.32,803 కోట్ల విలువైన 293 ప్రాజెక్టులు మాత్రమే అమల్లోకి వచ్చినట్టు డీఐపీపీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఈ ఐదేళ్లలో రూ.1.77 లక్షల కోట్ల విలువైన 810 ప్రాజెక్టులు ప్రారంభమైపోయాయని, వీటి ద్వారా 2.51 లక్షల మందికి ఉపాధి లభించిందంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలు కుదేలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గడచిన ఐదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఉద్యమాలు, విద్యుత్ కోతలతో అనేక కష్టానష్టాలు ఎదుర్కొన్న ఈ రంగం టీడీపీ అధికారంలోకి వచ్చాక మరింత అధికమమాయ్యియి. లక్షలాది సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో మొత్తం 25.96 లక్షలకుపైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నట్లు ఒక అంచనా కాగా , గడిచిన ఐదేళ్లలో 10.38 లక్షలకు పైగా యూనిట్లు మూతపడినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో మూడో స్థానంలో ఉన్న ఈ యూనిట్లు మూతపడటం వల్ల 10.38 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఎంఎస్ఎంఈ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, విజయనగరం వంటి జిల్లాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఐదు నెలల కిందట మూతబడిన విజయనగరంలోని ఫెర్రోఅల్లాయిస్ యూనిట్ కర్నూలులో 2 లక్షల మంది ఉపాధికి గండి కర్నూలు జిల్లాలో నూనె మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, సున్నపు బట్టీలు, గ్రానైట్, క్వారీ పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, పత్తికొండలలో నూలు, జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, ఆదోనిలోని పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ ప్రోత్సాహం కరువై అనేక చిన్న పరిశ్రమలకు తాళాలు వేశారు. వీటిద్వారా దాదాపు 5 లక్షల మంది ఉపాధి పొందేవారు. ప్రభుత్వం రాయల్టీ రూపంలో చిన్న పరిశ్రమల నుంచి భారీగా వసూలు చేయడం, విద్యుత్ చార్జీల పెంపు వల్ల కుదేలయ్యాయి. పెట్టుబడి నిధి సమకూర్చడం, బ్యాంకుల నుంచి రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలంకావడంతో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిద్వారా ఉపాధి పొందే వేలాది మంది రోడ్డున పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారమే ఐదేళ్ల టీడీపీ పాలనలో 6 వేల పరిశ్రమలు మూతపడి రెండు లక్షల మంది ఉపాధి కోల్పోయారు. పెరిగిన వలసలు విజయనగరం జిల్లాలో స్టీల్, ఫెర్రో ఎల్లాయిస్, ఫార్మా, చక్కెర, జూట్¯Œ, కెమికల్, జీడి రంగాలకు చెందిన అనేక చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో సుమారుగా 4,288 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉంటే అందులో 40 శాతం మూతపడ్డాయి. ఈ కారణంగా విజయనగరం జిల్లా వాసులు విశాఖ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 1,200 వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలున్నాయి. తిరుపతి, మదనపల్లి, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని చిన్న పరిశ్రమలు దాదాపు మూతపడ్డాయి. 860 చిన్న పరిశ్రమలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కోలుకోలేని స్థితిలో పడ్డాయి. రాజశేఖరరెడ్డి హయాంలో చిన్న పరిశ్రమలకు విద్యుత్, వ్యాట్‌లపై సబ్సిడీ ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యుత్‌పై రాయితీ ఎత్తివేయడంతోపాటు అప్పటికే ఉన్న చార్జీలను భారీగా పెంచారు. ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న పరిశ్రమలపై విద్యుత్ చార్జీల పెంపు గుదిబండలా మారింది. దీంతో అనేక పరిశ్రమలు నష్టాలు భరించలేక మూతపడ్డాయి. బంగారు పాళ్యంలోని గోమతి స్పిన్నింగ్ మిల్స్ లాంటి పరిశ్రమలు కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. ఒక్క నగరిలోనే టీటీకే, ప్రశాంత్ స్పిన్నింగ్ వంటి మిల్లులు మూతపడ్డాయి. ఈ రెండు మిల్లుల్లోనే 900 మంది పని చేసేవారు. చిన్నతరహా పరిశ్రమలన్నీ పడకేయడంతో వాటిలో పనిచేసే 7 వేల మంది కార్మికులు పొట్టచేతబట్టుకుని వలసబాట పట్టారు. ఎంఎస్ఎంఈ పార్కులెక్కడ? చిన్నతరహా పరిశ్రమల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ప్రస్తుత ఎన్నికల్లోగా కనీసం 45 పార్కులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పినా.. వాస్తవంగా ఇంతవరకు ఒక్క పార్కు కూడా ప్రారంభం కాలేదు. పెద్ద పరిశ్రమలకు కారు చౌకగా భూములిస్తున్న ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు మాత్రం అధిక ధరను కేటాయిస్తున్నాయని, ఎంఎస్ఎఈ పార్కుల్లో ధరలు కూడా అదే విధంగా ఉన్నాయంటూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలువాపోతున్నారు. -
రైతుల ఆందోళన ఉధృతం
పరిశ్రమలకు భూములిచ్చేది లేదంటూ నిరసన lఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు గీసుకొండ : పరిశ్రమల పేరుతో భూములను బల వంతంగా లాక్కోవాలని చూస్తున్నా్నరని ఆరోపిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్పింది. మండలంలోని ఊకల్æహవేలీ, శాయంపేట హవేలీ, సంగెం మండలం స్టేషన్ చింతలపెల్లి, కృష్ణానగర్ గ్రామాల రైతులు బుధవారం సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వద్ద నిరసన తెలిపారు. అంతేకాకుండా ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలో పుచ్చ రాజన్న, రామస్వామి, దం డు యుగేందర్, వేల్పుల లచ్చయ్య, ఐలయ్య, దండి కుమారస్వామి, కుమారస్వామి, సమ్మయ్య, కొమురయ్య, నర్సింగరావు, టి.రవీందర్ కూర్చున్నారు. దీక్షలకు మోర్తాల చందర్రావు, సోమిడి శ్రీనివాస్, రమేశ్, రాజేందర్, బీరం రాములు, బాబు, రంగారెడ్డి, చిన్ని, శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేకు రైతుల నిరసన సెగ.. మండలంలోని శాయంపేట హవేలీలి రైతులు పరిశ్రమలకు తమ భూములను ఇవ్వబోమంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎదుట నిరసన తెలిపారు. శాయంపేట హవేలీకి ఎమ్మెల్యే.. వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరెడ్డి, గీసుకొండ తహసిల్దారు శ్రీనివాస్‌తో కలిసి వెళ్లారు. పరిశ్రమల స్థాపన వల్ల మేలు కలుగుతుందని వివరించడానికి ప్రయత్నించగా.. కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే చెప్పినా రైతులు వినలేదు. ఈ మేరకు పలువురు వెళ్లిపోగా మిగిలిన రైతులతో ఎమ్మెల్యే మాట్లాడారు. అసైన్మెంట్ భూమి ఉంటే రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకుంటుందని, పరిశ్రమలకు అప్పజెప్పే భూముల ధరల విషయంలో తనతో చర్చిస్తే వారికి మేలు జరిగేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మామునూరు సీఐ శ్రీనివాస్, గీసుకొండ ఎస్ఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటుచేయగా సర్పంచ్‌లు కొంగర చంద్రమౌళి, కోల కుమారస్వామి, జక్కు మురళి, టీఆర్ఎస్ నాయకులు ముంత రాజయ్య, ధర్మారావు, పి.జయపాల్‌రెడ్డి, మాధవరెడ్డి, అంకతి నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
బలవంతపు భూసేకరణ తగదు
2013 చట్టాన్ని అమలు చేయాలి ప్రజా సంఘాల నాయకులు ధర్మసాగర్ : ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన పేరుతో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయ డం తగదని మహిళా రైతుల వేదిక రాష్ట్ర నాయకురాలు ఆశలత, సీసీసీ రాష్ట్ర నాయకురాలు, కాలమిస్ట్ కె. సజయ, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకుడు విస్సా కిరణ్ అన్నారు. మండలంలోని ముప్పారం, దేవునూరులోని టైక్స్‌టైల్ పార్కు ప్రతిపాదిత స్థలం, జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్‌లో నిర్మించనున్న రిజర్వాయర్ భూములను బుధవారం రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతుల హక్కు ల వేదిక, దళిత బహుజన ఫ్రంట్, సీసీసీ, మానవహక్కుల వేదిక రాష్ట్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్ట ప్రకారం మార్కెట్ రేటును సవరించి, పెంచకుండా అతి తక్కువ ధరకు భూములను సేకరించడం అన్యాయమన్నారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా దళిత, నిరుపేద రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా భూనిర్వాసిత రైతులకు లభించే నాణ్యమైన న ష్టపరిహారం, ఇతర విస్తృతమైన ఫలాలను అందించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మిం చిన భారం కావడంతోనే దొడ్డిదారిన 123 జీఓ తీసుకొ చ్చి రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. భూసేకరణకు సహకరించని రైతులను బెదిరిస్తూ వారి నుంచి భూము లు బలవం తంగా లాక్కోవడం రాజ్యంగ విరుద్ధమైన చర్య అన్నారు. 123 జీఓపై హైకోర్టు సైతం ప్రభుత్వానికి మొట్టికాయ వేసినప్పటికి ప్రభుత్వం దుందుడుకు తనా న్ని ప్రదర్శిస్తూ రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరిస్తుందన్నారు. ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలని వారు డిమాండ్ చేసారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పి.శంకర్, బీరం రాములు, చుంచు రాజేందర్, అద్దునూరి యాదగిరి, పొన్నాల రమేష్, నవీన్, కొండల్ పాల్గొన్నారు. భూములను పరిశీలించిన అధికారులు ధర్మసాగర్ : మండలంలోని ముప్పారం గ్రామంలో టెక్స్టైల్ పార్కు ప్రతిపాదిత భూములతోపాటు ఎలుకుర్తిలోని ప్రభుత్వ భూములను రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, కలెక్టర్ వాకాటి కరుణ బుధవారం పరిశీలించారు. జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించేందుకు రెండు రోజులుగా చేపట్టిన కార్యక్రమంలో భా గంగానే అధికారులు భూములను పరిశీలించినట్లు తెలిసింది. కార్యక్రమంలో జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఆర్డీఓ వెంకటమాధవరావు, డీఎఫ్ఓ భీమానాయక్, తహసీల్దార్ బి.సత్యనారాయణ, ఆర్ఐ అబ్బాస్, సర్వేయర్ భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. -
‘హోదా’ కేంద్రం నైతిక బాధ్యత
విభజనానంతర ఏపీ ఆర్థిక దుస్థితి దృష్ట్యానే బీజేపీ నాడు ప్రతిపక్షంగా పదేళ్ల ప్రత్యేక హోదాకు పట్టుబట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు హామీనిచ్చింది. కాబట్టి ఆర్థిక సంఘం సిఫారసును తిరస్కరించి, చట్ట సవరణ చేసైనా ఏపీకి ప్రత్యేకహోదాను కల్పించడం కేంద్రం నైతిక బాధ్యత, రాజ్యాంగ విధి. ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రాలకు మూడు విధాలుగా పెద్ద ఎత్తున నిధులు సమకూరుతాయి. అదీ దాదాపు ఉచిత గ్రాంట్లుగానే లభిస్తాయి. పన్నుల తగ్గింపులు, రాయితీల వల్ల పరిశ్రమల స్థాపన పెరిగి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. రాష్ట్రాభివృద్ధి ఊపందుకుంటుంది. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకోలేనంత తక్కువ వనరులున్న (పెట్టుబడి ఆస్తులు) రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అననుకూల పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్రాలుగా గుర్తించింది. వాటిని ప్రాధాన్యత న్వివలసినవిగా లేదా ప్రత్యేకమైనవిగా పరిగణిస్తుంది. వాటికి కేంద్ర పన్నుల్లో అత్యధిక రాయితీలను ఇస్తుంది. 1969లో ప్రారంభమైన ఈ విధానాన్ని అనుసరించి జమ్మూక శ్మీర్, అస్సాం, నాగాలాండ్లను తొలుత ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలుగా గుర్తించారు. ఆ జాబితాలో జార్ఖండ్ 2010లో పదకొండవదిగా చేరింది. ప్రధాని, కేంద్ర మంత్రులు, ప్రణాళికా సంఘం (నేటి నీతి ఆయోగ్) సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డీసీ)కి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా గుర్తించే అధికారం ఉంటుంది. అయితే ఎన్‌డీసీలో ప్రధానిదే నిర్ణయాత్మక పాత్ర. కాబట్టి ఆయన కోరుకుంటే ఏ రాష్ట్రానికైనా అ హోదాను కల్పించవచ్చు. 1. కొండలు కోనలతో కూడిన కఠిన భౌగోళిక పరిస్థితులున్న పరిస్థితుల్లో, 2. జనసాంద్రత తక్కువగా ఉండి, ఆదివాసుల వంటివారు ఎక్కువగా ఉన్న ప్రాంతమైతే, 3. దేశ సరిహద్దునున్న వ్యూహాత్మక ప్రాంతమైతే, 4. ఆర్థికంగా, మౌలిక సదు పాయాలపరంగా వెనుకబడినదైతే, 5. రాబడి తక్కువగా ఉన్నదైతే మాత్రమే ఒక రాష్ట్రం ప్రత్యేక హోదాను కోరగలుగుతుంది. వీటిలోని 4, 5 అంశాల దృష్ట్యా చూస్తే నేటి ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రం హోదా ఇవ్వదగినదే. ఆ హోదాకు అనుగుణంగా ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రానికి కేంద్ర పన్నులలో గరిష్ట రాయితీలను ఇవ్వవచ్చు. ‘ప్రత్యేక’ రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం ప్రణాళికా సంఘం కేంద్ర పన్నుల రాబడి నుంచి రాష్ట్రాలకు 1. సాధారణ కేంద్ర సహాయం, 2. అదనపు కేంద్ర సహాయం, 3. ప్రత్యేక కేంద్ర సహాయం అనే మూడు విధాలుగా నిధులను కేటాయిస్తుంది. మొత్తం కేంద్ర సాధారణ సహాయం నుంచి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 30 శాతం నిధులు లభిస్తాయి. అందులో 90 శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంటు కాగా, 10 శాతం అప్పు. మిగతా రాష్ట్రాలకు కేంద్ర సాధారణ సహాయంలో 30 శాతం మాత్రమే గాంట్లు, 70 శాతం రుణం. ఇక ప్రత్యేక కేటగిరీ హోదాగల రాష్ట్రాలు కేంద్ర పథకాలకు, విదేశీ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు అందే కేంద్ర అదనపు సహాయంలో గ్రాంట్లు, అప్పు నిష్పత్తి 90:10గా ఉంటుంది. ఇక ప్రత్యేక కేంద్ర సహాయం కింద ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు అంశాలవారీగా సహాయం అందుతుంది. ఈ కేటాయింపులు రాష్ట్ర ప్రణాళిక పరిమాణం, మునుపటి ప్రణాళిక వ్యయం వంటి ఆంశాలపై కూడా అధారపడి ఉంటాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ మూడు విధాలుగానూ పెద్ద ఎత్తున నిధులు... ప్రధానంగా గ్రాంట్లుగా లభిస్తాయి. అంతేకాదు, ఎక్సైజ్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఆదాయం పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లలో గణనీయమైన తగ్గింపులు, మినహాయింపుల వల్ల కూడా లబ్ధి చేకూరుతుంది. ఎక్సైజ్ తగ్గింపుతో పరిశ్రమల స్థాపన పెరుగుతుంది, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తద్వారా రాష్ట్రాభివృద్ధి ఊపందుకుంటుంది. వివిధ పద్దుల కింద కేంద్ర నిధులు వివిధ రాష్ట్రాలు కేంద్ర పన్నుల రూపేణా కేంద్రానికి ఏ మోతాదులో రాబడిని సమకూరుస్తాయనే దాన్నిబట్టి కేంద్ర ఆర్థిక సంఘం ఆయా రాష్ట్రాలకు పంచుతుంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన పన్నుల రాబడి నుంచి 2,55,414 కోట్లను రాష్ట్రాలకు పంచింది. ఇది రాష్ట్రాలకు కేంద్రం అందించిన మొత్తం నిధుల్లో 57 శాతం. ఇదిగాక ప్రకృతి వైపరీత్యాలు, రోడ్ల నిర్వహణ వంటి అవసరాలకు అది ఆయా రాష్ట్రాలకు అంశాలవారీగా అందజేసే గ్రాంట్లు, అప్పుల విషయంలో విధి విధానాలను కూడా ఆర్థిక సంఘం సూచిస్తుంది. అయితే కేంద్ర పన్నులను రాష్ట్రాలకు పంపిణీ చే యడంలో మాత్రం అది ఎలాంటి తేడానూ చూపదు. ప్రణాళికా సంఘం, అర్థిక సంఘాల ద్వారా కేంద్రం రాష్ట్రాలకు సాధారణంగా అందించే నిధులకంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు లభించే నిధులు పలు విధాలుగా ఎక్కువగా లభిస్తాయి. అంతేకాదు, హోదా ఉన్న రాష్ట్రాలకు లభించే నిధుల్లో అత్యధిక భాగం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంట్ల రూపంలో లభిస్తుంది. రుణం అతి స్వల్పంగా ఉంటుంది. ఈ తేడాయే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు త్వరితగతిన అభివృద్ధి చెందడానికి కేంద్రం అందించే తోడ్పాటు అని స్థూలంగా చెప్పుకోవచ్చు. 1. కేంద్ర పన్నుల్లో భాగం, 2. ప్రణాళికేతర అప్పులు, గ్రాంట్లు, 3. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు, 4. సాధారణ కేంద్ర సహాయం, 5. కేంద్ర ప్రత్యేక సహాయం, 6. అదనపు కేంద్ర సహాయం అనే ఆరు రూపాల్లో కేంద్ర సహాయం రాష్ట్రాలకు అందుతుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 3, 4, 5 మూడు పద్దుల కింద లభించే నిధుల ద్వారా భారీగా లబ్ధి కలుగుతుంది. వీటిలో సాధారణ కేంద్ర సహాయం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులకు సంబంధించి 90 శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంటు కాగా, 10 శాతం మాత్రమే రుణ ంగా ఉంటుంది. అంటే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఇలా అందే కేంద్ర సహాయం దాదాపుగా ఉచితంగా అందేదే. ఇక ఐదవదైన కేంద్ర ప్రత్యేక సహాయం కింద వివిధ ప్రాజెక్టుల వ్యయంలో 90 శాతం గ్రాంట్‌గా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు అందుతుంది. 2014 వరకు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఈ ప్రత్యేక కేంద్ర సహాయం అందింది (2011-12లో రూ. 4 లక్షల కోట్లు). పద్నాలుగవ ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం ఆమోదించడం, ప్రణాళికా సంఘం స్థానే నీతి ఆయోగ్ రావడంతో ప్రత్యేక ఆర్థిక సహాయంగా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు సహాయం రద్దయింది. అయితే దీన్ని పునరుద్ధరిం చాలని బలంగా కోరుతున్నారు. అనాలోచితమైన ఈ చర్యను కేంద్రం ఉపసంహరించుకోవడం సముచితం. ‘హోదా’ రాజ్యాంగపరమైన కర్తవ్యం రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌ను కోల్పోయింది. సర్వీసు రంగం, పారిశ్రామిక రంగం కేంద్రీకరించి ఉన్న రాజధాని ప్రాంతం నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూలో దాదాపు సగం లభించేది. హఠాత్తుగా ఆ రాబడి ఆగిపోయింది. అంతేకాదు, ప్రధాన పరిశ్రమలన్నీ అక్కడే ఉండ టంతో పారిశ్రామిక ఉత్పత్తి, మార్కెటింగ్, రవాణా రంగాలలోని ఉద్యోగావ కాశాలను నేటి ఏపీ కోల్పోయింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలలో వ్యవ సాయం ఎప్పుడూ దైవాధీనమే. మధ్యాంధ్ర, నెల్లూరు జిల్లాల్లోని అత్యుత్తమ మైన, సారవంతమైన, బంగారం పండే భూముల్లో గణనీయమైన భాగం రాజధాని, తదితర అవసరాలకు పోయి అక్కడ సాగు మూలన పడింది. దీంతో మొత్తంగా రాష్ట్ర వార్షిక స్థూల ఉత్పత్తి తీవ్రంగా పడిపోయింది. ఉపాధి అవకాశాలు, రాబడులు క్షీణించాయి. ఒకప్పుడు వలస కూలీలకు పనులను కల్పించిన ప్రాంతాల నుంచి ప్రజలు పొట్ట పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసలు పోవాల్సివస్తోంది. భూమినే నమ్ముకుని ఉన్న రైతుల ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు కరువైన నేటి ఏపీలోని అన్ని రంగాల్లోనూ వృద్ధి దిగజారిపోతోంది. విభజనానంతరం ఇలాంటి పరిస్థితి ఏర్పడక తప్పదనే నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఏపీని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా పరిగణిస్తామని రాజ్యసభలో హామీనిచ్చారు. బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు ఐదేళ్ల ప్రత్యేక హోదా ఎంత మాత్రమూ సరిపోదని, పదేళ్లు ఉండాల్సిందని గట్టిగా వాదించారు. యూపీఏ ప్రభుత్వం దాన్ని ఆమోదించి ప్రణాళికా సంఘానికి సైతం పంపింది. కాంగ్రెస్, బీజేపీలు రెండూ కలిసే ఏపీకి ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాకు హామీని ఇచ్చాయి. కాబట్టి ఆర్థిక సంఘం సిఫారసును తిరస్కరించి, అవసరమైతే చట్ట సవరణనైనా చేసి ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదాను కల్పించడం కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యతే కాదు, రాజ్యాంగపరమైన కర్తవ్యం కూడా. అంతేకాదు విభజన చట్టంలో పొందుపరచిన పన్నుల తగ్గింపు వంటి అంశాలను సత్వరమే కార్య రూపంలోకి తేవాలి. లేకపోతే రాష్ట్రం పరిస్థితి మరింతగా దిగజారుతుంది. ఇప్పటికే మిన్నంటుతున్న ప్రజల అసంతృప్తి తీవ్రవాద ఉద్యమాల వంటి అవాంఛనీయ ధోరణులకు ఊతం ఇచ్చే అవకాశం ఉంది. - (వ్యాసకర్త ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు) మొబైల్: 9849584324 - డి. సుబ్రమణ్యంరెడ్డి