సాక్షి,అమరావతి : గడిచిన ఐదేళ్లలో కొత్త పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ఐదేళ్లలో ఒక్క భారీ తయారీ రంగ పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలే మూతపడ్డ పరిస్థితి. కనీసం విభజన హామీలో పేర్కొన్న భారీ కేంద్ర ప్రాజెక్టులను ఒక్కదాన్ని కూడా సాధించలేదు. కేంద్రంలో అధికారం పంచుకున్నంతకాలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను గాలికొదిలేయడంతో రావాల్సిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.
విభజన సమయంలో ప్రత్యేక హోదా ప్రకటించడంతో హైదరాబాద్‌కు చెందిన ఒక ఇన్‌ఫ్రా కంపెనీ నెల్లూరు వద్ద యూనిట్‌ను ఏర్పాటు చేద్దామనుకుంది. రెండేళ్లు ఎదురుచూసినా ముఖ్యమంత్రి ధోరణి చూసి ఆ కంపెనీ రాష్ట్రంలో యూనిట్ నెలకొల్పే యత్నాన్ని మానుకుని ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లిపోయింది. హోదా వస్తే హైదరాబాద్‌లో యూనిట్లు ఉన్న చాలా సంస్థలు ఇక్కడ కూడా యూనిట్లు నెలకొల్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.
చివరకు ముఖ్యమంత్రి హోదా కంటే ప్యాకేజే ఉత్తమం అంటూ చెప్పడంతో ఆయా కంపెనీలు తమ ప్రతిపాదనలను విరమించుకున్నాయి. ఇలాంటి సంఘటనలకు అనేక దాఖలాలున్నాయి. టీడీపీ నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్నా ఒక్క భారీ ప్రాజెక్టును తీసుకురాకపోగా అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు ఎన్‌టీపీసీ–బీహెచ్‌ఈఎల్ కూడా అటకెక్కింది.
ప్రచార పాలసీలు–బూటకపు ఒప్పందాలు
గడిచిన ఐదేళ్లుగా పెట్టుబడుల ఆకర్షణ కోసం అనేక పారిశ్రామిక పాలసీలు, భాగస్వామ్య సదస్సులు, విదేశీ పర్యటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ రియాల్టీ షోలను నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా 22కు పైగా పారిశ్రామిక పాలసీలను ప్రకటించింది. పరిశ్రమల రంగంలో 12 పాలసీలు, ఐటీ రంగంలో 9 పాలసీలు, పర్యాటక రంగంలో ఒక పాలసీని విడుదల చేసింది. అదే విధంగా 2016, 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా మూడేళ్లు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ)తో కలిసి వైజాగ్ వేదికగా భాగస్వామ్య సదస్సులను నిర్వహించారు.
ఇలా మూడు భాగస్వామ్య సదస్సుల ద్వారా మొత్తం రూ.19.6 లక్షల కోట్ల విలువైన 1,761 ఒప్పందాలు కుదిరినట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. టీ కొట్లో పనిచేసేవారు, రాజకీయ నాయకుల కారు డ్రైవర్లకు సూటు బూటు తొడిగి పారిశ్రామికవేత్తలుగా వేషాలు వేయించి ఒప్పందాలు చేసుకున్న వైనాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన వైనం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని శ్వేతపత్రం సాక్షిగా బయటపడింది.
భాగస్వామ్య సదస్సులు కాకుండా రాష్ట్రంలో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు స్వతహాగానే పెట్టుబడులు పెట్టడానికి ముందుకురాగా, మరికొన్ని ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో ఒప్పందాలు కుదిరాయి. ఈ ఐదేళ్లలో మొత్తం 2,622 ఒప్పందాలు ద్వారా రూ.15.48 లక్షల కోట్ల పెట్టుబడులు 32.35 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నట్టు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ గత మూడు భాగస్వామ్య సదస్సుల్లోనే రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాలు వచ్చినట్టు చెప్పగా ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15.48 లక్షలకు తగ్గించేశారు.
విభజన హామీల అమల్లో విఫలం
రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు వృద్ధిరేటు, ఉపాధి అవకాశాలు పెంచడం కోసం అనేక భారీ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. ఇందులో ముఖ్యమైనది కాకినాడ వద్ద భారీ పెట్రోలియం కాంప్లెక్స్ నిర్మాణం. 2014 విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాకినాడలో గెయిల్–హెచ్‌పీసీఎల్ కలిసి రూ.32,900 కోట్లతో భారీ క్రాకర్, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చాయి. కానీ, ఈ ప్రాజెక్టు లాభదాయకతపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ స్టడీ రూ.5,615 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) అవసరమవుతుందని తేల్చిచెప్పింది.
ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నాయి. కానీ ఈ మొత్తం కేటాయించడానికి నిరాకరిస్తూ ఈ మొత్తం కూడా కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయా రాష్ట్రాలే వీజీఎఫ్ భరించాయని కేంద్రం చెప్పింది. కానీ దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు రూ.12,578 కోట్ల రాయితీలను ఇచ్చి హల్దియా సంస్థ చేత పెట్రో కెమికల్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు.
అదే విధంగా కడప వద్ద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ చేత భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి ఉక్కు లభ్యత గురించి వివరాలను ఇవ్వబోమని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా తొక్కిపెట్టి ఎన్నికల ముందు తామే నిర్మిస్తామంటూ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఎన్నికల తర్వాత నెమ్మదిగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. అదే విధంగా దుగరాజుపట్నం వద్ద ఓడ రేవు ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించింది.
దుగరాజపట్నం వద్ద ఏర్పాటుకు సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు రావడంతో మరో ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించమన్నా చూపించకుండా రామాయపట్నం వద్ద రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మైనర్ ఓడరేవు నిర్మాణం చేపట్టింది. పేరుకు రాష్ట్ర ప్రభుత్వమే అయినా ఇందులో 8 బెర్తులను అప్పుడే ప్రైవేటు సంస్థల సొంత వ్యాపారాల కోసం విక్రయించేసింది. కనీసం రామాయపట్నం ఓడరేవును తాము నిర్మిస్తామంటూ కేంద్రం ముందుకు వచ్చినా అనుమతులు ఇవ్వడం లేదు.
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ఈ కేంద్ర సంస్థలను తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం బలిచేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారంటున్నారు. ఈ ఐదేళ్లలో బందరు ఓడరేవు, భోగాపురం విమానాశ్రయం, భావనపాడు ఓడరేవు వంటి భారీ ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
తిరోగమనానికి గణాంకాలే సాక్ష్యం
ఓ పక్క పారిశ్రామిక రంగం తిరోగమన దశలో నడుస్తోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. వేగంగా దూసుకుపోతోందంటూ అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది. 2015–16లో 13.89 శాతంగా ఉన్న తయారీ రంగ వృద్ధిరేటు 2017–18 నాటికి 8.36 శాతానికి పడిపోయింది. అలాగే పారిశ్రామిక వృద్ధిరేటు 9.61 శాతం నుంచి 8.49 శాతానికి పడిపోయింది.
వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే చెబుతుంటే.. ముఖ్యమంత్రి ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయంటున్నారు. అందులో రూ.1.77 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్పత్తి కూడా ప్రారంభించేశాయని, మరో రూ.5.27 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయంటున్నారు. నిజంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే పారిశ్రామిక వృద్ధిరేటు రెట్టింపుపైగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి భిన్నంగా వృద్ధిరేటు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవంగా వచ్చింది రూ.32,803 కోట్లే
లక్షల కోట్ల పెట్టుబడులంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ప్రచారంలోని డొల్లతనాన్ని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీఐపీపీ) బయటపెట్టింది. దేశంలో పెట్టుబడి చేసే ప్రతీ పైసా డీఐపీపీ వద్ద నమోదు కావాల్సిందే. డీఐపీపీ గణాంకాల ప్రకారం గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.1,26,512 కోట్ల విలువైన 733 ఒప్పందాలు మాత్రమే జరిగాయి. అంటే చంద్రబాబు చెబుతున్న రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాలు జరగలేదన్నది స్పష్టమవుతోంది.
అలాగే గత ఐదేళ్లలో ఈ ఒప్పందాల్లో కేవలం రూ.32,803 కోట్ల విలువైన 293 ప్రాజెక్టులు మాత్రమే అమల్లోకి వచ్చినట్టు డీఐపీపీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఈ ఐదేళ్లలో రూ.1.77 లక్షల కోట్ల విలువైన 810 ప్రాజెక్టులు ప్రారంభమైపోయాయని, వీటి ద్వారా 2.51 లక్షల మందికి ఉపాధి లభించిందంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.
చిన్న పరిశ్రమలు కుదేలు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గడచిన ఐదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఉద్యమాలు, విద్యుత్ కోతలతో అనేక కష్టానష్టాలు ఎదుర్కొన్న ఈ రంగం టీడీపీ అధికారంలోకి వచ్చాక మరింత అధికమమాయ్యియి. లక్షలాది సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు.
