‘హోదా’ కేంద్రం నైతిక బాధ్యత | Primary responsiblity to center on AP special status | Sakshi
Sakshi News home page

‘హోదా’ కేంద్రం నైతిక బాధ్యత

Published Thu, Oct 8 2015 1:00 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘హోదా’  కేంద్రం నైతిక బాధ్యత - Sakshi

‘హోదా’ కేంద్రం నైతిక బాధ్యత

విభజనానంతర ఏపీ ఆర్థిక దుస్థితి దృష్ట్యానే బీజేపీ నాడు ప్రతిపక్షంగా పదేళ్ల ప్రత్యేక హోదాకు పట్టుబట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు హామీనిచ్చింది. కాబట్టి ఆర్థిక సంఘం సిఫారసును తిరస్కరించి, చట్ట సవరణ చేసైనా ఏపీకి ప్రత్యేకహోదాను కల్పించడం కేంద్రం నైతిక బాధ్యత, రాజ్యాంగ విధి. ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రాలకు మూడు విధాలుగా పెద్ద ఎత్తున నిధులు సమకూరుతాయి. అదీ దాదాపు ఉచిత గ్రాంట్లుగానే లభిస్తాయి. పన్నుల తగ్గింపులు, రాయితీల వల్ల పరిశ్రమల స్థాపన పెరిగి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. రాష్ట్రాభివృద్ధి ఊపందుకుంటుంది.
 
రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకోలేనంత తక్కువ వనరులున్న (పెట్టుబడి ఆస్తులు) రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అననుకూల పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్రాలుగా గుర్తించింది. వాటిని ప్రాధాన్యత న్వివలసినవిగా లేదా ప్రత్యేకమైనవిగా పరిగణిస్తుంది. వాటికి కేంద్ర పన్నుల్లో అత్యధిక రాయితీలను ఇస్తుంది. 1969లో ప్రారంభమైన ఈ విధానాన్ని అనుసరించి జమ్మూక శ్మీర్, అస్సాం, నాగాలాండ్‌లను తొలుత ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలుగా గుర్తించారు. ఆ జాబితాలో జార్ఖండ్ 2010లో పదకొండవదిగా చేరింది. ప్రధాని, కేంద్ర మంత్రులు,  ప్రణాళికా సంఘం (నేటి నీతి ఆయోగ్) సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డీసీ)కి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా గుర్తించే అధికారం ఉంటుంది.
 
అయితే ఎన్‌డీసీలో ప్రధానిదే నిర్ణయాత్మక పాత్ర. కాబట్టి ఆయన కోరుకుంటే ఏ రాష్ట్రానికైనా అ హోదాను కల్పించవచ్చు. 1. కొండలు కోనలతో కూడిన కఠిన భౌగోళిక పరిస్థితులున్న పరిస్థితుల్లో, 2. జనసాంద్రత తక్కువగా ఉండి, ఆదివాసుల వంటివారు ఎక్కువగా ఉన్న ప్రాంతమైతే, 3. దేశ సరిహద్దునున్న వ్యూహాత్మక ప్రాంతమైతే, 4. ఆర్థికంగా, మౌలిక సదు పాయాలపరంగా  వెనుకబడినదైతే, 5. రాబడి తక్కువగా ఉన్నదైతే మాత్రమే ఒక రాష్ట్రం ప్రత్యేక హోదాను కోరగలుగుతుంది. వీటిలోని 4, 5 అంశాల దృష్ట్యా చూస్తే నేటి ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రం హోదా ఇవ్వదగినదే. ఆ హోదాకు అనుగుణంగా ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రానికి కేంద్ర పన్నులలో గరిష్ట రాయితీలను ఇవ్వవచ్చు.
 
 ‘ప్రత్యేక’ రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం
 ప్రణాళికా సంఘం కేంద్ర పన్నుల రాబడి నుంచి రాష్ట్రాలకు 1. సాధారణ కేంద్ర సహాయం, 2. అదనపు కేంద్ర సహాయం, 3. ప్రత్యేక కేంద్ర సహాయం అనే మూడు విధాలుగా నిధులను కేటాయిస్తుంది. మొత్తం కేంద్ర సాధారణ సహాయం నుంచి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 30 శాతం నిధులు లభిస్తాయి. అందులో 90 శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంటు కాగా, 10 శాతం అప్పు. మిగతా రాష్ట్రాలకు కేంద్ర సాధారణ సహాయంలో 30 శాతం మాత్రమే గాంట్లు, 70 శాతం రుణం. ఇక ప్రత్యేక కేటగిరీ హోదాగల రాష్ట్రాలు కేంద్ర పథకాలకు, విదేశీ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు అందే కేంద్ర అదనపు సహాయంలో గ్రాంట్లు, అప్పు నిష్పత్తి 90:10గా ఉంటుంది. ఇక ప్రత్యేక కేంద్ర సహాయం కింద ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు అంశాలవారీగా సహాయం అందుతుంది. ఈ కేటాయింపులు రాష్ట్ర ప్రణాళిక పరిమాణం, మునుపటి ప్రణాళిక వ్యయం వంటి ఆంశాలపై కూడా అధారపడి ఉంటాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ మూడు విధాలుగానూ పెద్ద ఎత్తున నిధులు... ప్రధానంగా గ్రాంట్లుగా లభిస్తాయి. అంతేకాదు, ఎక్సైజ్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఆదాయం పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లలో గణనీయమైన తగ్గింపులు, మినహాయింపుల వల్ల కూడా లబ్ధి చేకూరుతుంది. ఎక్సైజ్ తగ్గింపుతో పరిశ్రమల స్థాపన పెరుగుతుంది, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తద్వారా రాష్ట్రాభివృద్ధి ఊపందుకుంటుంది.
 
 వివిధ పద్దుల కింద కేంద్ర నిధులు
 వివిధ రాష్ట్రాలు కేంద్ర పన్నుల రూపేణా కేంద్రానికి ఏ మోతాదులో రాబడిని సమకూరుస్తాయనే దాన్నిబట్టి కేంద్ర ఆర్థిక సంఘం ఆయా రాష్ట్రాలకు పంచుతుంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన పన్నుల రాబడి నుంచి 2,55,414 కోట్లను రాష్ట్రాలకు పంచింది. ఇది రాష్ట్రాలకు కేంద్రం అందించిన మొత్తం నిధుల్లో 57 శాతం.  ఇదిగాక ప్రకృతి వైపరీత్యాలు, రోడ్ల నిర్వహణ వంటి అవసరాలకు అది ఆయా రాష్ట్రాలకు అంశాలవారీగా అందజేసే గ్రాంట్లు, అప్పుల విషయంలో విధి విధానాలను కూడా ఆర్థిక సంఘం సూచిస్తుంది. అయితే కేంద్ర పన్నులను రాష్ట్రాలకు పంపిణీ చే యడంలో మాత్రం అది ఎలాంటి తేడానూ చూపదు.
 
 ప్రణాళికా సంఘం, అర్థిక సంఘాల ద్వారా కేంద్రం రాష్ట్రాలకు సాధారణంగా అందించే నిధులకంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు లభించే నిధులు పలు విధాలుగా ఎక్కువగా లభిస్తాయి. అంతేకాదు, హోదా ఉన్న రాష్ట్రాలకు లభించే నిధుల్లో అత్యధిక భాగం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంట్ల రూపంలో లభిస్తుంది. రుణం అతి స్వల్పంగా ఉంటుంది. ఈ తేడాయే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు త్వరితగతిన అభివృద్ధి చెందడానికి కేంద్రం అందించే తోడ్పాటు అని స్థూలంగా చెప్పుకోవచ్చు.
 
 1. కేంద్ర పన్నుల్లో భాగం, 2. ప్రణాళికేతర అప్పులు, గ్రాంట్లు, 3. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు, 4. సాధారణ కేంద్ర సహాయం, 5. కేంద్ర ప్రత్యేక సహాయం, 6. అదనపు కేంద్ర సహాయం అనే ఆరు రూపాల్లో కేంద్ర సహాయం రాష్ట్రాలకు అందుతుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 3, 4, 5 మూడు పద్దుల కింద లభించే నిధుల ద్వారా భారీగా లబ్ధి కలుగుతుంది. వీటిలో సాధారణ కేంద్ర సహాయం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులకు సంబంధించి 90 శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంటు కాగా, 10 శాతం మాత్రమే రుణ ంగా ఉంటుంది. అంటే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఇలా అందే కేంద్ర సహాయం దాదాపుగా ఉచితంగా అందేదే. ఇక ఐదవదైన కేంద్ర ప్రత్యేక సహాయం కింద వివిధ ప్రాజెక్టుల వ్యయంలో 90 శాతం గ్రాంట్‌గా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు అందుతుంది.  2014 వరకు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఈ ప్రత్యేక కేంద్ర సహాయం అందింది (2011-12లో రూ. 4 లక్షల కోట్లు). పద్నాలుగవ ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం ఆమోదించడం, ప్రణాళికా సంఘం స్థానే నీతి ఆయోగ్ రావడంతో ప్రత్యేక ఆర్థిక సహాయంగా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు సహాయం రద్దయింది. అయితే దీన్ని పునరుద్ధరిం చాలని బలంగా కోరుతున్నారు. అనాలోచితమైన ఈ చర్యను కేంద్రం ఉపసంహరించుకోవడం సముచితం.
 
 ‘హోదా’ రాజ్యాంగపరమైన కర్తవ్యం
 రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌ను కోల్పోయింది. సర్వీసు రంగం, పారిశ్రామిక రంగం కేంద్రీకరించి ఉన్న రాజధాని ప్రాంతం నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూలో దాదాపు సగం లభించేది. హఠాత్తుగా ఆ రాబడి ఆగిపోయింది. అంతేకాదు, ప్రధాన పరిశ్రమలన్నీ అక్కడే ఉండ టంతో పారిశ్రామిక ఉత్పత్తి, మార్కెటింగ్, రవాణా రంగాలలోని ఉద్యోగావ కాశాలను నేటి ఏపీ కోల్పోయింది.
 
  రాయలసీమ, ఉత్తరాంధ్రలలో వ్యవ సాయం ఎప్పుడూ దైవాధీనమే. మధ్యాంధ్ర, నెల్లూరు జిల్లాల్లోని అత్యుత్తమ మైన, సారవంతమైన, బంగారం పండే భూముల్లో గణనీయమైన భాగం రాజధాని, తదితర అవసరాలకు పోయి అక్కడ సాగు మూలన పడింది. దీంతో మొత్తంగా రాష్ట్ర వార్షిక స్థూల ఉత్పత్తి తీవ్రంగా పడిపోయింది. ఉపాధి అవకాశాలు, రాబడులు క్షీణించాయి. ఒకప్పుడు వలస కూలీలకు పనులను కల్పించిన ప్రాంతాల నుంచి ప్రజలు పొట్ట పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసలు పోవాల్సివస్తోంది. భూమినే నమ్ముకుని ఉన్న రైతుల ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు కరువైన నేటి ఏపీలోని అన్ని రంగాల్లోనూ వృద్ధి దిగజారిపోతోంది.
 
 విభజనానంతరం ఇలాంటి పరిస్థితి ఏర్పడక తప్పదనే నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏపీని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా పరిగణిస్తామని రాజ్యసభలో హామీనిచ్చారు. బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు ఐదేళ్ల ప్రత్యేక హోదా ఎంత మాత్రమూ సరిపోదని, పదేళ్లు ఉండాల్సిందని గట్టిగా వాదించారు. యూపీఏ ప్రభుత్వం దాన్ని ఆమోదించి ప్రణాళికా సంఘానికి సైతం పంపింది. కాంగ్రెస్, బీజేపీలు రెండూ కలిసే ఏపీకి ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాకు హామీని ఇచ్చాయి.

కాబట్టి ఆర్థిక సంఘం సిఫారసును తిరస్కరించి, అవసరమైతే చట్ట సవరణనైనా చేసి ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదాను కల్పించడం కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యతే కాదు, రాజ్యాంగపరమైన కర్తవ్యం కూడా. అంతేకాదు విభజన చట్టంలో పొందుపరచిన పన్నుల తగ్గింపు వంటి అంశాలను సత్వరమే కార్య రూపంలోకి తేవాలి. లేకపోతే రాష్ట్రం పరిస్థితి మరింతగా దిగజారుతుంది. ఇప్పటికే మిన్నంటుతున్న ప్రజల అసంతృప్తి తీవ్రవాద ఉద్యమాల వంటి అవాంఛనీయ ధోరణులకు ఊతం ఇచ్చే అవకాశం ఉంది.
- (వ్యాసకర్త ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు)
 మొబైల్: 9849584324
- డి. సుబ్రమణ్యంరెడ్డి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement