సాక్షి, అమరావతి : ఏపీ ఓటరు విజ్ఞతతో ఓటెయ్యాల్సిన సమయమిది. మీట నొక్కేముందు భావితరాల భవిష్యత్‌ను గుర్తు చేసుకోవాల్సిన అవసరమిది. విభజన గాయం సలపరింతలోనూ.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన గుండెకోత ఇంకా గుర్తుంది. ఐదేళ్ల అరాచక పాలన మళ్లీ మాయమాటల ముసుగేసుకుని మన ముందుకొస్తోంది. మేకవన్నె పులి అవతారమెత్తి.. ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అంటూ 40 ఏళ్ల అనుభవం నక్క వినయాలు ప్రదర్శిస్తోంది.
నమ్ముదామా ఈ మాటలు? వెన్నుపోటు రాజకీయాలను ఔపోసన పట్టిన చంద్రబాబుతో రాష్ట్రభవిష్యత్ సాధ్యమేనా? ఏ రోజుకారోజే మాట మార్చే అవకాశవాద రాజకీయ దురంధరుడు చంద్రబాబు వలలో పడితే రాష్ట్రమేమవుతుంది? ఓటేసే ప్రతి వ్యక్తి మనస్సాక్షి వేసే ప్రశ్నది. ఐదేళ్ల అరాచక అనుభవాలను నెమరు వేసుకుంటున్న తరుణమిది. రెప్పపాటు ఆలోచనలో సవాలక్ష ప్రశ్నలు.. సమాధానం లేని ప్రశ్నలు.
హామీలు.. మోసాలు..
పదవి కోసం దిగజారే చంద్రబాబు ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలు 600 పైమాటే. ఇందులో ఏ ఒక్కటీ అమలు కాలేదనేది జనమెరిగిన సత్యం. కులానికో పేజీ.. మతానికో మాట.. ఇదే ఎన్నికల మేనిఫెస్టోగా చెప్పాడు. అధికారంలోకి వచ్చాక ఆయన రూటే వేరు. అవినీతిలో మునిగితేలే బాబు హామీల మాటే మరిచిపోయారు. జనంలోకెళితే ఎక్కడ తన్ని తరిమేస్తారోనని మేనిఫెస్టోనే తన వెబ్‌సైట్ నుంచి మాయం చేసిన ఘనుడు. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి రూ.కోట్లు తెస్తానన్నాడు. ఓటుకు నోటు కేసు వెంటాడుతుంటే ప్రత్యేక హోదాను కేంద్రానికి అమ్మేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తితో రాష్ట్రం బాగుపడుతుందా?
దగా.. నయవంచన
బాబొస్తే జాబన్నాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. పొలిటికల్ ఎంట్రన్స్ కూడా పాసవ్వని కొడుక్కు ఏకంగా మంత్రి పదవే ఇచ్చాడు. ఎన్నో అర్హతలున్న నిరుద్యోగులకు మాత్రం కుచ్చుటోపీ పెట్టాడు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా.. ఐదేళ్లుగా ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని వ్యక్తి చంద్రబాబు. ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఆందోళన కలిగించే అంశం. ప్రైవేటీకరణ మంత్రం జపించే బాబు జమానాలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండమే. ఇలాంటి వ్యక్తి మనకు భరోసా ఇస్తాడా? ఇతని వల్ల మన పిల్లల భవిష్యత్ ఏమవుతుంది?
పచ్చి అవకాశవాదం
రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబు లక్ష్యం. దీనికోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం ఆయనది. బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదమని డైలాగ్ చెప్పిందాయనే. మోదీ రాష్ట్రానికొస్తే ఖైదు చేస్తానందీ ఆయనే. ఈ మాటలెటుపోయాయో? బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు. అదే మోదీని వీరుడు ధీరుడంటూ ఆకాశానికెత్తారు. నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు. జనం ఛీ కొడుతున్నారని ప్లేటు ఫిరాయించారు. మోదీ రాక్షసుడంటూ మాట మార్చాడు.
రాష్ట్రంపై కక్ష కట్టాడని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగారా? ఆ గర్భ శత్రువైన కాంగ్రెస్‌ను ఏ స్థాయిలో దుయ్యబట్టారో జనానికి తెలుసు. ఆ పార్టీ అధినేత్రి సోనియానూ ఇటలీ రాక్షసి అన్నారు. రాహుల్ పనికిమాలిన వాడన్నారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చెయ్యాలన్నారు. అదే కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని తిరగారు. ఇంతకు మించిన అవకాశవాదం ఉంటుందా? ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కోరుకుంటాడా?
ఉద్యోగుల ఆత్మాభిమానంపై దెబ్బ
ఈ ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగి ఏనాడైనా గౌరవంగా ఉన్నారా? ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారి వనజాక్షిని సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే దుర్భాషలాడిన వైనం చూశాం. దేవాలయ భూముల పరిరక్షణ కోరుకున్న భ్రమరాంబను ఇబ్బందులు పెట్టింది ఈ సర్కారే.
ఉద్యోగులను 50 ఏళ్లకే పదవీ విరమణ ఇచ్చి ఇంటికి పంపాలన్న కుయుక్తులు చేసిన చరిత్ర చంద్రబాబు సొంతం. రాష్ట్రవ్యాప్తంగా పచ్చచొక్కా నేతల ఆదేశాలే శిరసావహించాలన్న రీతిలో ఉద్యోగులపై గుత్తాధిపత్యం చెలాయించడాన్ని ఏ ఉద్యోగి ఇంకా మరిచిపోలేదు. ఇలాంటి నియంత పాలకులకు ఇంకా అవకాశం ఇస్తే రాష్ట్రం ఏమవుతుంది?
హోదాను అమ్మేశాడు
ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇదే మాట చెప్పారు. బీజేపీతో అంటకాగిన తర్వాత మాట మార్చారు. హోదా కన్నా ప్యాకేజీనే ముద్దన్నారు. అందులో లంచాలు బొక్కచ్చనుకున్నాడు. ప్యాకేజీ ఇచ్చిన మోదీని ఆకాశానికెత్తారు. జైట్లీకి సన్మానం చేశారు. అసెంబ్లీలో ఆవేశంగా ప్రశంసిస్తూ తీర్మానం చేశారు. ఇదెక్కడి అన్యాయమని ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తే.. మీకేం తెలుసు అని తోసిపుచ్చారు.
హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బావుకున్నాయని ఎదురుదాడి చేశారు. కేంద్రం మనకన్నా ఇంకే రాష్ట్రానికైనా మేలు చేసిందా చెప్పమని సవాల్ విసిరారు. హోదానే కావాలంటూ ఉద్యమించిన విపక్షంపై కత్తికట్టారు. ఆందోళనకు దిగిన విద్యార్థులపై కేసులు పెట్టారు. లాఠీలు విరగొట్టాడు.
నాలుగేళ్లు హోదాను బతికించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని కదిలిస్తూ అవిశ్వాస తీర్మానం పెడితే.. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ప్యాకేజీకి ఒప్పుకన్న చంద్రబాబు రూటు మార్చి హోదాపై ఉద్యమం అంటూ రకరకాల కలరింగులు ఇచ్చారు. పూటకో వేషం వేసే ఇలాంటి వ్యక్తిని ఇంకా ఉపేక్షిద్దామా? ఇలాంటి వాళ్లవల్ల రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందా?
తప్పులు చేసేది తను.. నింద ఇంకొకరిపై..
చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అనేక మంది అంటారు. నిజమేనని ఆయన రాజకీయ నైజమే చెబుతోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎంతో ఒకసారి మిత్రత్వం. ఇంకోసారి శతృత్వం. రాష్ట్ర ప్రయోజనాలను టీఆర్‌ఎస్ అడ్డుకుంటుందంటాడు. హోదా ఇవ్వకుండా తెలంగాణ అడ్డుపడుతోందంటాడు. ఆ పార్టీతో వైఎస్సార్ సీపీ అంటకాగుతోందనే కలర్ ఇస్తాడు. కేసీఆర్ యాగాలకు వెళ్లింది ఆయనే..
కేసీఆర్‌ను ఏపీకి రప్పించి మర్యాదలు చేసిందీ ఆయనే. బావమరిది హరికృష్ణ శవం సాక్షిగా కేటీఆర్‌తో పొత్తుల రాజకీయం చేసిందీ చంద్రబాబే. ఇన్ని చేసిన ఆయన నింద మాత్రం వైఎస్ జగన్‌పై వేస్తానంటారు. మోదీ, జగన్, కేసీఆర్ కుట్ర చేస్తున్నారంటారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి వేడుక చూస్తారు. ఇసుమంతైనా నిజాయితీ లేని ఈ వ్యక్తి పాలనలో రాష్ట్రం ఏమాత్రమైనా బాగుపడుతుందా?
అవినీతి సూత్రం.. అన్యాయ గోత్రం
అత్యంత ఖరీదైన నాయకుల్లో చంద్రబాబే ముఖ్యుడని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. రాజకీయ నాయకులు అవినీతి చేయడమెలా అనే దానిపై ఆయన పీహెచ్‌డీ చేసి ఉండొచ్చు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అవినీతి కథలు కుప్పలు తెప్పలు. ఇసుక, మట్టి, కరెంట్ కొనుగోళ్లు, పేదల భూముల దురాక్రమణ, దేవుడు, దేవుడి భూముల కబ్జా, కాంట్రాక్టుల్లో ముడుపులు.. ఇలా ఒకటేమిటి అవినీతి ఆరోపణలు ఎన్నో.. ఎన్నెన్నో. అడ్డొచ్చిన అధికారులను జుట్టుపట్టి ఈడ్చేసినా అడిగే దిక్కేలేని పాలన చూశాం. ప్రశ్నిస్తే కేసులు. ప్రతిఘటిస్తే జైళ్లు. కిందస్థాయి ఉద్యోగి నుంచి కలెక్టర్ల వరకూ.. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, చినబాబు, పెదబాబు వరకూ ముడుపులు. ఏ ఒక్కదానిపై విచారణలు లేవు. ఇలాంటి అవినీతి పాలనను ఏ ప్రజాస్వామ్య వాదైనా స్వాగతిస్తారా?
పోలవరాన్ని మింగేశారు
రాష్ట్రానికి జీవనాడి పోలవరం. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం మన అదృష్టం. కేంద్రం కట్టాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నాడు. అడ్డగోలుగా అంచనాలు పెంచేసి నిలువునా దోచుకున్నాడు. కేంద్రం లెక్క అడిగితే దబాయించే ప్రయత్నం చేశారు. పునాది రాయి కూడా దాటని పోలవరం ప్రాజెక్ట్ అంతా అయిపోయినట్టే ప్రచారం చేసుకున్నారు. పర్యాటక ప్రాంతంగా మార్చి.. ఊరూరా బస్సులు పెట్టి ప్రజలను తరలించారు.
ఇదిగో అభివృద్ధి.. అంతా అయిపోయిందని చెబుతున్నారు. మరోపక్క ఈ ప్రాజెక్టును తెలంగాణ, జగన్, మోదీ అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. అసలు పనులే అయిపోనప్పుడు ఎవరు అడ్డుకోగలరు? ఈ ప్రశ్నకు మాత్రం చంద్రబాబు సమాధానం చెప్పరు. వ్యవసాయమే దండగని భావించే చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల్లో కమిషన్లే చూసుకుంటారు తప్ప.. ప్రాజెక్టులు పూర్తవ్వాలని కోరుకుంటారా? ఇలాంటి వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందా?
వ్యవస్థలు ధ్వంసం
‘చంద్రబాబు ఏదైనా చెయ్యగలరు’ ఆయన అనుచరులు గర్వంగా చెప్పుకునే మాటిది. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలే కీలకం. మేధావులు రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదు. చంద్రబాబు మాత్రం దీనికి భిన్నమన్నట్టు వ్యవహరిస్తారు. అడ్డగోలుగా దోచుకున్న సొమ్ముతో 23 మంది విపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అయినా.. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోగా.. అందులో కొందరికి మంత్రి పదవులే ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్‌ను ఆకాంక్షిస్తారా? విపక్షం లేకుండానే ఏకపక్షంగా చట్టసభలను నడిపిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఏ ప్రజాస్వామ్యవాది ఈ పరిణామాలను స్వాగతిస్తారు? అవినీతి ఆరోపణలొస్తే ధైర్యంగా ఎదుర్కొన్న దాఖలా ఆయనకు లేనేలేదు. అన్నింటిపైనా స్టే తెచ్చుకుని తప్పించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇలాంటి వ్యక్తి ఉంటే ప్రజాస్వామ్య విలువలు నిలబడతాయా?
అరచేతి వైకుంఠమే..
రాష్ట్ర రాజధాని అమరావతిపై ఆయన రంగుల సినిమా చూపిస్తున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలం నిజమన్న రీతిలో ప్రచారం సాగుతోంది. 33 వేల ఎకరాల పంట భూములను లాక్కున్న ఈ సర్కారు ఇప్పటికీ శాశ్వత భవనం ఒక్కటీ కట్టలేదు. చిన్న వర్షానికే నీళ్లు కారే తాత్కాలిక భవనాల నిర్మాణంలోనూ పచ్చిదోపిడీ. రాజధాని నిర్మాణం చుట్టూ బినామీల భూములకు రక్షణ కల్పించి రూ.కోట్లు దండుకునే వ్యూహాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి మోసగాడి వల్ల రాష్ట్రం ముందుకెళ్తుందా?
అమ్మకూ రక్షణ లేదే!
రాజధాని సాక్షిగా కలవరం పుట్టించిన కాల్‌మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలే ముద్దాయిలు. ఆడపడుచుల జీవితాలతో ఆడుకున్న రాక్షసులను ఏ ప్రభుత్వమైనా ఎంతమాత్రం ఉపేక్షించదు. కానీ.. చంద్రబాబు పాలన ఇందుకు భిన్నం. ‘అన్యాయం జరిగింది మహాప్రభో’ అంటూ వచ్చిన అతివలపై కాల్‌మనీ రాక్షసులు దౌర్జన్యం చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకే వెనుకాడారు.
ఐదేళ్లుగా ధృతరాష్ట్ర పాలన కొనసాగింది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ సభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఎదురు దాడి చేశారు. ఏకంగా ఆమెను సభ నుంచే బహిష్కరించారు. మహిళలపై ఏమాత్రం గౌరవమే లేని ఇలాంటి వ్యక్తిని ఇంకా క్షమించాలా?
స్వప్రయోజనాల కోసం ఎంతకైనా...
విభజన జరిగినా పదేళ్ల పాటు హైదరాబాదే మన రాజధాని. అక్కడి మన ఆస్తులపై చెయ్యేసే అధికారం ఎవరికీ లేదు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి తట్టాబుట్టా సర్ధుకుని విజయవాడ కరకట్టకొచ్చారు. ఐదు కోట్ల ఏపీ ప్రజల ఆస్తులను పొరుగు రాష్ట్రం పాల్జేశాడు. హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే హక్కును విడిచిపెట్టాడు. కేసులో చిక్కుకోకుండా తానైతే రాజీపడ్డాడు. ప్రజల ప్రయోజనాలు మాత్రం కాలరాశాడు. ఇలాంటి వ్యక్తిని ఇంకా రాజకీయాల్లో ఉండనిద్దామా?
ఒక్క క్షణం ఆలోచించండి
రాక్షసుడికి బలమెక్కువ. నేల కూలే రోజొచ్చే వరకూ వేచి చూడటం తప్ప ఏమీ చెయ్యలేం. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. ఓటు అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. ఐదేళ్ల కష్టాలు.. కన్నీళ్లను గుర్తు చేసుకోవాలి. కర్తవ్యాన్ని, భావితరాల భవిష్యత్‌ను గుర్తుకు తెచ్చుకుంటే.. ఆయుధ ప్రయోగం మరింత పదునెక్కుతుంది. మిమ్మల్ని ఏడిపించిన శత్రువు రుధిరంలోంచి చీల్చుకెళ్తుంది. గుర్తుంచుకోండి. ఒక్క ఓటు.. మీ ఒక్క ఓటుతో ఈ దురాగతాల్ని కూల్చేద్దాం.. పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి వెళదాం.. ఓటేద్దాం. ఈ దురాగతాలన్నీ కూల్చేద్దాం.
Comments
Please login to add a commentAdd a comment