రాష్ట్రంలో మొత్తం 25.96 లక్షలకుపైగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నట్లు ఒక అంచనా కాగా , గడిచిన ఐదేళ్లలో 10.38 లక్షలకు పైగా యూనిట్లు మూతపడినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో మూడో స్థానంలో ఉన్న ఈ యూనిట్లు మూతపడటం వల్ల 10.38 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఎంఎస్‌ఎంఈ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, విజయనగరం వంటి జిల్లాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఐదు నెలల కిందట మూతబడిన విజయనగరంలోని ఫెర్రోఅల్లాయిస్ యూనిట్
కర్నూలులో 2 లక్షల మంది ఉపాధికి గండి
కర్నూలు జిల్లాలో నూనె మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, సున్నపు బట్టీలు, గ్రానైట్, క్వారీ పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, పత్తికొండలలో నూలు, జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, ఆదోనిలోని పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ ప్రోత్సాహం కరువై అనేక చిన్న పరిశ్రమలకు తాళాలు వేశారు.
వీటిద్వారా దాదాపు 5 లక్షల మంది ఉపాధి పొందేవారు. ప్రభుత్వం రాయల్టీ రూపంలో చిన్న పరిశ్రమల నుంచి భారీగా వసూలు చేయడం, విద్యుత్ చార్జీల పెంపు వల్ల కుదేలయ్యాయి. పెట్టుబడి నిధి సమకూర్చడం, బ్యాంకుల నుంచి రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలంకావడంతో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిద్వారా ఉపాధి పొందే వేలాది మంది రోడ్డున పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారమే ఐదేళ్ల టీడీపీ పాలనలో 6 వేల పరిశ్రమలు మూతపడి రెండు లక్షల మంది ఉపాధి కోల్పోయారు.
పెరిగిన వలసలు
విజయనగరం జిల్లాలో స్టీల్, ఫెర్రో ఎల్లాయిస్, ఫార్మా, చక్కెర, జూట్¯Œ, కెమికల్, జీడి రంగాలకు చెందిన అనేక చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో సుమారుగా 4,288 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉంటే అందులో 40 శాతం మూతపడ్డాయి. ఈ కారణంగా విజయనగరం జిల్లా వాసులు విశాఖ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 1,200 వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలున్నాయి.
తిరుపతి, మదనపల్లి, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని చిన్న పరిశ్రమలు దాదాపు మూతపడ్డాయి. 860 చిన్న పరిశ్రమలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కోలుకోలేని స్థితిలో పడ్డాయి. రాజశేఖరరెడ్డి హయాంలో చిన్న పరిశ్రమలకు విద్యుత్, వ్యాట్‌లపై సబ్సిడీ ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యుత్‌పై రాయితీ ఎత్తివేయడంతోపాటు అప్పటికే ఉన్న చార్జీలను భారీగా పెంచారు. ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న పరిశ్రమలపై విద్యుత్ చార్జీల పెంపు గుదిబండలా మారింది.
దీంతో అనేక పరిశ్రమలు నష్టాలు భరించలేక మూతపడ్డాయి. బంగారు పాళ్యంలోని గోమతి స్పిన్నింగ్ మిల్స్ లాంటి పరిశ్రమలు కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. ఒక్క నగరిలోనే టీటీకే, ప్రశాంత్ స్పిన్నింగ్ వంటి మిల్లులు మూతపడ్డాయి. ఈ రెండు మిల్లుల్లోనే 900 మంది పని చేసేవారు. చిన్నతరహా పరిశ్రమలన్నీ పడకేయడంతో వాటిలో పనిచేసే 7 వేల మంది కార్మికులు పొట్టచేతబట్టుకుని వలసబాట పట్టారు.
ఎంఎస్‌ఎంఈ పార్కులెక్కడ?
చిన్నతరహా పరిశ్రమల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ప్రస్తుత ఎన్నికల్లోగా కనీసం 45 పార్కులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పినా.. వాస్తవంగా ఇంతవరకు ఒక్క పార్కు కూడా ప్రారంభం కాలేదు. పెద్ద పరిశ్రమలకు కారు చౌకగా భూములిస్తున్న ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు మాత్రం అధిక ధరను కేటాయిస్తున్నాయని, ఎంఎస్‌ఎఈ పార్కుల్లో ధరలు కూడా అదే విధంగా ఉన్నాయంటూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలువాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment