బాబూ.. ఏది నీ జవాబు..? | People And Political Analysts Ask Chandrababu to Vote For What He Has Done | Sakshi
Sakshi News home page

బాబూ.. ఏది నీ జవాబు..?

Published Thu, Apr 11 2019 9:26 AM | Last Updated on Thu, Apr 11 2019 9:26 AM

People And Political Analysts Ask Chandrababu to Vote For What He Has Done - Sakshi

 సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రిగా అయిదేళ్లు పనిచేసిన వారెవరైనా తిరిగి ప్రజాతీర్పునకు వెళ్లేటప్పుడు.. చేసిన పనులు చెప్పి ఓట్లడగడం సంప్రదాయం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకు భిన్నం. ఐదేళ్లుగా ఏం చేసారో చెప్పరు.. కాని ఓట్లు మాత్రం మళ్లీ తనకే వేయాలని దబాయిస్తున్నారు. ఏం చేశారని చంద్రబాబుకు ఓట్లేయాలని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. చంద్రబాబుకు మళ్లీ అవకాశం ఎందుకివ్వాలో సహేతుకమైన ఒక్క కారణం చెప్పమనండి.. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు తిరిగి ఓట్లు వేయొద్దనడానికి వంద కారణాలు చూపుతాం అంటున్నారు! ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, యువతరం సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు చంద్రబాబుకు బాణాల్లా తగులుతున్నాయి. జనం సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీడీపీ నాయకులు హతాశులవడం ఈ ఎన్నికల ప్రత్యేకత.  

  –ఎల్‌.రఘురామిరెడ్డి, సాక్షి, అమరావతి

రాజధానిని నిర్మిస్తానని గ్రాఫిక్స్‌తో మాయ చేసిందెవరు?  
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని చెప్పి అయిదేళ్లలో చేసిందేమిటి?  సింగపూర్, మలేషియా, చైనా, జపాన్‌ అంటూ.. ఏ దేశానికి వెళితే అక్కడున్నట్లుగా రాజధాని నగరం నిర్మిస్తామంటూ.. ఐకానిక్‌ భవనాలను గ్రాఫిక్స్‌లో చూపించారు. కాని ఒక్క శాశ్వత ఇటుకైనా వేశారా? గ్రాఫిక్స్‌నే రాజధానిగా చూపినందుకా.. మళ్లీ ఎందుకు ఓటేయాలి?   

రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలు కమీషన్ల కోసం కాదనగలరా? 
స్వల్ప వర్షానికే నీరు కారే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం నిర్మాణాలకు గజానికి రూ.10,500 వెచ్చించడం వెనుక 75 శాతం కమీషన్లు మీరు దండుకోవడానికి కాదనగలరా?  మీ కమీషన్ల కోసం అన్నీ తాత్కాలిక నిర్మాణాలు చేపడతారా? 

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా చెరబట్టిన భూముల విలువెంత?   
మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రాజధాని పేరిట లక్ష కోట్లుపైగా దందా చేయలేదా? రాజధాని ఎక్కడ నిర్మిస్తారో ముందే నిర్ణయించుకుని.. అక్కడ భూములను కారు చౌకగా కొన్న తర్వాత ప్రకటించడం ద్వారా మీరు, మీ వర్గం భూముల ధరలు పెంచుకుని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా లక్ష కోట్లు దండుకున్నది నిజం కాదా? 

ఐదేళ్లలో మీ అవినీతి దందా 6లక్షల కోట్లు దాటింది వాస్తవం కాదా?   
గత అయిదేళ్లలో మీరు (బాబు అండ్‌ కో ) దందా చేయని రంగమంటూ ఉందా? గత అయిదేళ్ల మీ జమానాలో సాగిన అవినీతి మొత్తం రూ.6.17 లక్షల కోట్లు దాటిందని పుస్తకాలే వెలువడిన విషయం నిజం కాదా? ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీ అవినీతి గురించి చెప్పుకుంటోంది నిజం కాదనగలరా? 


రుణమాఫీ చేస్తానని రైతులను వంచించారా? లేదా? 
2014 ఎన్నికలప్పుడు రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. వంచించారా లేదా? అన్నదాతల రుణాల మొత్తం రూ.87,612 కోట్లు  ఉంటే మీరు విదిల్చింది.. కనీసం వడ్డీలకు కూడా సరిపోదు కదా! దీన్నే రుణ మాఫీ అంటూ రైతులను మోసం చేసినందుకు మీకు మళ్లీ ఓటేయాలా?  

మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టినందుకు మళ్లీ ఓటేయాలా;? 
ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అప్పు తీసుకున్న పాపానికి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నిర్వహించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. మీరు నివసిస్తున్న ప్రాంతమైన విజయవాడ, గుంటూరు నగరాల్లోనే కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారాన్ని మీ కోటరీలోని వారే నడిపారు. ఈ వ్యవహారంలో దోషులపై చర్యలు తీసుకోకుండా.. మీరు రక్షణగా నిలిచారు? మహిళలపై ఇంత అనాగరిక చర్యలను ప్రోత్సహించినందుకు మహిళలు నీకు మళ్లీ అవకాశం ఇవ్వాలా? 

ప్రత్యేక హోదా తేకుండా మోసగించినందుకు ఓటేయాలా? 
బీజేపీతో మీరు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు కదా? రాష్ట్రానికి అయిదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇప్పిస్తామని తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా హామీ ఇవ్వలేదా? బీజేపీతో కలిసి నాలుగేళ్లుపైగా మీ పార్టీ వారు ఇద్దరు మంత్రులుగా ఉండలేరా? మరి నాలుగేళ్లుపైగా ఎన్టీయే (మోదీ)తో కలిసి ఉన్న మీరు ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించలేకపోవడం మీ వైఫల్యం కాదా?  

ఐదేళ్లుగా రౌడీ రాజ్యం ఎవరిది? 
రౌడీలు, ఆర్థిక నేరగాళ్లు ఎక్కువగా ఉన్నది మీ పార్టీలోనా కాదా? ఉద్యోగులు, మహిళలను దారుణంగా కొట్టిన, ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన చింతమనేని ప్రభాకర్, ఖనిజ దందాలో హైకోర్టు తప్పుబట్టిన యరపతినేని శ్రీనివాసరావు, అధికారులపైనే దాడికి పాల్పడిన కేశినేని నాని,  భూదందా కేసుల్లో ఉన్న దేవినేని ఉమా.. ఇలా మీ పార్టీ వారి పేర్లు చెబుతూ చిత్రగుప్తుడి చిట్టా అవుతుంది కదా? 

650 హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా?  
2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే పరమావధిగా స్వార్థంతో 650పైగా హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే ఇవన్నీ చేస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టారు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేశారా? 

 కనీసం అయిదు సంతకాలకైనా విలువిచ్చారా? 
ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మొదట పెట్టిన అయిదు సంతకాల్లో.. అసలు ఏయే ఫైళ్లపై మీరు మొదటి సంతకం చేశారో అయినా మీకు గుర్తున్నాయా? వాటిల్లో మీరు అమలు చేసిందేమిటో మీకు గుర్తుందా? ఒక్క సంతకాన్ని అయినా సరిగా అమలు చేశారా? 

అగ్రిగోల్డ్‌ బాధితుల కడుపు కొట్టిందెవరు?  
అగ్రిగోల్డ్‌ ఆస్తులను బినామీ పేర్లతో కొట్టేసి లక్షలాది పేద డిపాజిట్‌దారుల కడుపు కొట్టినందుకు మరొక్కసారి మీకు అవకాశం ఇవ్వాలా? 

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందుకు ఓటేయాలా?  
మీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి ప్రతి ఒక్కరి తలపై రూ.83 వేల అప్పుల భారం మోపినందుకా? ఇంకా జనం నెత్తిల అప్పుల కుప్ప పెట్టడానికి లైసెన్సు ఇవ్వాలా?  మళ్లీ ఎందుకు ఓటేయాలి? 

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందుకా?  
రాష్ట్రంలో దోచుకున్న ప్రజాధనంతో 23 మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని సమర్థించాలా? ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెలంగాణకు వదిలేసి వచ్చినందుకు జైకొట్టాలా? మీకు ఎందుకు మళ్లీ ఓటేయాలి? 

విద్యారంగాన్ని నారాయణ, చైతన్యకు కట్టబెట్టినందుకా?  
ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి నారాయణ, చైతన్య విద్యాసంస్థలకు కొమ్ముకాస్తూ.. పేద, మధ్య తరగతి ప్రజల కడపుకొడుతున్నందుకా? మీకు ఓటు వేయాల్సింది. ప్రభుత్వ స్కూళ్లను మూసేసి.. తల్లిదండ్రులపై చదువుల భారం మోపినందుకా మీకు ఓటేయాల్సింది? 

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ఓటేయాలా? 
పిల్లనిచ్చిన, మంత్రి పదవి ఇచ్చిన సొంత మామ ఎన్టీ రామారావునే వెన్నుపోటుతో పదవి నుంచి తప్పించి ఆయన మరణానికి కారణమయ్యారు. బావమరింది హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి..మీకు పోటీ అవుతారని తర్వాత తప్పించారు. తాజాగా ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్టీఆర్‌ పేరు తొలగించాలని తోకపత్రిక ఎండీ రాధాకృష్ణతో కలిసి నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్‌నే ‘వాడు’ అంటూ అవమానించిన మీకు ప్రజలను ముంచడం ఒక లెక్కా?

ఉద్యోగులను దారుణంగా అవమానించినందుకు సమర్థించాలా? 
ఉద్యోగులను దారుణంగా అవమానించడం మీకు అలవాటే కదా? మీరు తోక పత్రిక అధినేత రాధాకృష్ణ కలిసి మాట్లాడిన సందర్భంగా కూడా ఉద్యోగులపై మీకున్న కక్ష బట్టబయలైంది. ‘ఆ నా కొడుకులకు సెంట్రల్‌ పీఆర్సీ ఇవ్వాలా? ఆ నా కొడుకుల జీతాల కోసమా జనం ట్యాక్స్‌లు (పన్నులు ) కట్టేది? వద్దు పక్కన పెట్టేయండి...’ అని తోకపత్రిక రాధాకృష్ణ అంటే ఆయన చెప్పినవన్నీ నిజాలేనని సమర్థిస్తూ.. ఉద్యోగులను అవమానించిన వీడియో సోషల్‌ మీడియాలో రెండు రోజులుగా వైరల్‌ అవుతోంది? ఇందుకు నిన్ను మళ్లీ ఉద్యోగులు నెత్తిన పెట్టుకోవాలా?  

సాగు నీటి ప్రాజెక్టుల్లో 25వేల కోట్ల కమీషన్లు దోచలేదా?    
సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని  పెంచి.. పనులు చేయకపోయినా చేసినట్లు బిల్లులు చెల్లించి... మీరు రూ.25వేల కోట్లకు పైగా కమీషన్లు దండుకున్నది నిజం కాదా? ఒక్క పోలవరంలోనే మీరు రూ.4వేల కోట్లకు పైగా దోచుకోలేదా?  

‘నీరు – చెట్టు’ కింద వేల కోట్లు దండుకోలేదా?  
నీరు చెట్టు పథకం బిల్లుల్లో, తవ్విన మట్టి అమ్ముకొని మీ పార్టీ నేతలు దోచిందెంత? మీకు ముట్టిన కమీషన్‌ ఎంతో చెప్పగలరా? నీరు చెట్టు కుంభకోణం విలువ రూ.62,246 కోట్లన్నది వాస్తవం కాదా?  

డ్వాక్రా మహిళలకు చెప్పిందేమిటి చేసిందేమిటి? 
డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి.. రూ.21,479 కోట్ల రుణాలు ఉంటే.. ఒక్క పైసా కూడ మాఫీ చేయకుండా 90లక్షల మంది అక్కచెల్లెమ్మలను మోసం చేసినందుకా మీకు ఓటు వేయాల్సింది?  

ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను ముంచింది మీరు కాదా?  
బాబొస్తేనే జాబు అంటూ .. అధికారంలోకి వచ్చి ఉన్న ఉద్యోగులను ఇళ్లకు పంపినందుకా? ఖాళీగా ఉన్న 2.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిండా ముంచినందుకా మీకు ఓటేయాల్సింది? మెగా డీఎస్సీ ద్వారా టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చేయనందుకా మీకు ఓటేయాల్సింది?  

నిరుద్యోగ యువతకు భృతి ఇస్తానని దగా చేసిందెవరు?  
నిరుద్యోగ యువతకు నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఎన్నికలు సమీపించే వరకూ దాని మాటే ఎత్తని విషయం అక్షర సత్యం కదా? చివరకు ఎన్నికలు దగ్గరపడిన సమయంలో ఓట్ల కోసం నిరుద్యోగ భృతి ప్రకటించినా.. రకరకాల నిబంధనలతో అర్హుల సంఖ్యను కుదించేశారు? గరిష్ట వయసు పెట్టారు? మూడేళ్లు మాత్రమే భృతి ఉంటుందన్నారు? నిరుద్యోగులను దగా చేసిన మీకు మళ్లీ ఎందుకు అవకాశం ఇవ్వాలంటావు? 

పేదల చదువులకు చిక్కులు కల్పించినందుకా? 
ఫీజురీయింబర్స్‌మెంట్‌ను నిర్వీర్యం చేశారు. లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను, స్కాలర్‌షిప్‌లకు నిధులు మంజూరు చేయలేదు.  ఫీజు బకాయిలు ఉన్నాయంటూ విద్యాసంస్థలు విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాయి. ఫీజు బకాయిల చెల్లింపు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడ్డారో వారికే తెలుసు. ఫీజురీయింబర్స్‌మెంట్, 
స్కాలర్‌షిప్‌ బకాయిలు వేల కోట్లు ఉన్నాయని విద్యాసంస్థల వారు వాపోతున్నారు. దీనికి నీ సమాధానమేమిటి? 

ప్యాకేజీ ముద్దు అన్నది వాస్తవం కాదా?  
ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజి కావాలంటూ.. మీరు కేంద్రానికి రాసిన లేఖను కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ బయట పెట్టారు కదా? మరలాంటప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని మీరు ఎలా అంటారు? అసలు రాష్ట్ర ప్రజలకు మోసం చేసింది మీరేననడానికి మీ లేఖ కంటే సాక్ష్యం ఏమి కావాలి? 

మీ చుట్టూ ఉన్న సుజనా, సీఎం రమేశ్‌ ఆర్థిక నేరగాళ్లు కాదా?  
సుజనా చౌదరి, సీఎం రమేష్, వాకాటి నారాయణరెడ్డి ఆర్థిక నేరగాళ్లుగా, బ్యాంకులను ముంచారన్నది మీకు తెలియదా? ఆర్థిక నేరగాళ్లకు ఊతం ఇస్తూ... ఇతరులను మీరు ఎలా వేలెత్తి చూపుతారు? 

మీ బామ్మర్ది బంధువుకు  కట్టబెట్టిన భూముల విలువ ఎంత?  
మీ బావమరిది నందమూరి బాలకృష్ణ అల్లుడు, విశాఖపట్నం టీడీపీ అభ్యర్థి భరత్‌ కుటుంబానికి చెందిన వీబీసీ ఇండస్ట్రీస్‌కు జగ్గయ్యపేటలో రూ.520 కోట్ల విలువైన భూమిని 4.99 కోట్లకే ఎలా ఇస్తారు? ప్రభుత్వ రంగ సంస్థలకు విశాఖలో కేటాయించిన 34 ఎకరాలను గీతం యూనివర్సిటీ ఆక్రమించుకుంటే చర్యలు తీసుకోవాల్సిందిపోయి ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయింపులను రద్దు చేయడం అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు కాదా?  

భూదోపిడీకి మళ్లీ లైసెన్సు ఇవ్వాలా?  
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేనంత భూదోపిడీ గత అయిదేళ్ల మీ జమానాలోనే జరిగిందనేది కాదనలేని సత్యం కాదా? రాజధాని సంగతి పక్కనబెడితే.. ఒక్క విశాఖపట్నం భూకుంబకోణం విలువే లక్ష కోట్లపైమాటేనని మీడియాలో పతాక శీర్షికలకెక్కిన విషయం కాదనగలరా? లక్ష ఎకరాల భూ రికార్డులు తారుమారయ్యాయని,మాయమయ్యాయని సాక్షాత్తూ విశాఖపట్నం అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మీడియా సమావేశంలో ప్రకటించిన విషయాన్ని కాదనే ధైర్యం మీకుందా? వెబ్‌ల్యాండ్‌ పేరుతో విలువైన సర్కారు భూములను మీ బినామీల పేర్లతో కొట్టేసింది నిజం కాదా?  

ఇసుక దోపిడీకి చట్టబద్ధత కల్పించాలా? 
రాష్ట్రంలో గత అయిదేళ్లలో మీరు, మీ పచ్చ పార్టీ నేతలు నదులు, వాగులు, వంకలు చెరబట్టి ఇసుకను తవ్వేసి.. అక్రమంగా అమ్ముకొని దోచింది రూ.14,250 కోట్ల అన్నది నిజం కాదా?  మీ నివాసం పక్కనే ఇసుక డ్రెడ్జింగ్‌ రేయింబవుళ్లు జరుగుతుంటే మీరు దానికి కాపలా కాస్తున్నది వాస్తవం కాదా? రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, పెన్నా , చిత్రావతితోపాటు అన్ని నదుల్లో మీ పార్టీ నేతలు అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరపలేదా? మీకు నేరుగా కమీషన్లు అందుతున్నాయన్నది బహిరంగ రహస్యమే కదా? 

మీ ఇసుక దోపిడీపై రూ.100 కోట్ల జరిమానా పడింది నిజం కాదా?  
సాక్షాత్తూ కేంద్ర హరిత ట్రిబ్యునల్‌ మీ సర్కారు  తీరును ఎండగట్టడం నిజం కాదా?  ఓవైపు మీరు, మీ సిండికేట్‌ ఇసుక దందా ద్వారా వేల కోట్లు దండుకుంటే.. మరోవైపు ఇసుక తవ్వకాల ద్వారా పర్యావరణానికి జరిగిన హానికి కేంద్ర హరిత ట్రిబ్యునల్‌ మీ సర్కారుకు రూ.100కోట్లు జరిమానా విధించింది నిజం కాదా? ఇంతకంటే దోపిడీకి సాక్ష్యాలేమి కావాలి? ఉచిత ఇసుక ముసుగులో మీ సిండికేట్‌ మూడు ట్రిప్పర్లు, ఆరు లారీల చందంగా ఇసుక దోపిడీ సాగించుకోవడానికి మళ్లీ మేం మీకు ఓటుతో అనుమతి ఇవ్వాలా? 

 ఇంకా దుబారా చేసేందుకు లైసెన్సు ఇవ్వాలా? 
పేద రాష్టమని ఒకపక్క చెబుతూ.. మరో పక్క ఢిల్లీకి, జపాన్‌కు, సింగపూర్‌కు ప్రత్యేక విమానాల్లో వెళ్లడం ద్వారా మీ విమాన ప్రయాణాన్ని ‘చంద్రబాబు ఎయిర్‌లైన్స్‌’గా మార్చింది వాస్తవం కాదా? ధర్మపోరాట దీక్షల పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎలా చేస్తారు? హైదరాబాద్‌లో మీ ఫామ్‌హౌస్‌లోని ఇళ్లకు కొత్త సొబగుల కోసం ప్రజా ధనాన్ని వెచ్చించడం దుబారా కాదా? రాజధాని నిర్మాణం పేరుతో వేసిన శిలాఫలకాలే మళ్లీ వేయడానికి సభలు, ఈవెంట్‌ మేనేజిమెంట్ల పేరిట రూ. 375 కోట్లు దుబారా చేయలేదా? మీ సొమ్మయితే ఇలా చేస్తారా? ఇలా ప్రజాధనాన్ని దుబారా చేసేందుకు మరో అయిదేళ్లు ఖజానా తాళాలు మీకే ఇచ్చినట్లుగా ఓటేయాలా? 

జగన్‌ చెప్పకపోతే ఇవి చేసేవారా? 
సామాజిక భద్రత పింఛను రూ.2000కు పెంచుతానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించకపోతే.. మీరు పింఛను పెంచేవారా? జగన్‌ హామీ ఇవ్వకపోతే మీరు సీపీఎస్‌ రద్దు  విషయం కనీసం ఆలోచించేవారా? యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ అనేవారా? ప్రతిపక్షం హామీలను కాపీ కొట్టినందుకు మిమ్మల్ని సమర్థించాలా? మళ్లీ మీకు ఎందుకు ఓటేయాలి? 

బాబూ.. ఈ ప్రశ్నల్లో వేటికైనా మీరు సమాధానం చెప్పగలరా? ఇవన్నీ మీకు మళ్లీ ఓటు వేయవద్దనడానికి బలమైన కారణాలు కాదా?   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement