పోలవరంలో ‘బాబు’ అవినీతికి ఆధారాలు.. | Chandrababu Naidu Corruption Proofs On Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరంలో చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవిగో..

Published Wed, Nov 11 2020 9:09 AM | Last Updated on Wed, Nov 11 2020 10:36 AM

Chandrababu Naidu Corruption Proofs On Polavaram Project - Sakshi

సాక్షి, అమరావతి : “పోలవరం ప్రాజెక్టు ను చంద్రబాబు నాయుడు (నాటి ముఖ్యమంత్రి) ఒక ఏటిఎంలా వాడుకుంటున్నారు. ప్రాజెక్ట్‌ను అడ్డం పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు డ్రా చేస్తున్నారు...రాజమండ్రి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ’ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకు నిదర్శనం ప్రాజెక్ట్ పనుల్లో వ్యయాన్ని అమాంతం మూడు వేల కోట్ల రూపాయలకు పెంచడమే కాకుండా పనులన్నీంటిని తమ వారికి నేరుగా నామినేషన్ పద్ధతిలో కేబినెట్ ఆమోదంతో అప్పగించడం ద్వారా అవినీతికి చంద్రబాబు నాయుడు ద్వారాలు తెరిచారు. ఇది అరుదైన అవినీతి. 2019 ఎన్నికల సభలో ప్రధాని మోదీ చేసిన ఆరోపణ రాజకీయ పరమైనదైనప్పటికీ అందులో వాస్తవం లేకపోలేదు. 

ఆయన చేసిన ఆరోపణలు నిజమేనని రాష్ట్ర ప్రభుత్వ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. ప్రాజెక్ట్‌ను అడ్డం పెట్టుకుని నేరుగా తమ వారికి పనులు అప్పగించి వాటి ద్వారా వారితో పాటు ఆయన సొమ్ము చేసుకున్నారనేది అక్షర సత్యం. ఇందుకు 2015 అక్టోబర్ లో అప్పటి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అద్దం పడుతున్నాయి. నాటి కాంట్రాక్టర్ సరిగ్గా, సక్రమంగా పనులు చేయలేకపోతున్నారని అందుకు ఆర్థిక పరమైన అవరోధాలతో పాటు ఇంజనీరింగ్ శక్తి సామర్థ్యాలు లేకపోవడమే కారణంగా చూపించి తమ వారికి నేరుగా పని కల్పించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. 

స్వార్థ ప్రయోజనాల కోసం కేబినెట్‌ను అడ్డంగా వాడుకొని..
నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టి చేసుకునేందుకు కేబినెట్ సమావేశాన్ని నిస్సిగ్గుగా వాడుకున్నారు. 2015 అక్టోబర్ 10 తేది (శనివారం) జరిగిన మంత్రి మండలి సమావేశంలో నీటి పారుదల శాఖ సమర్పించిన ప్రతిపాదనను ఆమోదించారు. చంద్రబాబు ఆదేశాలమేరకే అధికారులు ఆ ప్రతిపాదనను రూపొందించగా కేబినెట్ లో ఆమోదింపచేయించుకొని తమ వారికి పనులను అప్పగించారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు పనులు చేసిన ఆయనకు, ఆయనకు సంబంధించిన వారికి ఇంజనీరింగ్ సంస్థలు ఏమాత్రం పనులు చేయకపోగా ఖజానాను మాత్రం ఖాళీ చేశారు. మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని 2015 అక్టోబర్ 13న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేయడంతో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టర్లకే నేరుగా పనులు అప్పగించారు. 

తీర్మానం సారాంశం పరిశీలిస్తే ఇలా ఉంది..
“టెండర్లో పని దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ –JSE-UES జాయింట్ వెంచర్ పనిని చేయలేకపోతోంది. అందుకు కారణం ఈ ఇంజనీరింగ్ సంస్థకు నైపుణ్యం లేకపోవడమే. అందులో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన పనులు ప్రత్యేక సంస్థలు మాత్రమే చేయాలి. నైపుణ్యం ఉన్న అధునాతన సంస్థలు మాత్రమే ఆ పనులు చేయగలుగుతాయి. కానీ అటువంటి సంస్థలు ట్రాన్స్ ట్రాయ్ జాయింట్ వెంచర్ కు సబ్ కాంట్రాక్టర్లుగా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. ఫలితంగా పనులు చేయగలిగిన, నైపుణ్యం కలిగిన సంస్థలను ట్రాన్స్ ట్రాయ్ జాయింట్ వెంచర్ ఏజెన్సీలో నిబంధనల ప్రకారం చేర్చాలి. ఇందుకు ఒప్పందంలోని షరతులను సడలించాలి. ఆ తర్వాత అనుబంధ ఒప్పందం చేసుకోవాలి. దాని ఆధారంగా ఆ సంస్థలు నేరుగా పనిని చేపట్టి ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటాయి. క్రమంగా ట్రాన్స్ ట్రాయ్ వైదోలుగుతుంది.  

  • అదే సమయంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని 6961.70 కోట్లకు (2015-16 ధరల ప్రకారం) పెంచాలి. అంటే పని దక్కించుకున్న సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం 4054 కోట్ల రూపాయలు అంటే దాదాపు 3 వేల కోట్ల రూపాయలు అధికం. అంటే ఒప్పందం చేసుకున్న ధరకన్నా మూడింట రెండోతులు ఎక్కువ. అదే విధంగా పనులు చేపడుతున్న కొత్త కంపెనీలకు నేరుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు ఒప్పందం చేసుకొని ఏర్పాట్లు చేయాలి. ఈ ప్రకారం నవయుగతో పాటు నాటి తెలుగుదేశం ఎంపి నేడు బీజెపీలో ఉన్న సీఎం రమేశ్‌తో పాటు అనేకమంతి టీడీపీకి చెందినవారు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు.” ఈ విధంగా చేసిన తీర్మానానికి సంబంధించిన నకలు ఇక్కడ జత చేయడం జరిగింది. 
  • నీటి పారుదల శాఖ 2015 అక్టోబర్ 10న జరిగిన క్యాబినెట్ సమావేశానికి సమర్పించిన నివేధికను పరిశీలిస్తే నాటి ముఖ్యమంత్రి కోరుకున్న విధంగానే అన్నీ జరిగిపోయాయి. “డ్రాప్ట్ మెమోరాండం ఫర్‌ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్” పేరుతో నీటి పారుదల శాఖ (ప్రాజెక్ట్-1) సమర్పించిన నివేదిక లోని అంశాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి. వీటిని బట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ను ఎలా స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకొని పనులు చేయకుండా ముంచేశారనేది.

పోలవరం ప్రాజెక్ట్ పనులు 1980 దశకంలో అంకురార్పణ జరిగింది

  • 2004-05 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ (పిఐపి) రూపొందించి అందులో మూడు ప్రధాన పనులుగా అవి హెడ్ వర్క్, కుడి ప్రధాన కాలువ, ఎడమ ప్రధాన కాలువగా విభజించారు. ఎడమ కాలువను 8 ప్యాకేజిలుగా, కుడి కాలవను 7 ప్యాకేజీలుగా, హెడ్ వర్క్స్ ను 8 ప్యాకేజీలుగా 2005 నుంచి 2007 మధ్యలో అప్పగించారు. 
  • ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం ఆమోదం, కీలకమైన పర్యావరణ తదితర అన్నీ అనుమతులు అప్పుడే లభించాయి.
  • 2014 రాష్ర్ట విభజన సమయంలో సెక్షన్ 90, 2014 విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ను నిర్మించాలి.  2014లో ఈ ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉండగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి చేసి (అప్పట్లో ఎన్డీఏలో ఉండి కేంద్ర మంత్రి వర్గంలో భాగస్వామ్యం కలిగి ఉంది) ఈ ప్రాజెక్ట్ ను కేంద్రం డబ్బులు ఇస్తే రాష్ర్టం నిర్మించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. దీని వల్ల పనులు తమకు ఇష్టమైన వారికి ఇచ్చుకునే విధంగా ఆయనకు అవకాశం చిక్కింది. 
  • 2014లో సమీక్షించినప్పుడు ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగిపోయిందని గుర్తించారు. పనులు వేగంగా జరగడం లేదని అంచనా వేశారు. అందుకు నిర్మాణ సంస్థకు అవసరమైన యంత్ర సామాగ్రి లేకపోవడంతో పాటు నిధుల కొరత వేధిస్తుండడంతో ప్రభుత్వం అంచనాలకు తగిన విధంగా నిర్మించలేకపోతోంది. 
  • అందువల్ల కాంట్రాక్టు సంస్థను అన్ని విధాల పటిష్టపరచాలని నీటి పారుదల శాఖ సూచించింది. ఈ పని చేయడం వెనుక తమ వారికి చంద్రబాబు మేలు చేసే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
  • పోలవరం కుడి, ఎడమ కాలువలు అప్పటికే దాదాపు పూర్తయ్యాయి (వాస్తవానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తయ్యాయి). వీటికి సంబంధించి లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని క్యాబినెట్ కు సమర్పించిన నివేదికలో నీటి పారుదల శాఖ పేర్కొంది. 
  • 2005-07 కాలంలో అప్పగించిన పనులకు సంబంధించి నాటి అంచనా వ్యయం ప్రకారం 10151 కోట్లు ప్రాజెక్టు పూర్తికి వ్యయం చేయాలి. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి పనులకు ప్రత్యేకంగా టెండర్ పిలవాలి. 2010 లో ఇందుకు సంబంధించి జలాశయంలో ఎనిమిది పనులకు గాను రెండు పనులను అంటే స్పిల్ వే, ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం పనులను కాంట్రాక్టర్ నుంచి రద్దు చేసి మళ్లీ టెండర్ పిలవాలని నిర్ణయించారు. అప్పటికి 2010-11 ధరల ప్రకారం వ్యయం 16 వేల కోట్లు అవుతుందని నిర్ణయించారు. 
  • 2011-12 లో ఆ రెండు ప్యాకేజీలను ఒక్కటిగా చేసి టెండర్ పిలవగా 2013 లో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి అప్పగించారు. ఐదేళ్ళ నాటికి ఈ పనిని పూర్తి చేయాలి. కానీ అనుకున్న విధంగా ఆ సంస్థ చేయలేకపోయింది. 
  • కాంట్రాక్టర్ (ట్రాన్స్ ట్రాయ్ ) పాక్షికంగా మాత్రమే యంత్ర సామాగ్రిని ప్రాజెక్ట్ వద్దకు తరలించి కొంత మేరకు పనులు చేయగలిగారు. పని వేగం చేసేందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని తరలించలేకపోయినట్లు నీటి పారుదల శాఖ ఆ నివేదికలో పేర్కొంది.
  • ప్రధానమైన అవరోధాలను కూడా ఆ నివేదికలో పేర్కొంది. పని చేయడానికి అవసరమైన భూమి ప్రాజెక్ట్ వద్ద అందుబాటులో లేకపోవడం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడడం, నిర్మాణ ప్రాంతంలో ఉన్న విద్యుత్ లైన్లను తరళించే పని కాంట్రాక్టర్ చేయలేకపోవడం సమస్యగా ఉన్నాయి. 
  • ఈ పరిస్థితిని 2015 జూన్ 30, సెప్టెంబర్ 30 తేదిలలో జరిగిన నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీలో చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం కోరుకున్న విధంగా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి సమర్పించింది. పని ఆలస్యంగా జరగడానికి కారణాలను గుర్తించి ఆ పరిస్థతిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలనే దానిపై సిఫార్సులు చేసింది. 

దీని ఆధారంగా నీటి పారుదల శాఖ రెండు ప్రత్యామ్నాయలను మంత్రివర్గానికి సమర్పించింది. అవి ఏమంటే...

ఆప్షన్ వన్ : 
అప్పటికే పని చేస్తున్న కాంట్రాక్టర్ ను తొలగించి కొత్త వారికి పని టెండర్ పద్ధతిలో అప్పగించాలి. దీని వల్ల సాంకేతిక న్యాయపరమైన సమస్యలు తలెత్తి పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. అంతరాష్ర్ట వివాదం తీవ్రవమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు తీసుకోవాలి.

ఆప్షన్ టు:

  • దీని ప్రకారం ప్రస్తుతం (అప్పటి) కాంట్రాక్టర్ కు ధరలు పెంచి పనులు కొనసాగించాలి. 2015 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని పెంచాలి. ఇది తప్పనిసరి.
  • ప్రాజెక్ట్ లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 2015-16 ధరలను పాటించాలి. కాంట్రాక్టర్కు డపింగ్ యార్డు ధర గణనీయంగా పెరుగుతుంది. దీనిని ప్రభుత్వం భరించాలి. ఢయా ఫ్రం వాల్ నిర్మాణం, హైడ్రాలిక్ హయిస్ట్ మొదలైన పనులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలను సవరించాలి. 
  • కాంట్రాక్టర్ తో కుదుర్చుకున్న గత ఒప్పందంలో ధరల పెరుగుదల అంశాన్ని సడలించాలి. అదే సమయంలో ధరల వ్యత్యాసాన్ని లేబర్ అన్ని రకాల మెటీరియల్స్ కు, సిమెంట్ ,స్టీల్, స్ర్టక్చరల్ స్టీల్, ఇంధనం మొదలైన వాటికి వర్తింపచేయాలి. యంత్ర సామాగ్రికి సంబంధించిన ధరల పెరుగుదల అందులో చేర్చలేదు. దీనిని సవరించి పెరిగిన ధరల ప్రకారం కాంట్రాక్టర్ చెల్లించాలి. ఇతర మెటిరియల్గా పేర్కొన్న కాంపరెంటివ్ ధరల వ్యత్యాసాన్ని కూడా ప్రభుత్వం భరించాలి. ఇందుకోసం 2015-16 సంవత్సరాన్ని బేస్ ఇయర్ గా పరిగనించాలి. 
  • సమయానికి తగిన విధంగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాంకేతిక, ఆర్థిక పరమైన , అనుభవం ఉన్న ప్రత్యేకమైన ఇంజనీరింగ్ సంస్థలకు డయా ఫ్రం వాల్ పనులు అప్పగించాలి. అటువంటి సంస్థకు సబ్ కాంట్రాక్టర్ గా పని ఇవ్వడం కన్నా నేరుగా పనిచేస్తున్న కంపెనీలో భాగస్వామ్యం కల్పించి పనులు ప్రత్యక్షంగా అప్పగించాలి. ఇందుకు ఒప్పందంలోని అంశాలను సవరించి అనుబంధ ఒప్పందం చేసుకోవాలి.
  • ఈ ప్రకారం చేస్తే కేంద్ర ఆధీనంలో పిపేఎ నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తవని క్యాబినెట్ కు సంబంధించిన నోట్ లో స్పష్టంగా పేర్కొన్నారు.
  • సబ్ కాంట్రాక్టర్లను మెయిన్ కాంట్రాక్టర్ తో నేరుగా కలపడం (ఎనబుల్ ఆన్ బోర్డింగ్ ఆఫ్ ది సబ్ కాంట్రాక్టర్స్) వల్ల నిర్మాణ పని వేగం అవుతుందని క్యాబినెల్ లో నిర్ణయించారు. దీని వల్ల కాంట్రాక్ట్ సంస్థల మధ్య టీమ్ స్పిరిట్ ఉండడంతో పాటు నేరుగా ప్రభుత్వాలతోనూ, అధికారులతోనూ, సాంకేతిక నిర్మాణ పరమైన అంశాలను చర్చించి నిర్ణయం తీసుకుంటారు. నిర్మాణ పని వేగం చేయడానికి సబ్ కాంట్రాక్టర్లకు నేరుగా బిల్లలు చెల్లించడానికి తద్వారా లక్ష్యం మేరకు పనులు చేయడానికి సులభం అవుతుందని క్యాబినెట్ లో నిర్ణయించారు.
  • పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని చెల్లించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2013 మార్చి 2న కుదరిన ఒప్పాందాన్ని సవరించి సబ్ కాంట్రాక్టర్ల కు నేరుగా పని అప్పగించేందుకు చంద్రబాబు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 
  • సబ్ కాంట్రాక్టర్లకు నేరుగా రాష్ర్ట ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని క్యాబినెట్ తీర్మానించింది. 
  • 2016 సెప్టెంబర్‌ 7 అర్ధరాత్రి రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సహాయానికి చంద్రబాబు అంగీకరించారు. దాని అమలుకు సంబంధించి 2016 సెప్టెంబర్‌ 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోరాండంలోనూ 2014 ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. ఆ కేబినెట్‌లో టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి ఉన్నారు. ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుంటే వారు ఎందుకు అడ్డుకోలేకపోయారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 
  • ఆ కేబినెట్‌ తీర్మానాన్ని ఎత్తిచూపుతూ 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టుకు నీటి పారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదిస్తే రూ.2,234.77 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల కొర్రీ వేసింది.

ఎందుకీ జాప్యం?
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరుసార్లు కోరింది. దీనికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు జాప్యం చేసిన మాట వాస్తవం కాదా? 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన తీర్మానంలో సగ భాగం అసెంబ్లీలో చదివిన చంద్రబాబు... పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తామని ప్రకటించిన మాట వాస్తవం కాదా? శాసనమండలిలో అప్పటి ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వ్యయం అవుతుందని అంటున్నారని.. అంత డబ్బులు కేంద్రం ఇస్తుందా అని అడిగితే చంద్రబాబు దానిని ఎగతాళి చేశారు. శాసనమండలి ప్రొసీడింగ్స్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. అంటే.. రూ.20,398 కోట్లు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు మౌనం దాల్చారు? తన కోసం తన అనుకూల వర్గం కోసం రాష్ర్ట ప్రయోజనాలనే మాజీ సీఎం తాకట్టు తాకట్టు పెట్టారనేది వాస్తవం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement